పిట్టకొంచెం-కూత ఘనం @ డ్రోన్‍ టెక్నాలజీ


గత జూన్‍లో జమ్మూకాశ్మీర్‍లోని భారత వైమానిక స్థావరంపై తొలిసారిగా డ్రోన్లతో దాడి జరిగింది. వైమానిక స్థావరంలోని, యుద్ధవిమానాలే లక్ష్యంగా రెండు డ్రోన్లు ప్రేలుడు పదార్థాల (ఐఈడీ)ను జారవిడిచాయి. అయితే స్వల్ప నష్టం మినహా, యుద్ధవిమానాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. గతంలో చాటుగా సైన్యంపై కాల్పులు, ఆత్మాహుతి దాడులు, మందుపాతర్లను పేల్చడం లాంటి సంఘటనలు జమ్మూకాశ్మీర్‍లో జరిగాయి కానీ, డ్రోన్లతో దాడి జరగడం ఇదే తొలిసారని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అధిక ఖర్చు, ఎక్కువ ఎత్తులో ఎగిరే యుద్ధ విమానాల కన్నా నామమాత్రపు నిర్వహణా వ్యయంతో, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్ల ద్వారా సులువుగా తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునన్నది శత్రుదేశాల వ్యూహంగా, ఈ సంఘటన జరిగిన తీరును బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డ్రోన్లు, వాటి యొక్క పనితీరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


డ్రోన్‍ టెక్నాలజీ అంటే
వాహనచోదకుడు (పైలట్‍), ప్రయాణీకులు లేకుండా గాలిలో వాహనాన్ని ఎగిరించగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని డ్రోన్‍ టెక్నాలజీ అని, ఆ వాహనాన్ని మానవ రహిత వైమానిక వాహనం (Unmanned Aerial Vehicle – UAV) లేదా ‘డ్రోన్‍’ అని పిలుస్తారు. మానవ రహిత వైమానిక విధానం (Unmanned air craft system)లో మానవ రహిత వైమానిక వాహనాలు (UAVs) ఒక భాగం. వీటిని భూమి మీద నుండి నియంత్రించేందుకు వీలుగా ఒక నియంత్రణా పరికరం (•శీఅ•తీశీశ్రీశ్రీవతీ) మరియు సమాచార వ్యవస్థ (System of communication) ఉంటాయి.


మానవ రహిత వైమానిక వాహనాల (UAVs)కు ‘డ్రోన్‍’ అన్న పేరు ఎలా వచ్చిందన్న విషయాన్ని పరిశీలించినట్లయితే – డ్రోన్‍ అనగా ఆంగ్లంలో మగతేనెటీగలు (Male Honey bees). ఇవి తేనె పట్టులోని కూలి ఈగల (worker bees) కన్నా పరిణామంలో పెద్దవి. మగ తేనెటీగలు రాణి ఈగతో ప్రత్యుత్పత్తి పక్రియలో పాల్గొనడం తప్ప ఇతర విధులైన తేనెను సమీకరించడం, తేనె పట్టును సంరక్షించడం వంటి ఎలాంటి పనులు నిర్వర్తించకుండా, తేనెపట్టు కింది భాగంలో గుమికూడి ఉంటాయి. ఇవి మతిస్థిమితం (Mindless) లేకుండా, ఇష్టమొచ్చిన రీతిలో ఎగురుతూ ఉంటాయని జీవశాస్త్రవేత్తలు చెబుతారు. మగతేనెటీగల (Drones)లాగే, మానవ రహిత వైమానిక వాహనాలు (UAVs) కూడా తమ సొంత ఆలోచనతో ఎగరలేవు (They dont fly of their own mind). వాటికి సొంతంగా ఆలోచించగలిగే పరిజ్ఞానం ఉండదు (Mindless) అందువల్ల UAVsకు డ్రోన్స్ అని నామకరణం చేశారని సాంకేతిక రంగ నిపుణులు చెబుతున్నారు.


డ్రోన్స్ పరిణామం (Evolution of drones)
1850 : తొలిసారిగా మిలటరీ అవసరాలకు డ్రోన్‍ పరిజ్ఞానం వినియోగం.

డ్రోన్లు అన్న భావన మొట్టమొదటి సారిగా 1849లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఆస్ట్రియా మరియు వెనిస్‍లమధ్య జరిగిన యుద్ధంలో ఆస్ట్రియా ప్రేలుడు పదార్థాలు నింపిన బెలూన్లతో వెనిస్‍పై దాడి చేసింది. అదృష్టవశాత్తు పెద్దగా నష్టమేమీ జరగలేదు. ప్రేలుడు పదార్థాలతో నింపిన బెలూన్లు అన్నవి నేటి డ్రోన్లకు ఏ రకంగానూ సరిపోలనప్పటికీ, యుద్ధాలలో ఈ రకంగా దాడి చేయడమన్నది ఆనాటి సమాజానికి వింతగానూ, విడ్డూరం గానూ, వినూత్నంగానూ కనిపించింది. అంటే ఇప్పటికి 170 సం।।ల కిందటే డ్రోన్లకు సంబంధించిన మూల భావన (Basic Concepts)కు ఆనాటి యుద్ధరంగానికి చెందిన సాంకేతిక నిపుణులు బీజం వేశారని, దాని ఆధారంగానే తరువాతి దశాబ్దాలలో నేటి ఆధునిక డ్రోన్లు అవతరించాయని చెప్పవచ్చు.


1900 : వెలుగులోకి వచ్చిన మొదటి క్వాడ్‍ కాప్టర్‍

నేటి ఆధునిక వాణిజ్య డ్రోన్లన్నిటికీ సాధారణ లక్షణం నాలుగు రోటర్లు కలిగి ఉండడమని చెప్పవచ్చు. దీనినే ఆంగ్లంలో Quad copter configuration అంటారు. ఈ టెక్నాలజీని 1907వ సం।।లో Louis Brequet అనే ఇరువురు సోదరులు, ఫ్రాన్స్కు చెందిన శరీర ధర్మశాస్త్రవేత్త Physiologist) Professor Charles Richet సహకారంతో హెలికాప్టర్‍కు పూర్వరూపమైన Gyroplane ను అభివృద్ధి పరిచారు. Quad copter Technologyకి ఇది మొదటి రూపం. పైలట్‍తో కలిసి గాలిలోకి ఎగిరిన మొదటి ఎయిర్‍ క్రాఫ్ట్ ఇదే కావడం గమనార్హం. అప్పట్లో ఇది కేవలం 0.6 మీ।। ఎత్తుకు మాత్రమే ఎగిరింది. క్వాడ్‍ కాప్టర్‍ భావనను వివరించడానికి చేసిన ప్రయత్నం క్వాడ్‍ కాప్టర్‍ విమానం (Flight) గానూ పనిచేస్తుందన్న సరికొత్త ఆలోచనకు మొగ్గతొడిగింది. ఈ రకమైన ఒరవడి రాబోయే రోజుల్లో ఈ రంగం సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమం చేసింది.


1915-20 : డ్రోన్‍ సాంకేతిక రంగంలో పెద్ద మలుపు

మొదటి ప్రపంచ యుద్ధం ఉద్ధృతంగా కొనసాగుతున్న తరుణంలో బ్రిటన్‍కు చెందిన Archibald low అన్న ఇంజనీర్‍ 1916లో మొట్ట మొదటిసారిగా ఫైలట్‍ రహిత ఎయిర్‍ క్రాఫ్ట్ను అభివృద్ధి పరిచాడు. దీనికి Ruston proctor Aerial target అని పేరు పెట్టారు. ఇది రేడియో మార్గనిర్దేశిత వ్యవస్థ (Radio guidance system) ద్వారా పనిచేస్తుంది. Low చేపట్టిన ప్రాజెక్టులన్నీ విజయవంతం కావడంతో ఆయనకు ‘‘»The father of Radio Guidance Systems”అన్న పేరు కూడా వచ్చింది.


1930-1945 : మిలటరీ డ్రోన్‍ టెక్నాలజీ అభివృద్ధిలో ముందడుగు
అమెరికా నావికా దళం రేడియో నిర్దేశిత ఎయిర్‍ క్రాఫ్టస్లపై పరి శోధనలు చేపట్టి Curtis N2C-2 అన్న డ్రోన్‍ను 1937లో అభివృద్ధి పరిచింది.
1935లో బ్రిటన్‍ ‘‘Queen bee’’ అన్న Radio controlled Targeted droneను అభివృద్ధి చేసింది. Queen bee తోనే రేడియో నిర్దేశిత మానవ రహిత వైమానిక వాహనాలను ‘డ్రోన్‍’ అన్న పేరుతో పిలవడం మొదలైంది.


వియత్నాం యుద్ధం – డ్రోన్‍ టెక్నాలజీ

మొట్టమొదటిసారిగా విస్తృత స్థాయిలో నిఘా మరియు పర్యవేక్షణ కొరకు డ్రోన్లను వియత్నాం యుద్ధంలో వినియోగించారు. ఇదే కాకుండా ప్రత్యర్థిని మోసపుచ్చి శత్రుస్థావరాలపై దాడులు చేయడం, నిర్దేశిత లక్ష్యాలపై క్షిపణులను ప్రయోగించడం, కరపత్రాలను జారవిడవడం ద్వారా శత్రుదేశాల సైన్యంపై మానసికంగా పై చేయి సాధించడం వంటి విధులు కూడా అవలీలగా నిర్వహించేవి.


1960 : వినోద అవసరాల కొరకు డ్రోన్‍ టెక్నాలజీ వినియోగం

ట్రాన్సిస్టర్‍ టెక్నాలజీలో సంభవించిన విప్లవం కారణంగా రేడియో నిర్దేశిత భాగాలు కూడా కావాల్సిన స్థాయికి సూక్ష్మీకరించ బడ్డాయి. దాని వల్ల డ్రోన్ల పరిమాణం కూడా తగ్గి తయారీ ఖర్చు కూడా తగ్గిపోవడంతో, డ్రోన్లను పౌరులకు ఆశించిన ధరకే వినోద అవసరాల కొరకు ఈ దశాబ్దంలో విరివిగా విక్రయించడం జరిగింది. డ్రోన్ల భాగాలను ఒక కిట్‍ రూపంలో అమర్చగలగడం వల్ల, ఔత్సాహికులు ఆ కిట్‍ను తమతో తీసుకెళ్ళి తమకు నచ్చిన బాహ్య మరియు అంతర ప్రదేశాలలో (Indoor & Outdoor) డ్రోన్ల విడిభాగాలను ఒకదానితో మరొకటి (Assemble) కలిపి వాటిని ఎగరవేయడం ప్రారంభించారు. దీనివల్ల డ్రోన్లను వాణిజ్య అవసరాల కోసం వినియోగించేందుకు వీలుగా, డ్రోన్‍ టెక్నాలజీకి మరిన్ని మెరుగులు దిద్దే పక్రియ వేగవంతమైంది.


1980-89 : లక్ష్య నిర్దేశిత మిలటరీ డ్రోన్ల తయారీకి కట్టుదిట్టమైన కృషి

అమెరికా మిలటరీ అవసరాల కొరకు విస్తృత స్థాయిలో డ్రోన్ల ఉత్పత్తి మరియు సరఫరా చేయడంలో విజయం సాధించింది. అయినప్పటికీ డ్రోన్ల ఉత్పత్తి చాలా వ్యయప్రయాసలతో కూడినదిగా, అవి అంత విశ్వసించదగినవి కావు అన్న నింద వాటిపై ఉండేది. 1982లో ఇజ్రాయిల్‍ వైమానిక దళాలు డ్రోన్లను వినియోగించి, అతి తక్కువ నష్టంతో సిరియా వైమానిక దళాలపై విజయం సాధించడంతో డ్రోన్లపై నున్న అపనమ్మకాలన్నీ తొలగిపోయాయి. అమెరికా – ఇజ్రాయిల్‍లు సంయుక్తంగా “RQ2 Pioneer” అన్న మధ్యతరహా నిఘా డ్రోన్‍ను అభివృద్ధి చేశాయి.


ఇదే సమయంలో డ్రోన్ల సాంకేతిక నిపుణులు, డ్రోన్లకు కావలసిన శక్తిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందించే దిశగా తమ దృష్టి కేంద్రీకరించి, సౌరశక్తి (Solar Power)ని ఇందుకు మెరుగైన ప్రత్యామ్నాయంగా గుర్తించారు.


1990-2010 : మిలటరీ మరియు పౌర అవసరాల డ్రోన్ల అభివృద్ధికి కీలక దశాబ్దం

చిన్న మరియు సూక్ష్మ శ్రేణికి చెందిన డ్రోన్లు 1990వ దశకంలో ప్రవేశపెట్టబడ్డాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రిడేటర్‍ డ్రోన్‍ 2000 సం।।లో ప్రవేశ పెట్టిబడింది. దీనిని ఆప్ఘనిస్తాన్‍లో క్షిపణులను ప్రయోగించేందుకు మరియు ఒసామాబిన్‍ లాడెన్‍ను వెతికేందుకు ఉపయోగించారు. తరువాత సం।।రాలలో చిన్న పరిమాణంలో మరియు రెక్కలు అమర్చిన (Fixed wing) Raven, Waspమరియు Puma లాంటి నిఘా డ్రోన్లు అభివృద్ధి చేయబడ్డాయి. డ్రోన్ల చరిత్రలో 2006 ఒక కీలకమైన సంవత్సరం. అమెరికాకు చెందిన Federal Aviation Administration (FAA) వాణిజ్య అవసరాల కొరకు డ్రోన్లను వినియోగించుకోవడానికి తొలిసారిగా అధికారిక ఉత్తర్వులను మంజూరు చేసింది.


2010 : డ్రోన్ల అభివృద్ధికి స్వర్ణయుగం
డ్రోన్లను వినూత్నంగాను మరియు వాణిజ్య అవసరాల కొరకు వినియోగించుకోవడంలో గత 10 సం।।రాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. రేడియో నియంత్రణ (Radio Controlled) సాంకేతికత, మరియు స్మార్ట్ ఫోన్‍ సాంకేతికతలను సమ్మిళతం చేయడం వల్ల కెమెరాలు అమర్చిన డ్రోన్లను ఫొటోగ్రఫీ రంగంలో వాణిజ్య అవసరాల కొరకు విరివిగా వాడడం జరుగుతోంది.


డ్రోన్లు – రకాలు
డ్రోన్లను కొన్ని నిర్దిష్ట రకాలుగా విభజించేందుకు స్పష్టమైన ప్రమాణాలేవీ లేవు. అధికారికంగా అలాంటి విభజన పక్రియ కూడా ఏదీ లేదు. ఈ పక్రియ అంతా గందరగోళంగా ఉంటుంది. డ్రోన్లు అవి ఉపయోగపడే తీరునుబట్టి, ఈ క్రింది అంశాల ఆధారంగా విభిన్నరకాలుగా విభజిస్తారు. అయితే ఈ విభజన ప్రామాణికమైతే కాదు.


అవి :
i). Aerial platform (వైమానిక వేదిక)
ii) . పరిమాణం (Size)
iii). శ్రేణి (Range)
iv) . గాలిలో నిలిచే ఉండే సమయం (Endurance)

i). Aerial platform (వైమానిక వేదిక) ఆధారంగా డ్రోన్లను 4 రకాలుగా విభజించవచ్చు.

I) బహుళ రోటర్లు కలిగిన డ్రోన్లు (Multi rotor drones)
వీటిని సర్వ సాధారణంగా నిపుణులు (Professionals) మరియు అభిరుచి గలవారు (Hobbyists) ఉపయోగి స్తారు. వైమానిక ఫొటోగ్రఫీ (Aerial Photography), వైమానిక దృశ్య సహిత నిఘా (Aerial Video Survillence) తదితర అవసరాల కోసం ప్రధానంగా వీటిని వాడతారు. డ్రోన్లపైన అభిరుచిగల ఔత్సాహికులు వీటిని డ్రోన్ల పందేలు (Drone Racing) మరియు ఖాళీ సమయాలలో ఎగరేసేందుకు (Leisure Flying) కూడా ఉపయోగిస్తారు. బహుళ రోటర్లు కలిగిన డ్రోన్లను వాటిపై నున్న రోటర్లు ఆధారంగా తిరిగి 4 రకాలుగా విభజిస్తారు. i) 3 రోటర్లు కల్గినవి (Tricopter) ii) 4 రోటర్లు కల్గినవి (Quadcopter) iii) 6 రోటర్లు కల్గినవి (Hexacopter) iv) 8 రోటర్లు కల్గినవి (Octocopter). వీటన్నింటిలో 4 రోటర్లు కల్గిన డ్రోన్లు (Qued copter) ఎక్కువగా జనాదరణ పొంది, విస్తృతంగా వాడుకలో ఉన్నాయి.


II) స్థిరమైన రెక్కలు కల్గిన డ్రోన్లు (Fixed wing Drones)

స్థిరమైన రెక్కలు కల్గిన డ్రోన్లు నిర్మాణంలోనూ మరియు రూపంలోనూ బహుళ రోటర్లు కలిగిన డ్రోన్లకు పూర్తి భిన్నమైనవి. ఈ డ్రోన్లకు ఉన్న రెక్కలు సాధారణ విమానాల మాదిరిగా స్థిరంగా అమర్చబడి ఉంటాయి. బహుళ రోటర్లు కల్గిన డ్రోన్ల మాదిరిగా ఇవి ఆకాశంలో ఒకే చోట స్థిరంగా ఎగరలేవు. తమకు నిర్దేశించిన మార్గంలో వేగంగా ముందుకు మాత్రమే వెళ్ళగలవు. అందువల్ల వీటిని సైనిక పరమైన నిఘా అవసరాల కొరకు, ఏదైనా ప్రదేశాలనుMapping చేయడానికి ఉపయోగిస్తారు. కొంత సమయం కూడా ఒకే చోట నిలబడలేవు. కనుక వీటిని ఫొటోగ్రఫీ రంగలో ఉపయోగించ లేరు. దీనిని నడిపేందుకు నైపుణ్యం కల్గిన సిబ్బంది కావాలి. అంతే కాకుండా దీనిని గాలిలోకి ఎగిరించేందుకు రన్‍వే లేదా catapult launcher గానీ అవసరం. మరియు దించేందుకు (Landing) లేదా Run Way లేదా Parachute ఉపయోగించాలి.


III) ఒకే రోటరు కలిగిన డ్రోన్లు (single rotor drones)
ఒకే రోటరు కలిగిన డ్రోన్లు రూపం మరియు నిర్మాణంలో ప్రస్తుత హెలికాప్టర్స్ను పోలి ఉంటాయి. అయితే బహుళ రోటర్లు కలిగిన డ్రోన్లు లాగా కాకుండా ఒకే రోటరు కలిగిన డ్రోన్లకు పై భాగంలో పెద్ద పరిమాణం కలిగిన రోటరు మరియు తోక భాగంలో, తల భాగాన్ని నియంత్రించేందుకు చిన్న పరిమాణంగల రోటరు ఉంటాయి. బహుళ రెక్కలు కలిగిన డ్రోన్లకన్నా ఒకే రోటరు కలిగిన డ్రోన్లు సమర్థవంతమైన పనితీరును కనబరుస్తాయి. వైమానిక గతిశాస్త్రం (Aerodynamics)లో రోటరుల సంఖ్య తగ్గే కొద్దీ, ఆ వస్తువు తిరిగే (spin) వేగం కూడా తగ్గిపోతుంది. అందుకే 8 రోటర్లు కలిగిన డ్రోన్ల (Octocopters) కన్నా 4 రోటర్లు కలిగిన డ్రోన్లు (Quad copters) ఎలాంటి ఊగిసలాట లేకుండా స్థిరంగా ఉంటాయి. అదేవిధంగా బహుళ రోటర్లు కలిగిన డ్రోన్ల కన్నా, ఒకే రోటరు కలిగిన డ్రోన్లు మంచి పనితీరును కనబరుస్తాయి. అయితే ఒకే రోటరు కలిగిన డ్రోన్ల రోటరు పరిమాణంలో పెద్దగా ఉండడం వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వీటి ఖరీదు కూడా ఎక్కువే. వీటిని నడిపేందుకు నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం.


IV) హైబ్రిడ్‍ వీటీఓఎల్‍ (Hybrid VTOL)
ఇందులో వీటీఓఎల్‍ అనగా Vertically take off and landing. ఈ రకమైన డ్రోన్లు హెలికాప్టర్‍లాగా ఆకాశంలోకి నిటారుగా ఎగరడం (take off), ఆకాశంలో అటు ఇటు తిరగడం (Hover), నేలమీద దిగడం (Landing) వంటి విధులు నిర్వర్తిస్తాయి. బహుళ రోటర్లు కల్గిన డ్రోన్లు (multi rotor drones), స్థిరమైన రోటర్లు కల్గిన డ్రోన్లు (Fixed wing drone) చేసే పనులన్నీ హైబ్రిడ్‍ వీటీఓఎల్‍ డ్రోన్లు కూడా చేస్తాయి. ఇవి నిటారుగా ఎగురుతాయి కాబట్టి వీటికి రన్‍వే కూడా అవసరం లేదు. వీటిని నడిపేందుకు నైపుణ్యం కలిగిన సిబ్బంది కూడా అవసరం లేదు. వీటిని సైనిక మరియు వాణిజ్య పరమైన సేవలకు విస్తృతంగా వాడుతున్నారు.


I) పరిమాణం : పరిమాణం ఆధారంగా డ్రోన్లను 4 రకాలు విభజిస్తారు.
i) సూక్ష్మమైనవి (Nano) : ఒక కీటకమంత పరిమాణంలో ఉంటాయి (దాదాపు 50 సెం.మీ.)
ii) చిన్నవి (Small) : వాణిజ్య సేవలకు ఉపయోగించే డ్రోన్లన్నీ ఈ రకానికి చెందినవే. వీటి నిర్వహణ మరియు నియంత్రణకు కేవలం ఒక్కరున్నా సరిపోతుంది. 2 మీ।। కన్నా తక్కువ పొడవు ఉంటాయి.
iii) మధ్యతరహావి (Medium) : ఇద్దరు వ్యక్తులు ప్రయాణించేందుకు వీలుగా ఉంటాయి. చిన్న విమానాల కన్నా పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి.
iv) పెద్దవి (Large) : చిన్నవిమానం పరిమాణంలో ఉంటాయి. వీటిని సైనిక పరమైన నిఘా మరియు పర్యవేక్షణకు వాడతారు.


II) శ్రేణి : శ్రేణి ఆధారంగా డ్రోన్లను 3 రకాలుగా విభజిస్తారు.
i) సమీప శ్రేణి (Close Range) : వీటి పరిధి 3 మైళ్ళ వరకు ఉంటుంది. ఇవి గాలిలో 20-30 ని।।ల సేపు ఉండగలవు. వినియోగదారులకు సేవలందించే డ్రోన్లు ఈ కేటగిరీకి చెందుతాయి.
ii) తక్కువ శ్రేణి (Short Range) : ఈ శ్రేణికి చెందిన డ్రోన్లను 30 మైళ్ళ పరిధిలో వాటి నిర్వాహకుల చేత నియంత్రించవచ్చు. ఇవి గాలిలో 1-6 గం।। సేపు ఉండగలవు.
iii) మధ్యశ్రేణి (Mid- Range) : ఈ శ్రేణికి చెందిన డ్రోన్లను 9 మైళ్ళ వరకు నియంత్రించవచ్చు. ఇవి 12 గం।। సేపు గాలిలోఉండగలవు.
iv) గాలిలో నిలిచి ఉండే సమయం ఆధారంగా (Endurance)
ఈ రకమైన డ్రోన్లు 400 మైళ్ళ పరిధి వరకు నియంత్రించ బడతాయి. ఇవి వరుసగా 3 రోజుల వరకూ గాలిలో ఉండగలవు. సైనిక పరమైన విగా మరియు పర్యవేక్షణ కొరకు, అదే విధంగా శాస్త్రీయ సమాచారాన్ని (scientific data) సేకరించేందుకు వీటిని వాడతారు. (తరువాయి వచ్చే సంచికలో)


పుట్టా పెద్ద ఓబులేసు,
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *