నిప్పుల కొలిమే.. జీవనాధారం


ఊరుమ్మడి కొలిమి మాయమయ్యింది. దున్నెటోడు లేడు. నాగలి చెక్కెటోడు లేడు. కర్రు కాల్చుడు పనే లేదు. కొలిమి కొట్టం పాడువడి, అండ్ల దొరవారి గాడ్దులను కట్టెయ్యడం మొదలైంది. ఊళ్ళ రాతెండి పాత్రలు కొనే శక్తి ఎవ్వరికి లేక కంచరోల్ల కొలిమి బూడిదైపోయింది. తిననీకి తిండె లేదంటె బంగారి ఎండి సొమ్ములు చేసుకునేదెవ్వరు? ఔసులోల్ల కొలిమి కూడ కూలిపోయింది. ఒక్కటి గుడ లేకుండ ఊళ్ల ఉన్న కొలుములన్ని ఆరిపోయినయి. ఊళ్ల నిప్పు బుట్టని పాడుకాలమొచ్చింది. ఊరుమ్మడి కొలుములైతే కనబడకుండ పోయినయి. దొరవారి సొంత పనులకు గడీల కొలుముల తీర్గ కనబడేవి ఉన్నయి గాని, ఇచ్చంత్రం, ఆ కొలుముల్ల మంట ఎర్రగొస్త లేదు, తెల్లగ దయ్యం లెక్క ఉన్నది. అక్కడక్కడ పేదసాదలు ఇండ్లల్ల కొలుములు బెట్టుకుంటున్నరని మాటెల్లింది గాని ఊదు గాలది, పీరి లేవది. ఊరుమ్మడి కొలిమి అవసరం వచ్చింది.


మనిషిని మనిషికి కాకుండా చేస్తున్న, మనను మనకు కాకుండా చేస్తున్న ఒక మహమ్మారి మన ఊళ్లనూ, మన సామూహిక జీవనాన్నీ, మన ఆనందాలనూ, మన సంస్కృతినీ దెబ్బ తీస్తున్నప్పుడే మన కులవృత్తులు కూడా అణగారిపోయినై. ఒక కొలిమి మూతపడ్డదంటే ఒక వృత్తి అంతరించిందని మాత్రమే కాదు, ఒక సామూహిక జీవన సౌందర్యం అస్తమించిందని. ఒక అద్భుత కళానైపుణ్యం విధ్వంసమవుతున్నదని. వ్యవసాయం అవసరం లేని, వ్యవసాయ పరికరాల కమ్మరి కొలిమి అవసరం లేని, కంచరి పాత్రలు అవసరం లేని, కంసాలి కళాకౌశల అలంకరణలు అవసరం లేని ఒక నిరామయ, నిస్తబ్ద, నిరాశాపూరిత వాతావరణం మన ఊళ్లను కమ్మేసింది.


విశ్వకర్మీయుల/ విశ్వబ్రాహ్మణుల పంచ వృత్తులలో మొట్టమొదటి వృత్తి కమ్మరము. ఇనుమును కరిగించి వస్తువును తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడు లోహశిల్పి కమ్మరి. ప్రపంచంలో ఏ వస్తువు తయారు కావాలన్నా కమ్మరి కొలిమిలో కాసీ డాకలి పై సుత్తె దెబ్బలు తినాల్సిందే. భగభగ మండే కొలిమి ముందు కూర్చుని వేడిని లెక్క చేయక రైతుకు అవసరమైన పనిముట్లు చేస్తాడు. కమ్మరి కొలిమి రాజేసి ఇనప ముక్కలతో కొడవళ్ళు గునపాలు నాగళ్ళు చేస్తాడు. కొడవళ్ళకు కక్కు కొడతాడు. రెడీమెడ్‍ పనిముట్లు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో ఇనుముతో రకరకాల పనిముట్లు తయారు చేసే కమ్మరికి పని పోయింది. రైతులు గతంలో మాదిరి కొలిమి దగ్గరకు వచ్చి తమకు కావాల్సిన వస్తువులు చేయించుకొనే ఓపిక ఇప్పుడు లేదు. దాంతో వారు రెడీమెడ్‍ పనిముట్లు తీసుకొని తమ పనులు గడుపుకొంటున్నారు. అనావృష్టి, అతివృష్టితో రైతులు వ్యవసాయం చేయకపోవడంతో వ్యవసాయ పనిముట్లు తయారు చేసే కమ్మరి పని పోయింది. వీరు ఇప్పుడు ప్రవేటు ఫ్యాక్టరీలలో కార్మికులయ్యారు. ఆధునిక యంత్ర పనిముట్లు రావడం వల్ల కమ్మరి వృత్తి పూర్తిగా అంతరించిపోవుటకు సిద్దమైంది. ట్రాక్టర్లు రావడం వల్ల నాగళ్లు, పొలాన్ని దున్నేందుకు ఉపయోగం లేకుండా పోయాయి. వరి కోత మిషన్లు రావడం వల్ల కోసే కొడవలి కూడా ఉపయోగపడకుండా ఉంది.


కమ్మరి వృత్తి పనివార్లకు కొలిమి ప్రధానమైనది. గాలి తిత్తి ద్వారా బొగ్గులను కాల్చి ఇనుమును వేడి చేసి తగిన విధంగా ఇనుప వస్తువులను తయారుచేస్తారు. ఎర్రగా కాలిన ఇనుప ముక్కను పెద్ద ఇనుప దిమ్మ మీద పెట్టి పెద్ద సమ్మెటతో కొట్టి కావలసిన ఆకారానికి తీసుకొచ్చి, కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్లు, తొలికలు, ఇలా రైతులకు కావలసిన ఇనుప వస్తువులను వారు తయారు చేసె వారు. దాని పేరె కొలిమి. ప్రస్తుతం ఈ కొలుములు ఎక్కడా లేవు. అప్పట్లో కమ్మరి వారు చేసె వస్తువులు నేడు యంత్రాలతో తయారయి బజారులలో దొరుకుచున్నవి.


సాధారణంగా ప్రజలు వేసవిలో వేసవి తాపానికి తట్టుకోలేక ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, మరికొందరు ఎసిలు వినియోగిస్తారు. వేసవి తీవ్రత ఎంత ఉన్నా కణకణ మండే నిప్పుల కొలిమితో వారు జీవనం చేయక తప్పదు. కాని ఈ నిప్పుల కొలిమి ఎంత భగభగ లాడితే ఇనుప వస్తువులు అంత బాగా తయారవుతాయి. ఇనుప వస్తువు తయారికి కొలిమి వేడిచేయాలంటే వరి చిట్టు, బొగ్గులు ఉపయోగించాలి వాటిని కొనుగోలు చేయాలి. వీటన్నికంటే మలాట ఉపయోగించే కార్మికుడు ముఖ్యం. అతను లేక పోతే కొలిమి నిర్వహించలేరు. కార్మికుడికి అన్ని సదుపాయాలు కల్పించి రోజుకు నాలుగువందల నుండి ఐదువందలు రూపాయాలు వెచ్చించాలంటున్నారు. పని సమయంలో కనీసం కడుపు నిండా మంచినీరు సైతం తాగలేని పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు మొత్తం కష్ట పడితే కూలి మందం వస్తాయి అంటున్నారు. తాతలు, తండ్రుల నాటినుండి నేర్చుకున్న వృత్తని కొంతమంది అక్కడక్కడ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వేరేపని చేయలేక వేసవిని సైతం లెక్క చేయకుండా పనిచేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. పని నిర్వహించే ప్రదేశం సైతం నామమాత్రపు షెడ్డుతో ఏర్పాటు చేసుకుంటారు.


పూర్వం ఈ వృత్తిని చేసికొని బతికే సంచార జాతి ఇంకొకటి వున్నది. వారిని ‘బైట కమ్మరులు’ అంటారు. వీరు కమ్మరి పనికి కావల్సిన పనిముట్లతో ఊరూరు తిరుగుతుంటారు. వీరు ఊర్లోకి రాకుండా ఊరి బైటనే కొలిమి పెట్టుకుని కొద్ది రోజులు ఉండి వెళ్ళి పొతారు. నగరాల ఆరు బయట, చిన్నచిన్న పట్టణాల, పల్లెల కేంద్రాల బయట రోడ్డు ప్రక్కన డేరా వేసుకొని కొలిమి ముందు కూర్చొని సుత్తినో, కత్తినో, కొడవలినో, గడ్డపారనో సానపడ్తూ ఉండే మనుషులు మనకు కనపడ్తుంటారు. బస్సులోనో, ఆటోలోనో పోతూంటే ప్రతి రోజూ గమనిస్తూనే ఉంటాం. హైదరాబాద్‍ నగరంలోని అంబర్‍పేట 6వ నంబర్‍ చౌరస్తా నుండి విద్యానగర్‍ వెళ్లే రోడ్డు ప్రక్కన ఒక ఓ సమూహం కనపడుతుంది.


వీళ్లను తెలంగాణ ప్రాంతంలో ‘‘బైట కమ్మరోళ్లు’’ అని పిలుస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‍, ధార్‍వాడ్‍, గుల్బర్గా జిల్లాలలో కనిపించే వీరిని అక్కడ ‘‘బైట కమ్మర’’ గా వ్యవహరిస్తారు. ఉత్తరప్రదేశ్‍, మహారాష్ట్రలలో వీళ్లకు ‘గడియా లోహార్‍’ అనే పేరుంది. ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సమూహాలను ‘గౌసండి’ అని కూడా అంటారు. సంచార జాతులైన వీరు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‍లలో విముక్త నేర జాతుల జాబితాలో ఉన్నారు. ఇన్ని రకాలుగా వర్ణించబడే ఈ బయట కమ్మరులు, తమకు చాలా బ్రహ్మాండమైన చరిత్ర, సంస్కృతి ఉందని చాలా గర్వంగా చెప్తారు. రాజస్థాన్‍లోని మేవార్‍ ప్రాంతం వీళ్ల పూర్వీకుల నివాసం.
సైన్యానికి ఇనుముతో కత్తులు, డాళ్ళు, బరిసెలు వంటి ఆయుధాలు తయారు చేసి ఇవ్వడం, రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లు సరఫరా చేయడం వీళ్ల వృత్తి. ప్రధానంగా వీరు ఇనుముతో ఏరకమైన వస్తువు నైనా సృష్టించడంలో ప్రతిభావంతులు. సాంప్రదాయ కమ్మర్లు తయారు చేసే వాటికి భిన్నమైన వస్తువులను వీరు సృష్టించే వారు. పదహారవ శతాబ్దంలో మొఘల్‍ వంశీయులు మేవార్‍లో రాణా ప్రతాప్‍ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నాక వీరు తీవ్ర ఒత్తిడికిగురై, మానసిక క్షోభతో ఆ రాజ్యాన్ని వదలి ఒక ప్రతిజ్ఞ చేసి వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయి సంచార సమూహాలుగా మారిపోయారని చారిత్రక వాస్తవాలు తెలుపుతున్నాయి. మొఘల్‍ సామ్రాజ్యం అంతం అయి రాజపుట్‍ రాజ్యం ప్రతిష్టించబడే వరకు తాము చిత్రదుర్గ కోటకు వెళ్లమని, పక్కా గృహంలో నివసించమని, మంచంపై నిద్రించమని, దీపాలు వాడమని, నీళ్లు చేదడానికి తాళ్లు వాడమని ప్రతిజ్ఞ చేశారట. ఇది కొట్టి పారవేసే కథ కాదు, ఈ ప్రతిజ్ఞ వాస్తవమే అని చరిత్రకారులు కూడా నిర్ధారించారు.


దేశంలోని ఐదు రాష్ట్రాలకు సంచరిస్తూ వెళ్లిన ఆ సమూహాలపై నిజాం ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు విచారించడానికి కమిషన్లు కూడా వేశాయి. 1920లో నిజామ్‍ ప్రభుత్వం, హైదరాబాద్‍ స్టేట్‍ హైకోర్టు న్యాయమూర్తి సయ్యద్‍ సిరాజ్‍ ఉల్‍ హసన్‍ కమిషన్‍ను నియమించింది. ఈ కమిషన్‍ గిసాడీ సమూహం ఆచార వ్యవహారాలు, సాంఘిక, సామాజిక పరిస్థితులపై వివరమైన నివేదిక తయారు చేసి వీళ్ల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి పలు సూచనలు కూడా చేసింది. కర్ణాటక ప్రభుత్వం నియమించిన డాక్టర్‍ సి.ఎస్‍. ద్వారకనాథ్‍ కమిటీ వీళ్ల జీవన విధానంపై చాలా వివరాలు సేకరించింది. వీరి వివాహ పద్ధతులు, విడాకుల వ్యవహారాలు, బాలికలు యవ్వనంలోకి అడుగుపెట్టినప్పుడు ఆచరించే కార్యక్రమాలు, జననం, మరణానికి సంబంధించిన ఆచార వ్యవహారాల గురించి నివేదికలో నమోదు చేసింది. వీళ్లకు విద్య నేర్పడానికి తగు చర్యలు చేపట్టడం గురించే కాకుండా జీవనోపాధి, గృహ వసతి విషయాల్లో కూడా కర్ణాటక ప్రభుత్వానికి నిర్దిష్టమైన సూచనలు చేసింది. వీళ్ల సమస్యలు, తగాదాలు, కమ్యూనిటీ కమిటీలోనే పరిష్కరించుకుంటారు. న్యాయస్థానాలకు వెళ్లరు. తమను తాము హిందువులుగా భావిస్తారు. స్వామి గురప్ప, మున్నేశ్వరుడు, భైరవిలను కుల దేవతలుగా పూజిస్తారు. దేవ తలకు జంతు బలులిచ్చే ఆచారం ఉంది. వీళ్లు బ్రాహ్మణ, క్షత్రి య, వెలమ, కాపు లాంటి పై కులాల నుండి మాత్రమే వండిన ఆహారాన్ని స్వీకరిస్తారు. గ్రామాలల్లో ఉండే కమ్మరి, కుమ్మరి, కంసాలి, కంచర వృత్తుల వారిచ్చే ఆహారాన్ని స్వీకరించరు. పండుగల సందర్భంలో వీళ్ల సంస్కృతి, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే జానపద గేయాలు స్త్రీలు పాడతారు. రాజపుట్‍ రాజుల శౌర్యాన్ని, ఔన్నత్యాన్ని గానం చేస్తారు. ఈ జాతి వాండ్లు గుజరాతీ, మరాఠీ సంగమంగా తయారైన గిసాడి అనే భాష మాట్లాడుతారు. స్త్రీలు, పురుషులు మార్వాడీ గ్రామీణ ప్రజల సాంప్రదాయ దుస్తులైన గాగ్రా, జాకెట్‍, ధోవతి రంగు రంగుల తలపాగలు ధరిస్తారు. స్త్రీలు చాలా దృఢంగా ఉంటారు. వంట చేయడంతో బాటు, స్త్రీలు కొలిమి దగ్గర బరువైన సమ్మెట ఎత్తి కాలిన ఇనుమును సాగుదీయడంలో భర్తకు సహాయపడ్తారు. వీళ్లలో విద్య చాలా తక్కువ. గ్రామాల బయట, పట్టణాల బయట నివసిస్తారు కాబట్టి, వాళ్ల పిల్లలకు ఇతర బాల, బాలి కలతో స్నేహ సంబంధాలు ఉండవు. ఆధునిక జీవన పద్ధతులుగాని మారుతున్న జీవన విధానాల ప్రభావంగాని వీళ్లపై పడలేదు. సమాజంతో దూరంగా నివాసాలు ఏర్పరచుకొని జీవించడమే ఇందుకు కారణం. ప్రభుత్వ పథకాలు ఏవీ అందు బాటులో వీళ్లకు లేవు.

ఇప్పుడిప్పుడే వీళ్ల సంఘం అన్ని జిల్లాలు పర్యటించి రేషన్‍ కార్డులు, ఆధార్‍ కార్డులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నది. బ్యాంకు రుణాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపాస్తుల దగ్గరే అవసరాలకు డబ్బులు తెచ్చుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వీళ్లకు ఏ రిజర్వేషన్‍ జాబితాలోనూ స్థానం లేదు. అవసరమయినప్పుడు రెవెన్యూ అధికార్లు సాంప్రదాయ కులవృత్తులు నిర్వహించే, బి.సి. ‘బి’ గ్రూపుకు చెందిన కమ్మరి సర్టిఫికెట్‍ ఇస్తున్నారు. ఈ సర్టిఫికెట్‍ తమకేమీ ప్రయోజనం చేకూర్చడం లేదని వీళ్ల నాయకులు అభిప్రాయపడ్తున్నారు. నిజాం కాలంలోనే తమని ఎస్టీలుగా గుర్తించాలనే సూచనలు వచ్చాయని, సంచార జాతిగా గుర్తించాలనే సూచన ఇమడ్చబడకపోవడం చాలా విచారకరం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాతిని గడియా లోహార్‍, గిసాడి, భువాలియా, పాచల్‍, చిత్తొరియా లోహర్‍, రాజ్‍ పుట్‍లుగా రాజస్థాన్‍ ప్రభుత్వం గుర్తించింది.


గుజరాత్‍, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీళ్లను గుర్తించ డం జరిగింది. ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త ఎస్‍.పి. రుహేలా వీరిని భైల్‍ కమ్మరి (ఎడ్ల బండ్లలో సంచరించు కమ్మర)గా, ఆధునిక యంత్ర యుగంలో కూడా వీరు చాలా నాణ్యతతో తమ ఇనుప పనిముట్లు తయారు చేస్తారని అభిప్రాయపడ్డారు.
బైట కమ్మరులకు విశ్వబ్రాహ్మణులకు ఎటువంటి పోలిక కానీ సంబంధంకానీ లేదు. విశ్వబ్రాహ్మణ / విశ్వకర్మ కులస్తులు సాంప్రదాయ కమ్మరులు. ‘బైట కమ్మరులు’ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‍ షెడ్యూల్డు తెగల జాబితాలో 10వ కులం. బి.సి. జాబితాలో 21వ కులంగా చేర్చబడినారు.


తెలంగాణ ప్రభుత్వం నియమించిన బిసి కమిషన్‍కు వారు తమ పరిస్థితిని వివరించి, తమను ఎస్‍టి జాబితాలో చేర్చి, సంచార జాతుల కేటగిరిలో గుర్తింపు ఇవ్వాలని అభ్యర్థన చేశారు. తమ జీవన పరిస్థితులను అధ్యయనం చేసి, ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తేవడానికి ఏదైనా సామాజిక పరిశోధన సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కొలిమి దగ్గర ఉండి ఇనుప సామాన్ల తయారీలో ప్రమాదవశాత్తు మరణిస్తే భీమా సౌకర్యం కల్పించాలి అని వీరు డిమాండు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వారి న్యాయమైన కోరికలను నెరవేర్చి చేతి వృత్తులకు చేయూత అందించేందుకు విశేష కృషి చేస్తుంది. ఆ కృషి ఫలించి కులవృత్తులకు మళ్లీ పూర్వవైభవం రావాలని ఆశిద్దాం.


-సువేగా,
సెల్ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *