సమస్థ ప్రాణులు ప్రకృతి ఒడిలోనే


జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం


ప్రతి ఏడాది జూలై 28 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన జీవితంలో ప్రకృతి ప్రాముఖ్యతను, దాన్ని ఎందుకు పరిరక్షించాలో గుర్తుచేసే ముఖ్యమైన రోజు ఈ రోజు. ఈ ప్రపంచలో జీవించే సమస్థ ప్రాణులు ఈ ప్రకృతి ఒడిలో ఒదిగిపోతుంటాయి. అలాంటి ఈ ప్రకృతిని పరిరక్షించడానికి, దానిపై అవగాహన పెంచడానికి, ప్రకృతిని కాపాడటానికి ప్రోత్సహించడానికి ఈ రోజు మనకు అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఈ ప్రపంచలో ఉన్న సహజ వనరులు క్షీణించడానికి జనాభా విస్పోటనం ఓ ప్రధాన కారణం ఉంది. భూమిపై ఉన్న పరిమిత వనరుల సమతుల్యతను కాపాడుకోవడానికి వాటిని సమర్థవంతంగా ఉపయోగించాల్సిన ఆవశ్యకతను ఈ రోజు తెలియ జేస్తుంది. సహజ వనరులను పరిరక్షించేందుకు ఉత్తమమైన పద్ధతుల గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడింది. సహజ అసమతుల్యత కారణంగా ఓజోన్‍ పొర క్షీణత, సాంకేతిక పురోగతి, విలాసవంతమైన జీవనశైలి, గ్లోబల్‍ వార్మింగ్‍, వివిధ వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు, పెరిగిన ఉష్ణోగ్రత మొదలైన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని మనకు తెలుసు. ఇటీవలి కాలంలో అమెజాన్‍ అడవుల్లో చెలరేగిన మంటలు వంటివి పర్యావరణ సమస్యలను లేవనెత్తుతున్నాయి. కానీ మన తరువాతి తరాల వారికి ప్రకృతిని అందించడానికి దాన్ని సంరక్షించడం అవసరం. దాని కోసం సహజ వనరులను ఆదా చేయడం, దాన్ని రీసైకిల్‍ చేయడం, సంరక్షించడం, దానిని దెబ్బతీసే పరిణామాలను అర్థం చేసుకోవడం, వనరుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో అవగాహన పెంచడం చాలా ముఖ్యం.


ఆరోగ్యకరమైన వాతావరణానికి ప్రకృతి పునాది అని ఈ రోజు గుర్తించింది. ఈ రోజు వర్తమాన, భవిష్యత్‍ తరాల శ్రేయస్సును కోరుకుంటుంది. ప్రస్తుత, భవిష్యత్‍ తరాలను కాపాడటానికి ప్రకృతిని పరిరక్షించడం అవసరం. అటవీ నిర్మూలన, అక్రమ వన్యప్రాణుల వ్యాపారం, కాలుష్యం, ప్లాస్టిక్లు, రసాయనాలు వాడటం వంటి పనుల వలన ఈ ప్రకృతికి హాని కలుగుతుంది. పారిశ్రామిక అభివృద్ధి, ఇతర అంశాలు కూడా ప్రకృతి క్షీణతకు కారణమవుతాయి. మనం ఏది చేసినా అది ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. జీవించడానికి నీరు, గాలి, నేల, ఖనిజాలు, చెట్లు, జంతువులు, ఆహారం మొదలైన ప్రాథమిక అవసరాలను భూమి అందిస్తుంది కాబట్టి ఈ ప్రకృతిని ప్రతి ఒక్కరూ కాపాడాలి.


పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత!
ప్రతీ ఏటా ప్రపంచ పర్యా వరణ దినోత్సవం దగ్గరకు రాగానే హరిత చట్టాలు మరింత కఠినంగా ఉండాలనే వాదనలు అంతటా వినిపిస్తూ ఉంటాయి. చట్టాలు ముఖ్యమే, అయితే పర్యావరణాన్ని పరరక్షించటానికి చట్టాలు మాత్రమే సరిపోవు. మన జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉంది. ప్రాచీన సంస్కృతులన్నీ ప్రకృతిని ఆరాధిస్తూనే పెరిగాయి. చెట్లు, నదులు, పర్వతాలు, ప్రకృతి వీటన్నింటిని ఎల్లప్పుడూ పూజించారు. మన దేశంలో ఒక చెట్టును నరికేముందు ఐదు మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది. అన్ని ముఖ్యమైన పండుగలు, సంప్రదాయాలలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. నదులను తల్లులుగా, భూమిని దేవతగా కొలిచిన దేశం మనది. ప్రకృతిని పవిత్రంగా భావించి, ఆరాధించి, గౌరవించే ఈ సంప్రదాయాన్ని ఈనాటి నవీన సమాజంలో మరలా ప్రారంభించాల్సి ఉంది. వినూత్న విధానాలలో నీటిని పొదుపు చేయడం, రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేయడం మొదలైనవి తెలియజెప్పాలి. నదులను పునరుజ్జీవింప చేయడం, మొక్కలు పెంచడం, వ్యర్థాలు ఏమాత్రం ఉత్పత్తి చేయని జీవన విధానాలను అవలంభించడం వంటి విషయాలలో సమాజంలోని అందరినీ ముఖ్యంగా యువతను భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది.


నిజం చెప్పాలంటే మనిషిలోని దురాశే కాలుష్యానికి మూల కారణం. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు సంపాదించాలనే దురాశ పర్యావరణాన్ని ఛిద్రం చేస్తోంది. భౌతికంగా కాలుష్యాన్ని సృష్టించడమే కాక, వ్యతిరేక భావాలను సృష్టించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తోంది. మానవులలోని ఈ మనస్తత్వాన్ని, ఈ సమస్యకు మూల కారణాన్ని మనం సరిదిద్దాల్సిన అవసరం ఉంది.


సాంకేతికాభివృద్ధి జరిగి నప్పుడు పర్యావరణం నాశన మవుతుందనే తప్పనిసరి నిబంధన ఏమీ లేదు. టెక్నాలజీ (సాంకేతికత) గాని, విజ్ఞానశాస్త్రం గానీ చెత్తను సృష్టించవు. కానీ ఆ సాంకేతికతను, విజ్ఞానాన్ని వాడి మనం చేసే పనులు చెత్తను సృష్టిస్తున్నాయి. కాబట్టి ఆ చెత్తను తిరిగి వాడుకునే విధానాలను, చెత్తను ఉత్పత్తి చేయని సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసి వాడు కోవాలి. సౌరశక్తి, సహజ వ్యవసాయ పద్ధతులు వీటికి ఉదాహరణ.


ప్రకృతి వనరులను వాడు కోవడం ద్వారా ప్రజలకు విజ్ఞానాన్ని, సౌఖ్యాన్ని అందించడం సాంకేతికత ఉద్దేశ్యం. మానవ విలువలను మరిచి పోయినప్పుడు అదే సాంకేతికత, సుఖానికి బదులుగా వినాశనాన్ని, కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. క్షమ, సహనం, అందరి బాగోగులు కోరుకుంటూ పని చేయడం వంటి లక్షణాలు అలవర్చుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణానికీ మనకూ ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడు తుంది. అప్పుడు పర్యావరణం గురించి శ్రద్ధ తీసుకోగలుగుతాం.


మన చుట్టూ ఉన్న వాతావరణం స్వచ్ఛంగా, సకారాత్మకంగా ఉన్నప్పుడు, ఆ అనుభూతి మన జీవితంలోని అన్ని పార్శ్వాలలోనూ ప్రసవించి వాటిని ప్రభావితం చేస్తుంది. మానవుల మనస్తత్వానికి ప్రకృతితో గాఢమైన చారిత్రాత్మకమైన అనుబంధం ఉంది. ఎప్పుడైతే మనం ప్రకృతితో ఉన్న అనుబంధం నుంచి దూరంగా వెళ్లడం మొదలైందో, అప్పుడే కాలుష్యాన్ని పుట్టించడం, పర్యావరణాన్ని నాశనం చేయడం మొదలైంది.


ప్రకృతితో మనిషికి గల ఈ అనుబంధాన్ని మళ్లీ చిగురింప చేయాలి. మన మనస్తత్వాన్ని, అనూచానంగా వస్తున్న పద్ధతులను పైకి తీసి మరలా పాటించాలి. భూమిని పవిత్రంగా పూజించడం, చెట్లను, నదులను పవిత్రంగా ఆరాధించడం, ప్రజలందరినీ పవిత్రంగా భావించి ఆరాధించడం ప్రకృతిలో దైవాన్ని చూడటం అలవాటుగా చేయాలి. అది మనలో సున్నితత్వాన్ని పెంచుతుంది. సున్నితత్వమైన మనిషి ప్రకృతి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, పర్యావరణాన్ని పెంపొందించ కుండా ఉండలేడు. వీటన్నింటికి మించి, మనం మన ప్రపంచాన్ని విశాలదృష్టితో చూడాల్సిన అవసరముంది. మానసికమైన ఒత్తిడి లేకుండా, ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించాలనే సదాశయంతో మనం సాగాలి. అది జరగాలంటే మానవ చైతన్యం దురాశ, స్వలాభం కోసం ఇతరులను వంచించే విధానాలను దాటి ఉన్నతంగా ఎదగాలి. అప్పుడు మన యొక్క అసలైన స్వభావాన్ని, మనకు మనతో, ఇతరులతో, పర్యా వరణంతో గల అనుబంధాలను తెలుసుకునేలా చేస్తుంది. భూప్రపంచం అంతటినీ రక్షించ గలిగే దృక్పథాన్ని మనలో కలిగిస్తుంది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలను అభివృద్ధి చేసుకుంటూనే పర్యావరణంతో సమతుల్యాన్ని పాటించడమే ఈ శతాబ్దపు సవాల్‍.

ఎసికె. శ్రీహరి
ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *