విశ్వకర్మ చరిత్ర :
‘శిల్పాచార్యాయ దేవాయ నమస్తే విశ్వకర్మణే
మనవే మయాయ త్వష్ట్రేచ శిల్విన్ దైవ్ఞతే నమః’
పురుషసూక్తంలో విరాట్ పురుషునిగా అభివర్ణితుడైన విశ్వకర్మ దేవశిల్పి. అష్టావసువులలో ఒకరైన ప్రభావను కుమారుడు. తల్లి యోగసిద్ధి. పురాణకథల్లో అనేక చోట్ల విశ్వకర్మ ప్రస్తావన కనిపిస్తుంది. అరవై నాలుగు కళలలో ఒకటైన వాస్తు (నిర్మాణ) శాస్త్ర స్థాపకుడు (గాడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్) వాస్తు పురుషుడు. ‘విశ్వకర్మా సహంస్రాంశౌ’ అని ప్రమాణం. తొలిరోజులలో విశ్వకర్మను అపర బ్రహ్మ అనీ వ్యహరించేవారు. అప్సరస ఘృతాచిని, విశ్వకర్మ పరస్పరం శపించు కోవడంతో మానవులుగా (ప్రయాగలో) జన్మించారు. ఇద్దరూ ఒకసారి తటస్థ పడినప్పుడు పూర్వ జన్మవృత్తాంతం తెలుసుకొని ఒక్కటయ్యారు. అలా జన్మించిన వారే విశ్వబ్రాహ్మణులని ఐతిహ్యం.
మానవ జన్మకు పూర్వం ఇంద్రసభలో ఉన్న విశ్వకర్మ దుష్టశిక్షణ కోసం దేవతలకు శక్తిమంతమైన ఆయుధాలు, దేవతలకు, భూలోకపాలకులకు రాజప్రసాదాలు నిర్మించి ఇచ్చాడు. నిర్మాణాల విషయంలో అసురుల పట్ల పక్షపాతవైఖరి చూపలేదు. ఐతిహ్యం ప్రకారం,సూర్యపత్ని అయిన తన పుత్రిక సంజ్ఞ భర్త తేజస్సుకు తట్టుకోలేకపోవడంతో సూర్యుని సానబట్టాడట. అలా రాలిన చూర్ణంతోనే చక్రాయుధం తయారు చేసి శ్రీహరికి కానుకగా సమర్పించుకున్నాడట. ఇంద్రుడికి విజయం అనే ధనస్సు, యోగాగ్నితో దహించుకుపోయిన ముని దధీచి ఎముకలతో వజ్రాయుధాన్ని రూపొందించాడు. శివునికి త్రిశూలాన్నీ, ఆదిశక్తికి గండ్రగొడ్డలిని, త్రిపురాసుర సంహారంలో శివుడికి రథాన్ని తయారుచేశాడు. దేవేంద్రునికి అమరావతి నగరానిన సృష్టించి యిచ్చిన మహాపురుషుడు. పుష్పక విమానాన్ని రూపొందించాడు. యమవరుణులకు సభా మందిరాలను, రావణునికి స్వర్ణ లంక, శ్రీకృష్ణుడికి ద్వారకా నగరాన్ని, పాండవులకు ఇందప్రస్థ నిర్మాణం ఇలా ఎన్నో దివ్య సంపదల సృష్టికర్త విశ్వకర్మే. ఆయన అంశతో జన్మించిన వారు, వారసులు కూడా వాస్తులో విశేష ప్రతిభ కనబరిచారని పురాణగాథలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో సుగ్రీవుని కొలువులోని నలుడు ఈయన కుమారుడే. రామరావణ యుద్ధ సమయంలో నలుడు పర్యవేక్షణలోనే సేతువు నిర్మితమైందని రామాయణం చెబుతోంది. ఇతడు వాస్తుశిల్పే కాక వీరుడు కూడా. ఆ సంగ్రామంలో పాల్గొన్నాడు.
విశ్వకర్మ వంశీయులు వాస్తుశాస్త్ర ప్రవర్తకులు. పురాణ ప్రసిద్ధ నిర్మాణాలు చేసిన మేధావులు, తపస్సంపన్నులుగా పేరుపొందారు. వివిధ నిర్మాణాలు, వస్తువుల తయారీ, ఉత్పత్తులలో సేవలందించి లోకోపకారులుగా వినుతికెక్కారు. విశ్వకర్మ పంచముఖాల నుంచి మను, మయ, త్వష్ట, శిల్పి, దైవజ్ఞుడు ఉద్భవించి వారు వరుసగా ఇనుము, కర్ర, తామ్రం, రాయి, బంగారం తదితర ధాతువుల ద్వారా వస్తు సామగ్రి నిర్మాణ పక్రియను ప్రారంభించారు. పూరీక్షేత్రంలోని జగన్నాథ, సుభద్ర, బలభద్ర విగ్రహాల సృష్టికర్త ఆయన వంశీయుడేనని చెబుతారు. పాండవుల రాజసూయయాగం సందర్భంగా మయుడు నిర్మించిన రాజప్రాసాదం పురాణప్రసిద్ధం. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేసిన అద్భుత సృష్టే దుర్యోధనుడి అసూయకు, అవమానాలకు, చివరికి కురుక్షేత్ర సంగ్రామానికి కారణాలలో కీలకమైంది. దీనిని బట్టే దాని నిర్మాణంలో మయుని నిర్మాణం చాతుర్యం వెల్లడవుతోంది.అందుకే అద్భుత,విలాస కట్టడాలకు ‘మయసభ’ ఉపమానంగా నిలిచిపోయింది. అతడే అసురులకు స్వర్ణ, రజిత, కాంస్యాలతో మూడు నగరాలను (త్రిపురాలు) నిర్మించి ఇచ్చాడు. ఈ సామాజికవర్గంలో ఆవిర్భవించిన శ్రీమద్విత్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కులవృత్తిని పాటిస్తూనే ‘కాలజ్ఞానం’ బోధనతో జగద్విఖ్యాతులయ్యారు. మానవ జీవనానికి విశ్వకర్మీయుల కులవృత్తులు ప్రధాన ఆధారంగా ఉన్నాయి. విశ్వకర్మ సంతతి తమ వృత్తులను బట్టి స్వర్ణకారులు, వడ్రంగం, కంచర పనులతో మానవ మనుగడలో కీలక పాత్రగా మారారు. వాస్తు శిల్పులు వంశపారంపర్యంగా కఠోరశిక్షణ, తపశ్శక్తితో సాంకేతిక పరిజ్ఞానం పొంది ఎన్నో ఆలయాలు, అద్భుత కట్టడాలను ఆవిష్కరించారు. సమాజానికి వారు అందించిన సేవలకు తగిన గౌరవం దక్కేది. ఆలయాల నిర్మాణం నుంచి విగ్రహాల తయారీ, ప్రతిష్ఠ వరకు వీరి పాత్ర కీలకం. రథోత్సవాల సందర్భంగా వీరి ప్రమేయం లేకుండా దైవకార్యాలు సాగవని ఆలయ నిబంధనలు చెబుతున్నాయి. గ్రామాలలోని దేవాలయాలలో కల్యాణోత్సవాల సందర్భంగా మేళతాళాలతో స్వర్ణకారుల ఇళ్లకు వెళ్లి అమ్మవారి మెట్టెలు, మంగళసూత్రాలు సేకరించే పక్రియ నేటికీ కొనసాగుతోంది.
మనిషికి ప్రధాన అవసరాలైన కూడు, గూడు, గుడ్డ సమ కూరడంలో వీరి భూమిక కాదనలేనిది. వ్యవసాయంలో ఆధునిక పరికరాలు రాకపూర్వం బండ్లు, నాగళ్లు, కొడవళ్లు లాంటి పనిముట్ల తయారీలో ఊపిరిసలపకుండా ఉండేవారు. అందులోనూ మన దేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి కావడంతో వారి అవసరం ఎంతో ఉండేది. పొలం దున్నేముందు వారితోనే నాగళ్లకు పూజలు చేయించేవారంటే వారికి దక్కిన గౌరవం తెలుస్తుంది. వంశానుగత స్ఫూర్తితోనే ‘వాస్తు కన్సల్టెంట్’ పేరుతో సేవలు అందిస్తున్నారు. వీరు కులవృత్తులతో పాటు జ్యోతిషం, పౌరోహిత్యం, విద్య, వైద్యం లాంటి వివిధ రంగాలలోనూ రాణిస్తున్నారు. వాస్తుపూర్వక నిర్మాణాలే కాదు, అన్ని చేతివృత్తులకు విశ్వకర్మను ‘ఆదిపురుషుడు’గా చెబుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వకర్మ మనిషి నిత్యజీవితంతో మమేకమయ్యారు.
పంచదాయి వృత్తుల వారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన హైద్రాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‍లో విశ్వకర్మ జయంతి మహాయజ్ఞ పూజోత్సవం జరుపుతారు. వివిద ప్రాంతాల నుండి వేలాది మంది విశ్వకర్మీయులు హాజరవుతారు. ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు పాల్గొంటారు. చేతి వృత్తుల కళాఖండాల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో పండుగలా జరుపుకుంటారు. ఈ విశ్వకర్మ జయంతి రోజును దేశీయ కార్మిక దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
అందుకే అన్ని వృత్తుల వారు ‘విశ్వకర్మ జయంతి’ని దేశవ్యాప్తంగా ప్రధానంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, అస్సోం, త్రిపుర, ఒడిశా, కర్ణాటకలలో విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి సందర్భంగా నిర్వహించే ఆయుధపూజకు, విశ్వకర్మ జయంతి పూజకు కొంత పోలిక కనిపిస్తుంది. తాము చేయబోయే యుద్ధాలలో విజయం సాధించాలని పూర్వ కాలంలో రాజులు దసరా సందర్భంగా ఆయుధపూజ చేసేవారు. పనులు సజావుగా సాగాలని కోరుతూ ఈ కాలంలోనూ వివిధ వృత్తుల వారు ఆ సంప్ర దాయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, విశ్వకర్మ పూజతో సమాజ ప్రయో జనం మరింత ముడిపడి ఉంది. మానవ మనుగడకు అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పనకు ఉపకరించే పరికరాలను పూజిస్తారు. ఇది ఏ ఒక్క సామాజిక వర్గానికో సంబంధించిన పండుగ కాదు. కుల వృత్తిదారులు అందరికి పండుగే. తమతమ వృత్తులకు సంబంధించిన పరికరాలు సరిగా పనిచేయాలని అన్ని వర్గాల వారు కోరుకుంటూ చేసే పూజ.
చేతి వృత్తులకు గురువు :
సమస్త చేతి వృత్తులకు మూలపురుషుడు శ్రీ విరాట్ విశ్వకర్మ. చేతివృత్తుల మూల గురువు విశ్వకర్మకు, రచనాదేవిలకు జన్మించిన పుట్టిన ఐదుగురు కుమారులు. మను, మయ, త్వష్ఠ, శిల్పి, విశ్వజ్ఞలు. విశ్వకర్మ మొదటి కుమారుడు మను నుంచి వచ్చిన వృత్తి కమ్మరి. రెండో కుమారుడు మయ నుంచి వచ్చిన వృత్తి వండ్రగి. మూడో కుమారుడు త్వష్ఠ నుంచి వచ్చిన వృత్తి కంచరి. నాలుగో కుమారుడు శిల్పి నుంచి వచ్చిన వృత్తి శిల్పకార వృత్తి . ఐదో కుమారుడు విశ్వజ్ఞ నుంచి వచ్చినదే స్వర్ణకార వృత్తి . విశ్వకర్మ ఐదుగురు కుమారుల నుంచి పుట్టినవే నేటి సమాజంలోని చేతి వృత్తులు. ఈ వృత్తులనే పంచవృత్తులు అంటారు. సహజంగా పూర్వ కాలంలో వీరంతా, గ్రామంలో ఒక స్థలంలో ఈ ఐదు వృత్తులనూ చేస్తూ గ్రామానికి కావల్సిన వస్తువులను సమకూర్చేవారు. ఆ స్థలాన్నే విశ్వకర్మశాల అని ఆ రోజుల్లో వ్యవహరించే వాళ్ళు. క్రమేణా ఆ పేరు కాస్తా ‘కర్మశాల’గా మారి, ‘కమశాల’గా మారి, ‘కంసాల’ కులం పేరుగా, ఆ కులంలో పుట్టిన వారిని ‘కంసాలి’గా పిలవడం జరిగింది.
స్వర్ణకారుడు (కంసాలి):
స్వర్ణకారుడు అంటే ముడి బంగారాన్ని సేకరించి దాని నుండి అసలైన బంగారం గ్రహించి, దానికి రత్న మాణిక్యాలను కూర్చి, దాన్ని అనుభవ యోగ్యంగా, ఆభరణాలుగా మార్చగలిగిన వాడు. పురాతన దేవాలయాల్లో ఎటువంటి యంత్ర సహాయం లేకుండా చేసిన కిరీటం, నగలు, వస్తువులు అలనాటి విశ్వబ్రాహ్మణ వృత్తికి నిదర్శనం.
ఇంటి పేర్లు :
ఓజు అను పదంతో అంతమయ్యే అరవై ఇంటిపేర్లను విశ్వ బ్రాహ్మణులు కలిగి ఉంటారు. ఉదాహరణకు, నామోజు, లక్కోజు, దాకోజు, దాసోజు, కొమ్మోజు, బొల్లోజు, కన్నొజు, సంకోజు, మారోజు వంటివి. పూర్వం శిల్పులను ఓజులని సంబోధించేవారు. ఓజు అనగా గురువు (ఉపాధ్యాయుడు – ఒజ్జ – ఓజు) అని అర్థం. ఆ విధంగా వారి మామూలు నామానికి ఓజు తగిలించి వాడుకొనే వారు. కాల క్రమేణా అదే స్థిరమై ఇంటి పేరుగా మారిపొయ్యింది. భిన్న కులాలు ఒకే రకమైన ఇంటిపేర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. కానీ ఈ విధంగా ఓజుతో అంతమయ్యే ఇంటిపేర్లు ఈ ఒక్క కులానికి మాత్రమే పరిమితమై ఉండటం గమనార్హం.
ఏడు వారాల నగలు :
గురువారం – ముగింపులు
మంగళవారం – పగడాలు
సోమవారం – ముత్యాలు
శనివారం – అభిరుచులు
ఆదివారం – కెంపులు
శుక్రవారం – వజ్రం
బుధవారం – ఆకుపచ్చ
కుల వృత్తులను ఆదుకోవాలి :
ఒకప్పుడు చేతినిండా పనితో గడిపిన విశ్వ బ్రాహ్మణులు నేడు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పెద్దపెద్ద జువెల్లరీ దుకాణాలు, బెంగాలీ కూలీలతో స్వర్ణకారులు ఉపాధిని కోల్పో తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విశ్వబ్రాహ్మణులు ప్రత్యేక రాష్ట్రంలో మెరుగైన జీవనాన్ని గడుపుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది.
అయితే బెంగాలీ కూలీలతో స్వర్ణకారులు ఉపాధిని కోల్పోతున్నారు. రెడీమేడ్ ఆభరణాలు, ప్రైవేట్ రంగ సంస్థలు జువెల్లరీ దుకాణాలు ఏర్పాటు చేయడంతో వీరికి గిరాకీ తగ్గింది. బెంగాలీ కూలీలతో స్థానికులకు ఉపాధి దెబ్బతింటోంది. దీనికి తోడు దొంగ బంగారం కేసులతో స్వర్ణకారుల బతుకులు చిద్రమైపోతున్నాయి.
ఉపాధి కరువై ఎందరో విశ్వబ్రాహ్మణులు దినసరి కూలీలుగా, నైట్ వాచ్‍మెన్‍లుగా మారుతున్నారు.
వృత్తికి దూరమయ్యారు. వీరిని ఆదుకునేందుకు తెలుగు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని స్వర్ణకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్‍లాక్‍లో ఉన్నా వారి ఉపాధి ఏ మాత్రం మెరుగుపడ్డ దాఖలాలు లేవు. కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని నెలల పాటు ప్రజలు ఎలాంటి శుభకార్యాలు చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. దీంతో బంగారు, వెండి ఆభరణాల తయారీకి విఘాతం ఏర్పడింది. దాదాపు 14 లక్షల స్వర్ణకార, విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొం టున్నాయి. స్వర్ణకారులు లాక్‍డౌన్‍లో చాలా కష్టకాలాన్ని ఎదుర్కొన్నారు.
అంతేకాదు, జీవో 272 కారణంగా పోలీసుల చేతిలో స్వర్ణకారులు వేధింపులకు గురవుతున్నారు. అనవసరపు వేధింపులతో స్వర్ణకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని పోలీసులను వేడుకుంటున్నారు. తప్పేదైనా ఉంటే స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని స్వర్ణకారులు కోరుతున్నారు.
విశ్వ బ్రాహ్మణుల ప్రత్యేక డిమాండ్లు :
విశ్వకర్మలకు ప్రత్యేక పాలక మండలితో కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1,000 కోట్లు నిధులు కేటాయించాలి. 50 ఏళ్లు నిండిన వారికి రూ.3వేలు పింఛన్ అందించాలి. జీవో 272 అమలు పరిచి స్వర్ణకారులపై జరిగే అక్రమ రికవరీలను అరికట్టాలి. విశ్వ బ్రాహ్మణుల చేతి వృత్తులను పోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తి నైపుణ్యం కోసం ఆధునాతన మిషనరీలు అందజేయాలి. ఇందుకుగాను రూ.5లక్షల వరకు సబ్సిడీ రుణాలను అందించాలి. పుస్తె, మట్టెలు జ్యూవెల్లరీ షాపులలో అమ్మడాన్ని నిషేధించాలి. బ్యాంకుల్లో అప్రైజర్లుగా స్థానిక స్వర్ణకారులనే తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిద్దాం.
–సువేగా,
ఎ : 9030 6262 88