గణపురం గుళ్ళ నిర్మాత పసాయిత గణపతిరెడ్డి


మధ్యయుగాలలో ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయరాజ్యం 10వ శతాబ్దంలో మొదలై 14వ శతాబ్దంలో ముగిసి పోయింది. మొత్తం తెలుగువారిని ఒక్కత్రాటికి తెచ్చి పాలించిన సాతవాహనుల తర్వాత కాకతీయులు రెండవవారు. కాకతీయులు తమను ‘పరమాంధ్ర వసుంధర’ పాలకులుగా శాసనాలలో పేర్కొన్నారు. (కూసుమంచి కొత్తశాసనం) వెన్నుడు (వెన్నరాజు)తో మొదలైన కాకతీయరాజవంశం 2వ ప్రతాపరుద్రునితో ముగిసిపోయింది. (బయ్యారం శాసనం) బస్తర్లో పాలకులుగా వున్నవారిని మలికాకతీయులని చెప్పడానికి ఒకే శాసనం ఆధారంగా వుంది. మలికాకతీయుల చరిత్ర పరిశోధించాల్సిన అవసరం వుంది.


కాకతీయులకు ఆ పేరు వచ్చినతీరు మీద చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి. చారిత్రికాధారాలు కాకతీయులు తొలుత జైనమతానుయాయులుగా వున్నారని తెలుపు తున్నాయి. తర్వాత కాలాముఖాచార్యుల వద్ద దీక్షలు తీసుకున్న 2వ బేతన (క్రీ.శ.1076-1108) నుంచి అందరు కాకతీయులు శైవాన్ని ఆశ్రయించారు. కాని, వారి మంత్రులు, సామంతులు, సేనానులు, వారి పరివార జనాలు జైనాన్ని సేవించడం మానలేదు. జైనం, శైవం సమాంతరంగా నడిచాయి. కొన్నిచోట్ల శైవమతం తీసుకున్నవారు తమ స్వాధీన ప్రాంతాలలోని జైనబసదులను శైవాలయాలుగా పరివర్తన చేసారు.(ఉదా: బెక్కల్లు) జైనం మీద కొందరు పాలకులకున్న విశ్వాస, గౌరవాలను వారు నిర్మించిన దేవాలయాల బాహ్యకుడ్యాలపై జైనతీర్థంకరుల శిల్పాలను చెక్కించడం ద్వారా ప్రకటించుకున్నారు. (రామప్ప)
కాకతీయులు ఆలయనిర్మాణంలో కళ్యాణీ చాళుక్యుల నిర్మాణ పద్ధతులను అవలంబించారు. నక్షత్రాకారపు ఉపపీఠంపై గుడులు నిర్మించారు. ఏకకూట, ద్వికూట, త్రికూట, చతుష్కూట, పంచ కూటాలయాలు కట్టించారు. గుడులలో కళ్యాణమంటపం, అర్ధమంటపం, మహామండపం, నందిమంటపం, రంగమంటపం, రెండంతస్తుల ద్వారమంటపాలు ప్రత్యేకం. దేవాలయపు గోడలను రెండువరుసలతో కట్టించడం అద్భుతనిర్మాణ విశేషం.


మొదటి ప్రతాపరుద్రుని కాలంలో తన పేరన హన్మకొండలో నిర్మించబడ్డది రుద్రేశ్వర దేవాలయం. కూసుమంచిలో గణపతిదేవుని పేరుమీద గణపేశ్వరాలయం కట్టించబడ్డది. కాకతీయుల సామంతులు, మంత్రులు, సేనానులు తమపేరిట, తమ తల్లిదండ్రుల పేరిట నిర్మించిన దేవాలయాలెన్నెన్నో. పిల్లల మర్రి, నాగులపాడు అన్నారం, కొండపర్తి, గొడిసాల, ఇనుగుర్తి, నిడిగొండవంటి చోట్ల అద్భుతమైన కాకతీయశైలి దేవాలయాలు ప్రత్యేకం. పిల్లలమర్రి నుంచి గణపురం గుళ్ళ దాకా వారి, వారి అభిరుచుల మేరకు, ధర్మకార్యంగా నిర్మించినవే ఈ దేవాలయాలు. కాకతీయులశైలి దేవాలయాలలో తొలుతగా చెప్పుకోతగినది హన్మకొండ వేయిస్తంభాలగుడి. దక్షిణాభిముఖంగా వున్న ఈ దేవాలయం త్రికూటం. అనన్యసామాన్యమైన ప్రతిభావిశేషాలతో శిల్పులు అతి రమణీయంగా చెక్కిన శిల్పాలు, మందిరాలు, దేవాలయ కుడ్యాలతో వాపీ, స్తూప పర్యంతం దేవాలయవాస్తుకు మచ్చుతునక.


వేయిస్తంభాలగుడి తర్వాత మరొక ప్రసిద్ధమైన కాకతీయ నిర్మాణం రామప్పగుడి. ఈ గుడి పెద్దప్రాకారం నడుమ భూమి నిర్మాణ పద్ధతిలో కట్టిన గుడి. ఈ రామప్పగుడిని కాకతీయరాజ్య ప్రతిష్టాప నాచార్యుడైన రేచర్ల రుద్రదేవుడు గణపతిదేవుని (క్రీ.శ.1199-1262) హయాంలో కట్టించి, శాసనం వేయించాడు. శాసనకాలం 1213. ఈ గుడి అంతకు ముందునుంచి ఎన్నేండ్లుగా కట్టబడుతున్నదో. రుద్రసేనాని కట్టించిన రుద్రేశ్వరాలయానికి (శాసనంలో పేర్కొన్నట్లు) రామప్పగుడి అనే పేరు తర్వాతకాలంలో వచ్చినట్లుంది. కారణం, ఆధారం అలభ్యాలు.


రామప్పగుడి మహామంటపం, మూడు ప్రవేశద్వారాలు, ప్రదక్షిణాపథంతో నిర్మాణమైంది. గుడి ఎదురుగా ప్రత్యేక నంది మంటపం, మరొకచోట శాసనమంటపం రామప్పగుడికే చెందినవి. దేవాలయ బాహ్యకుడ్యాలమీద శిల్పాలను పరిశీలించినపుడు శివుని పరివారం, గణపతి, భైరవుడు, గజధారలు, అశ్వధారలు, చతుర్దళ రత్నపుష్పాలు, కాలాముఖాచార్యులు, మదనికలు, నాగినులు, అలసకన్యలు, ఇంకా, ఇంకా అనేకమైన అందమైన అర్ధశిల్పాలతో పాటు జైనతీర్థంకరుని శిల్పాలు కనిపిస్తాయి. ఒకచోట గడ్డం, తలపాగా, కత్తి, పంచభుజాకృతి డాలు పట్టుకున్నయోధుని శిల్పం కనిపిస్తుంది. అతడు విదేశీయుడు, ఫ్రెంచ్‍ సైనికుడని, మార్కొపోలో అని కొందరు చరిత్రకారులు వ్యాఖ్యానించారు. మరొకచోట పెద్దపట్టాకత్తిని పట్టుకుని నిలబడిన వీరుని శిల్పముంది. ఈ శిల్పం దేవాలయ నిర్మాత రేచెర్లరుద్రుని గుర్తుచేసే శిల్పమనిపిస్తున్నది.


హన్మకొండకు 74కి.మీ.ల దూరంలో జయశంకర్‍-భూపాలపల్లి జిల్లాలోని గణపురం అనే ఒకనాటి కాకతీయుల నగరంలోని గుడులు కోటవున్న కోటగుళ్ళుగా పిలువబడుతున్నాయి. కట్కూరు దేవాలయం కూడా కోటగుళ్ళ శైలిలోనే నిర్మించబడ్డది. అక్కడకూడా మొత్తం 22 గుడులుండేవి. కోటగుళ్ళల్లో కూడా 22 దేవాలయాలు అగుపిస్తాయి. జైన సంప్రదాయంలో 24 తీర్థంకరులకు 24గుళ్ళుండడం చూస్తాము. అందులో ప్రధానంగా భావించే రుషభ, మహావీరులకు, మరొక తీర్థంకరుని కలిపి త్రికూటాలయం కట్టి, మిగతా తీర్థంకరులకు వేరుగా గుడులు నిర్మించేవారు. బెక్కల్లులో అందుకు ఉదాహరణగా గుడులు కనిపిస్తాయి. వరంగల్‍ కోటలో కూడా 24మంది తీర్థంకరుల చౌవీసి దేవాలయం ఆనవాళ్ళున్నాయి. దేవాలయ నిర్మాణవాస్తులో ఏనాటికానాడు చోటుచేసుకున్న కొంగ్రొత్త మార్పులతో కొత్త, కొత్త దేవాలయాలు నిర్మించబడ్డాయి.


గణపురం కోటగుళ్ళు నిర్మాణంలో ప్రత్యేకమైనవి. కాకతీయ ఆర్కిటెక్చర్‍కి మ్యూజియం వంటిది గణపురం గుళ్ళసముదాయం. ఈ గుళ్ళను గణపతిదేవుడే కట్టించినట్లు గణపురం చెరువు కూడా అతడే తవ్వించాడని ప్రతాపచరిత్రలో రాయబడ్డది. గణపురంలో దొరికిన 3 శాసనాలలో దేవాలయ ముఖమంటపంమీద చెక్కిన శాసనంలో ‘ శ్రీగిరినివాసి పండితారాధ్య సేవకుడైన విభూతిగౌరుడు’ పేర్కొనబడ్డాడు. 2వ శాసనంలో ఈ గుళ్ళపేర్లు గణపేశ్వర, సూరేశ్వరుల దేవాయాలుగా చెప్పబడ్డవి. చెరువుగట్టుమీద ఆంజనేయుని విగ్రహం వద్ద వున్న 3వ శాసనంలో ‘దుర్మతి ఆశ్వయుజ శుద్ధ 10 గురువారం రామయ కొడుకు కృష్ణయ’ అని రాయబడి వున్నది. ఇవేవీ గుడినిర్మాణకాలాన్ని తెలిపేవి కావు. ఈ గుళ్ళను పాలంపేట రామప్పగుడులతో పోల్చిన చరిత్రకారులు కోటగుళ్ళు రామప్పగుడి కంటే ముందరివని అన్నారు. గణపురం గుళ్ళ ప్రణాళికా రచన, ఆర్కిటెక్చర్‍ లక్షణాలు రామప్పగుడిని పోలివుంటాయి. గణపురం దేవాలయ ప్రణాళిక శిలువాకారంలో వుంది. గర్భగృహం, అంతరాళం, సభామంటపం ఒకే సరళరేఖమీద వున్నాయి. గుడికి 3 ప్రవేశ ద్వారా లున్నాయి. సభామంటపానికి పడమర గర్భగృహ, అంతరాళా లున్నాయి. గర్భగృహం 14×14 అడుగులు, అంతరాళం 13.4 × 13.4 అడుగులు, ప్రధానాలయానికి దక్షిణంగా 48×48 అడుగుల స్తంభ మంటపం వుంది. దేవాలయం లోపలి వైశాల్యం 260×260 అడుగులు. ఈ దేవాలయానికి 12 అడుగుల ఎత్తైన ఉపపీఠం, అధిష్టానాలున్నాయి. పెద్దరాతికడీల నడుమ మట్టి, గులకరాళ్ళు నింపిన రెండుపొరల కట్టడాలు ఈ గుడిగోడలు. ఈ గుడికి రాతిప్రాకారం వున్న ఆనవాళ్ళు తెలుస్తున్నాయి. ప్రధానాలయానికి 25 అడుగుల దూరంలో రెండవ దేవాలయం వుంది. దాని ప్రణాళిక సమానమే. కొలతల్లో చిన్నది. దీని స్తంభమంటపం 15 అడుగుల ఎత్తున్న 60 ఇసికరాతి స్తంభాలతో నాట్య(రంగ) మంటపంగా నిర్మాణం చేయబడ్డది. ప్రధానాలయానికి బయట ఒకే సరళరేఖమీద 8 ఉపాలయాలున్నాయి. మరికొన్ని రెండు పెద్దగుడుల మధ్య వున్నాయి. వీటన్నింటికి విడి, విడిగా గర్భగృహ, అంతరాళాలున్నాయి.


హోయసలుల బాహుళ్య శిల్ప, నిర్మాణ విశేషాలు కాకతీయులు అనుసరించారు. ఉపపీఠం, అధిష్టానం, పభగ, వారండికబంధ, కపోత, వేది, కక్ష్యాసన, విమానాదులు కాకతీయులకాలంనాటి శిల్పులు తమదైన కొత్తశైలిలో నిర్మించారు. ఉపపీఠం మీద ప్రదక్షిణాపథం ప్రత్యేకంగా వుంది. పభగ, కుడ్యాలంకరణ అద్భుతంగా వుంది. తొలి చాళుక్యుల కాలంలో మొదలైన కపోత నిర్మాణశైలి గణపురం గుడులలో అత్యద్భుతంగా తీర్చిదిద్దబడ్డది. రెండురకాలైన కపోతాలు లోపలివైపున రంగులు వేసినట్లు కనిపిస్తుంటాయి.
కోటగుళ్ళలో పరివారదేవాలయాల విమానాలు ద్రవిడశైలిలో అగుపిస్తాయి. త్రితల, పంచతలాలతో కలశాలతో, నాగర విమానాల అమలసారికలతో అందంగా కనిపిస్తాయి. ఇటువంటి ఉపరినిర్మా ణాలను భూమిజ రకం అని అపరాజితపృచ్ఛ, సమరాంగణ సూత్రధారలు పేర్కొంటున్నాయి. భూమిజ శిఖరం అంతస్తుల అమరికలో వుంటుంది. పెద్దపూసల మెడగొలుసును నిలువుగా విసిరినట్లు అగుపిస్తుంది.


గణపురం దేవాలయంలోని అంతరాళానికి పంచతారల పద్ధతిలో రెండువైపుల 5గురేసి ద్వారపాలకులు వుంటారు. పదుగురిలో ఇద్దరు మగవారు. త్రిభంగిమలో నిల్చుని నాలుగుచేతులలో త్రిశూలం, ఢమరుకం, గదలతో కనిపిస్తారు. స్త్రీల చేతుల్లో పూర్ణకుంభాలు, వింజామరలున్నాయి. ఉత్తరాశి ‘మంగళఫలకం’ మీద గజలక్ష్మిని చెక్కారు. ఆ పైన లఘు నాగరవిమానాలున్నాయి. ప్రధానదేవాలయం అంతరాళ ద్వారం పైన నటరాజు దేవీదేవతలతో కనిపిస్తుంటాడు.
రామప్ప, గణపురం గుళ్ళల్లో బ్రాకెట్‍ శిల్పాలుగా మలిచిన స్త్రీమూర్తులు సాలభంజికలు. యక్షిణులు. వీరిని అలసకన్యలని, మదనికలని, నాగినులని పిలుస్తుంటారు ప్రజలు. వీటిలో కొన్ని పాము ఒంపులదేహాలతో, నాట్యభంగిమలతో నిల్చుని కనిపిస్తాయి. వాటికి కళాత్మక సంబంధం తప్ప మరొకటి వుండదు. బేలూరు చెన్నకేశవాలయంలో 42 బ్రాకెట్‍ శిల్పాలున్నాయి. గణపురం గుడిలో సాలభంజికల శిల్పాలు కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే ఈ స్త్రీలు తెలుగుదేశపు స్త్రీలవలె కనిపించరు. వీరు శిల్పులు వచ్చిన ప్రాంతాలలోని స్త్రీలు కావచ్చుననిపిస్తుంది.


గణపురం దేవాలయపు బ్రాకెట్‍ శిల్పాలలో గజకేసరి వ్యాళులు కనిపించడం విశేషం. రామప్పలో ఇటువంటివి కనిపించవు. కాని, వరంగల్‍ కోటలోని శిల్పాలలోని గజకేసరి శిల్పాలు వేరుగా వుంటాయి. గణపురం గుళ్ళ బ్రాకెట్‍ శిల్పాలలో ఒక గజకేసరి కిరీట ధారియైన రాజశిరస్సుతో కనిపించడంవల్ల అది కాకతీయుల బిరుదం రాయగజకేసరి శిల్పమనిపిస్తుంది. నిజానికి ఈ వ్యాళులు సింహ, శార్దూల, గండకి, నర, కిన్నర మొదలైనవి 26 రకాలుగా వుంటాయి. ప్రతిదేవాలయంలో ఇటువంటి వ్యాళులుండడం తప్పనిసరి. దేవాలయ గోడలమీద ప్రత్యేకశిల్ప ధారలుంటాయి. వాటిలో విమానధార, పుష్పధార, అశ్వధార, గజధార, హంసధారలిక్కడ అగుపిస్తుంటాయి. గోడలమీద సుసునియపట్ట, హతసునియ, చౌకఫుల పుష్పాలు చెక్కబడ్డాయి. దేవాలయపు బాహ్యకుడ్యాలమీద చామరధారిణులు, నృత్యలావికలు, వాద్యకారులు, భైరవుడు, గణపతి, కాలాముఖా చార్యుడు, జైనతీర్థంకరుడు చెక్కబడ్డారు.


ప్రధానాలయం బయట కోష్టాలలో రెండు విగ్రహాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. వాటిలో ఒకే రూపంతో, ఒకే రకమైన ఆహార్యంతో జారుముడి సిగతో, మెడలో హారాలతో, పట్టుధోవతికట్టి, కుడిభుజం మీద మోపి పట్టుకున్న పెద్దకత్తితో, పంచభుజాకృతి డాలుతో నిలబడిన యోధులు కనిపిస్తారు. ఇటువంటి శిల్పాన్ని పోలినది రామప్ప గుడి గోడల మీద కనిపిస్తున్నది. ఆయుధాలు సమానమే కాని, ఆహార్యంలో భేదమున్నది. ఈ వీరుడు కాకతీయ సేనాని రుద్రుని 3వ కొడుకైన పసాయిత గణపతిరెడ్డి కావచ్చుననిపిస్తున్నది.


దేవాలయం బయట కోటగుళ్ళవద్ద తవ్వకాలలో బయటపడిన విగ్రహాలను దిమ్మెలు కట్టి నిలబెట్టిన చోట ఒక శాసనం కూడా అగుపిస్తున్నది. దానిమీద సిమెంటుపడి శాసనాక్షరాలు మరుగున పడిపోయాయి. చదువగలిగినంత మేరకు శాసనపాఠాన్ని రాసుకున్నాను. ఈ శాసనం డిజిటల్‍ కాపీలతో నాకు యువ చరిత్రకారుడు అరవింద్‍ ఆర్య సహకరించాడు. శాసనంలో ‘స్వస్తిశ్రీ గణపతిదేవ మహారాజు పృథివిరాజ్యము చేయంగాను పసాయిత గణపతిరడి వారు… పసాయిత గణ(పతి)పురానను జయ’ వరకు చదువగలిగాను. గణపతిదేవుని కాలంలో జయ(వైశాఖ శుద్ధ త్రయోదశి గురువారం) సంవత్సరాన్ని వెతికితే అది క్రీ.శ.1234 (ఏప్రిల్‍ 13 గురువారం)గా తెలిసింది. వారసత్వశాఖలో డిప్యూటీ డైరెక్టరుగా పనిచేసి ఇటీవల రిటైరైన ఎస్‍.రంగాచార్యగారిచ్చిన శాసన ప్రతిబింబాల వల్ల కోటగుళ్ళ గణపురంశాసనం పూర్తిపాఠం పొందగలి గాను. పురావస్తుశాఖవారు శాసనాన్ని పరిష్కరించిపెట్టారు కాని, శాసనం ప్రచురించబడలేదు. శాసనం గురించి ఎక్కడా రాయబడలేదు. మొదటిసారి ఈ శాసనం సాయంతో కోటగుళ్ళ నిర్మాతను, గణపురం నగర ఎవరిపేరన వెలసిందన్నది తెలుసుకోగలిగాను. నేలకొండపల్లిలో లభించిన పసాయిత గణపతిరెడ్డి మరొక కొత్తశాసనాన్ని చరిత్రకారులు కట్టా శ్రీనివాస్‍, రాగి మురళి, రాధాకృష్ణ, చంటిల సాయంతో ఈ రచయితే పరిష్కరించాడు. అది (నేల)కొండపల్లి చెరువుకట్ట మీది పోలకమ్మ మూలస్థానాని(గుడి)కి మహామండలేశ్వర కాకతీయ గణపతిదేవ మహారాజు నిజభృత్యుడైన రేచెల్ల(ర్ల) పసాయిత గణపతిరెడ్డి క్రీ.శ. 1240 మార్చి 26న ఇచ్చిన దానశాసనం.


దానికన్నా ముందరిదైన ఈ కోటగుళ్ళశాసనం ఒక గ్రానైట్‍ రాతిస్తంభానికి రెండుపక్కల చెక్కబడ్డది. శాసనస్తంభ శిఖరం మీద నందిశిల్పం వుంది. శాసనం మొదలయేచోట సూర్య, చంద్ర చిహ్నాల నడుమ గణపతిశిల్పం వుంది.


శాసనపాఠం:
మొదటివైపు

 1. ‘‘స్వస్తిశ్రీ గణపతిదేవ
 2. మహారాజు పృథివి
 3. రాజ్యము చేయంగా
 4. ను పసాయిత గణ
 5. పతిరడి వారు…
 6. పసాయిత గణ(పతి)
 7. పురానను జయ సం
 8. వత్సర వైశాఖ శుద్ధ త్రయో
 9. దశిన బృహస్పతి వార
 10. మునాండు ప్రతిష్టచేసి
 11. న గణపతీశ్వర
 12. …..
 13. …..
  2వ వైపు
 14. …రుగాలము పం
 15. టను వపట్సగడ్డల..
 16. …పొలాన వెనుక
 17. ….ధారవోసి
 18. …..నారు……
 19. …ఠన గంటెల
 20. …య…రెడి…


రామప్పగుడిని తండ్రి రేచెర్ల రుద్రసేనాని తన పేరన రుద్రేశ్వరాలయంగా క్రీ.శ.1213లో నిర్మిస్తే, గణపురం కోటగుళ్ళను కొడుకు పసాయిత గణపతిరెడ్డి కూడా తన తండ్రిలెక్కనే తన పేరన గణపతీశ్వరాలయాన్ని క్రీ.శ.1234లో నిర్మించాడు. రామప్పగుడివున్న పాలంపేట రుద్రునిపేరిట రుద్రవరం కాలేదు, కాని కోటగుళ్ళున్న గణపురం పసాయిత గణపురంగానే వెలసింది.


ఆధారాలు:
 1. Y.Gopal Reddy – The Ghanapur Group of emples- Edit: VV KrishnaShastry
 2. డా. ఈమని శివనాగిరెడ్డి, చరిత్రకారుడు, స్థపతి- కాకతీయ దేవాలయాల నిర్మాణంపై నోట్స్ (రచయితకు లేఖ)
 3. ఎస్‍.రంగాచార్యులు, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్‍, వారసత్వశాఖ- వారిచ్చిన గణపురం శాసన ప్రతిబింబాలు
 4. కర్టెసీ ఆఫ్‍ అరవింద్‍ ఆర్య, తెలంగాణా యువ చరిత్రకారుడు- రామప్ప గుడికుడ్యాల మీది కొన్ని ఫోటోలు.
 5. గణపురం కోటగుళ్ళ సహయాత్రికులు మిత్రులు, చరిత్రకారులు కట్టా శ్రీనివాస్‍, కట్టా జ్ఞానేశ్వర్‍, కొండ్రెడ్డి భాస్కర్‍, రెడ్డి రత్నాకర్‍ రెడ్డి, తాళ్ళపల్లి సదానందం, నందకిశోర్‍, వంశీధర్‍ రెడ్డి
  అందరికి ధన్యవాదాలతో…

– శ్రీరామోజు హరగోపాల్‍, ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *