ప్రకృతే నియంత్రిస్తుంది 11 ప్రకృతే శాసిస్తుంది!!
ప్రకృతి దృగ్విషయాలు వింతగాను, ఆలోచించేవిగాను వుంటాయి. నేల, సముద్రం, ఆకాశం, కొండలు, పర్వతాలు ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తిస్తాయి. తమలోతుల్ని చూడమంటాయి. ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గల దూరం, ఒక దేశం నుంచి మరో దేశానికి గల భూ, సముద్ర, ఆకాశ మార్గాల దూరాలు వేర్వేరుగా వుంటాయి. వీటి ప్రయాణ దూరాన్ని గంటల్లో కొలుస్తాం. అధిరోహించలేని పర్వతాల ఎత్తుల్ని, దాటలేని నదుల వెడల్పును, ఈదలేని సముద్రాల లోతుల్ని, వైశాల్యాల్ని ఒకప్పుడు అట్లాస్‍ల్లో చూసి తెలుసుకుంటే, ఇప్పుడంతా గూగుల్ మయమే! ఈ సమాచారం, గణాంకాలు, విషయాల్ని ఎవరు, ఎలా, ఎప్పుడు గుర్తించారు అని ఏనాడూ ఆలోచించం. ఇప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి, ఇంకా చెప్పాలంటే డిజిటల్ టెక్నాలజీ, అంతరిక్ష వాహక నౌకలు (space crafts) ఈ సమాచారాన్ని అందిస్తాయిగా అనుకుంటాం!
కాని, పారిశ్రామిక విప్లవానికి ముందు ఈ విషయాల్ని ఎలా గుర్తించేవారో, సేకరించిన సమాచారాన్ని ఎలా గ్రంథస్తం చేసేవారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. నేడు ప్రపంచ వ్యాపితంగా పోగుపడిన జ్ఞాన సంపద, రాసులు రాసులుగా అనేక భాండాగారాలల్లో లభిస్తుంది. కొన్ని అచ్చుకెక్కగా, మరికొన్ని అనాథగానే వుండి పోతున్నాయి. అలాంటి వాటిలో ఇండియా రేఖాంశ మహాచాపం (Great Indian Arc of the Meridian) చెప్పుకో తగ్గది. ఈ సంపదంతా 19వ శతాబ్దంలో భారతదేశ దక్షిణకొస నుంచి, ఉత్తరాన హిమాలయాల చివరి అంచుదాకా సేకరించిన సమాచారమే! ది గ్రేట్ ట్రిగ్నామెట్రికల్ సర్వే ఆఫ్ ఇండియా గొడుగుకింద దాదాపు ఏడు దశాబ్దాలు సేకరించి, గణనచేసి దాచిన సమాచారము ఓ మహా గ్రంథాలయ సముదాయంగా నిండిపోతుంది. ఈ పేజీల్లో నిక్షిప్తమైన ప్రతిఅక్షరం భారతదేశ ఉపఖండం యొక్క అణువణువును ప్రతిబింబిస్తుంది. భౌగోళిక విషయాలతో పాటు జల, ఖనిజ వనరులను, సంపదను, అటవీ సంపదను, పల్లెను, పట్టణాన్ని, నగరాల్ని, వాటి నాగరికగతను, నదుల్ని, లోయల్ని, కొండల్ని, కనుమల్ని, పర్వతశ్రేణుల్ని, మహాపర్వతాల ఎత్తుల్ని మన కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తుంది. దీని సేకరణకై చేపట్టిన సర్వే పద్దతుల్ని, పడిన కష్టాల్ని, పోయిన ప్రాణాల్ని, అన్నీంటికి మించి సర్వేయర్ల దృఢ సంకల్పాన్ని, శ్రమని, నిజాయితీని మనను ఔరా అనిపిస్తుంది. ఒక్క మాటల్లో చెప్పాలంటే హిమాలయ శిఖరాలకన్నా మరింత ఔన్నత్యాన్ని ఈ సర్వే కల్గి వుందన్నమాట.
ఈ మహాచాప సృష్టికర్తలు, ప్రధాతలు ఎందరో మహాను భావులు. అందులో ప్రధానంగా చెప్పుకునే వారిలో బ్రిటన్‍కు చెందిన కల్నల్ విలియంలాంబ్టన్ (William Lambton) కాగా, మరొకరు లెప్టినెంట్ జనరల్ జార్జ్ ఎవరెస్ట్ (George Everest)
మహాచాపానికి ఆధ్యుడు, ఆరాద్యుడు విలియం లాంబ్టన్ :
1608లో మొట్ట మొదటిసారి భారత్‍లోకి (సూరత్) వ్యాపార నిమిత్తమై అడుగుపెట్టిన ఆంగ్లేయులు, కలకత్తా కేంద్రంగా రాజ్యాన్ని స్థాపించి, దక్షిణాన మద్రాసును, మైసూర్‍ను, పడమరన బొంబాయిని హస్తగతం చేసుకోవడం తెలిసిందే! ఈ క్రమంలో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్ దౌలాను, మైసూరు పులిగా పేరుగాంచిన టిప్పుసుల్తాన్‍ను ఓడించడం, చంపడం తెలిసిందే. 1799-1800లో జరిగిన నాల్గవ మైసూర్ యుద్ధంలో పులివేటకు పథక రచన చేసిన వ్యక్తే ఈ మహాచాపం సృష్టికర్త విలియం లాంబ్టన్. ఈ విజయంతో, రాజ్యవిస్తరణకై దేశ భౌగోళిక స్వరూపాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని, సంపదల ఉనికిని కూడా గుర్తించాలని, మద్రాస్ కేంద్రంగా బ్రిటీష్ ప్రభుత్వం రెండు సర్వే బృందాల్ని ఏర్పాటు చేసింది.
ఇందులో ఒక బృందం స్థానిక పంటలపై వ్యాపార సంబంధాలపై సర్వే చేయగా, మరో బృందం దక్షిణ భారత భూభాగ సర్వేని చేపట్టింది. ఈ సర్వేకి ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు కల్నల్ కొలిన్ మెకంజి (Col.colin Mackenzie)ని నియమించింది.
మెకంజి ప్రాథమిక గణిత సూత్రాల్ని, త్రిభుజీకరణ సిద్ధాంతాన్ని ఉపయోగించి మైసూర్ రాజ్య సరిహద్దుల్ని, పట్టణాల్ని, కోటల్ని, పల్లెల్ని, నదుల్ని, వీటి ప్రవాహ దిశల్ని, రహదారుల్ని, చెరువుల్ని, జలాశయాల్ని, కనుమల్ని (పశ్చిమ), కొండల్ని, వీటికి అనుసంధానంగా వుండే సంపదల్ని, అతి కచ్చితత్వంతో చూపాడు. దీనికై మెకంజి థియోడలైటు ( త్రిభుజీకరణానికి)ను, సమతలబల్ల (స్థలాకృతిని గుర్తించ డానికి)ను, ఉక్కుగొలుసు (కొలతలకు)ను, చక్రసాధనాల (నడక దూరం తెలిపేవి)ను పరికరాలుగా వాడాడు.
దీన్ని స్ఫూర్తిగా తీసుకొని దక్షిణాది నుంచి పశ్చిమానగల మంగళూరు, బొంబాయి దాకా సర్వేను చేయించాలని మూడో సర్వే బృందాన్ని 1800లో ఏర్పాటు చేసింది. దీని అధిపతే లాంబ్టన్. సిఫాయిగా అమెరికాలో, కెనడాలో భౌగోళిక స్వరూపాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన లాంబ్టన్ గణిత శాస్త్రజ్ఞుడు కూడా! అమెరికా, కెనడాల మధ్యన సరిహద్దును (నయాగరా) నిర్ణయించడంలో సహకరించాడు. భూతల సర్వేతో పాటుగా, భూపరిమాణాన్ని కూడా మాపనం చేయాలనే కోరిక లాంబ్టన్‍కు బలంగా వుండింది. ఈ లక్ష్య సాధనకై 1802లో మద్రాస్ కేంద్రంగా తన మహాచాపం సర్వేను ప్రారంభించాడు.
మొదటి మౌల్యరేఖ (first base line) :
ఇంగ్లాండ్ నుంచి రావల్సిన థియోడలైట్ (సముద్రంలో ఫ్రెంచ్‍వారు పట్టుకోడంతో) ఆలస్యం కావడం, జనిత్ సెక్టార్ (ఖగోళ పరిశీలనకై ఉపయోగించేది) లేక పోవడంతో కేవలం ఉక్కుతో తయారు చేసిన 40 కడ్డీల (కడ్డీ పొడవు 0.76 సెం.మీ. / మొత్తం పొడవు 30.5 మీటరు / బరువు 51 కి.గ్రా.) గొలుసుతో లాంబ్టన్ తన మొదటి సర్వేను మద్రాస్ బీచ్‍లో ప్రారంభించాడు. బీచ్‍లోని జండా కర్ర నుంచి రేసు కోర్సులోగల గ్యాలరీ (grand stand)ని కొలవగా, 5,854 మీటర్లు (5.85 కి.మీ) వచ్చింది. తర్వాత థియోడలైట్ రావడంతో, గ్యాలరీ రెలింగ్ (railing) నుంచి బీచ్‍లోని జండాకర్రకు గాలి నిమ్న కోణాన్ని (angle of depression) గుర్తించాడు. తిరిగి జండాకర్ర నుంచి రెలింగ్‍కు గల ఊర్థ్వకోణాన్ని (angle of elevation) కొలిచాడు. (మౌల్యరేఖను కొలిచేటప్పుడు దాని కచ్చితమైన నిడివిని, సముద్రమట్టంపైగల దాని ఎత్తును తెలుసుకోవడం చాలా అవసరం. 1802 దాకా సముద్రమట్టాన్ని అలల పోటు రేఖను ఎత్తుగా గుర్తించేవారు. తర్వాత నుంచి ఆటుపోటుల సరాసరి రేఖను సముద్రమట్టంగా గుర్తిస్తున్నారు.) ఈ విధంగా జండాకర్ర దగ్గర, రెలింగ్ దగ్గర ఏర్పడిన రెండు కోణాలతో జండాకర్ర నుంచి రేస్‍కోర్సు దూరాన్ని (5,854 మీ.)
ఉపయోగించి (రెండు కోణాలు / ఒక భుజము) త్రిభుజాన్ని ఏర్పర్చి, జండాకర్ర నుంచి రెలింగ్ ఎత్తును కర్ణం సహాయంతో గుర్తించి ఎత్తును కనుగొనగా రేసుకోర్సు సముద్ర మట్టానికి 4.8 మీటర్ల ఎత్తులో వున్నట్లు లాంబ్టన్ తేల్చాడు. ఇదే త్రిభుజీకరణ సూత్రంతో మిగతా సర్వేలను, హిమాలయ పర్వతాల ఎత్తుల్ని గుర్తించడం జరిగింది.
12 కి.మీ. దూరం (మౌల్యరేఖ) కొలతకు 57 రోజులు :
బీచ్ ప్రయోగం తర్వాత లాంబ్టన్ మద్రాస్ మౌల్యరేఖకు సన్నాహాలు చేసాడు. మద్రాస్‍కు దక్షిణంగా వున్న మౌంట్ సెంట్ థామస్ నుంచి 12 కి.మీ. దూరంలోని మరో కొండను ఎంచుకున్నాడు. ఈ 12 కి.మీ. మౌల్యరేఖను గొలుసుతో 400 సార్లు కొలిచారు. దీనికై 57 రోజులు పట్టగా, రెండు చివరల (A, B బిందువుల) గుర్తుల్ని (land marks) కట్టడానికి మరికొన్ని రోజులు పట్టాయి. ఇలాంటి గుర్తులపై, గుట్టలపై థియోడలైట్‍ని వడంబం (plumb) దోషం లేకుండా దూరాల్ని, కోణాల్ని అతి కచ్చితంగా గుర్తించి త్రిభుజీకరణ చేసి వాస్తవ దూరాల్ని, ఎత్తుల్ని, పల్లాల్ని గుర్తించాడు.
ఇలా ప్రారంభమైన లాంబ్టన్ సర్వే తీరం వెంబడి ఒక డిగ్రీ అక్షాంశాన్ని దక్షిణ కొసన గల కేప్ కామరిన్ (కన్యాకుమారి) వరకు సర్వే చేయడానికి ఒక సంవత్సరం (1803) పట్టింది. అలాగే మద్రాస్ మౌంట్ సెంట్ థామస్ నుంచి పడమరన గల మంగళూరు మధ్యన దూరాన్ని సర్వేచేసి, త్రిభుజీకరణతో 660 కి.మీ. దూరంగా (తర్వాత ఇండియా భూభాగం అరేబియా సముద్రంలో కుంచించుక పోయినట్లుగా గుర్తించి ఈ దూరాన్ని 576 కి.మీ. గా సవరించారు) గుర్తించి, ఈ ప్రాంత ద్వీపకల్ప వెడల్పును (తూర్పు-పడమర) 640 కి.మీ.గా లెక్కకట్టారు. ఈ సర్వేకు, గణనకు మూడు (1802-1805) సంవత్సరాలు పట్టింది.
78 డిగ్రీల మహాచాపం (780 Great Arc)
ఇలా ప్రాథమికంగా మొదలైన లాంబ్టన్ సర్వే కచ్చితత్వంతో కూడి వుండడం, సర్వేద్వారా అనేక భూభౌగోళిక, సంపదల, ఆస్తుల, ప్రజల సాంఘిక, ఆయా ప్రాంతాల రాజకీయ పరిస్థితిని ప్రతిబింబిస్తుందని గుర్తించిన ప్రభుత్వం యావత్ దేశాన్ని సర్వే చేయాలని, మిగతా ప్రాంతాలకు బ్రిటీషు రాజ్యాన్ని విస్తరించాలని తలచి, పటాల (Maps)ను సిద్ధం చేయాలని లాంబ్టన్‍ను నాటి మద్రాస్ గవర్నర్ జనరల్ అయిన రిచర్డ్ వెస్లీ (Rechard Wesley) కోరడంతో లాంబ్టన్‍కు మరింత అవకాశం కల్గింది.
దీంతో కేప్ కామరిన్ నుంచి హైదరాబాద్‍కు 78 డిగ్రీల రేఖాంశానికి అనుబంధంగా సర్వేను మొదలు పెట్టారు. దీన్నే ఉత్తర దక్షిణ శ్రేణిగా, మహాచాపంగా పేరుపెట్టాడు. యావత్ దేశవ్యాపితంగా జరగబోయే ఈ త్రికోణమితి (Trignometrical) సర్వే అస్థిపంజరమైతే, ఈ మహాచాపం (Great Arc) వెన్నెముక లాంటిదని లాంబ్టన్ ప్రకటించాడు. హైదరాబాద్ వరకు గల ఈ రేఖాంశ దూరం 1020 కి.మీ.గా తేల్చాడు. ఈ మొత్తం దూరాన్ని (భూతలంపై 10 డిగ్రీల అక్షాంశం) లాంబ్టన్ కాలినడకన, ఎడ్లబండ్లపై, పల్లకిలో ప్రయాణిస్తూ చేయడం గమనార్హం. మౌల్యరేఖ బిందువులకై గుట్టల్ని, గుడిగోపురాల్ని, చర్చ్ల శిఖరాల్ని, కోట గోడల్ని ఉపయోగించు కుంటూ, అవసరం అయినచోట కొన్ని మీటర్ల ఎత్తున (పులివెందుల దగ్గర గల చిన్న కుడాల, బెడదూరు గ్రామ పరిసరాల్లోని కొండలపై ఈ గుర్తులు ఇప్పటికి కలవు) రాతి కట్టడాల్ని (బురుజుల్ని) కట్టి థియోడలైట్‍ను స్థిరీకరించేవాడు.
ఇలా తంజాపూర్‍లో బృహదీశ్వరాలయ గోపురంపైకి థియోడలైట్ (1/2 టన్ను బరువు)ను ఎక్కిస్తుండగా గోపురంపై కొన్ని విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. తిరిగి వాటిని స్వయంగా దగ్గరుండి లాంబ్టన్ బాగు చేయించాడు. ఈ సర్వేయాత్రలో లాంబ్టన్ బృందం అనారోగ్య సమస్యల్ని, మలేరియా జ్వరాల్ని, దొంగల ముఠాల దాడుల్ని, జమిందారుల (పొలిగార్) నుంచి వ్యతిరేకతను (గుట్టలపై నుంచి సూక్ష్మదర్శిని ద్వారా మహిళల్ని నగ్నంగా చూస్తారని భావించి) ఎదుర్కొన్నారు. అననుకూల వాతావరణ పరిస్థితుల్ని, వర్షాల్ని, తుఫాన్లను, తీవ్ర చలిని ఎదుర్కున్నారు. నదుల్ని దాటడానికి (కృష్ణా, గోదావరి, నర్మదా మొ।।) పుట్టితో (తోలుతో కప్పబడె పెద్ద వెదురు బుట్ట) దాటడం జరిగేది.
సర్వేకు రహదారి అంటూ వుండది కాబట్టి మారుమూల ప్రాంతాల్లో కొండల్ని, గుట్టల్ని, లోయల్ని ఎక్కుతూ, దిగుతూ సాగాల్సిందే! నాడు అటవి సంపద, కీకారణ్యాలు (దండకారణ్యం, చంబల్) అత్యధికం కాబట్టి, క్రూర మృగాల, అటవి కీటకాల, సరీసృపాల బెడద విపరీతంగా వుండేది. రాత్రుల్లో వెలగడి (మంట) పెట్టి, కూతలతో, అరుపులతో, తుపాకులను పేల్చుతూ వాటిని అదరగొట్టే వారు. (ఆగ్రా నుంచి దక్షిణానికి డా।। హెన్రీ వొయిసె సర్వే చేస్తుండగా అయిదుగురిని పులి దాడి చేసి పట్టుకెళ్ళింది.)
ఈ విధంగా హైదరాబాద్ వైపు సర్వే సాగుతున్నప్పుడు కృష్ణానది దాటి ఏటూరునాగరం గుండా, వరంగల్ వైపు వస్తున్నప్పుడు యల్లాపురం (సర్వే బృందం పెట్టుకున్న పేరు) దగ్గర బృందమంతా (150 మందికి పైగా) జ్వర పీడితులయ్యారు. ఇది మలేరియా జ్వరం అయినా దీనికి యల్లాపురం జ్వరం అని పేరు వచ్చింది. ఈ జ్వరంతో 15 మందికి పైగా సిబ్బంది చనిపోగా (అప్పటికి 1818లో జార్జ్ ఎవరెస్టు వచ్చి చేరాడు), మిగతా వారు అస్థిపంజరాలుగా మారారు. బృందానికి వైద్యసేవలందించాల్సిన డా।। వొయిసె కూడా నడవలేని స్థితిలో పల్లకిలో రాగా, ఎవరెస్టు స్ట్రెచర్‍పై ఓ కోయ తెగ నాయకుడి సహకారంతో మూడు వారాలకు హైదరాబాద్ చేరాడు. మిగతా సిబ్బందిని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఎడ్లబండ్ల సహాయంతో హైదరాబాద్ చేర్చారు.
కొలిసిందే కొలవడం – తిరిగిందే తిరగడం :
సర్వే అనగానే గొలుసులతో, థియోడలైట్ సహాయంతో, జనిత్ సెక్టార్ పరికరంతో కొలత చేసుకుంటూ పోవడం కాదు. ముందు ఓ స్థానాన్ని (బిందువును) నిర్ణయించుకోవాలి. ఆ బిందువు ఎంచుకున్న రేఖాంశానికి, అక్షాంశానికి అనుబంధంగా వుండాలి. గుర్తించాల్సిన ప్రదేశాన్ని, పట్టణాన్ని, నదుల్ని, ఎత్తుల్ని, కనుమల్ని దృష్టిలో పెట్టుకోవాలి. వీటి సరళరేఖలో రెండో బిందువును గుర్తించాలి. ఈ రెండు స్థానాల మధ్యన అనేకసార్లు అటూ, ఇటుగా తిరిగి చూడాలి. అడ్డంకుల్ని తొలగించాలి. చెట్లను నరకాలి. (హిమాలయాల్లోని శివాలిక్ పర్వతాలలోని ఓ కొండ ఎత్తును తవ్వి ఆరు మీటర్లు తగ్గించారు) ఆగ్రా పరిసర ప్రాంతంలో జరిపిన సర్వే సందర్భంగా అడ్డు వచ్చిన అక్బర్ సమాధిపై గల గుమ్మటాన్ని తొలగించి, సమాధిపైననే ఆరు మీటర్ల జండాకర్రను నిలిపారు. చివరికి తాజ్‍మహల్ గుమ్మటంపై కూడా సర్వే స్థానాన్ని గుర్తించాలను కున్నా, ఎవరెస్టు విరమించుకొని, తాజ్‍మహల్ స్థానం యొక్క కచ్చితమైన రేఖాంశ, అక్షాంశాల్ని గుర్తించారు. ఇక్కడనే యమునా నదిని 78 డిగ్రీల రేఖాంశం (great meridian) నిట్ట నిలువుగా సమానంగా చీల్చుతున్నట్లు గుర్తించారు. అలాగే ఫతేపూర్ సిక్రిపై ఒక తిన్నెను నిర్మించాడు. ఇలా గుర్తించిన స్థానాల్ని, కట్టిన కట్టడాల్ని స్థానికులు ధ్వంసం చేయడం కూడా జరిగేవి.
దీంతో ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగేవి. ప్రభుత్వం కేవలం సర్వేకే (రూట్) ప్రాధాన్యతను ఇవ్వాలని పదేపదే సూచించేది. కొన్ని సర్వే బృందాలు ఈ ఆదేశాల్ని పాటించేవి. కాని, లాంబ్టన్ లక్ష్యం వేరు. దాదాపు ఇదే దారిలో నడిచిన ఎవరెస్టుది కూడా అలాంటిదే! ఈ ప్రతికూలతతో మలబార్ తీర మౌల్యరేఖను లాంబ్టన్ కొలవలేక పోయాడు.
ఇండియా మహాచాపం : (Great Arc of India)
కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా కొన్ని మంచి పనులకు కారణమౌతాయి అన్నట్టుగా, యావత్ భారత్ ఉపఖండానికి ప్రాతినిధ్యం వహించే 78 డిగ్రీల రేఖాంశానికి అనుగుణంగా ఉత్తర దిశవైపు, దీని కొనసాగింపుగా తిరిగి దక్షిణ దిశవైపు మౌల్యరేఖల్ని కొలత చేయాలని భావించిన లాంబ్టన్, బెంగళూరును ప్రారంభ స్థానంగా ఎంచుకొని మొదటి మౌల్య రేఖను కొలవ నారంభించాడు. ఈ కొలతకే లాంబ్టన్ ‘ఇండియా మహాచాపం’గా పేరు పెట్టాడు. (ఇది నేటి NH-44 (old NH-7), ఆసియా AH-43). బెంగళూరు నుంచి నైజాం సరిహద్దు వరకు 1806లో ఉత్తరదిశ చాపాన్ని త్రిభుజాలతో పొడగించాడు. దక్షిణ వైపు 224 కి.మీ. దూరంలోగల కోయంబత్తూరు దగ్గర మరో మౌల్యరేఖను కొలతచేసాడు. ఇక్కడి నేలపై గుర్తించిన 9.6 కి.మీ. మౌల్యరేఖ త్రిభుజీకరణ ద్వారా గణన చేస్తే 19.3 సెం.మీ. తేడా వచ్చింది. ఇలా పెద్ద అంగలతో (పురాతన కొలత విధానం – ఇప్పుడు థియోడలైట్‍తో త్రిభుజీకరణ) 1809లో కేప్ కామరిన్‍కు చేరాడు. (ఈ సందర్భంగానే బృహదీశ్వరాలయ గోపురం దెబ్బతిన్నది).
దక్షిణదిశ చాపాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి 1815లో హైదరాబాద్‍కు చేరి 120 కి.మీ. దూరంలోని బీదర్‍కు మహాచాపాన్ని పొడగించి ఆరవ మౌల్యరేఖను గుర్తించాడు. ఇప్పటి వరకు కూడా భూమిపై కొలిచిన చాపాలలో కేప్ కామరిన్ – బీదరు చాపమే (1140 కి.మీ) అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. యూరప్‍లో కూడా ఇంత పెద్ద చాపం కొలవబడ లేదు. ఈ చాపం అతి కచ్చితమైనదిగా గుర్తించబడడంతో భూపరిణామ శాస్త్రంలో ఓ ప్రత్యేకతను సంతరించుకున్నది. ఇలా మైసూరు సర్వేగా (మెకంజి) ప్రారంభమై దక్షిణ ద్వీప కల్పం యావత్తుగా విస్తరించి, ఉత్తరానికి (నాగపూర్, ఆగ్రా, డెహ్రాడూన్), తూర్పు (అస్సాం), పడమర బొంబాయి, గుజరాత్ తీరాల అంచులకు వ్యాప్తి చెందడానికి కారణమైంది.
ఈ బృహత్కార్యానికి కర్త, ఆధ్యుడైన లాంబ్టన్‍కు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. సర్వత్రా కొనియాడ బడ్డాడు. భూపరిమాణ శాస్త్రంలో ముందున్న ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు, ఫ్రెంచ్ అకాడమి ఆఫ్ సైన్సెస్ లాంబ్టన్‍కు సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. లండన్ రాయల్ సొసైటీ సభ్యత్వం ఇవ్వగా, కలకత్తా కేంద్రంగా గల ఈస్టిండియా కంపెని డైరెక్టర్ సామ్యూల్ డేవిస్ అభినందిస్తూ ఉత్తరం పంపాడు. ఈ మొత్తం కథనాన్ని వ్యాసంగా 1813లో ఎడింబరో రివ్యూలో ప్రొ।। జాన్ ప్లేఫేర్ (Play fair) రాసాడు.
ఉత్తర దిశగా అంగలు – పడమర నుంచి
తూర్పు దిశగా త్రిభుజీకరణ రెమ్మలు!
ఈ మధ్యకాలంలో లాంబ్టన్ ఆరోగ్య సమస్యలతో పాటుగా, సిబ్బంది సమస్యలు అధికమయ్యాయి. జ్వరాలు, ఇతర ఆరోగ్య సమస్యలపై సర్వే బృందంలోని సిబ్బంది మరణించడంతో భారత్‍లో బ్రిటీషువారి ఆయుఃప్రమాణం 45 సం।।లకు దిగజారింది. వీటికి బయపడి మరికొందరు సర్వేను విడిచిపోవడం, అశక్తతను వ్యక్తపరచడం జరిగేది. తోడుగా ఓ వైపు సర్వే చేయడం, మరోవైపు సేకరించిన గణాంకాలను సూత్రీకరించడం లాంబ్టన్‍కు తలకుమించిన భారమైంది. నలభై సంవత్సరాల వయస్సులో సర్వేలో చేరిన లాంబ్టన్ వయస్సు అరవైలో పడింది. తోడు క్షయ దగ్గు అధికమైంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఓ డాక్టరును, మరొక భూగర్భశాస్త్రజ్ఞున్ని పంపమని ప్రభుత్వాన్ని కోరాడు లాంబ్టన్. లాంబ్టన్ కోరినట్లుగానే స్వయంగా వైద్యుడు, భూగర్భ శాస్త్రజ్ఞుడైన డాక్టర్ హెన్రీ వొయిసె (Henry Voisey) తో పాటుగా ఒక సహాయకున్ని 1818 డిసెంబర్‍లో హైదరాబాద్ క్యాంపుకు పంపించారు. ఈ సహాయకుడే ముప్పైరెండు సంవత్సరాల లెఫ్టినెంట్ జార్జి ఎవరెస్టు. అప్పటికే ఎవరెస్టుకు సర్వే అనుభవం వుంది. సర్వేలో చేరిన సంవత్సరానికి, తిరిగి రెండో సంవత్సరంలో ఎవరెస్టు జబ్బు పడ్డాడు. ఆ తర్వాత లాంబ్టన్ స్థానంలో సూపరింటెండెంట్ అయిన తర్వాత 1825లో జబ్బుపడగా అయిదు సంవత్సరాలు ఇంగ్లాండుకు వెళ్ళి వచ్చాడు. (పోను, రాను సముద్రయానానికి సంవత్సరం).
హైదరాబాద్ క్యాంపు నాగపూర్‍కు మార్పు :
లాంబ్టన్ చివరి రోజు :
సహాయకుడిగా వచ్చిన ఎవరెస్టు యల్లాపురం (వరంగల్) జ్వరానికి గురికావడంతో విశ్రాంతికై దక్షిణాఫ్రికా కేప్ ఆఫ్ గుడ్ హోప్‍కి వెళ్ళడం, వైద్యుడిగా, శాస్త్ర వేత్తగా వచ్చిన వొయిసెను కలకత్తా కేంద్రంగా జరిగే సర్వేకు బదలాయించడంతో తిరిగి లాంబ్టన్‍పై పనిభారం పెరిగింది. దీనికి తోడు మద్రాస్ కేంద్రంగా గల ది గ్రేట్ ట్రిగ్నామెట్రికల్ సర్వే కార్యాలయాన్ని 1818లోనే కలకత్తాకు మార్చడంతో నివేదికల్ని పంపడం, అధికారిక అనుమతుల్ని అందుకోవడం లాంబ్టన్‍కు కష్టమైంది. సర్వేని కూడా హైదరాబాద్, మైసూర్ పద్ధతిలో కాకుండా, మహాచాపాన్ని ఆధారంగా చేసుకొని ఇండియా మొత్తంగా రేఖాంశ, అక్షాంశాలతో ఒక ఊహ చట్రాన్ని తయారు చేయాలని, హైదరాబాద్, మైసూరు సర్వేలను కూడా ఇలాగే మార్చాలని అధికారులు లాంబ్టన్‍పై ఒత్తిడి తెచ్చారు. ఇది ఇష్టంలేని లాంబ్టన్ మహాచాపాన్ని ఉత్తరాన ఆగ్రావరకు, పడమరన బొంబాయి వరకు, తూర్పున కలకత్తా వరకు పొడగించాలని త్రిభుజీకరణ కొమ్మల్ని, ఆకుల్ని, రెమ్మల్ని (అన్ని ప్రాంతాలకు) మహాచాపం (780 రేఖాంశ) ఆధారంగా నిర్మించాలని కృత నిశ్చయంతో వున్నాడు. దీనికి అనుగుణంగానే మహాచాపాన్ని మధ్య ఇండియా వరకు పొడగించాడు. 1822 అక్టోబర్ నాటికే నాగపూర్‍కు పడమరన గల బీరర్ (Berar – Nizam assigned districts) ప్రొవిన్స్లోని ఎలిచ్‍పూర్ వద్ద ఓ మౌల్యరేఖను లాంబ్టన్ కొలత చేసాడు. ఇదే చివరి సర్వే అని లాంబ్టన్‍గాని, ఆయన అనుచరులుగాని అనుకోని వుండరు. అప్పటికే మహాచాపం త్రిభుజీకరణాన్ని ఉత్తరానికి పొడగించే బాధ్యతను లాంబ్టన్ పర్యవేక్షణలో కొనసాగించాలని లాంబ్టన్ ప్రతినిధి అయిన జాషువా డిపెన్నింగ్‍కు అధికారికంగా అప్పజెప్పారు.
హైదరాబాద్ కేంద్రంగా 500 కి.మీ. దూరంలో సర్వే చేయడం ప్రయాసతో కూడుకున్నదని, క్యాంపు కార్యాలయాన్ని నాగపూర్‍కు డిపెన్నింగ్ డా।। వాయిసెకు బదులుగా పంపించబడ్డ డా।। మోర్టన్‍ల సహకారంతో లాంబ్టన్ మార్చుకున్నాడు. అది జనవరి 7, 1822. అతిచలిగా వుంది. క్షయ దగ్గుతో లాంబ్టన్ బాధ పడుతున్నాడు. నాగపూర్‍కు 80 కి.మీ. దూరంలోని హింగన్‍ఘాట్ గుండా ప్రయాణం సాగుతున్నది. తెల్లవారి లాంబ్టన్ నిద్రలేవలేదు. పరిచర్యలు చేసే వ్యక్తి లేపిచూడగా, లాంబ్టన్ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు.
ఓ సాధారణ పౌరుడిగా ది గ్రేట్ విలియమ్ లాంబ్టన్ హింగన్ ఘాట్‍లోనే సమాధి చేయబడడం ఓ చారిత్రిక విషాదం?
(తరువాయి వచ్చే సంచికలో)
డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162