ఒకప్పుడు సుల్తాన్ బజార్ లేదు.
ఆ ప్రాంతమంతా రెసిడెన్సీ బజార్లోనే కలిసి ఉండేది. అక్కడ నిజాం పరిపాలన కాక బ్రిటిష్ రెసిడెంటు ప్రభుత్వం నడిచేది. 1933లో కొంత ప్రాంతాన్ని నిజాంకు అప్పగించారు. అప్పుడు ఆ కొత్త ప్రాంతాన్ని సుల్తాన్ బజార్ అన్నారు. అప్పుడు ఇదొక వస్త్ర వ్యాపారుల విఫణి వీధి.
సుల్తాన్ బజార్‌కు దగ్గరలో ఉన్న ‘‘బడీ చావుడీ’’ ప్రాంతమంతా మహా రాష్ట్రులతో నిండి ఉండేది. శ్రీకృష్ణదేవరాయల భాషా నిలయం పక్క సందులో మరాఠీలు మరాఠీల కోసం నడిపే ‘‘విశ్రాంభవన్’’ అనే భోజనాలయం ఉండేది. అంతా శాఖాహారమే. మనుషులను చూసి గోల్ గోల్ గరం గరం రొటీలను తయారు చేసేవారు. మరాఠీ సంప్రదాయంలో కూచోటానికి ఒక పీట దాని ముందు పళ్లెం పెట్టుకోటానికి మరోపీట. స్వామీ రామానంద తీర్థ శిష్యులు దానిని నిర్వహించేవారు. గిరాకీలు రానప్పుడు వారు రాట్నం వడుకుతూ కూచునేవారు.
బడీ చౌడీలో నివసించే మరాఠీలకు దేశభక్తి ఎక్కువ. ఒకసారి బుద్ధితక్కువై ఆ ప్రాంతంలోని ఇళ్లపై రజాకారులు దాడిచేసారు. అప్పుడు మరాఠీ స్త్రీలు చెప్పులు, చాటలు, చీపుర్లు చేతబట్టి వారిని తరిమితరిమి కొడ్తే రజాకార్లు వెనక్కి తిరిగి చూడకుండా ఒకటే పరుగు. అక్కడ నివసించే డాక్టర్ హరిశ్చంద్ర హెడా, జ్ఞానకుమారి హెడాలు అక్కడి ప్రజలను చైతన్యపరిచారు. ఇమ్రోజ్ పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్‌ను రజాకార్లు నడిరోడ్డుపై తల్వార్లతో నరికి హత్య చేసాక నిండుగర్బిణి ఐన ఆయన భార్యను రహస్యంగా తప్పించి తమ ఆసుపత్రిలో పురుడు పోసిన ఘనత ‘‘హెడా’’ దంపతులదే. వారిద్దరూ అనేక త్యాగాలు చేసినా స్వాతంత్య్రం వచ్చాక ఎటువంటి పదవులను స్వీకరించలేదు. వారి దవాఖానా ఇప్పటికీ కాచీగూడ టూరిస్ట్ హోటల్ ఎదురుగా ఉంది.
ఈ వీధిలోనే ‘‘మోతీమహల్’’ సీన్మా టాకీసు ఉండేది. మూకీ సీన్మాలు కాక హిందీ టాకీ సీన్మాలు ఆడేవి. ఆడవాళ్లకు మేడపైన చెక్కలతో కట్టిన ప్రత్యేకమైన క్లాసు ఉండేది. ఆ రోజులలో చాలా సీన్మా హాళ్లలో స్త్రీలకు ప్రత్యేకమైన క్లాసులు ఉండేవి. సీన్మా ప్రొజెక్టర్ స్త్రీలు కూచునే వెనక భాగం వైపు ఒక గోడ ఉండేది. ఒకరోజు హఠాత్తుగా ఆ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. క్షణాలలో స్త్రీలు కూచున్న చెక్కల సెక్షన్ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. అనేక మంది స్త్రీలు పిల్లా పాపలతో సహా మాడి మసైనారు. కొంత మంది ధైర్యం చేసి ఆ మేడపై నుండి క్రిందికి దుంకారు. వారి కాళ్లు చేతులు విరిగినాయి. ఒక స్త్రీ తన చీర విప్పి ఒక స్తంభానికి కట్టి దాని సహాయంతో క్రిందికి జారింది. ఆ చీర పుణ్యమా అని మరి కొంత మంది స్త్రీలు తప్పించుకున్నారు. ఆ అగ్నిప్రమాద విషాదం తర్వాత చాలా కాలం ఆ సీన్మాహాలు మూతబడింది. తర్వాత దానిని సరికొత్తగా నిర్మించారు. అప్పుడు దాని పేరు ‘‘దిల్షాద్ టాకీసు’’. రాజ్ కపూర్ సీన్మాలన్నీ అందులోనే విడుదల అయ్యేవి. నగర ప్రజలకు ఆ సీన్మాటాకీసుతో ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉండేవి. కాని క్యా ఫాయిదా? కాలక్రమంలో అది కూడా కళ్లముందే కాలగర్భంలో కలిసిపోయి అక్కడ కోళ్ల పౌల్ట్రీఫాంల లాంటి అపార్ట్మెంట్లు మొలిచాయి.
సుల్తాన్ బజార్‌లోని దిల్షాద్ టాకీస్ ఎదురుగా ఉదయ్ క్లాత్ స్టోర్స్ అనే బట్టల దుకాణం ఉండేది. దాని యజమాని పేరు దేవయ్య. ఈ దుకాణం పై గదిలో ప్రతిరాత్రి ‘‘ఆర్యయువ క్రాంతి దళ్’’ అనే విప్లవకారుల సంస్థ సమావేశాలు జరిగేవి. 1) నారాయణ్‌రావ్ పవార్ 2) పండిత్ విశ్వనాథ్ (గన్‌ఫౌండ్రి) 3) రెడ్డి పోచనాధం (గన్‌ఫౌండ్రి) 4) జి.నారాయణస్వామి (లాలాగూడలో రైల్వే ఉద్యోగి) 5) బాలకిషన్ (టేలర్, సుల్తాన్ బజార్) 6) గండయ్య 7) జగదీష్ ఆర్యలు ఆ దళం సభ్యులు. కొండా లక్ష్మణ్ బాపూజీ వారికి సలహాదారుడే గాక ఆర్థికంగా సహకారం అందించేవాడు. ఏడవ నిజాం నవాబును ఎట్లా ఖతం చేయాలో వారు ప్రణాళికను ఆ గదిలోనే రచించారు. ఫలితంగానే 1947 డిసెంబర్ నాల్గవ తారీఖునాడు కింగ్ కోఠీలో నిజాం వెళ్తున్న కారుపై బాంబు వేశారు. కాని నిజాం బ్రతికి బయటపడినాడు.
ఈ సుల్తాన్ బజార్లోనే మాడ్రన్ హేర్ కటింగ్ సెలూన్ ఉండేది. అందులో గండయ్య పనిచేసేవాడు. అతనిది పాలమూరు జిల్లాలోని పాలమాకుల స్వగ్రామం. బాంబు ప్రయోగం విఫలం కాగానే అతను పాలమాకుల పారిపోయాడు. కాని ఆ రాత్రే అతనిని గిరఫ్తార్ చేసారు. ఈ హేర్ కటింగ్ దాటగానే ‘‘గిరి కాఫీ హౌజ్’’ అనే చిన్న హోటల్ ఉండేది. అది కూడా విప్లవకారులకు ‘‘అడ్డా’’గా పనిచేసేది. వీరందరూ సామాన్యమైన యువకులే కాని కాలం కత్తుల వంతెన మీద ఈ అట్టడుగు జనాలు అగ్గిపిడుగులు కురిపించారు.
ఈ సుల్తాన్ బజార్ చౌరస్తాలనే అణాగ్రంధమాల వ్యవస్థాపకుడు కె.సి.గుప్త మాస్కో కమ్యూనిస్టు పుస్తకాలను అమ్మేవాడు. తర్వాత కాలంలో అది ‘‘విశాలాంధ్ర’’ పుస్తకాల దుకాణంగా మారింది. ఆ దుకాణం ఇప్పటికీ అక్కడే నడుస్తుంది. దాని కొత్తపేరు ‘‘నవ చేతన’’.
సుల్తాన్ బజార్ క్లాక్‌టవర్ వద్ద 1938లో మొదటిసారి స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రథమ సత్యాగ్రహం జరిగి ఏడుగురు కాంగ్రెసు నాయకులు అరెస్టు అయినారు. స్వామి రామనంద తీర్థ, గోవిందరావు నానల్, వామన్రావ్ నాయక్ వీరిలో ప్రముఖులు. ఈ 1938వ సంవత్సరం నగర రాజకీయాల చరిత్రలో చాలా ముఖ్యమైన సంవత్సరం. ఒక వైపు స్టేట్ కాంగ్రేస్ సత్యాగ్రహమే గాక అటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులు ‘‘వందేమాతరం’’ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ సంవత్సరంలోనే. బహద్దూర్ యార్ జంగ్ ఈ సంవత్సరంలోనే మజ్లిస్ ఇత్తైహాదుల్ ముసల్మీన్ సంస్థను ప్రారంభించాడు.. దూల్పేటలో మొదటిసారి మతకలహాలు జరిగింది ఈ 1938 సంత్సరంలోనే!
ఈ సుల్తాన్ బజార్ గల్లీ ఆఖరిలో ఎడమవైపు రాయల్ టాకీసు. అదిప్పుడు లేదు. షాపింగ్ కాంప్లెక్సుగా మారింది. దాని ఎదురుగా కుడివైపు రాజాకందస్వామి మార్కెట్. అది ఇప్పటికీ ఉంది. రాజాకందస్వామి తమిళుడు. మొదలియార్ కుటుంబానికి చెందినవాడు. మూడవ నిజాం కాలంలో ఇతను ప్రముఖ ఇంజనీరు. 1802వ సంవత్సరంలో కోఠీలోని బ్రిటిష్ రెసిడెంటు భవనాన్ని నిర్మించింది ఇతనే. అప్పటి రెసిడెంటు కిర్క్‌పాట్రిక్ అతని నైపుణ్యానికి మెచ్చి ‘‘రాజా’’ అన్న బిరుదును ప్రసాదించాడు. ఈ మార్కెట్ దాటగానే గుజరాతీ గల్లీలో హనుమాన్ వ్యాయామశాల. ఇందులో నుండే నిజాంకు వ్యతిరేకంగా అనేక మంది యోధులు జన్మించారు. హైదరాబాద్ నగరంలో జాతీయోద్యమానికి గ్రంధాలయాలు, వ్యాయమశాలలు రెండు ముఖ్య కేంద్రాలుగా పనిచేసాయి. 1908లో మూసీకి వరదలు వచ్చి సగం పట్నం కొట్టుకపోయిన తర్వాత కార్వాన్ ప్రాంతంలో నివసించే గుజరాతీ, మార్వాడీ షావుకార్లు అందరూ ఇక్కడ స్థిరనివాసాలు, వ్యాపారాలు ప్రారంభించారు. అట్లా గుజరాతీ గల్లీ పేరు వచ్చింది. దీన్ని దాటి ముందుకు వెళ్తే హనుమాన్ టేక్డీ వస్తుంది. ఆంధ్రపితామహ మాడపాటి హన్మంతరావు నివసించిన ‘‘ఆంధ్రకుటీరం’’ ఇక్కడే ఉండేది.
ఇక్కడ మజేదార్ ‘‘మజాక్’’ ఒకటి మీకు చెప్పాలె.
ఒకసారి ప్రముఖ ఆంధ్రా కాంగ్రెసు నాయకుడు డాక్టర్ భోగరాజు పట్టాబి సీతారామయ్య మాడపాటి హన్మంతరావు ఇల్లు ‘‘ఆంధ్రకుటీరం’’లో బసచేశాడు. ఆయన తన రెచ్చగొట్టే ఉపన్యాసాల ద్వారా ప్రజలలో ఏం విప్లవం తెస్తాడో అన్న భయంతో నిజాం సర్కారు ఆయన్ని గిరఫ్తార్ చేయటానికి ‘‘వారెంట్’’ జారీ చేసింది. ఆ వారెంటు ఉర్దూభాషలో ఉంది. ఉర్దూకు స్వంత లిపి లేదు. ఫార్సీ లిపినే వాడుతారు. ఫార్సీ లిపిలో భారతీయ శబ్దాలు రాయటం చాలా కష్టం. ‘‘పట్టాభి సీతారామయ్య’’ అని రాయాలంటే ‘‘టప్పాబహీ సత్తార్ మియా’’ లా ఉంటుంది.
ఆంధ్రకుటీరానికి అరెస్టు వారెంటు పట్టుకొచ్చిన తురక పోలీసు జవానులు ‘‘యహాఁ సత్తార్ మియాఁ హై క్యా’’ అని హన్మంతరావును అడిగారు. దానికి ఆయన ‘‘యహాఁ సత్తార్ మియా కోయీ నహీఁ. ఇన్కా నాంతో సీతారామయ్యా హై’’ అన్నాడు. దాంతో వారు తికమకకు గురై ‘‘మాఫ్ కర్నా’’ అని సలాం కొట్టి వెళ్లిపోయారు. అట్లాగే మరోసారి ‘‘టంగుటూరి ప్రకాశం’’ మీద కూడా ఉర్దూలో అరెస్టు వారెంటు జారీ అయ్యింది. తురక పోలీసులు ఏకంగా ప్రకాశం పంతులు దగ్గరికే వచ్చి ‘‘యహాఁ టాంగ్ టూటీ పీర్ కాసిం కౌన్ హై’’ అని అడిగారు. దాంతో ప్రకాశం దర్జాగా పాన్ నములుతూ కాలు మీద కాలు వేసుకుని చక్కగా ఊపుకుంటూ ‘‘టాంగ్ టూటీ? యహా తో సబ్కే టాంగ్ అచ్చాహై దేఖో’’ అని కొంటెగా సమాధానం ఇచ్చాడు. టాంగ్ టూటీ పీర్ ఖాసిం ఇక్కడ లేడనుకుని పోలీసులు ఉత్తచేతులు ఊపుకుంటూ డీలాపడి వాపస్ వెళ్లిపోయారు.
కాలప్రవాహంలో సుల్తాన్లందరూ కొట్టుకుపోయినా చివరికి సుల్తాన్ బజార్ మాత్రం మిగిలిపోయింది.
(షహర్ నామా (హైద్రాబాద్ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్, ఎ: 91606 80847