మార్జాల రాజు


అనగనగా ఒక ఊళ్లో గొల్లవాడి ఇంట్లో ఒక పిల్లి ఉండేది. పాలు, పెరుగు తాగి వెన్న మెక్కి ఆ పిల్లి పిప్పళ్ళ బస్తాలా తయారయింది. దాన్ని చూస్తే మిగతా పిల్లులకు వెన్నెముకలో వణుకు పుట్టుకొచ్చి ఆమడదూరం పారిపోయేవి. దాంతో పిప్పళ్ళ బస్తా లాంటి పిల్లికి కళ్లు నెత్తిమీది కొచ్చాయి. తన పేరు మార్జాల రాజుగా మార్చేసుకొంది. మిగతా పిల్లులతో మాట్లాడటం తనకు తలవంపులుగా భావించేది.
ఒకనాడు మార్జాలరాజు ఒక కాయితం, కలం తీసుకొని అడవిలోకి వెళ్ళింది. దానికి అక్కడ మూడు పులి పిల్లలు కనిపించాయి. వాటిని చూస్తూనే మీరు ఇంకా అద్దె ఎందుకు కట్టలేదు? అని దబాయించింది. కాయితాన్ని, కలాన్ని చూసిన ఆ పులి పిల్లలు హడలిపోయాయి. అవి ఒక్క దూకులో తమ తల్లి దగ్గరకు పరిగెత్తాయి.
పులి తల్లి కంగారుపడుతూ వచ్చింది. వస్తూనే ‘మేము అడవిలో బతికే జీవాలం. అడవిలోకి వచ్చిన వాళ్ళను చంపి తినడమే గానీ, అద్దె కట్టడం యెరగం. ఇంతకీ మీరెవరు? ఎక్కడ నుంచి వచ్చారు?’ అంది.


‘నేను మార్జాల రాజును, మార్జాల చక్రవర్తి బంటును. అడవిలో ఉంటున్నందుకు మీరు అద్దె కట్టి తీరాలి’. ‘ఆడదాన్ని, నాకేం తెలుస్తాయి చెప్పండి ఇలాంటి విషయాలు. కాసేపయితే మా ఆయన వస్తారు. అలా కూచోండి’ అంది పులి తల్లి.


మార్జాల రాజు ఓ చెట్టుకింద ఠీవిగా కాలుమీద కాలు వేసుకొని కూర్చుంది. పులి తల్లి దాని పిల్లలు వాటి గుహలోకి వెళ్లిపోయాయి. అవి వెళ్ళిన కాసేపటికి పులి రానే వచ్చింది. భీకరంగా ఉన్న పులిని చూసేసరికి మార్జాలరాజు భయంతో గుడ్లు తేలవేసింది. కానీ వెంటనే తేరుకుంది. కాయితం, కలం గాలికి వదిలేసి ఒక్క గెంతులో చెట్టు ఎక్కి చిటారు కొమ్మన కూర్చుంది.


‘ఎక్కడ? మనని అద్దె అడిగిన ఆ వదరుబోతు ఎక్కడ? వాడిని ఇక్కడే నరికి పోగులు పెడతా అంటూ.. పిల్లి కనిపించడంతో పళ్లు పటపట కొరుకుతూ దాన్ని పట్టుకోవాలని పులి పై పైకి ఎగర సాగింది. అలా ఎగురుతున్న దాని మెడ చెట్టు కొమ్మలో యిరుక్కొని విరిగి పోయింది. దాంతో అది చచ్చి నేలమీద కూలింది. వెంటనే మార్జాలరాజు చెట్టు దిగి వచ్చి చచ్చిన పులి మొహంమీద నాలుగు గాట్లు పెట్టింది. తరవాత పులి తల్లిని పిలిచింది. పులి తల్లి, దాని వెనక పిల్లలు వచ్చాయి. పులి తల్లిని చూస్తూ ‘మీ ఆయన నామీదకే కాలు దువ్వాడు. చూశావా ఏం జరిగిందో. రెండు దెబ్బలతో మట్టి కరిపించాను. నాకు ఎవరు ఎదురు తిరిగినా ఇదే గతి పడుతుంది! అంది’.


‘మమ్మల్ని చంపకండి. జీవితాంతం మీకు సేవ చేసుకుంటూ మీ పాదాల దగ్గర పడి ఉంటాం’ అని పులి తల్లీ, దాని పిల్లలూ మార్జాలరాజు కాళ్లావేళ్లా పడ్డాయి.
‘అలాగే. ఏదో మొగదిక్కు లేని దానివని నిన్నూ, తండ్రిలేని పిల్లలని వాటినీ జాలిదలచి వదిలేస్తున్నాను. నాకు ఏలోటూ రాకుండా చూడండి. మీ ప్రాణాలకు ఢోకాలేదు అన్నది మార్జాలరాజు. ఆ రోజు నుండి మార్జాలరాజు పులి పిల్లలమీద సవారి చేస్తూ అడవంతా తిరిగేది. అవి వేటాడి తెచ్చిన జంతువులను కమ్మగా భోంచేస్తూ, కంటినిండా నిద్ర పోయేది. క్రమంగా మార్జాల రాజు తాను పిల్లిననే సంగతి మరిచిపోయింది. తన బలానికి ఎదురు లేదని దానికో గుడ్డి నమ్మకం ఏర్పడింది.
ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు పులి తల్లి మార్జాలరాజుతో ఇలా అంది. ‘మార్జాల రాజా! ఈ అడవిలో పెద్ద జంతువులు దొరకటం లేదు. నదికి ఆవైపున దట్టమైన అడవి ఉంది. అక్కడ పెద్ద పెద్ద జంతువులున్నాయి. మనం అక్కడికి వెడదాం!’


‘అలాగే’ అంటూ మార్జాలరాజు ఒక పులిపిల్ల వీపు మీదికి ఎగిరి కూర్చుంది. అవి అన్నీ నదిని దాటాయి. అది నిజంగా కాకులు దూరని కారడి. కన్ను పొడుచుకున్నా దారి కనిపించలేదు. ‘మీరు ఇక్కడే ఉండండి. నేను అలా వెళ్ళి కాస్త విశ్రమించడానికి ఎక్కడన్నా జాగా ఉందేమో చూసి వస్తాను’ అని మార్జాలరాజు కొంచెం అవతలికి వెళ్ళి బాగా ఎత్తుగా ఉన్న ఒక మర్రి చెట్టు ఎక్కింది. చిటారు కొమ్మనుంచి చ్తూ దానికి, దూరంగా చెట్టూ చేమా పెద్దగాలేని ప్రాంతం కనిపించింది. వెంటనే చెట్టు దిగి వెళ్ళింది. చచ్చిన దున్న పోతు మొహంమీద అక్కడక్కడా కొరికింది. తరవాత పులి తల్లి, దాని పిల్లలు ఉన్న చోటుకు వెళ్ళి ‘ఇక్కడికి దగ్గరలో ఓ దున్నపోతును చంపాను. మీరు వెళ్ళి దానిని తీసుకురండి’ అంది.


ఆ దున్నపోతును లాక్కొచ్చేటప్పటికి పులికి, దాని పిల్లలకు తల ప్రాణం తోకకు వచ్చింది. అంత పెద్ద దున్నపోతును ఇట్టే చంపిన మార్జాలరాజు బలం తలుచుకొని అవి ఆశ్చర్య పోయాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ‘అడవి నిండా ఏనుగులు, ఖడ్గ మృగాలు, నీటి గుర్రాలు ఉన్నాయి. వాటిని చంపుదాం. ఏనుగు మాంసం తిని ఎన్నో రోజులయింది’ అన్నాయి మార్జాలరాజుతో పులి తల్లి, దాని పిల్లలు.
‘అలాగే’ అంది మార్జాలరాజు అదేమంత పెద్ద పనికాదు అన్నట్టు. ‘మీరు వాటిని ఊదరగొడితే మేం చంపుతాం. లేక మేం ఊదరగొడితే మీరు చంపండి. మీకు ఎలా ఇష్టమైతే అలాగే చేద్దాం’.


‘అంత పెద్ద జంతువుల్ని మీ మొహం మీరేం చంపుతారు. మీరు ఊదరగొట్టండి. నేను చిటికెలో చంపుతాను’ అంది మార్జాలరాజు.
పులి తల్లి, దాని పిల్లలు జంతువుల్ని ఊదరగొట్టటానికి వెళ్ళిపోయాయి. అక్కడి నుంచి తొందరగా జారుకుంటేనే గాని తన ప్రాణాలు దక్కవు అని మార్జాల రాజు గ్రహించింది. అది అలా ఆలోచనలలో మునిగి ఉండగానే పులీ దాని పిల్లలూ ఊదరగొట్టిన జంతువులు ప్రాణభీతితో పరుగెత్తుకు రాసాగాయి. మార్జాలరాజుకు ఎదురుగా ముళ్ళన్నీ విరబోసుకొని వస్తున్న ఓ ముళ్ళపంది కనిపించింది. దాన్ని తప్పించుకోవడానికి మార్జాలరాజు పక్కనే ఉన్న ఒక పొదలో దూరింది. సరిగ్గా ఆ సమయానికే అటు పరిగెడుతూ వచ్చిన ఏనుగు కాలు దానిమీద పడింది. దాని పక్కటెముకలు పటపటా విరిగాయి.


కాసేపయిన తరవాత పులి తల్లి, దాని పిల్లలు మార్జాలరాజు చంపిన జంతువులను తిందామని లొట్టలేసుకుంటూ అటు వచ్చాయి. ఎముకలు నుగ్గు నుగ్గయి కొన ఊపిరితో ఉన్న మార్జాల రాజును చూడగానే వాటికి ఏడుపు ముంచుకు వచ్చింది. ‘మార్జాల రాజా! ఏమిటి ఇలా అయింది?’ అన్నాయి.
‘ఏం చెయ్యమంటారు? మీరు మరీ ఇంత చిన్న జంతువులను ఊదరగొడతారనుకోలేదు. నా వైపు వచ్చిన ఈ నలుసులాంటి జంతువులను చూడగానే వీటినా నేను చంపేది అనుకున్నాను! అంతే నాకు ఆపులోని నవ్వు వచ్చింది. పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వాను. ఫలితం చూశారుగా. ఎముకలన్నీ విరిగాయి’ అని భేషజం ఒలకబోస్తూ మార్జాలరాజు చచ్చిపోయింది.

  • హేమలత
    (ఫిబ్రవరి 1991 బాలచెలిమి)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *