ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు నడుం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం


ఏ దేశ సుస్థిర ఆర్థిక వ్యవస్థకైనా ఆయా దేశాల్లోని ప్రభుత్వరంగ సంస్థలు దోహదం చేస్తాయి. డిమాండ్‍కు తగ్గ ఉత్పత్తి, తక్కువ ధరలకు ప్రజలందరికీ అందుబాటులో ఉండటం, వచ్చే ఆదాయం ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలకు వినియోగించడం, మిగులు ఆదాయాన్ని మళ్లీ అదే సంస్థలకు పెట్టుబడిగా మార్చడం వల్ల ఒకే సమయంలో ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు భరోసా ఏర్పడుతుంది. విదేశీ సంస్థలకు, స్వదేశీ ప్రైవేట్‍ సంస్థలకు ప్రభుత్వాలు, ప్రజలు పరాధీనత చెందకుండా నివారిస్తాయి. అటువంటి ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ ప్రభుత్వాల, ప్రజల బాధ్యత. స్వాతంత్య్రానంతరం ఏర్పాటు చేసుకున్న అనేక కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలు, సంస్థలు రానురాను నిర్వీర్యం చేయబడి ప్రైవేట్‍ సంస్థల పరమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలకు భిన్నంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.


మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తెలంగాణ ఉండాలనేది కేసీఆర్‍ ఆకాంక్ష. భదాద్రి, పాల్వంచ, యాదాద్రి, థర్మల్‍ ప్రాజెక్టుల ద్వారా 5,880 మెగావాట్లు ఉత్పత్తికి ప్రణాళికలు వేసారు. ఈ పనులను తమకు అప్పగించాలని అనేక ప్రముఖ ప్రైవేటు సంస్థలు అడిగాయి. ఒత్తిడి తెచ్చాయి. కానీ కేసీఆర్‍ అంగీకరించలేదు. మన ప్రభుత్వరంగ సంస్థలను ప్రోత్సహించి, కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని భావించిన తెలంగాణ ముఖ్యమంత్రి బిహెచ్‍ఇఎల్‍కు 35వేల కోట్ల రూపాయల పనులను అప్పగించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా వున్న వివిధ భెల్‍ సంస్థలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ చర్య సామాన్యమైనదిగా కనిపించవచ్చుగాని యిది వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ దళితుల సామాజిక జీవన విధానంలో వినూత్న మార్పులు తెచ్చే దారిదీపం. గ్రామీణ తెలంగాణ దళితుల ఆర్థిక సుస్థిరతకు భరోసా. కేవలం 10 లక్షల రూపాయలు యిచ్చి ఊరుకోవడం కాదు. మినీ డెయిరీ ప్లాంట్లు, కూరగాయలసాగు, వరినాట్లు యంత్రాలు, ఆటో మొబైల్స్ వంటి వివిధ 30 రకాల వ్యాపార, ఉపాధి కార్యకలాపాలలో భాగస్వాములను చేయడం ద్వారా వారిలో వ్యాపార, వృత్తి నైపుణ్యాలను పెంచి తద్వారా దేశంలోనే దళితులకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక అస్తిత్వానికి పునాది వేస్తుంది.


ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం తెలంగాణ వారసత్వ ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తూనే ఉంది. దీనిలో భాగంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా హెరిటేజ్‍ తెలంగాణ బిల్లును క్యాబినెట్‍ ఆమోదంతో ‘తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్‍ అథారిటీని’ ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‍ కుమార్‍ అధ్యక్షతన జరిగిన మొదటి సమావేశం జంటనగరాల్లోని 26 రక్షిత స్మారక చిహ్నాల సంక్షిప్త స్టేటస్‍ నోట్‍, ఫొటోలతో సహా తయారు చేయాలని, తదుపరి చర్యల కోసం నివేదిక, ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామంలోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) దేవాలయ అభివృద్ధి కోసం ఇంటిగ్రేటెడ్‍ కన్వర్జేషన్‍ అండ్‍ మేనేజ్‍మెంట్‍ ప్లాన్‍ తయారు చేయాలని నిర్ణయించడం హర్షణీయం. రాష్ట్ర వ్యాప్తంగా వారసత్వ కట్టడాల సంపద పరిరక్షణ, పునరుద్దరణ కోసం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, జిహెచ్‍ఎంసీ స్థాయిలో మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం. ఈ కమిటీలు తమ తమ పరిధిలోని వారసత్వ కట్టడాల పరిరక్షణకు విజయవంతమైన కృషిని చేస్తాయని ఆశిద్దాం.


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *