పోరాటాల పురిటిగడ్డ ‘ధూల్‍పేట్‍’


మనం ధూల్‍పేట వీధులలో తిరుగుతుంటే నయాదౌర్‍ సీన్మాలో దిలీప్‍కుమార్‍ పాడిన ‘‘ఏ దేశ్‍హై వీర్‍ జవానోంకా, అల్బేలోంకా, మస్తానోంకా’’ పాట యాదికి వస్తుంది.
ధూల్‍పేట్‍ చౌరాస్తాలో నిలబడి ‘‘వీర గంధము తెచ్చినాము వీరులెవ్వరో తెల్పుడి, పూసిపోతుము – మెడలో వేతుము పూలదండలు భక్తితో’’ అని పాడితే ప్రతి ఇంటి నుండి ఒక వీరుడు, ఒక వస్తాదు, ఒక పహిల్వాన్‍ మీసాలు మెలిపెడుతూ తొడలు చరుస్తూ మన ముందు హాజరవుతారు. మనం పట్టుకెళ్లిన గంధమూ సరిపోదు, పూలదండలూ సరిపోవు. కృష్ణాజిల్లాలో వీరులపాడు అనే గ్రామం ఉంది. ఒకప్పుడు అక్కడంతా వీరులే ఉండేవారట. హైద్రాబాద్‍ నగరానికి సంబంధించి ‘‘ధూల్‍పేట’’ కూడా వీరులపాడు లాంటిదే.


నైజాం వ్యతిరేక పోరాట చైతన్యం రెండు కేంద్రాల నుండి ప్రారంభమయ్యింది. ఒకటి గ్రంథాలయాలు -‘‘ఒకే ఒక సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక’’ అన్నట్లు మేధో పరమైన ఉద్యమం ఒకటి, రెండవది ‘‘తాలింఖానాలు’’ అంటే వ్యాయామశాలలు. ఇందులో సాముగరిడీలు, కత్తి యుద్ధాలు, కుస్తీ విద్యలు నేర్చుకున్న కొమద సింహాల్లాంటి ఉడుకురక్తం ప్రవహించే దుడుకు యువకులు నిజాం రాచరికంతో ముఖాముఖి యుద్ధానికి తలపడ్డారు. బుజబలం, బుద్ధిబలం కలగలసిన కాలం అది. అట్లా ధూల్‍పేట్‍ హనుమాన్‍ వ్యాయామశాలకు చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ సుదీర్ఘ పోరాట చరిత్రను ఈ కథ చివర్లో చెపుతాను.


ధూల్‍పేట్‍ అసలు పేరు ధూళిపేట. అనగనగనగా అప్పుడెప్పుడో ఢిల్లీ పాదుషా ‘‘అలంగీర్‍ ఔరంగజేబు’’ చక్రవర్తి కుతుబ్‍షాహీల మీద కక్షతో కత్తి గట్టి గోల్కొండ రాజ్యం మీదికి దండెత్తి వచ్చినప్పుడు ఆ లంబాచౌడా యుద్ధ పటాలంలో ‘‘లోధాలు’’ అనే హిందూ క్షత్రియవీరులు కూడా ఉన్నారు. హరప్పా, మెహెంజోదారో నాగరికతలు క్రీస్తుపూర్వం రెండు వేల సంవత్సరాల నాటివి. దానికి సమకాలీన నాగరికత గుజరాత్‍లో బయల్పడిన ‘‘లోథాల్‍’’ నాగరికత. ఈ ‘‘లోథా’’ జాతి వారికి ఆ ప్రాచీన ‘‘లోథాల్‍’’ నాగరికతకు ‘‘సముద్రంలోని ఉప్పుకు, చెట్టు మీద ఉన్న ఉసిరికాయకు ఉన్న సంబంధంలాంటిది ఏమైనా ఉందేమో ఘనత వహించిన పురావస్తు శాస్త్రజ్ఞులో లేక చరిత్రకారులో సెలవివ్వాలి.


ఔరంగజేబు సైన్యంలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలకు సరైన శిక్షణ ఇవ్వటం, వాటి పోషణ భారం ఈ లోథాలదే. అంతేగాక, సైనికులకు కావాల్సిన ‘‘సారాయి’’ని కూడా బట్టీలు పెట్టి కాచి, వడపోసి అందించే వ్యాపారం కూడా చేసేవారు. పురానాపూల్‍ పక్కన ముచికుందా నదీ తీరాన ఇసుకపర్రలలో వీరి గుడారాలు, స్థావరాలు
ఉండేవి. గలగలా ప్రవహించే ముచికుందా నది నీటి అలలలో వీరు ఏనుగులు, ఒంటెలను, గుర్రాలను తీసికెళ్లి నీళ్లు చిమ్మి వాటికి స్నానాలు చేయించేవారు.


ప్రస్తుతం ఎండిపోయి మురికి కాలువలా ఉన్న ‘‘మూసీ’’ గురించే చెపుతున్నారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఔను సుజనులారా నేను ఆనాటి మూసీ గురించే మీ దివ్య సముఖానికి విన్నవిస్తున్నాను.


ఆ బంగారు రోజులలో సాయంత్రం అయ్యేసరికి పురజనులు మూసీతీరాన చల్లటి ఇసుక తిన్నెల మీద కూచుని పిల్లగాలులకు పరవశిస్తూ మనసును మురిపించే మనోహర దృశ్యాలను తిలకించేవారు. నగరానికి దూరంగా ఎక్కడో అనంత పద్మనాభస్వామి కొండకోనలలో జన్మించిన ముచికుందమ్మ ఇక్కడ పురానాపూల్‍ వద్ద వయసు వచ్చిన పడుచుపిల్లలా వొంపుసొంపులు తిరుగుతూ పాలవెల్లువలా ప్రవహించేది. నదిలో కొంతమంది స్నానాలు, సంధ్యలు చేసేవారు. బట్టలు ఉతుక్కునేవారు. మావటీలు ఫీల్‍ఖానా (గజశాల) నుండి ఏనుగులను తీసుకొచ్చి స్నానాలు చేయించే వారు. బాటసారులు ఇసుక తిన్నెల మీద కూచుని దూరభారపు శ్రమను మరిచిపోయే వారు. ‘‘చిలకాకు పచ్చ చీరె మీద చింతపూల రవిక తొడుక్కున్న’’ పడతులు ఇసుక తిన్నెల మీద చెలిమలు తవ్వి నీరు తోడి తాగటానికి కుండలలో తీసికెళ్లేవారు. నది ఒడ్డున శివమందిరం నుండి గోసాయిలు మోగించే గణగణగంటలు వీనులవిందుగా వినబడేవి.


అగ్గో! అటువంటి దినాలలోనే నది ఒడ్డున కొంచెం దూరంలో లోథాలు గుడారాలు, గుడిసెలు వేసుకుని నివసించేవారు. గోల్కొండ రాజ్యపతనం తర్వాత, ఔరంగజేబు విజయం సాధించిన తర్వాత లోథాలు మళ్లీ ఉత్తర భారతదేశం వాపస్‍ వెళ్లకుండా ఇక్కడే స్థిరపడిపోయారు. వారితోపాటు ఉన్న గుర్రాలు, ఒంటెలు, ఏనుగుల పథఘట్టనలతో నిరంతరం ధూళిలేస్తుండటం వలన ‘‘ధూళిపేట’’ అన్న పేరు స్థిరపడి కాలక్రమాన అది ధూల్‍పేట్‍గా మారింది. అక్కడ నివసించేవారిని ‘‘లోథోళ్ళు’’ అనేవారు.


వీరు క్షత్రియులు కావున దేహ దారుఢ్యానికి వ్యాయామశాలలకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఆర్య సమాజ ప్రభావం వలన నిజాంకు వ్యతిరేకంగా చైతన్యవంతులయ్యారు. పండిత్‍ నరేంద్రజీ, స్వామి రామానంద తీర్థల ఉపన్యాసాల వలన ‘‘అగ్గిపిడుగులు’’గా మారారు. హైద్రాబాద్‍ నగరంలో తొలిసారిగా హిందూ ముస్లిం మతఘర్షణలు జరిగాయి. బహద్దూర్‍ యార్‍ జంగ్‍ స్థాపించిన మజ్లిస్‍ ఇతైహాదుల్‍ ముస్లమీన్‍కు వ్యతిరేకంగా వీరు ఆర్యసమాజం అండదండలతో సమరశీల పోరాటాలు చేశారు. తర్వాత కాలంలో రజాకార్లకు వ్యతిరేకంగా కూడా పోరాడారు. హైద్రాబాద్‍ విమోచన ఉద్యమంలో వీరి పాత్ర మరువలేనిది.


బహద్దూర్‍ యార్‍ జంగ్‍ ‘‘అనల్‍ మాలిక్‍’’ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ప్రతి ముస్లిం కూడా ప్రభువేనని, పాలక వర్గంలో భాగస్వామి కావున నిజాం రాచరికాన్ని సమర్థించాలని అతని సిద్ధాంతం. ఇతను గొప్ప వక్త. శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసేవాడు. 1938 ఏప్రిల్‍ ఏడున ధూల్‍పేటలో మతకల్లోలాలు జరిగాయి. అందులో ఆయన మేనల్లుళ్లు ఇద్దరూ మరణించారు. వారి అంతిమ యాత్రలో 25,000 ముస్లింలు ఆయుధాలు ధరించి పాల్గొన్నారు. బహద్దూర్‍ యార్‍ జంగ్‍ సంయమనం పాటించినందున మతకల్లోలాలు జరగలేదు. ఆ రాత్రి నగరంలోని హిందువులందరూ భయం భయంగా బ్రతికారు. కాసీం రజ్వీ రంగ ప్రవేశం చేసిన తర్వాత రజాకార్‍ దౌర్జన్యాలు ప్రారంభమైనాయి. అయితే చాలా మంది ముస్లిం మేధావులు, ప్రముఖులు బహద్దూర్‍ యార్‍ జంగ్‍ను అతని ‘‘అనల్‍ మాలిక్‍’’ సిద్ధాంతాన్ని, కాసిం రజ్వీని వ్యతిరేకించారు. 1938 జులై నెలలో హైద్రాబాద్‍ స్టేట్‍ కాంగ్రెస్‍ స్థాపించబడింది.


స్వామి రామానంద తీర్థ (బాల బ్రహ్మచారి) సర్వసంగ పరిత్యాగి. సన్యాసి. సామాన్య ప్రజలు అతన్ని గోసాయి అనేవారు. ఆయన కొంత కాలం హైద్రాబాద్‍ స్టేట్‍ కాంగ్రేసుకు అధ్యక్షుడిగా పనిచేసారు. కాని ఆ కాలంలోనే కాంగ్రేసు పార్టీలో రెండు వర్గాల మధ్య ముఠా కుమ్ములాటలు ఉండేవి. స్వామీ రామానంద తీర్థ ఒక వర్గం. మరో వర్గం నాయకుడు జనార్దన్‍ దేశాయి. ఇద్దరు ఉప్పు-నిప్పులా చిటపటలాడేవారు. ఆ రెండు ముఠాలను ప్రజలు పరిహాసంగా ‘‘గోసాయి కాంగ్రేస్‍, దేశాయి కాంగ్రేస్‍’’ అని నవ్వుకునేవారు. ప్రస్తుతం స్వామి రామానంద్‍ తీర్థ విగ్రహం అసెంబ్లీ ఎదురుగా ఉన్న పార్కులో ఉంది. సమాధి బేగంపేట రైల్వే స్టేషన్‍ ఎదురుగా ఉంది. ఎట్లాగు రాజకీయాల ప్రసక్తి వచ్చింది కదా మరో చేదు మాట కూడా చెప్పుకోవాలి.


‘‘జీనా హైతో మర్నాసీఖో’’
అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించి ఉస్మానియా యూనివర్సిటీని వికసించిన విద్యుత్తేజంలా మార్చిన విప్లవ విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి హత్య 1972 ఏప్రిల్‍ 14న జరిగింది. ఈ హత్యలో ప్రథమ ముద్దాయి లఖన్‍సింగ్‍ ఈ ధూల్‍పేటకు చెందిన వాడు. ఆ రోజులలో అతను ఒ.యూ.లో ఇంజనీరింగ్‍ విద్యార్థి. సరైన సాక్ష్యం లేనందున అతనికి శిక్షపడలేదు. తర్వాత కాలంలో అతను ప్రభుత్వ ఇంజనీర్‍గా ఉద్యోగం చేసి పదవీ విరమణానంతరం చనిపోయాడు. బహుషా తన చివరి రోజులలో ఒక యువ మేధావిని హత్య చేసానని అతను పశ్చాత్తాపం చెంది ఉండవచ్చు.


రాజులు మారారు. రోజులు మారాయి. హైద్రాబాద్‍కు స్వాతంత్య్రం వచ్చింది. ఈ లోథా క్షత్రియవీరులు యుద్ధ విద్యలను మరచి బ్రతుకుతెరువు కోసం రకరకాల వృత్తులు చేపట్టారు. పతంగులను, మాంజాను తయారుచేసేవారు. యూరపు నుండి, చైనా నుండి వచ్చి జిప్సీలు, దేశ దిమ్మరులు ఉత్తర భారతదేశానికి వాటిని పరిచయం చేశారు.
ఉత్తరం నుండి హైద్రాబాద్‍కు వలస వచ్చిన లోథాలు ఈ నగరానికి పతంగులను, మాంజాను పరిచయం చేశారు. ఈ వ్యాపారమే గాక రకరకాల దేవుళ్ల విగ్రహాలను ముఖ్యంగా వినాయకుడి విగ్రహాలను తయారుచేసే కళానైపుణ్యం వీరికుంది. ఈ రెండు వృత్తులేగాక మరో రహస్య వృత్తి కూడా వీరికుంది. అది గుడుంబా తయారీ. ఔరంగజేబు కాలంలో మేలిమి రకమైన ద్రాక్ష సారాయాన్ని తయారు చేసిన వీరు ఆ తర్వాత బెల్లం, నవాసారాన్ని బట్టీలలో ఉడుకబెట్టి నాటుసారా, గుడుంబాలను తయారుచేసి దొంగతనంగా మోటారు ట్యూబులలో పెట్టి సరఫరా చేసేవారు. అప్పుడప్పుడు అధికారులు దాడులు చేసి, ఆ బట్టీలను, కుండలను ధ్వంసం చేసేవారు. లోథాలు ఇచ్చిన లంచాలతో అధికారులు లక్షాధికారులు అయినారు. వీరు మాత్రం నిరుపేదలుగానే మిగిలినారు. ధూల్‍పేట్‍ అనగానే సాధారణ ప్రజలకు గుడుంబా, గుండాలు అన్న సంగతే జ్ఞప్తికి వస్తుంది. దీనికితోడు తెలుగు సినిమాలు ఈ బస్తీని ఇంకా బద్నాం చేశాయి.


ఒకప్పుడు వీరసైనికులుగా, కళాకారులుగా, పహిల్వాన్లుగా రాణించిన ఈ లోథాలు ప్రస్తుతం ధూల్‍పేట దుమ్ములధూళిగా మారుతున్నారు. గుజరాత్‍లోని లోథాల్‍ నుండి ప్రారంభమైన వారి మహాప్రస్థానం ప్రస్తుతం పురానాపూల్‍ శ్మశానవాటికల చరమగీతం పాడుతున్నది.
‘‘జానే కహాఁ గయేవో దిన్‍..’’
పాట జ్ఞాపకం వస్తుంది కదా!


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *