తారే జమీన్‍ పర్‍ ‘ఇరామ్‍ మంజిల్‍’


చదివేస్తే ఉన్నమతి పోయి, కాకరకాయను కీకరకాయ అన్నట్లు మనం మన వీధులు, బస్తీల పేర్లన్నింటినీ అపసవ్యానికి, అపభ్రంశానికి గురి చేసాం.

అందుకే నేక్‍నాం పల్లె నాంపల్లి అయ్యింది. నేక్‍ నాం ఖాన్‍ కుతుబ్‍షాహీల కాలంలో ఒక ఉన్నతాధికారి. అతను నివసించిన ప్రాంతమే నేక్‍నాంపురా లేదా నేక్‍నాంపల్లె. చివరికి మనం ఆధునిక కాలంలో నేక్‍ను ఎగరగొట్టి నాంపల్లెను నాంపల్లిని చేసాం. ఉన్న పేర్లను చెడగొట్టటంలో ఘనులం మనం. మూన్సే రేమండ్‍ బాగ్‍ను ముసారాంబాగ్‍ అన్నాం. తోపులబట్టీని లేదా తోప్‍కాసాంచాను గన్‍ఫౌండ్రీ అన్నాం. జియ్యోరుగూడెం కాస్తా జియాగూడా అయ్యింది. ట్రూప్స్ బజార్‍ తూర్పుబజార్‍ అయ్యింది. అధికమెట్ట అడిక్‍మెట్‍ అయ్యింది. పాపం ‘‘దోమహల్‍’’ దోమల్‍గూడాగా అపఖ్యాతి చెందింది. ఇట్లా ఆ తప్పుల తడక వరుసలో ఇరామ్‍ మంజిల్‍ కాస్తా ఎర్రమంజిల్‍ కావటం ఆశ్చర్యం ఏముంది? యహాఁ సబ్‍కుచ్‍ చల్తా హై. చల్నేదో బాల్‍కిషన్‍!


ఆరవ నిజాం పరిపాలనా కాలంలో ఫక్రుల్‍ ఉల్‍ముల్క్ సైన్యాధికారి. ఆయన నివాసభవనమే ఇరామ్‍ మంజిల్‍. ఇతను గొప్ప సాహసంగల సైన్యాధికారి. ఆరవ నిజాం ప్రభువుకు నమ్మినబంటు. 1908లో మూసీ నదికి వరద వచ్చి నగరం కొట్టుకపోయినప్పుడు ఇతను చూపిన ధైర్యసాహసాల గురించి ఆనాటి ప్రజలు కతలు కతలుగా చెప్పుకునేవారు. ఆ వరదలకు, గాలివానకు పురానాపూల్‍తో పాటు చాదర్‍ఘాట్‍ వంతెన కూడా పూచికపుల్లలా కొట్టుకపోయింది. సెప్టెంబర్‍ నెలలో ఒకానొక కాళరాత్రి ప్రజలంతా పెను నిద్దురలో ఉన్నప్పుడు హైద్రాబాద్‍ నగరాన్ని జలసర్పం కాటేసింది. మరునాడు సూర్యోదయం అయ్యేసరికి నగరం నామరూపాలు లేకుండా అతలాకుతలం అయిపోయింది.


ఆరవ నిజాం నవాబు మహబూబ్‍ అలీఖాన్‍ ‘‘పాషా’’ కాలినడకన నగర పర్యవేక్షణకు బయలుదేరి జలవిధ్వంసాన్ని చూస్తూ చాదర్‍ఘాట్‍ ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ వంతెన స్థానంలో ఉగ్రరూపంలో పొంగిపొర్లుతున్న ముచికుందమ్మ (మూసీనది అసలు పేరు) కనిపించింది. గట్టుకు అవతలివైపున ఇరామ్‍మంజిల్‍ నుండి బయలుదేరి గుర్రంపై ఆసీనుడైన సైన్యాధికారి ఫక్రుల్‍ ఉల్‍ ముల్క్ కనిపించాడు.


నగరాన్ని రక్షించవలసిన ఒక సైన్యాధికారిగా ఆయన ఏమాత్రం జాగుచేయక తన అశ్వంపై నుండి దిగి వరద నీళ్ల వైపు అడుగులు వేసాడు. అతని కర్తవ్య నిర్వహణ గురించి బాగా తెలిసిన నవాబు ‘‘వద్దు వద్దు సాహసం చేయకండి’’ అని గొంతెత్తి అరిచినా ఆ ప్రభు భక్తి పరాయణుడు ఆ మాటలను లెక్క చేయక ప్రవాహంలో దుంకి ఈదుకుంటూ నవాబువైపు రాసాగాడు. ఆ ప్రవాహంలో అక్కడక్కడా మనుష్యుల, జంతువుల కళేబరాలు కొట్టుకపోతున్నాయి. ఆ జలసంద్రాన్ని ఎదిరిస్తూ ఈదుతూ ఒడ్డును సమీపిస్తుంటే ఒక పెద్ద దూలం అతని వైపు మృత్యుదూతగా అతివేగంగా దూసుక రాసాగింది. ప్రభువుతో సహ జనులంతా హాహాకారాలు చేయసాగారు. చాకచక్యంగా నీటిలో మునిగి తలదాచుకున్న ఆయన, దూలం తన తలపై నుండి దాటిపోగానే నీటిపై తేలి, ఒడ్డుకు వచ్చి తడిబట్టలతోనే తలక్రిందికి వంచి కుడిచేయితో మూడుసార్లు సలాంలు సమర్పిం చాడు. ప్రభువు ఆ భృత్యుడిని మనసారా కౌగిలించుకుని కంటతడి పెట్టాడు. వరద బాధితుల పునరా వాసం కోసం నవాబు తర్వాత పెద్ద ఎత్తున భూరి విరాళాన్ని ప్రకటిం చింది ఫక్రుల్‍ ఉల్‍ ముల్క్ గారే!


భవనాల నిర్మాణంలో ఈయనకు వికారుల్‍ ఉమ్రాతో పోటీ ఉండేది. వికార్‍ మంజిల్‍కు పోటీగా ఖైరతాబాద్‍లో ఎత్తైన గుట్ట మీద ఈయన ఇరామ్‍ మంజిల్‍ను నిర్మించాడు. హైద్రాబాద్‍లో ఉన్న గొప్ప భవనాలలో ఇరాం మంజిల్‍ కూడా ఒకటి. విశాలమైన స్థలంలో మైళ్లకొద్దీ కట్టిన ప్రహారీ గోడల మధ్య నిర్మించబడిన ఈ భవనం ఒక ‘‘చోటీసీ దునియా’’.


విలాసవంత జీవితానికి కావాల్సిన సౌకర్యాలు, హంగులన్నీ ఈ భవనంలో ఉండేవి. ఆ ప్రాంగణంలో అనేక పూదోటలు, ఉద్యానవనాలు, వాహ్యాళీ క్షేత్రాలు, పూదోటల మధ్య కాలిబాటలు, రహదారులు, ఈత కొలనులు, బోటింగ్‍ సరస్సులు, టెన్నిస్‍ కోర్టులు, రెండు పెద్ద పెద్ద పోలో ఆట స్థలాలు ఉండేవి. ఇరవై ముప్పై పశువులతో ఒక పాడి కేంద్రం మరియు ఆ గొల్ల వారి నివాసాల సముదాయం ఒక మూలలో ఉండేది. మరో మూలలో గుర్రపుశాలలు, వాటి రౌతులు, వారి పనివాళ్ల గృహాలు ఉండేవి. సవారీ గుర్రాలు, పోలో గుర్రాలు, యుద్ధరంగానికి వెళ్లే గుర్రాలు విడివిడిగా ఉండేవి. వాటికి సంబంధించిన రకరకాల వాహనాలు ఉండేవి.


ఆ ప్రాంగణంలోనే వివిధ సేవకావృత్తుల వారు నివసించేవారు. వారి భార్యలకు, పిల్లలకు కూడా అక్కడే చిన్నా చితకా ఉద్యోగాలు ఉండేవి. ఆధునిక శౌచాలయాలు వాడుకలోకి రానందున సాంప్రదాయిక మేతర్లు, పాకీపనివారు కూడా అక్కడే ఒక మూలలో నివసించేవారు.
ఇరాం మంజిల్‍లో ఉన్న చెరువుకు సమీపంలో చాకలివారు నివసించేవారు. అక్కడే దోబీఘాట్‍లు ఉండేవి. ఫక్రుల్‍ ముల్క్ దుస్తులు మాత్రం ఉతకటానికి, ఇస్త్రీ చేయటానికి ప్యారిస్‍కు పంపబడేవి. మేజోళ్లు, జేబురుమాళ్లు ఒకసారి వాడితే మళ్లీ వాడేవాడు కాదు. ఆయన అలంకార ప్రియుడు. రోజుకు రెండు, మూడు సార్లు దుస్తులు మార్చేవాడని ప్రతీతి. ఆరవ నిజాం నవాబు కూడా ఒకసారి వాడిన విదేశీ సబ్బును ఇంకోసారి వాడేవాడు కాదు. సేవకులు ఆ విదేశీ సబ్బులను జిమ్మేరాత్‍ బజారులో అమ్మి సొమ్ము చేసుకునేవారు.


వంట పనికి సంబంధించిన అనేక మంది సేవకులు బావర్చీలు, మసాల్చీలు ఉండేవారు. ప్రత్యేకమైన భవనంలో రెండు వంటశాలలే గాక వంట దినుసుల కోసం రెండు విశాలమైన గదులు కూడా ఉండేవి. మళ్లీ అందులోనే యూరోపియన్‍, చైనీస్‍, మొగలాయీ వంటల సెక్షన్లు వేరువేరుగా ఉండేవి. ఆ గదులలో తెల్లని చాదర్లు పరిచిన రెండు సోఫాలు ఉండేవి. నవాబుల స్త్రీలు బావర్చీలకు సలహాలు ఇవ్వటం కోసం అందులో ఆసీనులయ్యేవారు. ఆరోగ్యరీత్యా వంట పాత్రలు వెండివి తప్ప అల్యూమినియం గిన్నెలను వాడేవారు కాదు. ఈ గిన్నెలు వచ్చిన కొత్తలో పామరజనులు అల్యుమినియం అన్న పదం పలుకరాక అయోమయం గిన్నెలని, సీమెండి (సీమవెండి) గిన్నెలని పిలిచేవారు.


యూరోపియన్‍ వంటకాల్ని తయారు చేయటానికి గోవా నుండి రప్పించబడిన పోర్చుగీసు కుక్‍లు, మొగలాయి వంటల కోసం లక్నో, ఢిల్లీ నుండి వచ్చిన ఆర్గురు బావర్చీలు, డైనింగ్‍ హాలులో అనేకమంది బట్లర్లు సర్వదా సిద్ధంగా ఉండేవారు. వీరికి సహాయకులుగా శిక్షణ పొందిన వారేగాక బాల సేవకులు, సేవికలు కూడా ఉండేవారు. భవనం బాగోగులు, మరామత్తుల కోసం అనేక మంది మేస్త్రీలు, వడ్రంగులు, బిస్తీలు (తోలు సంచులలో నీటిని సరఫనా చేసేవారు) ఉండేవారు.
సాయం సంజెవేళలలో దీపాలు, షాండిలీయర్లు, రకరకాల రంగుల కొవ్వొత్తులు వెలిగించి భవనాన్ని దేదీప్యమానం చేయటానికి డజన్లకొద్దీ నౌకర్లు, చాకర్లు హమేషా ‘‘ఖడేరహోగా’’ హాజరుగా ఉండేవారు.


వీరేగాక జాగీరు జమాబందీ లెక్కలు చూడటం కోసం, ఇరాం మంజిల్‍ నిర్వహణా వ్యయం చూడటానికి అనేక మంది నఖల్‍ నవీస్‍లు, మునీమ్‍లు (క్లర్కులు, అకౌంటెంట్లు) చప్రాసీలు ఉండేవారు. వీరేగాక పిల్లలకు ఇంగ్లీష్‍, ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ భాషలలో చదువులు చెప్పటానికి టీచర్లు, ట్యూటర్లు, ఖురాన్‍ బోధించటానికి ముల్లాలు, మౌల్వీలు ఉండేవారు. బిలియర్డస్ గదులు, బాంక్వెట్‍ హాల్‍ నిపుణులు సరేసరి. వీరందరి సంఖ్య సుమారు ఐదువందలు అని అంచనా. వీరందరూ ఫక్రుల్‍ ఉల్‍ ముల్క్గారి వ్యక్తిగత, ఖాన్గీ (ప్రైవేట్‍) సిబ్బంది. వారి జీతభత్యాలు, నివాస సౌకర్యాల బాధ్యత అంతా ఆయనదే.


సిబ్బందికి రోగాలు, నొప్పులు వస్తే అందులోనే యూరోపియన్‍ డాక్టర్ల పర్యవేక్షణలో ఒక దవాఖానా ఉండేది. కొత్తగా పనివారు ఎవరు ఉద్యోగంలో చేరినా వారికి పూర్తిగా వైద్య పరీక్షలు జరిగేవి. తర్వాత ఎవరైనా జబ్బుపడితే ప్రత్యేక గదులలో వారిని పెట్టేవారు. ఆపరేషన్లు సహితం అక్కడే జరిగేవి.
భవనంలో ఎక్కడా దుమ్ముధూళి ఉండేది కాదు. ఈగలు, దోమలు, నల్లులు లాంటివి మచ్చుకైనా కనబడేవికాదు. సఫాయి ఇన్‍స్పెక్టర్ల నిఘాలో వంటగదులు, భోజనశాలలు, నివాసగదులు పరిశుభ్రంగా ఉండేవి. జనానా గదులలో స్త్రీ పర్యవేక్షకులు ఉండేవారు. స్త్రీ సేవకులలో ‘‘మామాలు’’ అని ప్రత్యేకంగా ఉండేవారు. వీరు జనానాకు, మర్దానాకు మధ్య సందేశకులుగా వ్యవహరించేవారు. జనానా గదుల వద్ద కాపలా కోసం పురుషులను నియమించ కుండా ‘‘కొజ్జాల’’ను నియమించేవారు.


ఇరాం మంజిల్‍లో ఆరువందల గదులుండేవి. నవాబు గారికి, ఆయన బేగం గారికి ప్రత్యేకమైన విలాస వంతమైన గదులు, ఐదుగురు కొడుకులకు, వారి కుటుంబాల వారికి వేరు వేరు గదులు ఉండేవి. బ్రేక్‍ఫాస్ట్ హాల్‍, డైనింగ్‍ హాల్‍, బాంక్వైట్‍హల్‍లు విడివిడిగా ఉండేవి. రెండు పెద్ద దివాన్‍ ఖానాలు, రెండు బిలియర్డస్ గదులు, కార్డస్ – పత్తాలాడుకునే రెండు గదులు ఉండేవి. బహమతులు, సావనీర్‍లు, ట్రోఫీలు, వెండి కప్పుల కోసం, ఆయుధాల కోసం, వేటాడిన పులులు, సింహాల చర్మాలు, బొమ్మలకోసం విశాలమైన గదులు ఉండేవి. దానిని షికారీ సెక్షన్‍ అనేవారు. ఆ ప్రాంగణంలో ఒక ‘‘బారాదరీ’’ ఉండేది. పన్నెండు తలుపులు, పన్నెండు కిటికీలు కలిగిన విశాలమైన గది అది.


అటువంటి వైభవోజ్వల భవనం ఇరామ్‍ మంజిల్‍ ఇప్పుడే మయ్యింది. కొంత భూఆక్రమణలకు గురైంది. మరికొంతలో నిమ్స్ దవాఖానా అయ్యింది. మరికొంత భాగంలో ఆఫీసర్స్ క్వార్టర్స్ అయినాయి. జింక పిల్లలు ఎగిరి దుమికిన ఉద్యానవనాలు లేవు. మలయ మారుతాలు లేవు. పూలసౌరభాలు లేవు గాక లేవు. లాహిరి లాహిరిలో అంటూ ఊగిసలాడుతూ వివహరించిన ఆ పూల పడవలూలేవు. ఆ నీలిజలాల సరస్సులూలేవు. గతంలోని ఘనవైభవ మంతా గాయబ్‍ అయిపోయి ప్రస్తుతం అక్కడ ఆర్‍ & బి చీఫ్‍ ఇంజనీర్‍ కార్యాలయం ఉంది.


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *