దళితజాతికి దారిదీపం

  • ఐరాస లక్ష్యం, కేసీఆర్‍ ఆచరణ శ్రీ దేశం ముంగిట దళిత ఎ‘జెండా’
  • ఏడాది కిందే దళిత బంధు.. కరోనా వచ్చినందుకే లేటు: కేసీఆర్‍


ఏడాది కిందే దళిత బంధుకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్‍ అన్నారు. హుజురాబాద్‍ నియోజకవర్గంలోని శాలపల్లి బహిరంగ సభలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కరోనా నేపథ్యంలో దళిత బంధు ఆలస్యం అయిందని చెప్పారు. ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని.. అర్థం పర్థం లేని మాటలు మంచిది కాదన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా తెలంగాణలో దళిత బంధు తీసుకొచ్చిన ఘనత టీఆర్‍ఎస్‍దే అన్నారు.


రాష్ట్రంలో కరీంనగర్‍ జిల్లా ప్రత్యేకతను చాటుకుంటుందని సీఎం కేసీఆర్‍ ఉద్ఘాటించారు. పేదలు, రైతులకు సంబంధించిన కీలకమైన పథకాలన్నీ కరీంనగర్‍ వేదికగా పురుడు పోసుకుంటున్నా యన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకునే రైతుబంధు కార్యక్రమాన్ని కరీంనగర్ నుంచి మొదలుపెట్టామన్నారు. ఇప్పుడు దళిత వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసే దళిత బంధు పథకాన్ని కూడా ఇక్కడే మొదలుపెట్టినట్లు వెల్లడించారు. హుజురాబాద్‍ నియోజకవర్గంలో సకల జనుల సర్వే సందర్భంగా 25 వేల దళిత కుటుంబాల లెక్క తేలిందని సీఎం కేసీఆర్‍ వివరించారు.


దళిత బంధుతో అందరికీ డబ్బులు ఇవ్వడం లేదని, వారి ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తున్నామని, హుజురాబాద్‍ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి వచ్చే నెల రోజుల్లో దళిత బంధు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రమంతా ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు. దళితులకు అండగా నిలువాలనేది తన లక్ష్యమని సీఎం కేసీఆర్‍ పేర్కొన్నారు. 2 ఏండ్ల కిందటే ఆలోచన చేశామన్నారు. అణిచివేతకు గురైన లక్షల మంది దళితుల కోసం పని చేస్తున్నామన్నారు. అంబేద్కర్‍ పోరాట ఫలితంగా కొంతమందికి అవకాశాలు వచ్చాయని, ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. కానీ, 95 శాతం మంది దళితులు ఇంకా అణిచివేతకు గురవుతున్నారని, గుండెల్లో బాధను అణుచుకుని జీవిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ పని ఏండ్ల కిందటే చేస్తే దళితులకు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.
దళితులు ధనికులుగా మారటం లాంటి విషయాలను ఎవరూ ఇంతవరకు జనవేదికల మీద చర్చకు తీసుకురాలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మాత్రమే దళిత, బహుజనుల గురించి లోతుగా ఆలోచించే స్థితి రావటం, అందుకు ప్రభుత్వమే పథకాల రూపకల్పన చేయటమన్నది ఎన్నడూ ఊహించనిది. గతంలో ఏ పాలకుడూ ఈ దిశగా అడుగులు వేయలేదు. ఏ ప్రభుత్వమూ ఇంత సాహసం చేసేందుకు సిద్ధం కాలేదన్నది నిజం. ప్రగతిపథం అన్న ఆర్థిక రథచక్రంలో దళిత బహుజనుల చెమట చేతులను లెక్కకట్టి, నిరుపేదలు సంపన్నులు కావాలన్న తాత్వికతతో ఆలోచించి ‘దళిత బంధు’ లాంటి పథకం రూపకల్పన చేసింది దేశంలో కేసీఆర్‍ ఒక్కరే అనడంలో అతిశయోక్తి కాదు!


ఊరు బయట మూలుగుల నుంచి.. చెమటచుక్కల సంస్కృతి నుంచి.. తరతరాల అణచివేతల నుంచి.. అలసిన జీవితాల నుంచి.. చెప్పులు కుట్టిన చేతుల చరిత్రను తిరగరాస్తూ దూసుకొస్తున్న ఒక ఆర్థిక విప్లవంగా, ఆర్థిక స్వాతంత్య్రంగా దళితబంధు పథకాన్ని కేసీఆర్‍ దార్శనిక ఆలోచనలతో రచించారు. ఈ పథకానికి శక్తివంతమైన ఆచరణ రూపం ఇచ్చారు. పేదింటి దళితుల తలుపు తట్టి వాళ్ల ఆర్థిక స్థిరత్వం కోసం రూ.10 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించటం ఎవ్వరూ కలలో కూడా ఊహించనిది. తరతరాలుగా సమాజంలో కీలకమైన శ్రమశక్తి వర్గం, సంపద సృష్టించే వర్గం ఇంతకాలం వెలివేతలకు గురైంది. చాలాకాలం బానిస బతుకులుగా ఇదే తెలంగాణ నేల మీద జీవించింది. అందుకే అంబేద్కర్‍ లాంటి మహనీయులు దేశ స్వాతంత్య్ర పోరాటానికి సమాంతరంగా దళితుల అస్తిత్వ జీవన పోరాటం కొనసాగించారు. ఉన్నవ లక్ష్మినారాయణ ‘మాలపల్లి’, గుర్రం జాషువా ‘గబ్బిలం’, బోయిభీమన్న ‘గుడిసెలు తగలబడ్తున్నాయ్‍’, కొలకలూరి ఇనాక్‍ ‘ఊరబావి’ కథలు, చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట, పాదముద్రల, దళిత బహుజన ఆత్మల కవిత్వం సాహిత్యంలో ఎగిసిపడింది. ఎన్నెన్నో దళిత డిక్లరేషన్ల రచనలూ జరిగాయి. కానీ ఊరి బయట వెలివాడల జీవితాల్లో మార్పులేదు. ఈ వర్గాల్లో మార్పు రావాలి. తమకు తాముగా నిలబడే స్వాతంత్య్రం పొందగలగాలి.


బడుగుజీవుల బక్కపల్చటి బతుకుల్లో మార్పులు వచ్చి సంపదల సృష్టికర్తలైన దళితులు లక్షాధికారులు కావాలన్న ఆలోచనలకు కేసీఆర్‍ ఒక రూపం ఇవ్వటం మహా విశేషం. దానికి ‘దళితబంధు’గా నామకరణం చేయటం ఎవ్వరూ ఊహించని తెలంగాణ ప్రభుత్వ అసాధారణ చర్య. ఈ పథకం నిలవాలి. ఈ పథకం గెలవాలి. ఈ పథకం దళితజాతికి ఒక దారిదీపంగా మారాలి. మన జాతికి ఇంతకన్నా గొప్పది, ఉన్నతమైనది ఇంకేం ఉంటుంది. దేశంలో రాజకీయపార్టీలు తమ ఉనికిని తాము చూసుకుంటాయి, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ వాసాలమర్రిలో దళితవాడల ఉనికిని ఎవరు చూశారన్నది గుండెమీద చేయివేసుకొని ఆలోచించుకోవాల్సిందే. ఒక మంచి పథకం ప్రవేశపెడుతుంటేనే శుభం పలకాల్సిన దానికి బదులు ఇది సాధ్యమయ్యేదేనా? అనేవాళ్లు, అడ్డుతగిలేవాళ్లు ప్రతికాలంలో వేర్వేరు రూపాల్లో ఉంటూనే ఉంటారని గతకాలాలే చెప్తున్నాయి. దళిత బిడ్డలను అక్కున చేర్చుకోవాలి. ఈ పని తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే చేస్తానంటుంటే కేసీఆర్‍కు సెల్యూట్‍ చేయాలి.


స్కీంలో 30 రకాల వ్యాపారాలు
దళితుల సామాజిక జీవన విధానంలో వినూత్న మార్పులు తీసుకరావటానికి ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలోని 30 రకాల వ్యాపారాలు దళితులను ఆర్థిక స్థిరత్వంలో నిలబెట్టేవే. ఇవన్నీ అత్యధికంగా గ్రామీణ తెలంగాణలోనే ఉండటం మరో విశేషం. జనాభాపరంగా 60 శాతానికిపైగా ఉన్న గ్రామీణ తెలంగాణ ఆర్థిక అస్తిత్వంతో నిలిచేందుకు ఇవి బాగా ఉపయోగ పడుతాయి.
మినీ డెయిరీ యూనిట్‍, పందిరి కూరగాయల సాగు, వరి నాటు వేసే యంత్రాలు, వేప నూనె, పిండి తయారీ, వ్యవసాయ యంత్ర పరికరాలు, ఆటో మోబైల్‍ షాపులు, మట్టి ఇటుకల తయారీ ట్రాక్టర్లు, నాటుకోళ్ల పెంపకం, సెవన్‍ సీటర్‍ ఆటో, ఫ్యాసింజర్‍ ఆటో, మూడు చక్రాల ట్రాలీ, ఫెస్టిసైడ్‍ షాఫులు, టెంట్‍హౌజ్‍ డెకరేషన్‍ సామాన్లు.. ఇలా 60 రకాల కార్యక్రమాలను దళితబంధు కింద 10 లక్షలతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆయా గ్రామాల, పట్టణాల పరిధుల్లో స్థానిక అవసరాలు, యూనిట్‍ నుంచి తయారుచేసే వస్తువులు, అమ్మకాలకు సంబంధించిన పరిస్థితులను అంచనాలు వేసుకొని ఈ పథకం కార్యక్రమాలను అమలు జరుపుకోవచ్చు. ఈ దళిత స్వయం ఉపాధి పథకాల ద్వారా దళితులు ఆర్థిక స్వాతంత్య్రంతో ఆత్మగౌరవంతో నిలబడగలరు. ఇది మొత్తం తెలంగాణ ఆత్మగౌరవంగా నిలువనున్నది. దళిత బంధు పథకం నిరుపేద దళితుల జీవితాల్లో కొత్త వెలుగులను నింపుతుంది. ఇది సామాజిక తెలంగాణ జన జీవితంలో ఊహించని మార్పులు తీసుకరావటానికి కొత్తదారి వేస్తుంది.


వాసాలమర్రి సందేశం
‘సమాజంలోని అత్యంత బలహీనుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తామనేదే దేశ గొప్పతనానికి కొలమానం’ అన్నారు గాంధీజీ. ప్రభుత్వ అంతిమ లక్ష్యం ప్రజల సంక్షేమానికి పాటుపడటమే. ఈ సంక్షేమ రాజ్య భావజాలాన్ని కేసీఆర్‍ అణువణువునా ఒంటబట్టించు కున్నారనేది వాసాలమర్రి గ్రామంలో దళితులను ఉద్దేశించి మాట్లాడిన తీరును బట్టి అర్థమైంది. ‘దళిత బంధు’ పథకం అత్యుత్తమమైనదీ, అపూర్వమైనదనేది అనడంలో సందేహం లేదు. దళితులతో ఆయన సంభాషించిన విధానంలో ఈ పథకం విజయవంతం కావాలనే ఆరాటం, వారు బాగుపడాలనే ఆకాంక్ష ద్యోతకమవుతున్నది. తరతరాలుగా అభివ•ద్ధి మార్గాలు మూసుకుపోయి ఉన్న జనానికి హఠాత్తుగా పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ముఖ్యమంత్రి మాకు అండగా ఉన్నారనే భరోసాను వారికి కేసీఆర్‍ ఇవ్వగలిగారు.
తెలంగాణ జనజీవితంలో తరచూ తారసిల్లే మార్వాడీ వ్యాపారులను కేసీఆర్‍ తన ప్రసంగంలో ఉదాహరణగా చెప్పారు. ఒక మార్వాడీకి పది లక్షలు ఇస్తే ఏడాదిలో ఇరువై లక్షలు చేస్తారు. ఇందుకు కారణం డబ్బు పట్ల, దానిని వాడుకోవడం పట్ల వారి ఆలోచనా విధానం. ఇదేవిధంగా దళితులు పది లక్షల రూపాయలను తగు విధంగా వ్యాపారంలో పెడితే అవి పిల్లలు పెడతాయని వివరించారు. ఏ వ్యాపారం చేయాలనేది తొందరపడి నిర్ణయించు కోవద్దని, ఇంటిల్లిపాది అంతా వారమైనా, నెలరోజులైనా చర్చించుకోవాలని సూచించారు. తాము నిరాడంబర జీవితాన్ని గడుపుతూనే వ్యాపారంలోని సొమ్మును పెంపొందించుకోవాలని విడమరిచి చెప్పారు. అభివ•ద్ధికి సామాజిక ఐక్యత దోహద పడుతుందనేది కూడా కేసీఆర్‍ వారికి వివరించారు. ప్రభుత్వాధినేతగా కాకుండా ఆత్మబంధువుగా ఆయన మారిపోయారు.
ముఖ్యమంత్రిగా విధాన రూపకల్పనకే పరిమితం కాకుండా ప్రజలలో ఒకరిగా మారిపోయి వారికి ప్రేరణ ఇవ్వడం కేసీఆర్‍ ప్రత్యేకత. వాసాల మర్రిలో దాదాపు మూడు గంటల పాటు ఇంటింటికీ కలియ తిరిగి వారి జీవన పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు. పేరుపేరునా పలుకరిస్తూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. మామూలు ముఖ్యమంత్రులు వేరు, ప్రజాభిమానం గల కేసీఆర్‍ వేరు. కేసీఆర్‍కు పేదల పట్ల ఎంత నమ్మకమో, వారికి ఆయన పట్ల అంతే విశ్వాసం. ఈ పరస్పరాభిమానం ఈ పర్యటన సందర్భంగా వెల్లు వెత్తింది. కేసీఆర్‍ గ్రామ సందర్శన దళితుల్లో ఉత్సాహాన్ని నింపింది. తమ కష్టాలు తీర్చడానికి దేవుడే మా వాడకొచ్చిండంటూ ఆనందపరవ శులయ్యారు. ఇది దళిత జనహిత ప్రభుత్వమనే సందేశం వాసాల మర్రికే కాదు, యావత్‍ తెలంగాణలోని దళితులందరికీ చేరింది.


దళిత బంధును స్వాగతిద్దాం
‘దళిత బంధు’ పథకం సాధ్యాసాధ్యాల మీద అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. హుజూరాబాద్‍ ఎన్నిక తర్వాత అంతా హుష్‍కాకి అనే పెదవి విరుపులూ ఉన్నాయి. విమర్శల సంగతి ఏమైనా దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక మద్దతును ఇస్తామని కేసీఆర్‍ చేసిన ప్రకటన దానికదే ఒక పెద్ద సాహసం. దళితుల అభివృద్ధిలో ప్రతిపాదిస్తున్న నూతన ప్రమాణం.
గత ప్రభుత్వాలు దళితులకు స్వయం ఉపాధి కోసం ఏదో రూపాయి, అర్ధా ఇచ్చి సరిపెట్టుకొమ్మని చెప్పినవే. దళిత ఉద్యమకారులు కూడా 10 లక్షల పెద్ద మొత్తాన్ని ఎప్పుడూ డిమాండ్‍ చేయలేదు. కానీ కేసీఆర్‍ దళితులకు అందవలసిన సహాయానికి సంబంధించి ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‍కు మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాల్సిందే. సుదీర్ఘ రాజకీయానుభవం, తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరం చేర్చిన ఘన చరిత్ర ఉన్న కేసీఆర్‍ అంత అలవోకగా ‘దళిత బంధు’ వంటి పథకాన్ని ప్రకటిస్తారా? గతంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు కొన్ని నిలుపుకోలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. నిలుపుకొన్నవి చాలా ఉన్నాయి కదా. వాటినీ చూడాలి కదా. బడ్జెట్‍లో సింహభాగం పేద వర్గాల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నమాట నిజం కాదా?
ఎన్నికల ప్రయోజనం కోసమైనా పేదలు, రైతులు, దళితులు, ఆదివాసులు, మహిళల కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగిన పథకం ఉందా? కార్పొరేట్లకు చేసిన మేలు మాత్రం అనేక రూపాల్లో కనిపిస్తున్నది.


తెలంగాణ ప్రభుత్వం ఎజెండా ఇందుకు పూర్తిగా భిన్నం. పేదల సంక్షేమమే కేసీఆర్‍ ఎజెండా. ఎన్నెన్ని పథకాలు? ఒకటా రెండా? దాదాపు యాభై సంక్షేమ పథకాలు యాభై వేల కోట్ల వ్యయంతో అమలవుతున్నాయి. రైతుబంధు, రైతు బీమా పథకాల వల్లనైతేనేమి, 24 గంటల ఉచిత కరెంటు వల్లనైతేనేమి, ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపటం వల్లనైతేనేమి, వ్యవసాయంలో ఫలసాయం పెరిగింది. రాష్ట్ర జీడీపీలో 20 శాతం ఆదాయం వ్యవసాయం నుంచి రావటం నిజం గా గొప్ప మార్పు. ఈ సానుకూలతను చూసేందుకు నిరాకరిస్తే విజ్ఞత ఎలా అవుతుంది? పార్టీ కార్యకర్తల జేబులు నింపేందుకు సీసీ రోడ్లు తప్ప గ్రామాల్లో ఇతర మౌలిక సదుపాయాల గురించి గత ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలా ఉందా?


సంక్షేమ పథకాల వరుసలో సామాజిక వేదిక మీద ఇప్పుడు దళితబంధు వచ్చి నిలిచింది. ఉదాత్త ఆశయంతో, ఉన్నత లక్ష్యంతో, ఉత్తమమైన ప్రతిపాదనలతో నిండిన పథకం తెలంగాణ ‘దళిత బంధు’. ప్రజలను ప్రేమించేవారు ముందు ఈ ఆలోచనను బలపరచాలి. అణగారిన జాతికి అధిక మొత్తాన్నివ్వాలని, స్వశక్తితో స్వాభిమానంతో వారిని నిలబడేలా చేయాలనే ప్రభుత్వ తలంపునకు స్వాగతం పలకాలి. ‘ఆరంభింపరు నీచమానవులు’ అనే భర్త•హరి సుభాషితాన్ని పదేపదే
ఉదహరించే కేసీఆర్‍ తన ధీరోదాత్తతను తానే ఇప్పుడు కాలపరీక్షకు నిలిపారు. వేచి చూడాలి కదా.


రెండవసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత, ఐదేండ్ల పరిపాలనా కాలం మధ్య దశలో ‘దళిత బంధు’ను ప్రవేశపెడుతూ కేసీఆర్‍ సాహసాన్ని చేస్తున్నారు. రాబోయేరోజుల్లో జనం ముందు అగ్నిపరీక్షకు నిలబడవలసి ఉంటుందని కేసీఆర్‍కు తెలియదా? తప్పకుండా తెలుసు. భారీ వ్యయంతో కూడిన ‘దళిత బంధు’ పథకాన్ని పూర్వాపరాలు విచారించకుండా, తగిన సన్నద్ధత లేకుండా ప్రవేశపెట్టారని ఎవరైనా అనుకుంటే అది వారి అమాయకత్వమైనా కావాలి, లేదా యాంత్రికమైన వ్యతిరేకతైనా కావాలి.
ప్రభుత్వానికి ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్మాణం కోసం పెడుతున్న వ్యయం తగ్గింది. ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నారు. ఆదాయాన్ని పెంచుకునే మరిన్ని కొత్త మార్గాలేవో కేసీఆర్‍ ఆలోచనల్లో ఉండే ఉంటాయి. ఆ నిధులను దళితులకు పంచుదామని ఆయన ఆలోచిస్తే అంతకన్నా కావలసిందేముంది? స్వాగతించాల్సిందే.


దళిత కుటుంబాల్లో ‘దళిత బంధు’ చర్చ జోరుగా సాగుతున్నది. హుజూరాబాద్‍ దళిత కుటుంబాల్లో మంచి బతుకుకు సంబంధించిన ఆశలు మోసులెత్తుతున్నాయి. తామొక మంచి ఉపాధిని ఎంచుకునే వరం తమకు లభించబోతున్నదనే సంతోషం వారిలో కనిపిస్తున్నది. ట్రాక్టర్‍ కొనుక్కుంటామని, హార్వెస్టర్‍ కొనుక్కుంటామని, మెడికల్‍ షాప్‍ పెట్టుకుంటామని రకరకాల యోచనలు చేసుకుంటున్నారు. ప్రగతిభవన్‍లో జరిగిన వర్క్షాప్‍లో ఇచ్చిన వివిధ ఉపాధి మార్గాల పట్టికను అందరూ ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. తెలంగాణ దళితబంధు విశాలదృష్టితో ప్రవేశపెడుతున్న విలక్షణ పథకం. 10 లక్షల గ్రాంటు ద్వారా లబ్ధిదారుడు నికరంగా మంచి ఆదాయం పొందడానికి వీలైన యూనిట్‍ ప్రారంభించుకోవచ్చు. చాలా సంతృప్తికరమైన స్థాయి పెట్టుబడి అని చెప్పవచ్చు. లబ్ధిదారులు కొంతమంది సమూహంగా కూడితే చిన్న లేక మధ్యతరహా పరిశ్రమనే పెట్టుకోవచ్చు. ఉపాధిమార్గాల అన్వేషణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఉపాధి ఎంపికలో లబ్ధిదారులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. తిరిగి చెల్లించాలీ, కిస్తీలు కట్టాలనే భయం లేదు. బాకీ కట్టాలనే రంది లేదు. కాబట్టి వచ్చిన ఆదాయం సంపూర్ణంగా వినియోగించుకోవచ్చు. యూనిట్‍ విజయవంతం కావటానికి ప్రభుత్వం పర్యవేక్షణ, మార్గదర్శనం ఉంటాయి. తన యూనిట్‍కు సంబంధించిన ప్రభుత్వ శాఖ ఆ బాధ్యత తీసుకుంటుంది. వివిధ శాఖలతో గ్రామ, మండల, జిల్ల్లా, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆపద వస్తే ఆదుకునే ‘దళిత రక్షణ నిధి’ అదనపు బలం చేకూరుస్తుంది. దళితవాడల్లో మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. దళితుల మీది కేసుల ఎత్తివేత విషయాన్ని పరిశీలిస్తున్నది. అణగారిన జాతిలో ధైర్యం నింపే అన్ని అంశాలూ ‘దళిత బంధు’లో ఉన్నాయి.


అందరికీ సమానహక్కులు, ప్రతిపత్తి కలిగించటమనేది గొప్ప సామాజిక, ఆర్థిక రాజకీయ కృషి. భారత రాజ్యాంగ లక్ష్యం కూడా అదే. దళితుల కోసం ప్రత్యేక ఆవాస విద్యాలయాల స్థాపన, మార్కెట్‍ కమిటీల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం, ఎస్సీ ప్రగతినిధి చట్టం వంటి చర్యలతో దళితుల సామాజిక వికాసం దిశగా తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగులు బలంగా వేసింది. రాజ్యాంగం ప్రవచించిన విలువల సాధనలో ‘దళిత బంధు’ ద్వారా నేడు నూతన ప్రమాణాలను ప్రతిపాదిస్తున్నది.
సామాజిక, ఆర్థిక, న్యాయ సాధనలో ప్రభుత్వం తన బాధ్యతలను, కర్తవ్యాలను గుర్తించటంలోనే సగం విజయం ఇప్పటికే సాధించింది. సమాజాన్ని మరింత నాగరికంగా మార్చే ప్రతి చర్య ఆహ్వానించదగినదే. పథకం సాఫల్య వైఫల్యాలను ప్రతిపక్షం చర్చించాలి కానీ, పురిట్లోనే సంధి కొట్టాలనే దురాలోచన మానుకోవాలి. అమంగళం ప్రతిహతమవుగాక. తెలంగాణ ‘దళిత బంధు’ను రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసి టీఆర్‍ఎస్‍ ప్రభుత్వం సంపూర్ణ విజయాన్ని పొందాలని ఆకాంక్షిద్దాం. బహుజన హితాయ.. బహుజన సుఖాయ..


‘వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు’ తమ రెక్కల కష్టం సైతం తమది కాకుండా పోతున్న దళితజాతి పరివేదనను పలికించిన పద్య పాదం ఇది. మహాకవి జాషువా కమనీయలేఖిని కార్చిన కన్నీటి బిందువు ఇది. పరిశుద్ధికి, పరిశ్రమకు పెట్టని కోటలు దళితవాడలు. చచ్చిన పశువుల చర్మం తీసి డప్పును, చెప్పును మలిచిన కళావేత్తలు. మోట నీటిని చేలకు పారించే తొండం బొక్కెన కనుగొన్న శాస్త్రవేత్తలు దళితబిడ్డలు. అమృతోత్సవ స్వాతంత్య్రం సాక్షిగా అర్ధాకలితో అలమటిస్తున్న అర్ధ బానిసలు దళితబిడ్డలు. నేటికీ కైకిలి కోసం తండ్లాడే కూలిబిడ్డలు, యంత్రభూతముల కోరలు తోమే కార్మికన్నలు అంతా దళితజాతి బిడ్డలే. వారి చెమట బిందువులే గాదెల్లో నిండిన ధాన్యపు గింజలు, వారి నెత్తురు మాంసాలే కండ్లు మిరుమిట్లు గొలిపే మహా సంపదలు.
ప్రజాస్వామ్యానికి మరోపేరు సమానత్వం. అణగారిన జాతుల వారికి సమానత్వం అందని మావిఫలం. ఆ అగాధాన్ని పూడ్చటం కన్నా మించిన కర్తవ్యం ప్రజాస్వామిక ప్రభుత్వాలకు వేరొకటి ఉండదు. ‘పొదల పొదల గట్ల నడుమ పొడిచేనమ్మ చందామామ’ అన్నట్లు దళితజాతికి తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన విశ్వాసాన్ని ఇస్తున్నది. నమ్మకం కోల్పోయిన జాతిలో ఒక కొత్త ఆశారేఖను ఉదయింపజేస్తున్నది.


ఉన్న ఊర్లోనే ఉన్నతంగా..
తెలంగాణలో 19వ శతాబ్దం మొదట్లో దళితత్రయంగా పిలుచుకునే భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బి.ఎస్‍.వెంకట్రావు లాంటివారు దళిత సాధికారత కోసం కృషిచేసినట్లు చరిత్ర మనకు చెప్తున్నది. అంటరానితనం వంటి తీవ్ర వివక్షతలున్న ఆ రోజుల్లోనే వీళ్లు ధైర్యంతో దళితుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అదే ధైర్యం, అదే తెగువతో నేడు దళితుల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ‘దళితబంధు పథకం’ ద్వారా చేస్తున్న ప్రయత్నం ఎన్నదగి నది. ఈ పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్‍ పేరు చరిత్రలో నిలిచి పోతుంది.
ఆర్యుల కాలం నుంచి నేటిదాకా దళిత వర్గం వివక్షకు, వెనుకబాటుతనానికి గురవుతూనే ఉన్నది. స్వాతంత్య్ర సమరంలో దళితులపై వివక్ష చూపించరాదన్న భావనతో మహాత్మా గాంధీ ఉద్యమంలో వారిని భాగస్వాములను చేశారు. దళిత సమాజం ఎదుర్కొంటున్న వివక్షను డాక్టర్‍ బాబాసాహెబ్‍ అంబేద్కర్‍ వివరించారు. దళితులు వివక్షకు గురికాకూడదని రాజ్యాంగంలో కొన్ని హక్కులతో పాటు, ప్రత్యేక నిబంధనలను తీసుకువచ్చారు. దళితుల విద్య, ఆర్థిక సాధికారతకు అన్ని ప్రభుత్వాలు కృషిచేయాలని రాజ్యాంగంలోని అధికరణం-46 చెప్తున్నది. అధికరణలు 15, 16, 17 అంటరానితనం, విద్య రిజర్వేషన్లు వంటి అంశాలను తెలియ పరుస్తున్నాయి. చట్టసభల్లో దళిత నేతలకు ప్రాతినిధ్యం కల్పించడం కోసం రిజర్వేషన్లను అమలుచేశారు.


రాజ్యాంగంలో దళితుల అభ్యున్నతిపై అనేక అంశాలున్న ప్పటికీ గత ప్రభుత్వాలు వీటిపై చిత్తశుద్ధి చూపలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని దళిత సమాజం అణగారిన వర్గంగానే ఉండిపోయింది. విద్య, వైద్యం, ఉపాధి లాంటివి సాధికారత మీదే ముడిపడి ఉంటాయి. ఎన్ని పథకాలు వచ్చినప్పటికీ దళిత సామాజిక వర్గం అభివ•ద్ధి సాధించలేకపోయింది. ‘నేషనల్‍ క్రైమ్‍ కంట్రోల్‍ బ్యూరో’ ప్రకారం సుమారు 22 శాతం దళితులపై నేరారోపణలు, హత్యలు, స్త్రీలపై అఘాయిత్యాలు పెరిగాయి. ‘ప్రథం’ అనే స్వచ్ఛంద సంస్థ వార్షిక నివేదిక దళితుల్లో ఎక్కువ శాతం బాలబాలికలు అర్ధాంతరంగా విద్యను నిలిపివేస్తున్నారని వెల్లడించింది. 10-12 శాతం మంది మాత్రమే ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తున్నారని అభివృద్ధి నివేదికలు చెప్తున్నాయి.
దళితుల్లో అత్యంత అణగారిన వర్గాలు, ఆశ్రిత కులాలు ఎక్కువ. కులాల రిజిస్ట్రేషన్లలో వారిని చేర్చనందువల్ల చాలామంది రిజర్వేషన్లు కూడా పొందలేకపోతున్నారు. సంక్షేమ పథకాల్లో అనర్హులుగా మిగిలి పోతున్నారు. ఈ నేపథ్యంలోనే అందరి సంక్షేమం, అభివృద్ధి కోసం తెచ్చిందే ‘దళిత బంధు’ పథకం.


రాష్ట్రంలోని 54 లక్షల మంది దళితుల బాగుకోసం విద్య, వైద్యం, ఉపాధిని స్వతహాగా అభివృద్ధి చేసుకునేవిధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రతి నియోజక వర్గంలో అర్హులైన వంద మందికి రూ.10 లక్షల నగదు తమ సొంత బ్యాంకు ఖాతాలో నేరుగా జమవుతాయి. ఈ పథకం ద్వారా ప్రభుత్వం చేసే ఆర్థికసాయం పూర్తిగా ఉచితం. ఇది అప్పు కాదు. దళారుల ప్రమేయం ఉండదు. ఈ డబ్బుతో వివిధ చిన్న, మధ్యతరహా వ్యాపార రంగాలకు పెట్టుబడి పెట్టడం వల్ల వారి జీవితాల్లో నమ్మకం, భద్రత ఏర్పడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే అన్నిరకాల విముక్తి లభిస్తుంది. దళితులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కులవ•త్తులకు సంబంధించిన వ్యాపారాలూ ప్రారంభించవచ్చు. సాధికారతే లక్ష్యంగా, ఉన్న ఊర్లోనే ఉన్నతంగా ఎదిగేందుకు దళితబంధు పథకం తోడ్పడుతుంది. దళిత సాధికారతతో పాటు దళితుల రక్షణ నిధిని కూడా ప్రభుత్వం ప్రకటించడం ‘దళిత బంధు’ లో ఉన్న మరొక గొప్ప విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాలు ‘దళిత బంధు’ లాంటి పథకాలు తీసుకువస్తే గత ఏడు దశాబ్దాల్లో సాధించని దళితుల సాధికారత, అభివృద్ధిని కొద్ది కాలంలోనే సాధించే అవకాశం
ఉంటుంది.


పేదరికం రూపుమాపే దళిత బంధు పథకం
దళిత జాతి పేదరికం రూపుమాపాలని ప్రవేశ పెడుతున్న తెలంగాణా దళితబంధు పథకానికి రాష్ట్ర క్యాబినెట్‍ ముక్త కంఠంతో ఆమోద ముద్ర వేసింది. దళిత జాతి కష్టాలు తీర్చడానికి ప్రవేశ పెడుతున్న తెలంగాణ దళితబంధు పథకం అమలుకు సంబంధించి మంత్రివర్గ సభ్యులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా దళితబందు పథకానికి చట్టబద్దత కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టం తీసుకు రావాలని క్యాబినెట్‍ అభిప్రాయ పడింది. గతం లో ఎస్సి ప్రగతి నిధి చట్టం తెచ్చి, ఒక వార్షిక బడ్జెట్‍ లో దళితులకు కేటాయించిన నిధులలో మిగిలిన నిధులను తరువాతి వార్షిక బడ్జెట్‍ కు బదలాయించే విధానం తీసుకొచ్చామన్నారు. ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, అదే విధంగా దళిత బందు కూడా దేశానికి దారి చూపే పథకం అవుతుందనీ క్యాబినెట్‍ అభిప్రాయ పడింది.


రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీన స్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో ఇరవై శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో ఉన్న సాగుభూమి కేవలం పదమూడు లక్షల ఎకరాలేనని దళితుల పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని.. ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్తితుల్లో దళితులూ ఉన్నారని ముఖ్యమ్నంత్రి అన్నారు.
దళితుల అభివృద్ధి, అరకొర సహాయాలతో సాధ్యం కాదని, అందుకే దళితబంధులో ఒక యూనిట్‍ పెట్టుకోవడానికి పదిలక్షల రూపాయల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం అన్నారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆదాయంలో ఆర్థిక స్థితిలో మెరుగుదల రాదని ముఖ్యమంత్రి తెలియ జేశారు. లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెద్ద పెట్టుబడితో పెద్ద యూనిట్‍ పెట్టుకునే అవకాశాన్ని దళితబందు పథకం ద్వారా కల్పించాలనే ముఖ్యమంత్రి నిర్ణయానికి కేబినెట్‍ ఆమోదం తెలిపింది. ఉపాధి,వ్యాపార మార్గాన్ని ఎంచుకునే స్వేచ్చ లబ్దిదారులదే అని, ప్రభుత్వం అధికారులు, దళిత బంధు స్వచ్చంద కార్యకర్తలూ ఈ దిశగా మార్గదర్శనం చేస్తారని, అవగాహన కల్పిస్తారని ముఖ్యమంత్రి అన్నారు.


లబ్ధి దారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ శిక్షణ అవగాహన కల్పించాలని క్యాబినెట్‍ అభిప్రాయ పడ్డది. శిక్షణ, పర్యవేక్షణ కోసం గ్రామస్థాయి నుంచీ రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటుచేయాలని క్యాబినెట్‍ నిర్ణయించింది. అమలులో జిల్లా కలెక్టర్‍, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని ముఖ్యమంతి అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతిజిల్లాలో ‘సెంటర్‍ ఫర్‍ దళిత్‍ ఎంటర్‍ ప్రైజ్‍’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.


యూనిట్‍ పెట్టగానే ప్రభుత్వ బాధ్యత తీరిపోదని యూనిట్‍ సరిగ్గా నడుస్తుందా లేదా అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించడం కూడా ముఖ్యమని క్యాబినెట్‍ తీర్మానించింది. దళితబంధు పథకం అమలుకు పటిష్టమైన యంత్రాంగం అవసరం అనీ వివిధ శాఖలలో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావును కేబినెట్‍ ఆదేశించింది. దళిత బంధు ద్వారా ఎవరికైతే లబ్ది చేకూరుస్తారో వారికి అందజేసే ఒక ప్రత్యెక కార్డు నమూనాలను క్యాబినెట్‍ పరిశీలించింది. ఈ కార్డు ఆన్లైన్‍ అనుసంధానం చేసి లబ్దిదారుని పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. దళిత వాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా అన్ని హంగులూ దళిత వాడలకు ఏర్పడాలని, ఇందుకు నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. (మరింత సోర్స్ : ఇంటర్నెట్‍)

  • కట్టా ప్రభాకర్‍, ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *