మూసీని మురికి కాలువనేమో అనుకున్నా..

  • పర్యావరణానికి మనం చేస్తున్న నష్టం కళ్లకు కట్టింది
  • హైకోర్టు చీఫ్‍ జస్టిస్‍ సతీశ్‍ చంద్ర శర్మ
  • ‘పీసీబీ అప్పిలేట్‍ అథారిటీ’ ప్రారంభోత్సవం


‘‘హైదరాబాద్‍కు వచ్చే ముందు హుస్సేన్‍సాగర్‍ గురించి విన్నాను. నగరంలో ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో ఒకటి అని తెలుసుకొని అక్కడికి వెళ్లాను. ఆ చెరువులోని నీరు కలుషితమై ఉంది. హైకోర్టు పక్కన ఉన్న మూసీని చూసి తొలుత మురికి నాలానేమో అని అనుకున్నాను. తర్వాత అది గతంలో నగరానికి మంచినీటిని అందించిన నది అని తెలిసింది. ఇది మనం చేతులారా చేస్తున్న తప్పిదం’’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‍ సతీశ్‍ చంద్ర శర్మ పేర్కొన్నారు. హైదరాబాద్‍ నాంపల్లి గగన్‍విహార్‍లో తెలంగాణ పొల్యూషన్‍ కంట్రోల్‍ బోర్డ్ అప్పీలేట్‍ అథారిటీ కార్యాలయాన్ని (పీసీబీ) నవంబరు 21 ఆయన ప్రారంభించారు. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా అప్పీలేట్‍ అథారిటీలను నియమించడం, వాటికి ప్రత్యేక అధికారాలను అప్పగించడం మంచి విషయమని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా హుస్సేన్‍ సాగర్‍, మూసీ నది ప్రాంతాలను చూసి తన అనుభవాన్ని పంచుకున్నారు. హుస్సేన్‍సాగర్‍, మూసీ ప్రాంతాల్లో పర్యావరణానికి మనం చేస్తున్న నష్టం కళ్లకు కట్టినట్లుగా కనిపించిందన్నారు. ఈ ప్రాంతాలను మునుపటి స్థితికి తీసుకొచ్చే బాధ్యత పీసీబీపై ఉందన్నారు. సబర్మతీ నదిని శుభ్రపరిచిన తర్వాత అది పర్యాటక ప్రాంతంగా మారిందని.. పర్యాటకులు కుటుంబాలతో అక్కడికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. ఇండోర్‍ నగరం దేశంలో క్లీనెస్ట్ సిటీగా ఐదుసార్లు ఘనత సాధించిందని గుర్తు చేశారు. అక్కడ కలెక్టర్‍ మనీశ్‍ సింగ్‍, ఇతర అధికారులు టాయ్‍లెట్‍ సమీపంలో ఉన్న ఫుట్‍పాత్‍పై భోజనం చేశారని… దానికి కారణం టాయ్‍లెట్‍తో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండటమేనన్నారు. హైదరాబాద్‍ గొప్ప చరిత్ర గల సుందర నగరమని మనందరం కలిసి ఈ సిటీకి పాత శోభను తిరిగి తెచ్చేందుకు కృషి చేయాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత వరకు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నించాలని ఉద్బోధించారు. గత నాలుగు దశాబ్దాలుగా పర్యావరణ హితానికి సంబంధించి కోర్టులు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాయని తెలిపారు. పీసీబీ అప్పీలేట్‍ అథారిటీ చైర్మన్‍ జస్టిస్‍ బి.ప్రభాకర్‍రావు మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు వాయుకాలుష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. కాలుష్యం కారణంగా మనతోపాటు మన తర్వాతి తరాల వారిలో డీఎన్‍ఏలో సైతం మార్పులు జరుగుతాయని ఆందోళన వెలిబుచ్చారు. గతంలో హైదరాబాద్‍ లేక్‍ సిటీగా పేరుగాంచిందని, దాదాపు 600 చెరువులు ఉండేవని.. ప్రస్తుతం వాటిలో సగానికి పైగా చెరువులు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.


చట్టాలు ఉన్నది ఉల్లంఘించడానికే కొందరు భావిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భూమి మనకు తల్లి వంటిదని.. భూగోళాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వంలోని ఇతర శాఖలను సమన్వయం చేసుకొని పీసీబీ పనిచేయాలని సూచించారు. పీసీబీ మెంబర్‍ వి.జయతీర్థరావు మాట్లాడుతూ పీసీబీని బలోపేతం చేయడానికి కొత్త నైపుణ్యం, కొత్త టెక్నాలజీని సమకూర్చుకోవాలని సూచించారు. ఫార్మా హబ్‍గా మారిన నగరంలో కాలుష్య కారక పరిశ్రమలను గుర్తించడం ముఖ్యమన్నారు. పీసీబీ మెంబర్‍ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్‍ మాట్లాడుతూ ఆన్‍లైన్‍ మానిటరింగ్‍తో పాటు కాలుష్య కారక పరిశ్రమలపై ద•ష్టి పెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అడ్వకేట్‍ జనరల్‍ బి.శివానంద్‍ ప్రసాద్‍, పీసీబీ మెంబర్‍ బి.ప్రభాకర్‍ రెడ్డి, సీవై నాగేష్‍, నల్సార్‍ వర్సిటీ లాయర్లు, పీసీబీ అధికారులు పాల్గొన్నారు.

  • సేకరణ : దక్కన్‍ న్యూస్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *