‘ఆరోగ్యదాయ నగరం’ భావన పట్టణ ప్రణాళికారచనలో కీలకం..



ఎప్పటికప్పుడు మానవాళిని విపత్తులు చట్టుముడుతూనే వుంటాయి. వాటిని ఎదుర్కోవడానికి మార్గాలు అన్వేషించడమూ, నివారించుకోవడమూ అంతే సహజం. ఇప్పుడు కరోనా అనే మహమ్మారినే కాక తద్వారా ఏర్పడిన అనేక ఒత్తిళ్లను తట్టుకొని నిలబడాల్సి వస్తుంది. వీటిని అధిగమించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. ఈ విపత్తులకూ, అమలు చేస్తున్న, చేయబోతున్న ప్రణాళికలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల సురక్షితకు అర్బన్‍ ప్లానింగ్‍ సిస్టమ్‍ అత్యంత కీలకం. నగరాలలో, పట్టణాలలో రోజురోజుకీ జనసాంద్రత పెరుగుతుంది. 2060నాటికి 66 శాతం జనాభా పట్టణ వాసులు కాబోతున్నారని ఐరాస అంటున్నది.


ఈ సమయంలో ఆరోగ్యదాయక నగరం అనే నూతన భావన ముందుకొచ్చింది. వాయు, శబ్ద, జల, పారిశుద్ధ్య కాలుష్యాలకు చోటులేని విధంగా ప్రణాళికలు రూపొందించుకొని, పటిష్టంగా అమలు చేయడంద్వారా ‘ఆరోగ్యదాయకనగరం’ సాధ్యమవుతుంది. పట్టణ ఆరోగ్యసుస్థిరతకు, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు, సంక్షోభ సమయాల్లో సేవల నిమిత్తం బహిరంగస్థలాలు, భవనాలు ప్రొటోకాల్‍ ప్రకారం మార్పులకు పటిష్ట చర్యలు తీసుకోవాలి.


పట్టణ ప్రణాళిక రచనలో జనసాంద్రత, హౌసింగ్‍, పబ్లిక్‍ స్పేసెస్‍, రవాణా, డిజిటల్‍ టెక్నాలజీ, పబ్లిక్‍ హెల్త్ సుస్థిరత, డ్రైనేజీ వ్యవస్థ, విద్యాభివృద్ధి వంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది.


నగర శివారు ప్రాంతాలతో బహుళ అంతస్తుల భవన నిర్మాణం ద్వారాను, గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పథకాలు, ఉపాధి అవకాశాలు కల్పించి వలసలను నివారించడం ద్వారాను పట్టణ జనసాంద్రతను తగ్గించేందుకు, ఔటర్‍రింగ్‍ రోడ్స్, అనుబంధ రహదారులు, ప్లై ఓవర్లు, మెట్రో వంటి ద్వారా రవాణా సమస్యలను, మూసీ ప్రక్షాళన, డ్రైనేజీ వ్యవస్థల మరమ్మత్తులు, నిర్మాణాలు, నాళాల పరిరక్షణ, పారిశుద్ధ్య చర్యలలో నూతన విధానాలు, హరితహారం, గ్రీన్‍ సిటీల ద్వారా ఆరోగ్యదాయక నగరం కోసమే కాకుండా, UNESCO గుర్తింపుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్న హైదరాబాద్‍ నగరానికి World Heritage City Statusసాధన కోసం మున్సిపల్‍ శాఖా మంత్రి కెటీఆర్‍ అధికారులకు సూచనలిస్తూ ప్రణాళిక చర్యలు అమలయ్యేలా చూడటం హర్షదాయకం.


చేనేత మన ప్రాచీన సంస్కృతికి ప్రతిబింబం. కళాత్మక నైపుణ్యతకు, ప్రతిభకు మన చేనేత కార్మికులు ప్రపంచ గుర్తింపును పొందారు. యాంత్రీకరణ అభివృద్ధి వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ఇతర ప్రాంతాలకు వలస పోవడం. యితర పనులు చేసుకోవడం మనం చూస్తున్నాం. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం దాదాపు 10 వివిధ పథకాలు ప్రవేశపెట్టింది. రుణమాఫీ చేసింది. టెక్స్టైల్‍ హబ్‍ ఏర్పాటు చేసింది. ఉత్పత్తిని ప్రభుత్వాశాఖలే కొనుగోలు చేసేలా చూసింది. గొల్లభామ చీరెలకు సిరిసిల్లా పేటెంట్‍ పొందింది. వివిధ పథకాల ద్వారా చేనేతకు పూర్వ వైభవం తేవడం కోసం కేటీఆర్‍ చేస్తున్న కృషి అభినందనీయం.


ఇక్కత్‍ వస్త్రాలకు, చారిత్రక, పర్యాటక అంశాలకు చిరునామా భూదాన్‍ పోచంపల్లి. ఇప్పుడు యునైటెడ్‍ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్‍ వారి ‘బెస్ట్ టూరిజం విలేజ్‍’ కాంటెస్ట్కు నామినేట్‍ అయింది. ఇందులో విజేతగా నిలిచి మన రాష్ట్రానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తుందని ఆశిద్దాం.


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *