బీగల్‍ యాత్ర (Voyage) లక్ష్యాలు!

ప్రకృతే నియంత్రిస్తుంది! 12 ప్రకృతే శాసిస్తుంది!!(గత సంచిక తరువాయి)

ఏదైనా ఓ లక్ష్యం నెరవేరాలంటే సరియైన ప్రణాళిక వుండాలి. లేకుంటే సత్ఫలితాలు రావు. పారిశ్రామిక విప్లవంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో యూరప్‍ దేశాలన్నీ ప్రపంచం వైపు దృష్టిసారించాయి. ఆయా దేశాల, ప్రాంతాల, భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై సర్వేలను చేపట్టాయి. దీంతో ఆయా ప్రాంతాల సంపదల్ని కొల్లగొట్టి, రాజకీయ అనిశ్చిత పరిస్థితిని కలిగించి, ఆ దేశాల్ని ఆక్రమించాలనేది దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో ఇంగ్లాండ్‍ది అగ్రభాగంగా వుండేది. ఈ నేపథ్యంలోనే రవి అస్తమించని సామ్రాజ్యాధినేతగా బ్రిటన్‍ చరిత్రలో నిలిచిపోయింది. నాటికి విమానాలు (1903 వరకు) అందు బాటులోకి రాకపోవడంతో సముద్ర మార్గాలనే ఈ అన్వేషణకు వాడుకునే వారు. భారతదేశాన్ని కూడా ఈ విధంగానే కైవసం చేసుకోవడం జరిగింది.
ఈ కోవలోనే బ్రిటన్‍ నౌకాదళంకు చెందిన HMS బీగల్‍ (Beagle)ను భూమధ్యరేఖ ప్రాంత ఖండాల తీరాల్ని, దేశాల్ని, ఆయా ఖండాలకు సముద్ర మార్గాల్ని రూపొందించడానికై, పరిశీలించడానికై వినియోగించారు. ఇందులో భాగంగానే మొదటి యాత్రను దక్షిణ అమెరికాఖండ తీరప్రాంతాల దేశాల్ని సర్వే చేసారు. దీనికై హైడ్రో గ్రఫీ (hydrography) విధానాన్ని వినియోగించి సముద్రలోతుల్ని, థియోడోలైట్‍ను ఉపయోగించి దూరాలని, ఎత్తుల్ని గుర్తించారు. ఈ విధంగా వివిధ సముద్రాల, సరస్సుల, సముద్రాల్లో కలిసే నదుల భౌతిక, భౌగోళిక పరిస్థితుల్ని తెలుసుకున్నారు. అలాగే కాలమానిని (chronometer) ఉపయోగించి అన్ని ప్రాంతాల సమయాన్ని (timezone) కచ్చితంగా గుర్తించారు.


రెండో యాత్రలో మొదటి యాత్ర లక్ష్యాలకు తోడుగా, దక్షిణ ఆఫ్రికాఖండ తీరప్రాంతాన్ని కూడా సర్వేచేసి పటాలను (charts) తయారు చేస్తూ, భూగోళం చుట్టూగల రేఖాంశం యొక్క కచ్చితమైన నిడివిని కనుగొనాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే 33 సెకండ్ల లోపంతో (error) 22 క్రోనోమీటర్లను ఉపయోగించి మొత్తం రేఖాంశ నిడివిని గుర్తించారు. వీటికి అదనంగా శాస్త్రీయ అన్వేషణ (explore)ను చేపట్టాలని భావించిన కెప్టెన్‍ ఫిట్జ్రాయ్‍ ప్రకృతి అన్వేషణకై డార్విన్‍ను తోడు తీసుకెళ్ళాడు.


లక్ష్యాల్ని అధిగమించిన అన్వేషణ : (Exploration)

ప్రకృతి ఔత్సాహికుడైన డార్విన్‍తో బయలు దేరిన బీగల్‍ డార్విన్‍ ఊహలకే అందని పరిణామ సిద్ధాంతానికి బాటలు వేసిన పరిస్థితులు ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. యావత్‍ ఉత్తర, దక్షిణార్థ గోళాల భూభాగాన్ని, మూడు మహా సముద్రాల్ని (అంటార్కిటిక్‍, పసిఫిక్‍, హిందూ) చుట్టి, రెండు సంవత్సరాలనుకున్న అన్వేషణ అయిదు సంవత్సరాలపాటు సాగి, భౌగోళిక అంశాలతోపాటు, జీవుల గూర్చి, వాటి మనుగడ, వైవిధ్యం గూర్చి, పరిణామం గూర్చి విస్తృతంగా పరిశీలించి, జీవుల పుట్టుక దైవసంబంధమన్న భావనల్ని పటాపంచలం చేసి ఆధునిక ఆలోచనలకు బాటలు వేయడం యాదృచ్ఛికమే!


ఈ విధంగా ఇంగ్లాండ్‍లోని ప్లైమౌత్‍ (Ply mouth) రేవు నుంచి 27 డిసెంబర్‍ 1831న ప్రారంభమైన యాత్ర 2, అక్టోబర్‍ 1836 దాకా సాగింది. ఈ యాత్రలో కెనరీ ద్వీపాల్లోని (స్పెయిన్‍) టెయినిరిఫ్‍ (Tenerif) అగ్విపర్వత ప్రాంతాన్ని, దక్షిణాఫ్రికాలోని కేప్‍ వర్డే (Cape Verde) దేశంలోని దాదాపు పది అగ్నిపర్వత ద్వీపాల్ని పరిశీలించి తిరిగి దక్షిణ అమెరికా తీరప్రాంతాల అన్వేషణను కొనసాగించింది. ఈ ఖండంలోని దేశాలైన బ్రెజిల్‍, ఉరుగ్వే, అర్జెంటినా, పెరు, ఈక్వడార్‍ తదితర దేశాల్లోని అనేక ద్వీపాల సమూహాల్ని, భూఖండికల్ని, రేవు పట్టణాల్ని అన్వేషిస్తూ, మూడు సార్లు భూమధ్యరేఖను అటూ, ఇటూ దాటి (Line crossing cermony on 17/2/1832), కర్కట, మకరరేఖల ప్రాంతాల భూభాగాల్ని (ధృవప్రాంతాలు తప్ప) అనేక ఒడిదొడుకులకు, ప్రకృతి వైఫరిత్యాలకు గురై, అగ్ని పర్వతాల పేలుళ్ళను ప్రత్యక్షంగా చూస్తూ, భూకంపాల్ని తట్టుకుంటూ యాత్ర కొనసాగింది.


ఈ యాత్ర చెప్పుకోవడానికి బాగానే వున్నా, మొత్తం యాత్ర ఓ పీడకల లాంటిదే! కీకారణ్య కీటకాల దాడి, సరీసృపాల ప్రాణసంకటం అనునిత్యం వెంటాడేది. డార్విన్‍ను అడవి నల్లులు కుట్టడంతో నిత్య జ్వరపీడుతుడిగా మారాడు. ఆహార సమస్యతో జీర్ణాశయం దెబ్బతిని జీర్ణకోశ వ్యాధులతో డార్విన్‍ జీవితాంతం బాధపడ్డాడు. మరికొన్ని ద్వీపాలైతే మానవ మనుగడలేనివే! యాత్ర మొదలైన వారం రోజులకే ఇంగ్లాండ్‍లో కలరా మహమ్మారి సోకిందన్న వార్తతో బీగల్‍ సిబ్బంది స్పెయిన్‍లోని కెనరి ద్వీపంలో క్వారంటైన్‍లోకి పోవాల్సి వచ్చింది. నాడు ప్లేగ్‍, కలరా సర్వసాధారణమైన మహమ్మారీలు. ఇలాంటి కారణాలచే శాంతాక్రుజ్‍ (Santa Cruz) ద్వీపానికి అనుమతి కూడా లభించలేదు. ఇలా వరుసగా బాహియా (Bahia) రియోడిజనిరో, మోంటెరిడియో, ఫాక్లాంజ్‍, వాల్‍పరాసియో (Valparasio), కాలోలిమా (Callolima)లను చూసుకుంటూ 15 సెప్టెంబర్‍, 1835న గాలాపాగోస్‍ (Galapagos) దీవుల్ని చేరింది.


ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా ఖండంలోని తూర్పు, దక్షిణ ప్రాంతంలోగల సిడ్నికి, (జనవరి 1836) తర్వాత న్యూజిలాండ్‍, తహితి, హోబర్ట్, కింగ్‍ జార్జ్ సౌండ్‍లను చుట్టి హిందు మహాసముద్రంలోని కాక్స్ (Cocos – Keeling) పగడపు దీవుల్ని పరిశీలించి మారిషస్‍ (Marritius) ద్వారా తిరిగి శీతాకాలంలో (1836) దక్షిణాఫ్రికా కేప్‍టౌన్‍కు చేరుకుంది. ఇక్కడ ఓ మూడు నెలల అన్వేషణ తర్వాత తిరిగి బాహియ, కేప్‍ వర్డెల ద్వారా అజోర్స్ (Azores)కు చేరింది. ఈ యాత్రలో ఇదే చివరి మజిలి. చివరికి బయలు దేరిన ఇంగ్లాండ్‍కు తిరిగి వచ్చింది.


ఈ విధంగా అన్వేషణ వాతావరణ పరిస్థితులకు లోబడి, అవసరాల రీత్యా, సేకరణ ప్రాధాన్యతను బట్టి, కొన్ని దీవుల్లో దీర్ఘ కాలికంగా నెలల కొద్ది, వారాల కొద్ది కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో టెంట్లు వేసుకోగా, మరి కొన్ని ప్రాంతాల్లో ఇంటిని కిరాయి (Butafogo) తీసుకొని సర్వే చేయడం జరిగింది. ఆస్ట్రేలియాలో 12 జనవరి 1836 నుంచి మార్చి 30 వరకు వివిధ ప్రాంతాల్ని చూసారు. చాలా ప్రాంతాల్లో సర్వే ప్రాముఖ్యతను బట్టి, అధికారులు, ఆయా దేశాల సర్వేయర్‍ జనరల్స్ వచ్చి కెప్టెన్‍ను, డార్విన్‍ను కలిసేవారు. దీంతో డార్విన్‍ ఆలోచనా శక్తి మరింతగా పదునెక్కింది.


జీవం పుట్టుకపై సుడులు తిరిగిన ఆలోచనలు !

యాత్ర మొదలు కాగానే కెప్టెన్‍ ఫిట్జ్రాయ్‍, చార్లెస్‍ లియల్స్ (Lyells) రాసిన భూగర్భ సూత్రాలు (Principle of Geology) అనే పుస్తకాన్ని డార్విన్‍కు ఇచ్చి చదవమన్నాడు. దీంతో భూగర్భశాస్త్రంపై అవగాహన పెరగడంతో తనకుతానే భూగర్భ శాస్త్రజ్ఞుడిగా, శిలజాల సేకరణకుడిగా (fossil collector) డార్విన్‍ చెప్పుకునేవాడు. తానుకూడా అలాంటి పుస్తకాన్ని మరింతగా పరిశోధన చేసి రాయాలనుకున్నాడు. కాని తలచింది ఒకటైతే జరిగింది మరొకటి. అర్జెంటినాలోని పుంటా అల్టా (Punto Atla) అనే ద్వీపంలో పురాతన అతిపెద్ద పాలిచ్చే జంతువు (sloth – ఎలుగుబంటి ముఖంతో ఏనుగు ఆకారం) శిలజాన్ని చూసిన డార్విన్‍ అది నేటి భూమిపై గల పెద్ద జంతువులకు దగ్గరగా వుందని గుర్తించాడు. దృఢమైన శరీరంతో గల ఏనుగు, (gomphotheres) గుర్రపు అస్థి పంజరాల్ని సేకరించి లండన్‍కు తరలించాడు. అలాగే సెంట్‍ జాగో (St. Jago)లో దాదాపు 23 మీ. ఎత్తులో వుండే బ్యారెల్‍ ఆకారపు బాఓబా (adansonia) అనే ఓ మహావృక్షాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.


న్యూజిలాండ్‍లో గల మానవరహిత క్వాయిల్‍ (Quail – పిట్ట) దీపంలో మరే ప్రాంతంలో చూడనటువంటి తాబేళ్ళను, ఎర్రరంగుతో ఆకర్షణీయంగా, చిన్నకాళ్ళతో వుండే ఎండ్రికాయల్ని, ఊసరవెళ్ళిలా రంగులు మార్చే ఆక్టోపస్‍ (octopus)ను చూసాడు. ఇక్కడ నాడు డార్విన్‍ బృందం టెంట్లు వేసుకొని ఉన్న ప్రాంతంలో నేడు జంతువుల క్వారంటైన్‍ కోసం అందమైన గుడిసెల్ని నిర్మించారు. ఈ అన్వేషణ వృక్షాలకు, జంతువులకు (క్లామిడోమోనాస్‍ వృక్ష;, జంతు సంబంధమైనదని భావిస్తారు) మధ్యగల సంబంధాల్ని తెలియచేసింది. ఇలా చాలా ద్వీపాలు మానవరహితంగా, ప్రకృతి విధ్వంసం లేకుండా, కాలుష్యరహితంగా వుండడంతో జంతుజాలం, వృక్షజాలం, మొక్కలు, పక్షులు, కీటకాలు, సముద్రజీవులు దీర్ఘకాలికంగా మనుగడ సాగించాయి. మరణించినవి ప్రకృతి ఒడిలో శిలజాలుగా మారాయి. ఇలా పదునెక్కిన ఆలోచనలతో డార్విన్‍ కొన్ని దీవుల్లో గుర్రాల్ని అద్దెకు తీసుకొని, సహాయకుల్ని ఉపయోగించి మరింత లోతైన పరిశీలనలను చేసాడు.
విభిన్న ద్వీపాల్లోని ప్రకృతి, జంతు, వృక్ష వైవిధ్యాలు డార్విన్‍ను మరింతగా ఆలోచించేలా చేసాయి. రోజురోజుకు గడించిన అనుభవం ఆలోచనసుడుల్ని మరింతగా పెంచాయి. గాలాపాగోస్‍ దీవుల్ని సందర్శించిన (సెప్టెంబర్‍ 1835) సందర్భంగా చూసిన ఫించ్‍ (fringillidae) పక్షుల ఆహార సేకరణ విభిన్న ఆలోచనలకు తెరలేపాయి. పావురం, రామచిలుక, వడ్రంగి పిట్టలా కొన్ని గింజల్ని తింటే, కొన్ని చిన్న కీటకాల్ని, మరికొన్ని చెట్ల కాండాల బెరడను కొరికి తినేవి. కాలక్రమంలో వీటి ముక్కు (beak) ఆకారంలో మార్పు వచ్చినట్లుగా గ్రహించాడు. ఒకేజాతి, ఒకే ఆకారమైనా, ఆహారపు అలవాట్లలో (నేటి మానవుల్లా) మార్పులకు ఆయా ఆవాస ప్రాంతాలేనని గ్రహించాడు. అందుకే ఈ పక్షులు దీవులకు దీవులకు వేరుగా, ఒకే దీవిలో విభిన్నంగా వున్నట్లు గ్రహించి, ఇదో జీవపరిణామమని సిద్ధాంతరీకరించుకున్నాడు.


గాలాపాగోస్‍ దీవులు :
ఈక్వడార్‍లోని 127 ఖండికల సమూహమే ఈ గాలాపాగోస్‍ ద్వీపాలు. పశ్చిమార్థ గోళంలో భూమధ్యరేఖకు ఇరువైపులా పసిఫిక్‍ మహాసముద్రంలోని ఈ ద్వీపాల్లో 19 పెద్దవికాగా, అయిదు మానవ రహితమైనవి. ఇందులో ఓ ద్వీపం పేరును డార్విన్‍ ద్వీపంగా తర్వాత పేరుపెట్టారు. 1987లో యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా (ఒకటిగా) గుర్తించింది. డార్విన్‍ పరిణామ సిద్ధాంతానికి పురుడు పోసినందుకు గాను పుయర్టొ అయోరా (Puerto Ayora) అనే ద్వీపంలో డార్విన్‍ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసారు.
తన అన్వేషణలో అత్యధిక సమయాన్ని డార్విన్‍ ఈ దీవుల్లోనే గడిపాడు. అయిదు దఫాలుగా సందర్శించి 34 రోజులపాటు భూ, సముద్ర భాగాల్ని, జంతువులను, పక్షులను, సరీసృపాల్ని, కీటకాల్ని, ఆర్ద్రోపోడల్ని నిశితంగా పరిశీలించాడు. రక్షణకోసం జంతువులు (మొలస్కాజాతి) తమ చుట్టూ ఏర్పర్చుకునే రక్షణ కవచాన్ని (shell) సేకరించాడు. సముద్ర సింహాలతో ఈదులాడాడు. అగ్ని పర్వతాలు పేలడాన్ని, భూకంపాలు రావడాన్ని స్వయంగా చూసాడు. భూకంపం సందర్భంగా చిలీ దేశంలో భూమి పైకి ఉబికి, దాదాపు 7వేల అడుగుల ఎత్తుకు లేవడాన్ని చూసాడు. ప్రత్యేకంగా ఆకుపచ్చ, చుక్కల తాబేళ్ళను, గొంతు భాగంలో ఎర్రని తిత్తిగల పెద్ద పక్షి (frigate)ని, బాతు ఆకారపు నీలి పాదాల (booby)ను చూసాడు.


ఆఫ్రికా ఖండంలోని కేప్‍వర్డె (Cape Verde)లోని పది అగ్ని పర్వత ప్రాంతాల్ని, భూమధ్యరేఖపైగల సెంట్‍ పాల్‍ రాక్స్ (St. PaulRocks)లోని 15 ద్వీపాల సమూహాన్ని పరిశీలించగా, ఎక్కడ అనుభవించని విధంగా అతి సాధారణ గాలులు వున్నట్లు గ్రహించాడు. ఇలా చూసిన వాటిలో కొన్ని చిన్న జంతువులను
(తాబేళ్ళు), శిలజాలను, పక్షుల్ని, వాటి గూళ్ళను, తదితర నమూనాల్ని తెచ్చి, వెంట వెంటనే ఇంగ్లాండుకు భద్రంగా రవాణా చేసాడు. డార్విన్‍ సేకరించిన కొన్ని విలువైన నమూనాలు ఇప్పటికీ లండన్‍ మ్యూజియంలో వున్నాయి.


ఆస్ట్రేలియాకే పరిమితమైన కొన్ని జంతువులు :
‘కంగారు’ (kangroo) దేశమని ఆస్ట్రేలియాను పిలవడం తెలిసిందే! కారణం, భూగోళంపై మరే ప్రాంతంలో లేని కంగారు. ప్లాటిపస్‍ (platypus), ఎకిడ్నా (echidna) జాతి జంతువులు ఈ గడ్డపైననే కనపడుతాయి. సహజంగా పాలిచ్చే జంతువర్గానికి చెందిన ప్లాటిపస్‍, ఎకిడ్నా పిల్లల్ని నేరుగా కాకుండా సరీసృపాల్లా, పక్షుల్లా, గుడ్లు పెట్టి, పుట్టిన పిల్లలకు పాలిస్తాయి. కంగారు తన సంతానాన్ని పొట్టభాగంలోని ఓ సంచిలో (sac) దాచుకొని పరుగెడుతుంది. 12 జనవరి 1836లో సిడ్నీ ఓడరేవుకు చేరుకున్న డార్విన్‍ ఆస్ట్రేలియాలో 19 రోజులు అన్వేషణ సాగించాడు. దక్షిణ అమెరికాలో చూడని అనేక కొత్తరకాల జంతు, వృక్ష, కీటకాలని చూసాడు. బ్లూమౌంటేన్‍, జాస్మిన్‍లోయ, హోబర్ట్, మౌంట్‍ వెళ్ళింగ్‍టన్‍ (ఎక్కాడు) లను చూసి, చివరిగా కింగ్‍ జార్జి సౌండు పోర్టుకు చేరుకున్నాడు.


ఇతర ప్రాంతాలతో పోల్చినప్పుడు, ఈ ప్రాంతంలో అత్యధిక రకాల జీవజాతుల్ని ఆయన సేకరించాడు. 119 రకాల జీవజాతుల సేకరణలో 97 రకాలు కీటకాలే! ఇందులో 42 రకాలకు పేర్లు లేకపోగా, నాల్గుంటికి తర్వాతి ప్రకృతి శాస్త్రజ్ఞులు డార్విన్‍ పేరు పెట్టారు. కొత్తరకం ఎలుక (ఇప్పుడు కను మరుగైంది), తొండలు, కప్పలు, తుమ్మెదలు, ఆరు రకాల బీటల్స్ (beatles), నాలుగు రకాల స్టింక్‍ నల్లులు, పలురకాల పాములు ఇతర సరీసృపాల్ని సేకరించాడు. అన్నింటికి మించి డార్విన్‍ను ఆలోచింప చేసినవి కంగారు, ప్లాటిపస్‍. ఉత్తరార్ధ్ర గోళంలో కనపడని ఈ జాతులు ఆస్ట్రేలియాకే పరిమితమా, లేక ఇతర ప్రాంతాలలోని ఎలుక (rat-kangroo), కుందేళ్ళ నుంచి ఇవి రూపాంతరం చెందాయా అనే సంశయం డార్విన్‍కు వచ్చింది. జీవుల పుట్టకకు, సృష్టికర్తకు (Creator) ఎలాంటి సంబంధం లేదనే నిర్ణయానికి వచ్చాడు. కాని, ఈ విషయాన్ని వెంటనే బహిర్గతంగా ప్రకటించలేక పోయాడు. తిరుగు ప్రయాణంలో దారిపొడుగునా సముద్ర పక్షుల్ని, అనేక రకాల చేపల్ని, సొరచేపల్ని (shark), డాల్ఫిన్లను, తిమింగలాల్ని, పగడపు దీవుల్ని, సూదంటురాయి (reefs) దిబ్బల్ని కూడా చూసాడు.


అమెజాన్‍ అడవులపై దృష్టిపెట్టని డార్విన్‍ :

ప్రకృతి అన్వేషనలో ప్రథముడిగా గుర్తింపబడ్డ డార్విన్‍ ఆఫ్రికా ఖండంలోని అమెజాన్‍ అడవుల్ని, నైలునది పరివాహక ప్రాంతాల్ని చూడలేకపోయాడు. బహుష కెప్టెన్‍ ఫిట్జ్రాయ్‍కి డార్విన్‍ ఓ సహాయకుడే గాని స్వయం నిర్ణయాధికారి కాకపోవడం వల్ల కావచ్చు! ఈ యాత్రలో కెప్టెన్‍కు, డార్విన్‍కు మనస్పర్తలు కూడా వచ్చాయనేది ఓ కథనం. అలాగే బీగల్‍ యాత్ర మొత్తంగా తీర ప్రాంతాలకే పరిమితం కాబట్టి, లోతట్టు ప్రాంతాల్ని అన్వేషించలేకపోయి వుంటాడు.
పరిణామ సిద్ధాంతానికి బీజం వేసిన ఈ యాత్ర, అమెజాన్‍ అడవుల్లోని జీవ, జంతుజాలాన్ని, ముఖ్యంగా తోకలేని మానవులైన (apes) చింపాంజీ, గొరిల్లా, ఒరాంగ్‍టాన్‍లను చూసినట్లైతే ఆయన సిద్దాంతానికి మరింతగా బలం చేకూరడమేకాక, యాత్ర ముగిసిన వెంటనే సిద్దాంత ప్రకటన చేసి వుండేవాడు.


సిద్దాంతానికి పరిపూర్ణత చేకూరిన విధం :
యాత్ర విజయగాధ తర్వాత రెండు సంవత్సరాలకు (1838) లండన్‍లోగల జంతువుల పార్కును (Zoological) డార్విన్‍ సందర్శించి, మొదటిసారి మూడు సంవత్సరాల ఒరాంగుటాన్‍ను (Jenny) చూసాడు. తోడుగా వున్న మరో మగ ఒరాంగుటాన్‍, వాటి మధ్యగల ప్రేమానురాగాల్ని, ప్రదర్శనశాల సంరక్షుడు (Curator) ఇచ్చే ఆదేశాల్ని పాటించడాన్ని చూసి, వీటికి (apes) మానవులకు విధిగా పూర్వపు బంధం వుంటుందనే నిర్ధారణకు వచ్చాడు. అప్పటికే జీవుల పుట్టకపై విక్టోరియన్‍ చర్చి ఆలోచనలకు వ్యతిరేకంగా ఓ నిర్ణయానికి వచ్చిన డార్విన్‍, ఒరాంగ్‍టాన్లను చూసిన తర్వాత మరింత ధైర్యంగా ముందడుగు వేసాడు. అయినా 21 సం।। తర్వాతగాని (1859) సహజ ఎంపిక ద్వారా జీవుల పుట్టుక (on the origin of species by means of Natural selection) అనే పుస్తకాన్ని ప్రచురించ లేకపోయాడు.


అందరు భావిస్తున్నట్లుగా గాలాపాగోస్‍ దీవులలో, లభించిన రకరకాల జంతువులు, వెక్కిరించే పక్షులు (mocking) డార్విన్‍ సిద్దాంతానికి పరిపూర్ణతనేమి ఇవ్వలేదు. ఫించ్‍పక్షుల ముక్కులు మాత్రం డార్విన్‍ ఆలోచనల్ని తట్టి లేపాయి. ఏది ఏమైనా, వేలాది సంవత్సరాలుగా మానవుడి బుర్రను తొలుస్తున్న జీవం పుట్టుక, జీవుల పరిణామాలు జరిగినతీరుపై ఓ సమగ్ర సమాచారాన్ని, హేతుబద్ద శిలాజాల సేకరణను, సంధించే ప్రశ్నలకు సమాధానాల్ని డార్విన్‍ తన సిద్దాంతాల ద్వారా, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు.


డార్విన్‍ ఆలోచనల్ని, ఆయన సిద్దాంతాల్ని తార్కిక దృష్టితో భావితరాలకు చెప్పగలిగే వారు వుంటే, సమాజపు ఆలోచనలో అనూహ్యమైన మార్పు వస్తుంది. భూమి, జీవరాశి పుట్టుక, పరిణామం, మనుగడ అర్థమవుతోంది. (వచ్చే సంచికలో డార్విన్‍ సిద్దాంత ఆవిష్కరణను చూద్దాం!)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *