చిందుల ఎల్లమ్మ

శ్రమ నుంచి పుట్టిన ఏ కళారూపమైనా మట్టి పరిమళాలు వెదజల్లుతుంది. అణచివేతకు గురైన సామాజిక వర్గాల జీవితాల నుంచి జనించే కళారూపాలేవైనా శ్రమను మరిపించేలా చేస్తాయి. ఇలాంటి కళారూపాలు ఎన్ని ఒడిదుడుకుల సునామీలొచ్చినా తట్టుకుని నిలబడతాయి. పునాదిలో మార్పు రానంతకాలం, శ్రమజీవుల జీవితాల్లో వెలుగులు పరుచుకోనంత కాలం అలాంటి కళలు సజీవంగానే ఉంటాయి. అలా సజీవంగా ఉన్న కళారూపాల్లో ‘చిందు భాగవతం’ కూడా ఒకటి.
ఇన్ని సంవత్సరాలుగా ఒక కళారూపం స్థిరపడటాన్ని చూస్తే అది సామాజిక, సాంస్కృతిక జీవితంలో వేళ్లూనుకున్న విషయాన్ని గమనిస్తే ఆ కళారూపానికి సమాజంలో వివిధ కులాల, వర్గాల ప్రజల ఆమోదం ఉందని అర్థం.


చారిత్రకంగా చూస్తే ‘చిందు’ అనేది తొలినాళ్లలో ఒక సంబురం, పండుగ.‘చిందు’ అనే పేరు ఈ అర్థాన్నే వ్య్తం చేస్తుంది. చిందులేయడం అనే వ్యక్తీకరణ అనాదిగా వ్యవహారంలో ఉంది. అది సంతోషంగా ఉన్నప్పుడు మనిషి చేసే క్రియ చిందుతొక్కడం మనిషి హావభావాల వ్యక్తీకరణ. అంతేకాదు.. మనిషి దేహభాష కూడా.
పంట కోతల సమయంలో వంటను ఇంటికి తెచ్చుకుంటున్న సంబురంలో ఆ శ్రమజీవులంతా కలిసి ఆడతారు, పాడతారు. ఈ రకమైన పండుగ వేడుక ప్రతీ నాగరికతలో, ప్రతీ సముదాయంలో ఉంటుంది. బహుశ ‘చిందు’కు అక్కడే ఒక వ్యవస్థీకృత రూపం ఏర్పడి అది కొనసాగడానికి ప్రాతిపదిక ఏర్పడి ఉంటుంది. ప్రాతిపదికలు, పునాది అంశాలు ఏం ఉన్నా, ఏమైనా చిందు భాగవతం పల్లె నుంచి ప్రపంచానికి ఎదగడానికి మాత్రం చిందుల ఎల్లమ్మ కృషి ఎనలేనిది. ఈ కృషి వెనుక వ్యక్తిగత జీవితాన్నే ఫణంగా పెట్టిన వైనమిది.


గత్తరొస్తే ఊర్లకు ఊర్లే గడగడలాడిపోయేవి. అలాంటి గత్తరొచ్చిన కాలంలో ఊరిడిసి పోయి, తిరిగి వచ్చేటప్పుడు పుట్టి, బతికిబ్ట కట్టిన సంతానంలో ఎల్లమ్మ రెండోది. ఆదిలాబాద్‍ జిల్లా బాసరలో జన్మించిన చిందుల ఎల్లమ్మ అసలు పేరు సరస్వతి, ఎల్లమ్మ నాలుగో యేట ఆమె తండ్రికి చూపుపోయింది. అప్పుడే మొక్కులో భాగంగా సరస్వతికి ఎల్లమ్మగా నామకరణం చేసి జోగిణిగా మార్చారు. అప్పటి నుంచి పులింట్లో సరస్వతి కాస్త ఎల్లమ్మగా మారింది.


నాలుగేళ్ల వయసులో ముఖానికి రంగు అద్దుకుంది ఎల్లమ్మ. తొలిసారి బాలకృష్ణ వేషం వేసింది. తెరవెనుక ఉన్నవాళ్లు పాటపాడితే తెరముందు ఎల్లమ్మను వదిలి ఆడమని ప్రోత్సహించేవారు. అలా అభినయంలో అడుగులేయడం మొదలైంది. నాలుగేళ్లలోనే ప్రావీణ్యత సాధించింది. ఆ తరువాతి కాలంలో రంభ వేషం వేసింది.
‘మీ కాలు పడితే మంచిదంత, సల్లదనమంట. మీరొచ్చి బాగోతం ఆడితో అనపడ్తదట. పంటలు పండుతాయట. సిందులోల్లూ మీరు రావాల’ అని పిలుచుకునే సామాజిక స్థితి ఆ రోజుల్లో ఉండేది. నిజామాబాద్‍ జిల్లాలోని మద్నూరు, దెగ్గూరు నుంచి మహారాష్ట్ర దాకా వెళ్లి ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇలా ఎప్పుడంటే అప్పుడే, ఎక్కడంటే అక్కడికి తిరుగుతూ బాగోతాలు ఆడుతుండేవారు. ‘యాడ వానాకాలం వస్తే అన్నే ఉంటుంటిమి. యా ఎవరు సస్తే ఆన్నే బొందపెడుతుంటిమి. ఎవరికైనా లగ్గం కరారైతే ఆన్నే చేస్తుంటిమి. గోసనాయినా, మా సిందోల్ల బతుకులు’ అని ఎల్లమ్మ వాపోయిన సందర్భాలెన్నో.


ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ కూడా చిందుబాగోతం బతుకుదెరువే కాదు, ఒక సామాజిక వర్గ జీవిత చిత్రమని, దాన్ని కాపాడాలని చివరికంటా తపన పడిన చిందుల ఎల్లమ్మకు తన 15వ యేట మేనత్త కొడుకు సైదులతో వివాహం జరిగింది. కానీ నిరంతరం ప్రదర్శనల్లోనే తలమునకలుగా ఉండే ఎల్లమ్మ జీవిత సహచరుడికి సరైన సమయాన్ని మానసికంగానూ, శారీరకంగానూ అంత దగ్గర కాలేకపోతున్నానని మథనపడింది. అతనికి కావాల్సిన అవసరాల్ని తీర్చలేకపుతున్నానని దిగులుపడింది. కానీ వైవాహిక జీవితం కన్నా చిందు కళమీదే ధ్యాస ఎక్కువ కలిగిన ఎల్లమ్మ చాలా పెద్ద మనసే చేసుకున్నారు. మనువాడిని మగడికి చెల్లి రామవ్వనిచ్చి మారు మనువు చేసింది. అప్పటికీ 20, 22 ఏళ్ల ప్రాయం ఎల్లమ్మది. ఇక చిందు బాగోతమే తన లోకమనుకుంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా జీవితంలోని దశలన్నీ చిందు ప్రదర్శనలతోనే దాటేసింది. భర్త, చెల్లెలు, అన్నలతో ఆమె కుటుంబం సంతోషంగా ఉన్నారు. ఏ అరమరికలు లేకుండా గడిపారు. ఆ తరువాత కాలంలో భర్త సైదులు తనను ‘అమ్మా’ అంటుండె అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.


వైవాహిక జీవితానికి దూరమైన ఎల్లమ్మకు ఒకటే ఆలోచన. ఎవరికీ పట్టని తన చిందుల కళకు ప్రపంచం పట్టం కట్టాల. అందరూ ఆదరించాల. అదే ఆశ, అదే శ్వాసగా బతికింది. ఎలాగైతేనేం అనుకున్నది సాధించింది.
30ల వరకు ఆడ, మగ రెండు పాత్రలు వేసేది ఎల్లమ్మ. తన అన్న గంగారం హరిశ్చంద్రుడిగా నటిస్తే ఎల్లమ్మ చంద్రమతిగా మారేది. అనన సత్యవంతుడైతే ఎల్లమ్మ సావిత్రిగా జీవించేది. అన్న వాలిగా నిలబడితే ఎల్లమ్మ సుగ్రీవుడిగా పోటీపడేది. ఎవరైనా పాత్రధారులు లేకపోతే ఆ పాత్రకు తానే ప్రాణం పోసేది. ఆ తరువాత క్రమంగా చిత్రాంగి, చెంచులక్ష్మి, చంద్రమణి వేషాలు వేసింది. అలా చిందు బాగోతమే ఆమె జీవితంగా మారింది.


చిందు బాగోతంలోని ఏ పాటలకు ఆ పాట రాగం వేరుగానే ఉంటుంది. భూపాల రాగం ఎత్తుకుంటే భూమి వణుకు, నరాలన్నీ గుంజకపోవు అంటారు అప్పటి కళాకారులు, అప్పుడు బాగోతాలల్ల భూపాలం, రూపక తాళం, ఆది తాళం ఎక్కువగా ఉండేవి.
మొదట్లో ఈ చిందు యక్షగానంలో మద్దెలు, తాళాలు, గజ్జెలు, పుంగీ ప్రధాన వాయిద్యాలు తర్వాత క్రమంలో హార్మోనియం వచ్చింది. చిందు యక్షగానంలో గొప్పతన మేమిటంటే కళాకారులు వాళ్లే, వాయిద్యకారులు వాళ్లే, భుజకీర్తులు, కిరీటాలను, నగలను కూడా వాళ్లే తయారు చేసుకోవడం విశేషం. పొనికి కర్రతో వీటిని తయారు చేస్తారు. పొనికి కర్రనే బూరుగు కట్టె అంటారు.


నిచ్చెన మెట్ల వ్యవస్థలో అణచివేతకు గురవుతున్న సామాజిక వర్గంలో ఉన్న మాదిగలకు ఉపకులంగా చిందు కులస్థుల గురించి చెప్పినా, జాంబవంతుని పెద్దభార్య పిల్లలు మాదిగలని, చిన్న భార్యపిల్లలు చిందు కులస్థులని వారి విశ్వాసం. మాదిగలకు తమకు మధ్య ఉన్న బంధం అదే అంటారు.
ఈ కళాకారుల విషయంలో ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం ఏమిటంటే… యక్షగానంలో ఆడవారి పాత్రలను ఆడవారే వేయడం. ఈ కుటుంబంలోని మహిళలకు అలాంటి అవకాశం ఉండేది. కళాకారులుగా రాణించినందుకు వారికి ఎటువంటి కట్టుబాట్లు, ఆంక్షలు ఉండేవి కావు. అది మనుగడ కోసమే అయినా ఆహ్వానించదగిన పరిణామమే.


1981లో నిజామాబాద్‍ జిల్లా తిరుమనపల్లిలో నటరాజ రామకృష్ణ గారి పరిచయం తర్వాత ఇదే జిల్లా కలెక్టరేట్‍లో ఇదే సంవత్సరం తొలి అధికారిక ప్రదర్శన. తదనంతర కాలంలో అంతర్జాతీయ ఖ్యాతికి తొలిమెట్టు అయ్యింది. నటరాజ రామకృష్ణగారితో పరిచయమైన రోజున చెంచులక్ష్మి కథను ప్రదర్శించారు. ఆ ప్రదర్శనకు ముగ్ధుడైన రామకృష్ణగారు తన శాలువా తీసి ఎల్లమ్మకు కప్పారు. చిందు కళను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అదే సంవత్సరం నాటక అకాడమీ సభ్యత్వం కూడా ఇప్పించారు రామకృష్ణగారు.


1986లో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుగారు చిందు ఎల్లమ్మ బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ‘అప్నా ఉత్సవ్‍’లో ప్రదర్శన ఇప్పించారు. ఆ అప్నా ఉత్సవ్‍లో నాటి ప్రధానమంత్రి రాజీవ్‍గాంధీతో పాటు.. నాటి రష్యా అధినేత గోర్బచెవ్‍ దంపతులు వారి ప్రదర్శన చూసి ముగ్ధులయ్యారు.
అదే సంవత్సరం చిందుల ఎల్లమ్మను ‘హంస’ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. ‘కళారత్న అవార్డు’, 2004లో ‘రాజీవ్‍’ ప్రతిభా పురస్కారాలతో రాష్ట్రం ప్రభుత్వం తన ఉనికిని చాటుకుంది. 2004లోనే నిజామాబాద్‍ నుంచి బోధన్‍ వరకు గల రహదారికి ఎల్లమ్మ రహదారిగా నామకరణం చేసిన అనతికాలంలోనే కళారూపాన్నే ఇంటిపేరుగా మార్చుకున్న చిందు ఎల్లమ్మ 2005, నవంబర్‍ 9న శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. అయినా అశేష అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా కొలువై ఉంది ఈ కళాతపస్వి.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-వి. పద్మ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *