కొలిపాక తీర్థం చారిత్రక భాగ్యనగరమా, శాపగ్రస్త పురమా?


(గత సంచిక తరువాయి)
కొలనుపాక పురావస్తుశాఖ మ్యూజియం:

ఈ మ్యూజియంలో విద్యాదేవి శిల్పం అపురూపమైంది. ఈ దేవత (జయద్రథ యమళ తంత్రం) తాంత్రిక దేవత. ఎక్కడ ఈ విగ్రహం లభించిందో అక్కడ తప్పక ప్రత్యేక దేవాలయం వుండాలి. మ్యూజియంలో నిలబెట్టిన వానరుని శిల్పం కుడిచేత గద, ఎడమచేయి చిన్ముద్రలో వున్నాయి. ఇది మత్స్యవల్లభుని విగ్రహమేనా? శివతాండవ శిల్పాలు రెండున్నాయి. ఒకటి భుజంగత్రాస భంగిమలో దండహస్తంతో కనిపిస్తుంది. కొన్ని దేవతల ఊర్ద్వాంగప్రతిమలు (Bust Size)న్నాయి. 16వ శతాబ్దపు కోదండరాముడున్నాడు. లింగాలున్నాయి. శాసనస్తంభాలున్నాయి. సూర్య శిల్పాలున్నాయి. దేవకోష్టాలున్నాయి. వీరగల్లులున్నాయి. వీరనారాయణ దేవాలయ ప్రాంగణంలో లభించిన మహావీరుని ప్రతిమ వుంది. మ్యూజియంలో గతంలో కనిపించిన శిల్పాలు ఇపుడన్ని కనబడవు.


వందేండ్ల కింద కొలనుపాక:
వందేండ్ల కింద (క్రీ.శ.1915) కొలనుపాక దేవాలయాలను సందర్శించిన నిజాంకాలపు పురావస్తుశాఖ అసిస్టెంట్‍ సూపరింటెండెంట్‍ టి. శ్రీనివాసాచార్య రాసిన పుస్తకంలో ఉన్న విషయాలు సంక్షిప్తంగా…
‘‘ఈ గ్రామంలో పెద్దసంఖ్యలో దేవాలయ శిథిలాలు, చెక్కిన రాతిస్తంభాలు, విగ్రహాలు, సాలంకాలు, నందులు, లింగాలు, సప్తమాత•కలు దొరికాయి. రెండు పాత దేవాలయాలు సోమేశ్వరుని గుడి, వీరనారాయణగుడి పూజాదికాలు నడుస్తున్న గుళ్ళు. ఇంకా 22 చిన్నగుడులు మఠాలుగా పిలువబడేవి వున్నాయి. ఇవన్నీ శిథిల (జైన) దేవాలయాలరాళ్ళు, శిల్పాలతో కట్టినవే. సోమేశ్వరుని గుడికి ఏకైక పెద్దద్వారం తూర్పున వుంది. (ఈ ద్వారం కాకతీయ ద్వారతోరణంలెక్క గజలక్ష్మి లలాటబింబంగా, వేలాడుతున్న 7మొగ్గలతో, ద్వారస్తంభాలకు రెండువైపుల కలశాలతో, ముందర విరిగిపోయిన శంఖలతాతోరణంతో వుంది.) గుడికి ముందర బహిరంగ ప్రాంగణం వుంది. మధ్యలో 26అ.ల ఎత్తున్న ఏకశిలా స్తంభం వుంది. ప్రాంగణానికి ఉత్తర, దక్షిణాలుగా స్తంభాలతో రెండు వరండాలున్నాయి. అక్కడ కొన్ని లింగాలు, సాలంకాలున్నాయి.


ఉత్తరవరండాలో వికసితపద్మం మీద మడిమలమీద (వజ్రాసనంలో) కూర్చున్న చతుర్భుజి, స్త్రీదేవతా శిల్పముంది. అధిష్టానపీఠం ముందరివైపు సూక్ష్మస్తంభాలు, వాటిమధ్య ఆకులతో చక్రం, దానికిరువైపుల జింకలు లేదా దుప్పులు, వాటికి ప్రతివైపు ఒక్కొక సింహం చెక్కివున్నాయి.(దీనినే బుద్ధుని అధిష్టానపీఠమని అమరావతిలో జరిగిన ‘కాలచక్ర’ కొరకు తరలించారు. దానితోపాటు తీసుకెళ్ళిన శిల్పాలు ఇంకా ఈ మ్యూజియానికి చేరలేదు.) దక్షిణం వరండాలో 4అ.ల ఎత్తు, 10అ.ల పొడవున మనుషులబొమ్మలు, జంతువులు, హంసలు, వ•క్షాలున్న రాతిస్తంభాలు పాతగుడులవి. పడుమట దేవాలయ పూర్వమంటపముంది. దీంట్లో 24స్తంభాలున్నాయి. ద్వారం చక్కనిశిల్పంతో వుంది. గుడికి, ప్రాంగణానికి నడుమ ఖాళీలో 26అ.ల ఎత్తైన స్తంభాల్లో ఒకటి పడిపోయివుంది. ప్రధానదేవాలయమే దయనీయస్థితిలో వుంది. గుడికి హక్కుదారునని చెప్పుకునే ఒకావిడ గబ్బిలాలతో పోటీపడుతూ అక్కడ దీపం పెడుతున్నది. సోమేశ్వరుని గర్భగుడి 6 చదరపుటడుగుల వైశాల్యమున్న చిన్నగది. పక్కగుడిలో చండిక దేవతది చక్కనిశిల్పం.’’ (ఇపుడా దేవతస్థానంలో భైరవుని విగ్రహంపెట్టి, బట్టలుకప్పి, పూజలు సాగిస్తున్నారు. అసలు దేవతశిల్పం ఏమైందో?)
కొలనుపాక పెద్దచెరువులో ఊబదిబ్బ అనే దీవివంటి గడ్డమీద ‘అంబరకులతిలకం’ అనే జైనబసది శిథిలాలు, 4పక్కల శాసనమున్న జైనమానస్తంభం ఉన్నాయి. అక్కడికి ఫర్లాంగు దూరంలో 18అ.ల ఎత్తున్న ఒక రాతి ద్వారతోరణం వుంది. (దానిని రాజదర్వాజ అని పిలుస్తారు స్థానికులు. మనం ‘కొలనుపాక ద్వారతోరణం’అని పిలుద్దాం.) దానికి 8చిన్న ఆర్చులు, 7డ్రాప్స్ వున్నాయి. అక్కడున్న దిబ్బమీద లభించిన విరిగిన పాదాలున్న మూడు రాతి శకలాలున్నాయి. మరొక రాతిముక్క మీద ధ్యానంలో ఉన్నట్లున్న విగ్రహభాగం వుంది. అది బుద్ధునిదో, జినునిదో?
అక్కడికి ఫర్లాంగు దూరంలో తూర్పుముఖంగా ఉన్న జైనదేవాలయ ముంది. మూడు ప్రధానదేవుళ్ళున్న గదులు. వాటిలో ఆదినాథుడు, నేమినాథుడు, మహావీరుల విగ్రహాలున్నాయి. మహావీరుని శిల్పం రత్నశిల (జేడ్‍)లో చెక్కింది. గుడిచుట్టు తవ్వకాలలో ఎన్నో శిల్పాలు బయటపడ్డాయి. కాయోత్సర్గ భంగిమలలో ఉన్నవి 3, ధ్యానస్థితిలో వున్నవి 6 జైనవిగ్రహాలు ప్రధానమైనవి. జైనాలయానికి ఎదురుగా సికింద్రాబాద్‍ సేఠ్‍ పూనంచంద్‍ తోట, తోటలో ఈశాన్యదిశలో 6పొరల పాతకాలపుఇటుకలు, డంగుసున్నంతో కట్టిన గిర్త్ మీద 6 అ.ల పెద్దశివలింగం ఉంది. అక్కడొక శివాలయ ముండాలి. దానికి చెందిన మూడెత్తుల మెట్లున్న బావి వుంది. జైనదేవాలయం పునరుద్ధరణలో 60 చెక్కిన స్తంభాలు, వేలసంఖ్యలో చెక్కినవి పెద్దరాళ్ళు, రాశిపోసిన పాతఇటుకలతోటి ఎదురుగా బంగ్లాగోడలు కట్టబడ్డాయి.


కొలిపాక తీర్థం- జైనదేవాలయాలు:
ఒక కథనం ప్రకారం కళ్యాణీ నగరాన్ని జైనుడైన శంకరుడు పాలిస్తుండేవాడు. మిధ్యాదేవుడు అతని రాజ్యంలో మహమ్మారిని వ్యాపింపచేసాడు. జైనశాసనదేవత పద్మావతి అతనికి కలలో కనిపించి, సముద్రంలో వున్న మాణిక్యదేవుని విగ్రహాన్ని తెచ్చిపూజిస్తే మేలు కలుగుతుందని చెప్పింది. శంకరుడు సముద్ర తీరాన దీక్షతో
ఉపవాసం చేసాడు. సముద్రుడు అతనికి మాణిక్యదేవుని ప్రతిమను ఇచ్చేటపుడు ‘రాజా, దీనిని తీసుకొనిపోయేటపుడు సందేహం కలిగినచోట ఈ విగ్రహాన్ని ప్రతిష్టించమన్నాడట’. శంకరరాజు తిరిగి వచ్చేటపుడు ప్రతిమ తనవెంట వస్తున్నదా లేదా సందేహం కలిగి తిరిగిచూసిన చోట, ఈ కొలనుపాకలో జైనతీర్థంకరుడు మాణిక్యతీర్థుని విగ్రహాన్ని ప్రతిష్టించి, జైనాలయాలను నిర్మించినాడని చెప్తారు. కథలో చెప్పిన శంకరరాజు కొలిపాక పాలకుడు శంకరగండరసనే మరొకరు కాదు. కొలనుపాక జైనశిల్పాలశైలి 9వ శతాబ్దానికి చెందినదే. జైనదేవా లయంలో రుషభుడు, నేమినాథుడు, మహావీరుల ప్రధాన విగ్రహాలతో పాటు దేవాలయ మంటపంలో జైనతీర్థంకరులు, జైనగురువులు, జైన శాసనదేవతల శిల్పాలు కనిపిస్తాయి. (తరువాయి వచ్చే సంచికలో)

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *