మన తెలంగాణ ఐటి సవాళ్ళు దాటి.. అభివృద్ధిలో మేటి


తెలంగాణ రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‍ రంజన్‍


లక్ష్యాలు చేరుకునేందుకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. సమస్యలూ పలకరిస్తాయి. అయితే వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ప్రయాణం సాగిస్తేనే గమ్యస్థానం చేరుకోగలం. అభివృద్ధిపరంగా అయినా ఇదే సూత్రం. ఇది తూ.చ. తప్పకుండా పాటించింది కాబట్టే ఇప్పుడు తెలంగాణలో ఐటి, పరిశ్రమలు వృద్ధిరేటు ఆశాజనకంగా నమోదవుతుంది. కోవిడ్‍తో వివిధ రాష్ట్రాల ఆదాయాలు తలకిందులు అవుతున్న ఈ కష్టకాలంలో కూడా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. ఒకటి రెండు అని కాదు దాదాపు అన్ని రంగాల్లోనూ ఈ అభివృద్ధి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆపత్కాల పరిస్థితుల్లో రాష్ట్రంలోని పరిశ్రమలు, ఐటీ శాఖ ఎలా నిలదొక్కుకున్నాయి నిలకడైన పెట్టుబడులను రాష్ట్రం ఎలా ఆహ్వానిస్తుంది వంటి సందేహాలను వివరిస్తున్నారు మన తెలంగాణ రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‍ రంజన్‍.


కోవిడ్‍ క్లిష్ట పరిస్థితుల్లోను రాష్ట్ర ఐటీ శాఖ మెరుగైన ఫలితాలను సాధించింది. అయితే ఉద్యోగాల కల్పనలోనూ, ఐటీ ఎగుమతుల్లోనూ, రాష్ట్ర తలసరి ఆదాయంలోనూ దేశ సగటును మించిన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఆశాజనక ఫలితాల వెనుక ఆయా శాఖల కృషి ఎంతో వుంది. వాటి భవిష్యత్‍ కార్యక్రమం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఇలా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రోత్సహకాలే పారిశ్రామిక అభివృద్ధికి కారణం.


కోవిడ్‍ నేపథ్యంలో కూడా ఐటీ, పరిశ్రమల వర్గాల్లో మంచి ప్రగతిని సాధించడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. మొట్టమొదట వేగవంతమైన అభివృద్ధి సాధించడానికి తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగైదు సంవత్సరాల నుండే గట్టి పునాది వేయడం జరిగింది. ఈరోజు వాటి ఫలితాలు మనకు కనబడుతున్నాయి. ఆనాటి గట్టి పునాది వల్ల నేడు కోవిడ్‍ క్లిష్టసమయంలో కూడా అభివృద్ధికి మన తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవు. ఐటీ విషయంలో రెండు ప్రత్యేకమైన విషయాలు వున్నాయి. ఒకటి హైదరాబాద్‍ నగంలో ప్రపంచానికి సంబంధించిన అన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. సాధారణంగా పెద్దపెద్ద కంపెనీలు రెండు మూడు సంవత్సరాల ముందే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ఉదాహరణకు ఒక కంపెనీలో ఈ ఏడాది ఒక వెయ్యిమంది ఉద్యోగులు పనిచేస్తుంటే దాన్ని రెండేళ్లలో రెట్టింపు స్థాయికి తీసుకెళ్ళాలని లక్ష్యం పెట్టుకుంటాయి. అలా మనం ఇప్పుడు చూస్తున్న ఫలితాలు కూడా గత రెండు మూడు సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.


రెండవది ఐటీ పరిశ్రమలో కూడా కోవిడ్‍ కష్టాలు ఉన్నాయి. అయితే వారికి కోవిడ్‍ వల్ల కొత్త అవకాశాలు కూడా వచ్చాయి. ప్రపంచమంతా డిజిటలైజేషన్‍ చాలా భారీ స్థాయిలో జరుగుతుంది. మామూలు సమయంలో కన్నా ఇప్పుడు డిజిటలైజేషన్‍ కొన్ని రెట్లు పెరిగింది. కావున ప్రతి ఐటీ కంపెనీకి కొత్తగా అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగా కొత్తగా ఎంప్లాయిస్‍ను నియమించుకోవడం, కొత్త ప్రాజెక్టులను నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఫలాలు నేడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి. ఇలా ఐటీలో గణనీయమైన ప్రగతిని సాధించినా ఇది పెద్దగా ఆశ్చరపడే అంశం కాదు. ఎందుకంటే ముందే లక్ష్యాలు నిర్ణయించుకున్నాం కాబట్టి.


పరిశ్రమల విషయానికి వస్తే చిన్న పరిశ్రమలకు ఈ లాక్‍డౌన్‍ వల్ల, ఇతర కారణాల వల్ల వారి కార్యక్రమాలకు కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయి. కానీ పెద్ద పరిశ్రమలు దూరదృష్టితో లక్ష్యాలు నిర్దేశించుకొని వెళ్లుతాయి. అవి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లుతాయి. లాక్‍ డౌన్‍ వల్ల అన్నింటి కంటే ఎక్కువ నష్టం లాజిస్టిక్స్కు కల్గింది. దూర ప్రాంతాల నుండి ముడి సరుకు తెప్పించే వారికి, తయారు అయిన వస్తువులను దూర ప్రాంతాలకు అమ్మే కంపెనీలకు ఈ లాక్‍డౌన్‍ వల్ల ఎక్కువ నష్టాలు జరిగాయి. లాజస్టిక్స్లో చూస్తే తెలంగాణలోని హైదరాబాద్‍ నగరం భారతదేశానికి నడిబొడ్డున ఉంది. అందువల్ల లాజిస్టిక్‍కు చాలా ఉపయోగాలు
ఉన్నాయి. ఇక్కడి నుండి మ్యాన్‍ప్యాక్చరింగ్‍ ఏ ప్రాంతానికైనా సులభంగా తరలించవచ్చు. అదే విధంగా ఆ ప్రాంతాల నుంచి సులభంగా తెప్పించుకోవచ్చు. ఖర్చు తక్కువ వుంటుంది. లాజిస్టిక్‍ వసతులు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి అనేక సౌలభ్యాల వలన దూరదృష్టి గల పరిశ్రమలు పెట్టుబడులకు హైదరాబాద్‍ను ఎంచుకుని ముందుకు వస్తున్నాయి. అందువల్ల కోవిడ్‍ సమయంలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రగతి చాలా మంచిగా ఉన్నది.


2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వార్షిక నివేదికలో ఇటువంటి ఫలితాలను చూస్తున్నాం. మౌలికంగా హైదారాబాద్‍లో అభివృద్ధి జరగడానికి ప్రధానమైన కారణం ఇక్కడి నైపుణ్యత చాలా చక్కగా ఉంటుంది. 2014లో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శిగా నేను బాధ్యతలు స్వీకరించేటప్పుడు చాలా మంది చెప్పింది ఏమిటంటే బెంగళూరులో దొరికినటువంటి మేధావులు ఇక్కడ దొరకరు, మీరు చాలా కష్టపడాలి, హైదరాబాద్‍లో టాలెంట్‍ (నైపుణ్యత) మంచిగా ఉండదని ఇలా రకరకాల కామెంట్లు చేసేవారు. అటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రస్తుతం చాలా రంగాల్లో బెంగళూరు కంటే మన దగ్గరే టాలెంట్‍ (నైపుణ్యం) గలవారు ఉన్నారని చెబుతున్నారు. అదీకాక ఇలా టాలెంట్‍ గలవారికి బెంగళూరులో ఎక్కువ జీతం ఇవ్వాల్సి వుంటుంది. ఎందుకంటే అక్కడి కాస్ట్ ఆఫ్‍ లివింగ్స్ ఎక్కువ కాబట్టి. హైదరాబాద్‍లో కాస్ట్ ఆఫ్‍ లివింగ్స్ తక్కువ కావున వారి జీతం కూడా తక్కువగా వుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీల్లో గమనిస్తున్నది ఏమిటంటే బెంగళూరులో ఉద్యోగుల మార్పిడి చాలా భారీగా జరుగుతుంది. పెద్ద కంపెనీల్లో ఉద్యోగులు 10 నుంచి 12 శాతం మంది మారిపోతుంటారు. ఆ ప్లేస్‍లో కొత్త వారిని నియమించుకొని వారికి కొంత కాలం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలా అక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. ఇటువంటి సమస్య హైదరాబాద్‍లో 3 నుంచి 4 శాతం మాత్రమే ఉంటుంది. కావున హైదరాబాద్‍లో ఉద్యోగాలు ఎక్కువ పోవు, జీతాలు తక్కువుగా ఉంటాయి, నాణ్యతలో కూడా ఎటువంటి మార్పు ఉండదు, నైపుణ్యం గల ఉద్యోగులు దొరుకుతారు. ఇది భవిష్యత్‍లో కూడా ఇలానే కొనసాగుతుంది అంటున్నారు జయేశ్‍ రంజన్‍.


జీనోం వ్యాలీ :
జీనోం వ్యాలీ సెకండ్‍ ఫేస్‍ కార్యక్రమాలు ఈ సంవత్సరమే మొదలైనాయి. కొత్తగా కొన్ని కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్‍ పెడుతున్నాయి. ఇవన్నీ జీనోం వ్యాలీ స్ఫేస్‍-2లో పెట్టడం జరుగుతుంది అని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుగారు చెప్పారు. అదే విధంగా బయోఫార్మా హబ్‍లో కూడా కన్‍స్ట్రక్షన్‍ మొదలై దాదాపు పూర్తి కావస్తుంది. కొన్ని కంపెనీలు స్పేస్‍ కూడా తీసుకున్నాయి. గత బయోలో ప్రకటించిన రెండు అంశాలు ఇప్పటికే పూర్తి అయినాయి. వీటి ద్వారా బయోటెక్‍ రంగానికి ఇంకా పెద్దపీఠ దొరికే అవకాశం ఉంటుంది. కరోనా వ్యాక్సిన్‍ నేపథ్యంలో హైదరాబాద్‍లో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్‍ను ప్రపంచమే గుర్తించింది. ఇలా హైదరాబాద్‍ ఖ్యాతి ప్రపంచము వైపు వ్యాపిస్తుంది. ఫార్మా రంగం కోసం కూడా మూడు సంవత్సరాల నుంచి చాలా కృషి చేస్తున్నాము. మాస్టర్‍ ప్లాన్‍, స్థల సేకరణ, ఇన్‍ఫాస్ట్రక్చర్‍, మౌలిక వసతులు కల్పించడం వంటివి చివరి దశకు వచ్చినాయి. హైదరాబాద్‍లో నేడు బయోటెక్నాలజీ రంగం, ఫార్మారంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది.


మెడిసిన్‍ ఫ్రమ్‍ ద స్కై :
‘మెడిసిన్‍ ఫ్రమ్‍ ద స్కై’ ప్రస్తుతం ఒక ప్రయోగం చేస్తున్నాం. భారతదేశంలో ఇటువంటి విధానం ఎక్కడా లేదు. ప్రపంచంలో కూడా ఆఫ్రికా వంటి దేశంలో రవాండ ప్రదేశంలో మాత్రమే ఒక స్థాయిలో వుంది. మిగతా చోట్ల ఆ స్థాయిలో లేవు. భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. ఎందుకంటే దీనిలో చాలా సమస్యలు ఉంటాయి. రకరకాల పర్మిషన్లు, అనుమతులు, ఇతర డిపార్ట్మెంట్‍ల సమన్వయం అవసరం ఉంటుంది. మొట్టమొదటి సారి తెలంగాణ ప్రభుత్వమే ఈ ఆలోచన చేసింది. ‘వరల్డ్ ఎకనామిక్‍ ఫోరం’ అని ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది. వాళ్ళతో మేము భాగస్వాముల మవుతున్నాము. ఇలా అందరి దగ్గరనుంచి ఈ ప్రయోగం చేయడానికి అనుమతి వచ్చింది. ఈ ప్రయోగం ద్వారా ఎట్లాంటి ఫలితాలు వస్తాయి, ఎంత దూరం వ్యాక్సిన్‍ తీసుకెళ్లగలుతాము, ఎంత దూరం మెడిసిన్స్ తీసుకెళ్లగలుగు తాము, బ్లడ్‍ ఎంత దూరం తీసుకెళ్లగలుగుతాము ఇలా తీసుకెళ్లే సందర్భంలో ఎదైనా సమస్య వస్తుందా! ఉదాహరణకు వ్యాక్సిన్‍ తీసుకెళ్లే సందర్భంలో ఏదైనా వాతావరణ సమస్య వస్తుందా అని చూసుకోవాలి. ప్రస్తుతం ఇది ఒక ప్రయోగంగా వికారాబాద్‍ ప్రాంతంలో చేయబోతున్నాం. ఇందులో ఎక్స్ప్రెషన్‍ ఇంట్రెస్ట్ పద్ధతి ద్వారా ఎనిమిది కంపెనీలను షార్ట్లిస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కకంపెనీకి వికారాబాద్‍ కేంద్రం నుంచి ఒక్కొక్క పీహెచ్‍సీకి తీసుకెళ్ళడానికి అనుమతి వస్తుంది. దీన్ని కోవిడ్‍ సమయంలో ప్రయోగం చేస్తున్నాము కాబట్టి కొంతమంది కోవిడ్‍ వ్యాక్సిన్‍ పంపిస్తార అని అడుగుతున్నారు. ఈ ప్రయోగంలో కోవిడ్‍ వ్యాక్సిన్‍ లేదు. ఎందుకంటే కోవిడ్‍ కంటే ముందే ఈ ప్రయోగం చేయడానికి ప్లాన్‍ చేయడం జరిగింది. ఆ సమయంలో కోవిడ్‍ అనే పేరు కూడా మేము వినలేదు. కావున కోవిడ్‍ వ్యాక్సిన్‍ కాకుండా పిల్లలకు వాడే టీకాలు, మెడిసిన్‍ వంటివి తీసుకెళ్తాము. ఆకాశ మార్గం ద్వారా ఎన్ని కిలోల బరువు తీసుకెళ్లగలుగుతాము, నిర్దేశించిన స్థలంలో ల్యాండ్‍ అవుతుందా లేదా వంటి ప్రయోగం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న ఈ ప్రయోగాన్ని భారతదేశం మొత్తం చూస్తుంది. మంచి ఫలితాలను ఇస్తే మిగతా చోట్ల అమలు చేయాలని చూస్తుంది.


టీ-హబ్‍
టీ-హబ్‍లో కొత్త బిల్డింగ్‍ ఆవిష్కరణ అవుతుంది. కోవిడ్‍ సమయంలో వెంటిలేటర్లు, డ్రోన్లు, ఎలక్ట్రిక్‍ స్కూటర్‍ ఇలా కొత్త కొత్త సర్క్యూట్‍ బోర్డు అందించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి ఆత్మనిర్భర్‍ క్యాంపెయిన్‍ నడుస్తుంది. ఇందులో రెగ్యులర్‍గా ఉపయోగించే వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంటే అవి మనమే తయారు చేయగలమా అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆత్మనిర్బర్‍ పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం మనం వాడే ఫర్నిచర్‍, టాయిస్‍ గురించి దృష్టి సారించింది.


ఆత్మనిర్భర భారత్‍లో భాగంగా… రాష్ట్రంలో బొమ్మల పరిశ్రమలకూ సరైన ఊతమందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. అదే సమయంలో ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు ప్రణాళికలు రచించామని… ఔత్సాహికులు ముందుకొస్తే అనుమతులు వేగంగా అందిస్తామని స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటు అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. వలస కార్మికుల కష్టాలు తీరేలా కొత్త విధానం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‍ రంజన్‍.


అంతరిక్ష పెట్టుబడుల కోసం సమగ్ర పాలసీ:
రాష్ట్రంలో పర్యావరణ వ్యవస్థ అభివవృద్ధి కోసం అంతరిక్ష పెట్టుబడుల సమగ్ర పాలసీని రూపొందిస్తున్నామని ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‍ రంజన్‍ అన్నారు. ప్రపంచలోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ స్పేస్‍టెక్‍ పాలసీ ఫ్రేమ్‍వర్క్ రూపకల్పన కోసం వాటాదారులతో వెబ్‍నార్‍ సమావేశం నిర్వహించారు. అంతరిక్ష సంబంధిత పెట్టుబడులు, ఆవిష్కరణలలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తెలంగాణ స్పేస్‍టెక్‍ పాలసీ సమగ్ర ఫ్రేమ్‍వర్క్-2021ను రూపొందిస్తున్నామని జయేశ్‍ రంజన్‍ తెలిపారు. రాష్ట్రంలో ఎండ్‍-టు-ఎండ్‍ స్పేస్‍టెక్‍ పర్యావరణ వ్యవస్థను అభి వృ ద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
ఇది యూనివర్సల్‍ కనెక్టివిటీ, వ్యవసాయం, రిమోట్‍ ఎడ్యుకేషన్‍, విపత్తు నిర్వహణ కోసం పెద్ద డేటా అనలిటిక్స్ ఆవిష్కరణ, ఇతర రంగాలపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. తెలంగాణ స్పేస్‍టెక్‍ పాలసీ ఫ్రేమ్‍వర్క్ను రూపొందించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంబంధిత వాటాదారులందరితో వర్చువల్‍ వేదికగా సమావేశం నిర్వహించారు. వాటాదారుల సంప్రదింపుల సమావేశంలో హార్డ్వేర్‍ స్టార్టప్‍లు, అనలిటిక్స్ స్టార్టప్‍లు, అకాడమియా అంశాలపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు.

ఎలక్ట్రానిక్స్, అపారెల్‍ రంగంలో పెట్టుబడులు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలక్ట్రానిక్స్, వస్త్ర (అపారెల్‍) రంగాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుండటంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు బెంగళూరులో ఇండియాల ఎలక్ట్రానిక్స్ అండ్‍ సెమీ కండక్టర్‍ అసోసియేషన్‍ (ఐఈఎస్‍ఏ) ప్రతినిధులతోపాటు వస్త్ర పరిశ్రమ ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా వారికి వివరించారు. పారిశ్రామికవేత్తలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న టీఎస్‍ఐపాస్‍తో పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు ఎంతో అనువైన వాతావరణం ఉన్నదని, మానవనరులు, మౌలిక సదుపాయాలు, సులభరత వాణిజ్యం (ఈవోడీబీ)లో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నదని మంత్రి కేటీఆర్‍ తెలిపారు. జౌళి (టెక్స్టైల్‍) రంగంలో కొరియా సంస్థ ‘యంగ్‍వన్‍’ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‍లో ఎలక్ట్రానిక్‍ పరిశ్రమకు మంచి అవకాశాలున్నాయని, ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు ఎలక్ట్రానిక్‍ మ్యానుఫాక్చరింగ్‍ క్లస్టర్లలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. మూడో క్లస్టర్‍ కోసం ఐటీవలే కేంద్రానికి లేఖ రాశామన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు పెరుగనున్న డిమాండ్‍ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య మిస్తున్నదని మంత్రి కేటీఆర్‍ వివరించారు.


ఎలక్ట్రిక్‍ వాహనాలను ప్రోత్సహించాలి :
ఎలక్ట్రిక్‍ వాహనాలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం, ఐటీ శాఖ ప్రిన్సిపల్‍ సెక్రటరి జయేష్‍ రంజన్‍ అన్నారు. సైదాబాద్‍ మాతృశ్రీ ఇంజనీరింగ్‍ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్‍ ఆఫ్‍ ఎక్స్లెన్సీ ఫర్‍ ఎలక్ట్రిక్‍ వెహికిల్స్ బ్లాక్‍ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన ఎలక్ట్రిక్‍ వాహనాలు, వస్తువులను పరిశీలించారు.


ప్యాకేజింగ్‍’ చేస్తే ఉద్యోగం గ్యారంటీ
దేశవ్యాప్తంగా ప్యాకేజింగ్‍ టెక్నాలజీకి అత్యంత ఆదరణ కనబడుతున్నది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వంద శాతం ప్లేస్‍మెంట్‍ లభిస్తున్నది. దీంతో ప్యాకేజింగ్‍ రంగంపై యువత ఆసక్తి చూపుతున్నది. ఈ నేపథ్యంలో ప్యాకేజింగ్‍ టెక్నాలజీ కోర్సును ఇండియన్‍ ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ ప్యాకేజింగ్‍ (ఐఐపీ)తో జేఎన్‍టీయూహెచ్‍ పీజీడీపీ / ఎంఎస్సీ ప్యాకేజింగ్‍ టెక్నాలజీ కోర్సుల అంశంపై పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. జేఎన్‍టీయూహెచ్‍ ఇన్‍చార్జి వైస్‍ చాన్స్లర్‍, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‍ రంజన్‍, ఐఐపీ ముంబయి డైరెక్టర్‍ ప్రొఫెసర్‍ తన్వీర్‍ అలామ్‍ ఎంవోయూ చేసుకున్నారు. ముంబయిలో ఉన్న ఐఐపీ ప్రస్తుతం హైదరాబాద్‍ కూడా తన క్యాంపస్‍ నడిపిస్తున్నది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఐఐపీ పని చేస్తున్నది. ఈ క్రమంలో పోస్టు గ్రాడ్యుయేషన్‍ డిప్లొమా ఇన్‍ ప్యాకేజింగ్‍ (పీజీడీపీ) కోర్సును పూర్తి చేసిన వారందరికీ వంద శాతం ఉద్యోగాలు వస్తున్నాయి.


ఫేక్‍ న్యూస్‍కు చెక్‍
సోషల్‍ మీడియాలో ఒకరు ఓ వార్త పెడతారు… ఆ వెంటనే అది నిజమేనని మరొకరు చెప్తారు. తప్పని ఇంకొకరు వాదిస్తారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలా జరిగిందని వేరొకరు విమర్శలు గుప్పిస్తారు. కొన్నిసార్లు ఇది సామాజికపరమైన ఉద్రిక్తతలకూ దారితీస్తుంది. పెను ఉపద్రవాలకు కారణమవుతుంది. అసలు ఆ వార్త, వీడియో తాజాదా.. పాతదా అన్న విషయం కూడా తెలియదు. నిత్యం ఇలాంటి ఎంతో చెత్త సామాజిక మాధ్యమాల్లో హల్‍చల్‍చేస్తున్నది. వాట్సాప్‍, ఫేస్‍బుక్‍, ట్విట్టర్‍ వంటి యాప్‍లతో పాటు సోషల్‍మీడియాలో వందల సంఖ్యలో వస్తున్న వార్తల్లో నిజమెంత? ఏది అసలు వార్త.. ఏది తప్పుడు వార్త.. అనేది ధ్రువీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‍సైట్‍ను ప్రారంభించింది. దేశంలో ఫేక్‍న్యూస్‍ కట్టడి, నిజనిర్ధారణ కోసం ప్రత్యేకంగా పోర్టల్‍ను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించింది. కరోనాపై ఫేక్‍న్యూస్‍ చెక్‍పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లాక్‍డౌన్‍, కరోనా వైరస్‍ వ్యాప్తి తదితర అంశాలపై డిజిటల్‍ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం. వందతులపై నిజనిర్ధారణ చేసుకొనేందుకు https://factcheck.telangana.gov.inవెబ్‍సైట్‍ను ప్రారంభించింది. దీని ద్వారా ఏది నిజం, ఏది అబద్ధం అనేది ధ్రువీకరించుకోవచ్చని ఐటీశాఖ తెలిపింది. ఫ్యాక్ట్లీ మీడియా అండ్‍ రిసెర్చ్ సంస్థతో కలిసి ఈ వెబ్‍సైట్‍ను తీసుకొచ్చామని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‍రంజన్‍ చెప్పారు. సామాజిక మాద్యమాల్లో వైరల్‍ అయ్యే సమాచారానికి సంబంధించిన నిజానిజాలపై నిరంతరం బులెటిన్‍ను విడుదలచేయనున్నట్టు తెలిపారు. సోషల్‍మీడియాలో సమాచారం షేర్‍చేసే ముందు నిజనిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఫేక్‍న్యూస్‍ కట్టడికి కేంద్రం అధికారంగా మార్గదర్శకాలు ఇవ్వడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ వైబ్‍సైట్‍ను అందుబాటులోకి తెచ్చిందని అధికారులు చెప్పారు. అధికారిక ధ్రువీకరణ లేకుండా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను వైరల్‍ చేయడం శిక్షార్హమైన నేరమని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొన్నది.


నూతన లక్ష్యాల సాధనకు టిటా అడ్వైజరీ కౌన్సిల్‍ :
అధునాతన సాంకేతికతను తెలంగాణ పల్లెలకు చేరవేసేందుకు, రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి సలహాలిచ్చేందుకు, మార్గనిర్దేశనం చేసేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీ అసోసియేషన్‍ (టిటా) తన కార్యాచరణను మరింత వినూత్న రీతిలో తీసుకెళ్లేందుకు ప్రణాళికా రచన చేస్తోంది. అందులో భాగంగా ‘టిటా అడ్వైజరీ కౌన్సిల్‍’ను ఏర్పాటు చేసింది. టిటా గ్లోబల్‍ ప్రెసిడెంట్‍ సందీప్‍ కుమార్‍ మక్తాల ప్రతిపాదనకు గవర్నింగ్‍ కౌన్సిల్‍ ఆమోద ముద్ర వేసి బైలాస్‍లలో మార్పులు చేసింది. నూతన మార్పు ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శిగా ఉన్న అధికారి టిటా అడ్వైజరీ కౌన్సిల్‍ చైర్మన్‍గా ఉంటారు. ప్రస్తుతం ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జయేశ్‍ రంజన్‍ కౌన్సిల్‍ తొలి చైర్మన్‍గా నియమితు లయ్యారు. సభ్యులుగా జేఎన్‍టీయూ రెక్టార్‍ ఏ. గోవర్ధన్‍, ఫినిక్స్ గ్రూప్‍ డైరెక్టర్‍ శ్రీకాంత్‍ బాడిగ ఎన్నికయ్యారు. ఈ మేరకు టీటా గ్లోబల్‍ ప్రెసిడెంట్‍ సందీప్‍ మక్తాల సారధ్యంలోని బృందం జయేశ్‍ రంజన్‍ను ఆయన కార్యాలయంలో కలిసి అభినం దించింది. టిటాను మరిన్ని రంగాలకు విస్తరించడం, వినూత్న కార్యాచరణ చేపట్టడం లక్ష్యంగా టిటా అడ్వైజరీ కౌన్సిల్‍ ఏర్పాటు చేసింది.
(ఆధారం : ఈటీవీ, నమస్తే తెలంగాణ మరియు ఇంటర్నెట్‍)

కట్టా ప్రభాకర్‍
సెల్ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *