తీర్పు

‘‘ఈ తగువులు నేను తీర్చలేను’’ అంటూ విసుగ్గా బరువైన పదార్థమేదో విసిరేసి లోపలికి వెళ్లిపోయింది సుందరరామయ్య భార్య. అది తిన్నగా వచ్చి సుందరరామయ్య వొడిలో పడింది.
అదేమిటా అని కుతూహలంగా చూశాడు సుందరరామయ్య. అందమైన అట్టలు అయిదు కనిపించాయి. అవి పిల్లల పరీక్షల్లో వాడుకునే రైటింగ్‍ పేడ్స్. అందులో నాలుగు అట్టలు ఒకే తీరుగా
ఉన్నాయి. ఒక అట్ట మాత్రం తక్కిన నాలుగింటి కంటె పెద్దది. దాని మీద వేసిన కాగితం అందమైనదీ ఖరీదైనదీ పైగా దానికి కాలికోతో చేసిన కార్నర్‍ పోకెట్లు కూడా ఉన్నాయి.


సుందరరామయ్యకి నలుగురు మగపిల్లలు. తరవాత ఒక ఆడపిల్ల. పెద్ద వాళ్లు ముగ్గురూ హైస్కూల్లో చదువుకుంటున్నారు. తలయెత్తి చూసిన సుందరరామయ్యకి ద్వారం దగ్గర తన మూడో కొడుకూ, కూతురూ కనిపించారు. వాళ్లిద్దరూ తండ్రి దగ్గరకి వచ్చారు. కూతురు చెప్పటం ప్రారంభించింది.


‘‘రెండో అన్నయ్యకి స్కూల్లో అట్టలు చెయ్యటం నేర్పారు. చాలా అట్టలు తయారుచేసి అమ్మారు. ఒక్కొక్క అట్ట ముప్ఫయి నయాపైసలకి అమ్మారు. పెద్దన్నయ్య అర్ధరూపాయి ఖర్చుతో అరడజను అట్టలు చెయ్యవచ్చని కనిపెట్టాడు. బజారులో ఆ అట్టలే ఆరణాలని చెపితే, అమ్మ అర్థరూపాయి ఇచ్చింది. ఉన్న వాళ్లు అయిదుగురే కాబట్టి అయిదు అట్టలే చేసుకుందాం అన్నారు. మిగిలిన డబ్బులు ఒక అట్ట మీద యెక్కువగా ఖర్చుపెడితే అందమైన కాలికో అట్ట తయారయింది.
పెద్దన్నయ్య తను పెద్దవాడుకాబట్టి తనది పెద్ద క్లాసుకాబట్టి ఆ అట్ట తను తీసుకుంటానన్నాడు. అలా వీల్లేదు నేను తీసుకుంటానన్నాడు రెండో అన్నయ్య. అమ్మ మొదట ఆ అట్ట పెద్దన్నయ్యకే ఇచ్చెయమంది. రెండో అన్నయ్య వాదించేసిరికి వాడికి ఇవ్వబోయింది. తగువు తీరకపోవటం వల్ల అమ్మ అట్టలు తెచ్చి ఇక్కడ విసిరేసింది’’. అదీ జరిగిన విషయం.


సుందరరామయ్య తెలివికి ఇదో పెద్ద సమస్య కాదు. అయినా, ఆయన కొంచెంసేపు వెనకా ముందూ ఆలోచించాడు. పెద్ద కొడుకుకి సుందరరామయ్య తండ్రి పేరు పెట్టాడు. అందుకని తండ్రికి వాడంటేనే ఇష్టమని మిగతా పిల్లలు అనుకుంటూ ఉండేవాళ్లు.
రెండోవాడికి, తల్లి తండ్రి పేరు పెట్టారు. కాబట్టి, వాడంటే తల్లికి ముద్దూ గారాబమూ అని పిల్లల మేనత్త (సుందరరామయ్య అక్కగారు) అంటూ ఉండేది. పిల్లలూ పెద్దలూ – ఇలా రెండు పార్టీలు అనిపించుకోవటం, అనటం కూడా సుందరరామయ్యకి ఇష్టం లేదు. తన పిల్లలందరూ ఒద్దికగా కలిసిమెలిసి ఉండాలని ఆయన కోరిక… కూతురు చెప్పినదంతా విని ఆయన కొంచెంసేపు ఆలోచించాడు.
‘‘అన్నయ్యలు ముగ్గుర్నీ తీసుకురా’’ అని ఆఖరి కొడుకుని పంపించాడు. వాడు వెళ్లాక –
‘‘అమ్మను కూడా తీసుకురా’’ అని కూతుర్ని పంపించాడు. పెద్దవాడు – తెల్లగా, నాజూగ్గా, స్టయిల్‍గా ఉంటాడు. కళ్లల్లో తెలివి కొట్టవచ్చినట్టు కనబడుతుంది. వాణ్ణి చూస్తే, వాడు నీళ్లు పోసి పెంచుతున్న గున్నమామిడి మొక్కలా ఉంటాడు.


చిన్నవాడు – కాస్త బండగా ఉంటాడు. తెలియని వాళ్లకి అన్నకంటే వీడే పెద్దవాడనిపిస్తాడు. ముఖంలో పట్టుదలా నిబ్బరం కనిపిస్తాయి. చూసే వాళ్లకి వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదనిపిస్తుంది. సుందరరామయ్యకి – పెద్ద కొడుకు అభిమానం దెబ్బతిన్నట్టు కనిపించింది. రెండో వాడి ముఖం కోపంతో జేవురించి ఎర్రగా కందగడ్డలా ఉంది. తక్కిన పిల్లలంతా ఏం జరుగుతుందో చూద్దామని తలా ఒక మూలా నిలబడ్డారు. తల్లి, గుమ్మం దగ్గరుంది…. సుందరరామయ్య అక్కగారూ ఒక పక్కగా నిలబడి వుంది.
సుందరరామయ్య పిల్లలందరి వంకా చూస్తూ ‘‘మీరు చెప్పదలిచింది చెప్పండి. నేను చెప్పవలిసింది తరువాత చెప్తాను’’ అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. అందరికన్నా చిన్నది ఆడపిల్ల. ఏదో నసిగింది. తరవాత నవ్వింది. సిగ్గుపడింది. తరవాత అక్కడ నుంచి పారిపోయింది.


మగపిల్లల్లో ఆఖరివాడు చెప్పాడు. అందర్లోనూ తను చిన్నవాడు కాబట్టి తను ముందు యెంచు కోవాలన్నాడు.
‘నువ్వెలా చిన్నవాడివవుతావ్‍? నీకంటే చిన్నది చెల్లాయి
ఉందిగా ఆ అట్ట దానికివ్వాలి’’ అన్నాడు తండ్రి.
‘‘చెల్లాయి ఒకటో క్లాసేగా? దానికెందుకు?’’
‘‘నువ్వు మూడో క్లాసేగా – నీకు మాత్రమెందుకు?
‘‘నాకు వచ్చే ఏడాదికి పనికొస్తుంది’’.
ఆ మాత్రం వాదించటం నేర్పిన నాల్గవ కొడుకుని చూసి సుందరరామయ్య లోలోపల సంతోషించాడు.


మూడోవాడు అంతకంటే బాగా వాదించాడు – అన్నయ్యలిద్దరూ పెద్దవాళ్లు. వాళ్లు తల్చుకుంటే, ఇంకొక మంచి అట్ట తయారు చేసుకోగలరు. తమ్ముడూ చెల్లాయీ చిన్నవాళ్లు. వాళ్లకి ఆ అట్ట ఉపయోగపడదు. కాబట్టి, అది తనకివ్వటం న్యాయం అన్నాడు. అలా కాకుండా ఆ అట్టని పెద్దవాళ్లిద్దరిలోనే ఒకరికి ఇవ్వాలంటే అది రెండో అన్నయ్య కివ్వటం న్యాయమని కూడా చెప్పాడు. తనకి ఏ అట్ట ఇచ్చినా ఫరవాలేదన్నాడు. ఎందుచేతంటే తను వాటిని చెయ్యలేదు. ఊరికే పేస్టు రాశాడు. అంతే. అది పెద్ద పని కాదని ఒప్పుకున్నాడు.
రెండవ కొడుకు చాలా ముక్తసరిగా ‘‘అన్నయ్య అయిడియా ఇచ్చాడు. అమ్మ డబ్బిచ్చింది. ఆ అట్టలన్నీ చేసింది నేను’’ అన్నాడు.
పెద్దవాడు, – ‘‘అట్టలు ఇలా తయారు చెయ్యవచ్చనీ, చేద్దామనీ అయిడియా ఇచ్చిన వాణ్ణి నేనే. అమ్మను అడిగి డబ్బు ఇప్పించిన వాణ్ణి నేనే. తను తయారు చేసినంత మాత్రాన దాని మీద హక్కంతా తనదే అన్నట్టు వీడు మాట్లాడితే నాకూ పట్టుదలొచ్చి ‘ఆ అట్ట నాకే రావాలి’ అని మొండికెత్తాను. అంతేకాని ఆ అట్టమీద నాకేం మోజు లేదు’’ అన్నాడు.
‘‘ఎవరడిగినా అమ్మ డబ్బిస్తుంది… బజారుకెళ్లి అవన్నీ తెచ్చిన వాడు చిన్నన్నయ్య. అవన్నీ చేసినవాడూ వాడే. అందుకని ఆ అట్ట వాడికే ఇవ్వాలి’’. అన్నాడు మూడవ పిల్లవాడు.
‘‘పెద్దవాడన్నాక పెద్దవాడే. వాడి తరవాతే మీరంతా. ముందు పెద్దవాడు యెంచుకోవటమే ధర్మం’’ అని అడగకుండానే సలహా చెప్పింది మేనత్త. ధుమధుమలాడుతూ మేనత్త వంక చూశాడు రెండోవాడు.
‘‘మీరంతా ఊరుకోండి. నిశ్శబ్దంగా ఉండండి’’ అన్నాడు చిరాగ్గా సుందరరామయ్య. ఆయన మనస్సు పరిపరివిధాలపోతోంది. ‘లాటరీ వేసేస్తే?’ అనుకున్నాడోసారి. ‘అట్టలెవరివీ కావని దాచేస్తే?’ అనుకున్నాడింకోసారి. ‘అవన్నీ చింపిపారేస్తే పీడవదులుతుంది. అన్నది భార్య… ‘పోనీ ఇంకో అట్ట అలాంటిదే చేస్తే’?… దానికంటే మంచి అట్ట తను స్వయంగా చేసి పెద్దవాడికిస్తే? – ఇలా చాలాసేపు ఆలోచించి పిల్లలతో అన్నాడు-
‘‘అసలు ఆ ఒక్క అట్ట మాత్రం వేరే విధంగా యెందుకు చేశారు?’’
‘‘ఆ అయిడియా కూడా పెద్దన్నయ్యే ఇచ్చాడు’’ అన్నాడు మూడవవాడు.
‘‘చిన్నన్నయ్య అన్నీ ఒకలాంటివే చేసుకుందామన్నాడు’’ నాలుగోవాడన్నాడు.
‘‘అప్పుడేమో, ఫరవాలేదు. ఎవరో ఒకరం తీసుకుందాంలే అన్నాడు పెద్దన్నయ్య. ఇప్పుడేమో పోటికి వచ్చాడు’’. అన్నాడు రెండోవాడు కోపాన్ని అణుచుకుంటూ.
సుందర రామయ్య ఆలోచిస్తున్నాడు.


ఈలోగా తక్కిన వాళ్లంతా వాదించుకుంటున్నారు.
‘‘తలుచుకుంటే, అలాంటివి పది అట్టలు చెయ్యగలం’’ అన్నాడు రోషంగా నాలుగోవాడు.
‘‘మరి యెందుకుచేసుకోలేదు’’ కాస్త వేళా కోళంగా అడిగాడు మూడోవాడు.
‘‘చేసుకుంటాం చూడవోయ్‍!’’ అన్నాడు మూడోవాడు వెక్కిరిస్తూ
‘‘ఏమిటి చేసుకునేది పేడేనా?’’ అన్నాడు నాలుగోవాడు.
‘‘నీకు చేతనయింది అదేలే’’ – నిర్లక్ష్యంగా అన్నాడు మూడోవాడు.
ఇంతలో మేనత్త అందుకని – ‘‘రెండోవాడికి బొత్తిగా చిన్నా పెద్దా తేడా లేకుండా పోయింది. ఇవాళ తన అన్నయ్యని కాదన్నాడు. రేపు కన్న తండ్రినే ఖాతరు చెయ్యడు… వాడు చెడిపోయాడు’’. అన్నది… అంతే. రెండో వాడు సర్రున తండ్రి దగ్గరకి దూసుకువెళ్ళాడు. ఆయన దగ్గర పడి ఉన్న అట్టలన్నీ తీసుకున్నాడు.
‘‘అత్తా! నేనీ అట్టలు పంచుతున్నాను చూడు!’’ అన్నాడు. వాడి కంఠస్వరంలో తీవ్రతకి అందరూ నిర్ఘాతపోయారు.


‘‘అయిడియా ఇచ్చినందుకు అన్నయ్యకి ఒక అట్ట. సాయం చేసినందుకు ఒక అట్ట పెద్ద తమ్ముడికి. ఇహ ఈ రెండు అట్టల్లో ఒకటి చిన్న తమ్ముడికి ఒకటి చెల్లెలికీ. ఈ కాలికో అట్ట నాకు చాలా నచ్చింది. ఇది నేను తీసుకుంటున్నాను… అన్నయ్యని పంచమని అడిగాను. వాడికి చేత కాలేదు. అమ్మను అడిగాం. ఆవిడకీ చేతకాలేదు. చేతనయినా నాన్నగారు యెందుకో వెనకా ముందూ ఆలోచిస్తున్నారు. నువ్వేమో మేం అడగకపోయినా పంచటానికి ముందుకొస్తున్నావు. నేను చెడిపోయానన్నావు. మొన్న ఒకసారి యేదో సందర్భంలో నువ్వే ‘పంచిన వాళ్లు పాపాన పోతారు’ అని సామెత చెప్పావు జ్ఞాపకముందా?… పెద్దవాళ్లు ఈ అట్టలు మాకు ‘పంచి పాపానపోవటం’ యెందుకని నేనే వాటిని పంచి పాపం మూటకట్టుకున్నాను… నేను చెడిపోయానని యెలాగూ అనేశావు కదా! ఇహ ఇప్పుడు కొత్తగా నేను చెడేదేముంది? కష్టపడి అన్నీ తయారు చేసిన వాణ్ణి కాబట్టి, నాకు ‘‘నచ్చింది నేను తీసుకోవటం తప్పుకాదు’’ అంటూ చరచరా వీధి గదిలోకి వెళ్లిపోయాడు రెండోవాడు. అందరూ బొమ్మల్లా చూస్తూ నిలబడిపోయారు.


-కాళీపట్నం రామారావు
(జనవరి 1991 బాలచెలిమి – పిల్లల మాసపత్రిక సౌజన్యంతో)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *