బొమ్మ హేమాదేవి


తెలంగాణ మలితరం రచయిత్రులలో బొమ్మ హేమాదేవి ఒకరు. మొట్ట మొదటి బహుజన రచయిత్రి. 1960-1980 మధ్యకాలంలో మహిళల నుండి సాహిత్యం వెల్లువయింది. చదువుకునే వారి సంఖ్య పెరగడంతోపాటే రాసేవారి సంఖ్యా పెరిగింది. జీవితానుభవాలు, సంఘటనల నుండి కథలు, నవలలుగా మలిచారు మహిళలు. అందులో ఒకరు బొమ్మ హేమాదేవి.


ఆమె అసలు పేరు రుక్ష్మిణీదేవితోపాటు యమున అనే పేరు కూడా ఉంది. రాయడం ఆరంభం చేసినప్పుడు ‘దేవీరమ’ అని ఇంకో పేరు పెట్టుకున్నారు. ఆ పేరుతో 20 నవలలు, 40 వరకు కథలు అచ్చయ్యాయి. ఆ తర్వాత ఆమె రాసినవి ప్రింటు కావడం అకస్మాత్తుగా ఆగిపోయాయి. అప్పుడు ‘బొమ్మ హేమాదేవి’ అని కోడలు హేమ పేరు పెట్టుకున్నారు. ఆ పేరుతో రాసిన ‘కుంకుమ పూలు’ కథకు మొదటి బహుమతి వచ్చింది. అప్పటి నుండి ఆమె ఆ పేరుతోనే తన రచనలు కొనసాగించారు. అలా బొమ్మ హేమాదేవి పేరు స్థిరపడిపోయింది.


హేమాదేవి రాసే నవలలకు కథలకి ఆధారం తనకు తెలిసన కొందరి జీవితాలు, ఆమె భర్త నారాయణ. ‘ఆయన ఏదో ఒకటి మాట్లాడతారు. నాకు థీమ్‍ దొరికిపోతుంది. అన్నయ్య కూడా ఓ పత్రికకి సంపాదకులు. నేను రాసే కథలు చాలావరకు ఆ పత్రికలోనే పడుతూ ఉంటాయి’ అంటూ తన కథలకు ముడిసరుకు ఎలా అందుతుందో కుంకుమపూలు కథకి బహుమతి వచ్చిన సందర్భంలో బొమ్మ హేమాదేవి చెప్పారు.


హేమాదేవి సాహితీ ప్రయాణం 1950లో ఆరంభించారు. అచ్చులో వచ్చిన మొదటి నవల భావన భార్గవి. అది 1960లో అచ్చయింది. ఆ తర్వాత నవధాన్యాలు, లవ్‍స్టోరీ, తపస్విని, సంభారతి వంటి నవలలు మొదలైనవెన్నో వచ్చాయి. ఆమె చివరి నవల వనజ అడవిపుత్రిక. 1995లో రాశారు. ఇది విప్లవోద్యమంలో, దళాలలో పనిచేసిన ఒక మహిళ ఆత్మకథ. వనజ ఉద్యమ జీవితాన్ని ఈ నవలలో చక్కని శైలిలో చిత్రించారు.


నవలా పక్రియలో తెలంగాణా రచయిత్రుల్ని వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. చాలా తక్కువమంది నవలలు రాశారు. అందులో బొమ్మ హేమాదేవి ఒకరు.
తరుణ పత్రిక నవంబరు 1974 సంచిక ముఖచిత్రంగా బొమ్మ హేమాదేవి ఫొటోతో ప్రచురించారు. ఆ సందర్బంగా వెనుక అట్టపై ఆమె గురించి ఆ పత్రిక ఎడిటర్‍ ఏ విధంగా వ్యాఖ్యానించారో చూద్దాం.


‘లోగడ పది నవలలకు పైగా రాసినా ఆ తర్వాత ఎందుకో ఆమె రాయలేదు. పాఠకుల నుంచి, రచయితలు దూరంగా ఉండడం మంచిది కాదన్న సలహాపై ‘కుంకుమ పూలు’ కథ రాసి ఆంధ్రజ్యోతి 1973 దీపావళి కథల పోటీలో మొదటి బహుమతి పొందారు. ఆ ప్రోత్సాహంతో ఇప్పుడు మళ్ళీ రాయడం – విజృంభించారు. ఆమె పుట్టింది నిజామాబాద్‍లో, ఉండేది హైదరాబాద్‍ల, డిగ్రీలు గొప్పగాలేవు. జీవితానికి కావలసినంత సంస్కారం జీర్ణించుకున్నారు. ‘కథలు రాయడం నా వృత్తికాదు. హాబీ’ అనే హేమాదేవి గారు ఆత్మీయుల జీవితాల్లోకి, తోటి మనుష్యుల జీవితాల్లోకి సానుభూతిపూర్వకంగా తొంగి చూస్తారు. ఏమైనా కనిపిస్తే ఏదో ఒక కథ సిద్ధం చేస్తారు. పాఠకులతో తమ భావాలను పంచుకుంటారు.


‘బంగారు గూడు’ నవల చాలా రోజుల తర్వాత శ్రీమతి హేమాదేవిగారు రాసిన హుషారైన చిన్న నవల. ‘నవధాన్యాలు’ అనే నవల వీరి సునిశిత దృష్టికి నిదర్శనంగా నిలుస్తుంది. భార్యాభర్తలు బయటికి వెళ్ళినప్పుడు భర్త ఎదురుగానే భార్యని సంఘవిద్రోహ శక్తులు కిడ్నాప్‍ చేసిన వాస్తవ సంఘటన తీసుకుని నవల రాశారు. నేరస్థుడ్ని పట్టుకుంటారు. కానీ భర్త భార్యను ఏలుకోలేను. ఏలుకుని చుట్టుపక్కల తలెత్తుకుని బతకలేను. కాబట్టి ఆమెను పుట్టింటికి పంపించెయ్యమని తల్లితో చెప్తాడు. అప్పుడా తల్లి కోడలు పక్షాన నిలబడి మాట్లాడుతుంది. ఆమె కిడ్నాప్‍ అవడానికి కారణం ఆమెనా, ఆమె తప్పు చేసినట్లా, కాదు. అటువంటప్పుడు ఆమె ఇంటినుండి ఎందుకు వెళ్ళిపోవాలి అని కొడుకుని నిలదీస్తుంది. తన కోడలు ఇల్లు విడిచి వెళ్ళేది లేదని కొడుకుకు స్పష్టం చేస్తుంది. నీవు ఇక్కడ తలెత్తుకోలేను అనుకుంటే ఈ ఊరి నుండి మారిపోవచ్చు అని కొడుక్కి సలహా ఇస్తుంది.


తన పాత్రల ద్వారా, తాను సృష్టించిన సాహిత్యం ద్వారా సమాజాన్ని సంస్కరించాలనే తాపత్రయం కనిపిస్తుంది. రచయిత్రి బొమ్మ హేమాదేవి రచనల్లో.
స్త్రీలకు జరిగే అన్యాయాలపట్ల స్త్రీ సమస్యల పట్ల ఎంతో ముందు చూపుతో రచనలు చేశారామె. తమ రచనల ద్వారా స్త్రీలపట్ల జరిగే అన్యాయాలకు, అఘాయాఇత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి అని ఉద్బోదిస్తున్నట్లుగా ఉంటుంది బొమ్మ హేమాదేవి సాహిత్యం. 1973లో వచ్చిన ‘కుంకుమపూలు’ కథలో ప్రధానంగా కనిపించే అంశాలు… భర్త చనిపోతే భార్య కుంకుమపూలు తీసేయకుండా ఉండడం ఒకటయితే, భర్త చనిపోయిన ఆమెకు మళ్ళీ పెళ్ళి చేయడం, భర్త చనిపోయాక చిన్నప్పటినుండి పెట్టుకున్న కుంకుమపువ్వులను తీసేయడం తగదనే అభ్యుదయ దృక్పథం కనిపిస్తుంది. ఆమె విశాల దృష్టిని తెలుపుతుంది.
మచ్చుకు కథలో డైలాగ్స్ చూద్దాం తన భర్త పోయినప్పుడు కుంకుమ, పూలు తీసేసిన మొహాన్ని నలుగురికీ చూపలేక తల్లడిల్లిన తల్లి తన కూతురు శారద భర్త చనిపోతే కుంకుమ, పూలు తీయలేదని కొడుకుతో ఈ విధంగా అంటుంది.


‘నీ చెల్లెలు చూడూ తన మొగడు చచ్చినా కుంకుమ, పూలు, గాజులు పెట్టుకుని నన్ను చూడు నా వేషం చూడు అంటూ తిరుగుతోందిరా’ అని కోపంతో కొడుకు ముందు అరుస్తుంది. ‘కోపం తెచ్చుకోకుండా శాంతంగా వినమ్మా. పూలు కుంకుమకు భర్తకు ఏరకమైన సంబంధంలేదమ్మా. ఇవన్నీ మన భావనలు. పువ్వుల్లో కుంకుమల్లో అంత మహత్తు ఉంటె మరి ముస్లిమ్స్ ఎవరూ కుంకుమ పెట్టుకోరు. వాళ్ళ మగాళ్ళకుగాని, వాళ్లింట్లోగాని ఆపద రాదెందుకు? క్రిస్టియన్స్ కొంతమంది గాజులు వేసుకోరు. చాలా దేశాల్లో పూలు కూడా పెట్టుకోరు.


‘నుదిటి నిండా కుంకుమ, చేతినిండా గాజులు, ఒక్క తలలోనే రెండు తలలకు సరిపోయే పూలు పెట్టుకున్న వాళ్ళ భర్తలు తొందరగా పోయినవాళ్ళున్నారు. అలాంటప్పుడు కుంకుమ, పూలు, గాజులు ఏదో మహత్తు కాదని స్పష్టం కావడంలేదా’ తల్లికి విశదం చేయ ప్రయత్నిస్తాడు ఆమె కొడుకు రవి.
మరో సంభాషణలో ‘భార్య పోయిన రఘుని శారద పెళ్ళి చేసుకుంది. భర్త పోయిన శారదని విష్ణు పెళ్ళి చేసుకుంటాడు’ అందులో తప్పేముంది అంటూ తల్లికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది.


పెళ్ళిచూపులు సాధారణంగా అమ్మాయి ఇంట్లోనో, గుళ్ళోనో మరెవరి ఇంట్లోనో ఏర్పాటు చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయం. 1984 ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చిన ‘అభయ’ కథలో అందుకు భిన్నంగా అమ్మాయికి తెలియకుండా రైలులో ఏర్పాటయ్యాయి పెళ్ళి చూపులు. ఆ విషయం తెలియని అమ్మాయి, అబ్బాయి ఎదురు బొదురు బెర్తుల్లో బెంగుళూరు నుండి హైద్రాబాద్‍కు వస్తారు. ప్రయాణంలో వారు తమ సొంత పేర్లతో పరిచయం చేసుకోరు. కానీ వారి అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా వెల్లడించుకుంటారు.


‘మా ఇంట్లో కట్నాలు ఇవ్వము తీసుకోము. ఐనా ఈ చేతగాని తనాన్ని ఓ సబ్జెక్టుగా తీసుకుని దాని గురించి చర్చించడం అంటే అసహ్యం నాకు. ‘తల్లిదండ్రులను ఆడవాళ్ళే ఎందుకు వదులుకోవాలి. మగ వాళ్ళు ఎందుకు వదులు కోకూడదు’ అంటుంది నా భార్య. ‘ఆవిడ తల్లి దండ్రుల దగ్గర ఉంటుంది. తనకు ఇక్కడికి రావాలనిపించినప్పుడు వస్తుంది. నాకు వెళ్ళాలనిపించినప్పుడు నేను వెళ్తాను’ అని చెప్తాడు అతను.


మనం ఇక్కడ తడిమి చూసిన రెండు కథల్లోనూ నూతనత్వం కనిపిస్తుంది. సరికొత్త ఆలోచనాధోరణి బాటలు వేయడం కనిపిస్తుంది. ‘అప్పుడప్పుడూ మా ఆయన ఎంతో ఉదారంగా షాపింగ్‍ కోసం ఇచ్చే కొద్దిపాటి సొమ్ముల్ని నేను కథలు రాసుకోవడానికి తెల్లకాయితాలు తెచ్చుకోవడానికి ఉపయోగించుకుంటాను’ అని బొమ్మ హేమాదేవి చెప్పినట్లు సీనియర్‍ రచయిత్రి నిడదవోలు మాలతి మహిళా రచయిత్రలపై రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.


‘కుంకుమ పూలుకు ఫస్ట్ ప్రైజ్‍ రావడం నా సంతోషం మాట ఎలా ఉన్నా చాలా ఆశ్చర్యంగా ఉంది’ అన్నారంటుంది. 1973 ఆంధ్రజ్యోతి వారపత్రికలో తన గురించి చెబుతూ ‘నా జీవితం గురించి ఏం రాయను మీకు, అతి సాధారణమైన జీవితాల్లో ఏం ఉంటాయని, పోతే కొన్ని రోజుల క్రితం మా చిన్నన్నయ్య పబ్లికేషన్స్ నుండి నేను రాసిన నవలలు కొన్ని ప్రింటయ్యాయి. నాకు పెళ్ళయ్యేంత వరకు చదువుకున్నాను. మా బావకి అంటే మా ఆయనకి, పిల్లలకి ఆయా పని చేస్తాను. హాబీస్‍ ఏమున్నాయి? వంట, పిల్లల్ని తిట్టడం, బావతో పోట్లాడ్డం తప్ప!’ అని అన్నారు.


నిజామాబాద్‍కు చెందిన రామాగౌడ్‍, గంగాదేవిల మొదటి సంతానం ఆమె. 1932 సెప్టెంబర్‍ 14 తేదీన నిజామాబాదులో జన్మించారు. హైదరాబాదులోని నారాయణగూడ బాలికోన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్‍ చదివారు. ఆమెకు చిన్న వయసులోనే అంటటే 15వ ఏటనే వివాహం అయింది. ఆర్థికంగా ఉన్నత స్థాయి కుటుంబం, పేద ఇంటికోడలై ఆ యింటి పరిస్థితులకనుగుణంగానే నడుచుకునేది. ఆరుగురు పిల్లలతో సంసార బాధ్యతలతో తలమునక లవుతూనే రచనా వ్యాసంగం చేయడం గమనించదగ్గది. ఏ మాత్రం సమయం చిక్కినా ఆ సమయాన్ని రచనా వ్యాసంగానికి వినియోగించుకునే వారు హేమాదేవి. పని మధ్యలో పది పదిహేను నిముషాలు సమయం చిక్కినా కూర్చొని రాసుకునేవారు. రాసుకోవడానికి ప్రత్యేక సదుపాయాలు, వసతులు ఏమీలేవు. మూడ్‍ వస్తే రాయడం వంటివి ఏమీ లేవు. సమయం దొరికితే చాలు కలం అందుకునేవారావిడ అని అంటారు ఆమె పెద్ద కూతురు శోభారాణి.


గుడిపాటి వెంకటాచలంతో ఎప్పుడూ ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతుండేవారనీ, సినారె, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి కవులతో సాహితీ సాంగత్యం అమ్మతో సాహితీ ప్రయాణం చేయించాయి అంటారామె. 50కి పైగా ప్రజాదరణ పొందిన నవలలు, 100కుపైగా కథలు ముద్రణ అయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సంకలనాల్లో, రచయిత్రుల డైరెక్టరీల్లో ఈ రచయిత్రి పేరు ఎందుకు చేరలేదో ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె తన రచనలను భద్రపరచి సంకలనం వేసి ఉంటే భవిష్యత్‍ తరాల వారికి ఎంతో సౌలభ్యంగా ఉండేది. అందుకు ఆమె ఆర్థిక పరిస్థితులు సహకరించి ఉండకపోవచ్చు. లేదా ఆవిడకే తన రచనలను భద్రపరచాలన్న ఆలోచన లేకపోవచ్చు. ఈ రోజుకీ ఆమె ఆలోచనల్లోని కొత్తదనం, చైతన్యం మాసిపోలేదు. నేటి సమాజానికి మార్పుకు దోహదం చేసే ఆ రచనలు అవసరమే. ఏదేమైనా ఇప్పటికైనా ఆమె రచనలు భద్రపరచాల్సిన అవసరం, భవిష్యత్‍ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
వి. శాంతి ప్రబోధ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *