కుతుబ్‍షాహీల పతనం తర్వాత గోల్కొండ రాజ్యము మొఘలుల ఆధీనంలోకి వెళ్ళింది. అది మొఘల్ రాజ్యంలో ఒక సుబుగా మారింది. దీనిపై కమురుద్దిన్ చింక్‍లిచ్ ఖాన్ సుబేదారుగా నియమింపబడ్డారు. ఔరంగజేబు మరణం తర్వాత చింక్‍లిబ్‍ఖాన్ స్వతంత్రంగా పరిపాలన చేశాడు. కానీ స్వతంత్రతను మాత్రం ప్రకటించుకోలేదు. మొఘలు చక్రవర్తిలచే నిజాం అనే బిరుదు పొందాడు. ఇతని వారసులు నిజాం బిరుదుతోనే స్వతంత్రను ప్రకటించుకొని రాజ్య పరిపాలన చేశారు. అసఫ్‍జాహీ వంశస్థులైన వీరు హైదరాబాద్ సుబాను 1721 నుండి 1948 వరకు పరిపాలించారు. వీరి పరిపాలనలో పూర్తి తెలంగాణ, కర్నాటక మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఉండేవి.
అసఫ్‍జాహీ వంశ తొలినాళ్ళలో విద్యపూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయ్యింది. దీనికి అనేక కారణాలున్నాయి. రాజ్యంలో అనిశ్చితి, గందరగోళ పరిస్థితులు కుట్రలు, మరాఠులతో శత్రుత్వం, ఫ్రెంచి, బ్రిటిష్ ఆధిపత్య పోరాటాలలో వీరిని పావులుగా వాడటం, రాజులకు విద్యాభివృద్ధికి సరైన సమయము లేకపోవడం, శ్రద్ధలేకపోవడం, ప్రజలలో కూడా విద్యపట్ల ఉత్సాహం లేకపోవడం, విద్య ఒక ప్రాథమిక అవసరమని అటు పాలకులు ఇటు ప్రజలు గుర్తించకపోవడం. ఫలితంగా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడలేదు. రాజ్యంలో కొన్ని ప్రభుత్వ మదరసాలు ఉండేవి. ఉలేమాలు, సూఫీలు ప్రాథమిక విద్యను అందించేవారు. అయితే ఉలేమాలు బాగా చదువుకున్నారు. ఎక్కువ ప్రమాణాలతో విద్యనించేవారు. దాతో సామాన్యులు అంత జ్ఞానాన్ని, వీరి బోధనను అర్థం చేసుకోలేకపోయేవారు. ఇక ఖానుగీ పాఠశాలలు అనగా ప్రైవేటు పాఠశాలలు తెలుగు విద్యను నేర్పించేవి. అయితే ఇవి కూడా కేవలం ప్రాథమిక విద్యను నేర్పించే వరకే ఉండేవి. ఈ పరిస్థితి 19వ శతాబ్ధం మధ్యకాలం వరకు నడిచింది. మొదటి సాలార్జంగ్ దివాన్‍గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. విద్యాభివృద్ధికి బాధ్యతలు చేపట్టారు. అయితే అవి హైదరాబాద్‍కు మాత్రమే పరిమితమైనాయి. సాలార్జంగ్ సంస్కరణలతో నిజాం రాజ్యంలో ఆధునికీకరణ యుగం ప్రారంభమైంది. అది మహబూబ్ అలీఖాన్ కాలం నాటికి పరుగులు పెట్టింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలం నాటికి చాలా అభివృద్ధి సాధించింది.
1853లో సాలార్జంగ్ దివాను అయినపుడు విద్యావ్యవస్థ క్షీణదశలో ఉంది. ఈ కాలంలో విద్యా ప్రోత్సాహానికి మదరసాలకు దానాలు, విద్యార్థులకు వసతులు, తిండి, బట్ట ప్రభుత్వమే చూసుకునేది. ఉపాధ్యాయులను కూడా ఉత్తర భారతం నుండి, ఇరాక్, బుఖారా నుండి పిలిపించేవారు. కొందరు ఉన్నత, ధనిక కుటుంబాలకు చెందిన వారు స్వంతంగా ఉపాధ్యాయులను నియమించుకొని తమ పిల్లలకు చదువులు చెప్పించుకునేవారు.
తొలుత పాఠశాలలు : 1834లో ఇంగ్లాండు చర్చికి చెందిన క్లెర్జిమెన్ ఇంగ్లీషు పబ్లిక్ స్కూలును ప్రారంభించింది. ఇందులో ఆంగ్లో ఇండియనులకు ప్రవేశముండేది. 1853-54లో సాలార్జంగ్1 దారుల్-ఉల్-ఉలుమ్ (ఓరియంటల్ కాలేజి)ను హైదరాబాద్‍లో ప్రారంభించాడు. ఈ పాఠశాలలో 160 మంది విద్యార్థులుండేవారు. 185లో సిటీ ఇంగ్లీషు పాఠశాల ప్రారంభించబడింది. ఇందులో ఇంగ్లీషు, అరాబిక్, పర్షియన్, హిందుస్థానీ, తెలుగు, కన్నడ మరాఠీ భాషలలో బోధన ఉండేది. అందులో అరబిక్, పర్షియన్, ఇంగ్లీషు భాషలలో బోధన జరిగేది. 1860లో తెలుగు, మరాఠీ భాషలు కూడా బోధనలో చేర్చబడ్డాయి. గణితం, భౌతిక, రసాయనిక, ఖగోళ శాస్త్రాలు విషయాలుగా ఉండేవి. ఇదే సంవత్సరం సాలార్జంగ్ ప్రతి జిల్లా కేంద్రంలో, తాలూకా కేంద్రాలలో ఒక్కొ పాఠశాలలు తెరువబడింది. 1868లో సాదరుల్ మహం డిపార్ట్మెంటల్ మినిస్టర్‍గా నియమించబడిన తర్వాత విద్యను మిస్లేనియస్ మినిస్టర్ క్రిందకి చేర్చారు. 1869లో డబ్ల్యూ.హెచ్. విల్కిన్‍సన్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా మరియు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‍స్పెక్టర్ అధికారిగా నియమింపబడ్డాడు. అతని కాలంలో విద్యావ్యవస్థ పునర్వవస్థీకరింపబడింది. విద్యా వ్యవస్థలో నూతన ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది. విద్యాబోధనలో నూతన పద్ధతులు ప్రవేశపెట్టడం జరిగింది. అతని అనంతరం వచ్చిన అతని వారసుడు ఇనాయత్ ఉర్ రహమాన్ విద్యను ఇంకా అభివృద్ధి చెందించాడు. ఈ విధంగా హైదరాబాద్‍లో నూతన విద్యావిధానానికి సాలార్జంగ్ దారులు వేశాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను, వైద్య, సాంకేతిక కళాశాలలను ప్రారంభించాడు. వీటి పర్యవేక్షణకు అధికారులను నియమించాడు. ఈ చర్యలతో హైదరాబాద్ రాజ్యంలో విద్య కొత్త పుంతలు తొక్కింది.
క్రిస్టియన్ మిషనరీలు :
క్రిస్టియన్ మిషనరీలు కూడా ఈ కాలంలో విద్యా వ్యాప్తికి కృషి చేశాయి. 1834లో సెంట్ జార్జి గ్రామర్ స్కూలు, 1855లో ఆల్ సెయింట్స్ హై స్కూలు ప్రారంభించబడ్డాయి. సెయింట్ గ్రామర్ స్కూలు బ్రిటిష్ వారి పిల్లల కోసం, ఆల్ సెయింట్ హైస్కూలు నిజాం ఆర్మీ స్టాఫ్ కోసం (బ్రిటిష్ సైన్యం పిల్లల కోసం) ఏర్పాటు చేయడం జరిగింది. అనంతర కాలంలో ఇది అందరికోసం ద్వారాలు తెరిచాయి. 1865లో మిషనరీలు ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభించాయి. వారి విద్యకోసం ప్రభుత్వం గ్రాంటును ఇచ్చింది. 1881లో వరంగల్లులో మరొక అనాధాశ్రమం స్థాపించారు. విద్యాశాఖ దీని బాగోగులు చూసుకునేది.
1860లో సివిల్ ఇంజనీరింగు కాలేజి ప్రారంభించబడింది. దాని క్రింద ఆంగ్ల మాధ్యమంలో ఒక పాఠశాల ప్రవేశపెట్టబడింది. అనంతరం ఆ పాఠశాల దాని నుండి వేరు చేయబడి చాదర్‍ఘాట్ ఆంగ్లో వెర్నాక్యులర్ పాఠశాలగా మార్చారు. అనంతరం అదే హైదరాబాద్ కాలేజీగా మారింది. అది బి.ఎ. ప్రమాణాతో 1884లో మద్రాసు విశ్వవిద్యాలయం కిందికి వెళ్ళింది. 1878లో సాలార్జంగ్ చాదర్‍ఘాట్‍లో ఒక పాఠశాల ప్రారంభించాడు. దానికి మదరసా – ఇ – ఆలియా గా పేరు మార్చారు. ఇది తన కుమారుల కోసం, ఉన్నత కుటుంబాల కుమారుల కోసం ఏర్పాటు చేయబడింది. సాలార్జంగ్ మేనల్లుడు ముకరం – ఉద్ – దౌలా మదర్‍సా-ఇ-ఐజాను ఉన్నత కుటుంబాల కోసం ప్రారంభించాడు. 1884 కాలం నాటికి దివానీలో 162 పాఠశాలలు ప్రారంభమైనాయి. అందులో 13 హైదరాబాద్‍లో ఉండేవి. అందులో 105 పర్షిక్ష్మీన్, 35 మరాఠీ, 19 తెలుగు, 3 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు ఉండేవి. వీటిలో ప్రైవేటు స్కూళ్ళు, చర్చి పాఠశాలలు ఉండేవి. ఈ స్కూళ్ళపైన 5గురు డివిజనల్ ఇన్‍స్పెక్టర్లు మరియు బోధనా సిబ్బంది నియమింపడ్డారు. 1883లో టీచర్లకు శిక్షణ ఇచ్చే సంస్థను కూడా ప్రారంభించారు. విద్యకు 2 లక్షల రూపాయలు కేటాయిచంబడింది. దారుల్-ఉల్-ఉలుమ్ లేదా ఒరియంటల్ కాలేజి విభజింపబడి 5 శాఖలుగా మారింది. 1. ఖురాను పాఠశాల 2 . అంబిక్ హైస్కూలు 3. పర్షియన్ హైస్కూలు 4. రెండు ప్రాంతీయ భాషల్లో పాఠశాలలు 5. ఆంగ్లో వెర్నాక్యులర్ పాఠశాల. అయితే ఇందులో బోధించడానికి ఉపాధ్యాయులు కరువయ్యారు. దాంతో ఉపాధ్యాయుల నియామకం వారికి శిక్షణ తప్పనిసరి అయ్యింది. దానికోసం 1889లో వెస్లియన్ మిషన్ వాళ్లు తెలుగు నార్మల్ స్కూలును టీచర్ల శిక్షణ కోసం ఏర్పాటు చేశారు. ఫలితంగా ఉపాధ్యాయులందరూ శిక్షణ పొందగలిగారు. అయితే స్త్రీ ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండేది. వారికోసం ఇదే శిక్షణ సంస్థ రెండు స్త్రీ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను అనుసంధానంగా ప్రారంభించింది. ఆ రెండింట్లో ఒక సంస్థ సికిందరాబాద్ వెస్లీ మిషన్‍కు, రెండవది ఎలిజబెత్ స్లాన్లీ గర్లస్ హై స్కూలుకు అనుసంధానం చెయ్యబడ్డాయి. ఇక్కడ శిక్షణ పొందిన టీచర్లను ఎక్కడ అవసరమైతే అక్కడ నియమించారు. 1871-1880ల మధ్య విద్యా వ్యవస్థలో త్వరిత, అధిక పురోగతి కన్పించింది. ఈ మధ్య కాలంలో ప్రైవేటు పాఠశాలలు, ఖాన్లీ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. మదరస-ఇ-ఆలిమాలో ఫీజులు అధికంగా ఉండేవి. మదరస-ఇ-ఐజాలో తక్కువగా ఉండేవి. అందుకే చాలా మంది ఇందులో చేరేవారు. ఇందులో పర్షియన్, అరబిక్, ఉర్దూ, ఇంగ్లీషు బోధింపబడేవి. వీటితో బాటు అర్థమెటిక్, చరిత్ర, ఖగోళశాస్త్రం, భూగోళశాస్త్రం బోధింపబడేవి. పిల్లలను ప్రోత్సహించడానికి ఉపకారవేతనాలు, స్టైఫండ్లు ఇచ్చేవారు. వారి రవాణాకోసం ఎడ్లబండ్లు, బగ్గీలను ఏర్పాటు చేశారు. వీటి వలన ప్రజలకు కూడా నెమ్మదిగా విద్య యొక్క విలువ తెలిసింది. దాంతో సమాజంలో విద్య యొక్క, విద్యా సంస్థల యొక్క గుర్తింపు, విలువ పెరిగింది. నెమ్మదిగా అనేక రకాల విద్యా సంస్థలు పుట్టుకు రావడం మొదలయ్యింది.
మతపరమైన విద్యాసంస్థలు :
ఫజేలాత్ జంగ్ బహదూర్ మతపరమైన విద్యను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 1876లో జమా-ఇ-నిజామియా అనే ఇస్లామిక్ లెర్నింగ్ సెంటర్‍ను ప్రారంభించాడు. ఇందులో ఈజిప్టులో ఉన్న అల్-హజర్ విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యావిధానాన్ని శాఖలను ప్రవేశపెట్టారు. 1882లో ఇదే ఉద్దేశ్యంతో మదరస-ఇ-దీనియా అనే మరొక సంస్థ స్థాపించబడింది. 1946 నాటికి హైదరాబాద్‍లో 31 మత సంస్థలు ఏర్పడ్డాయి.
హిందూ మత విద్యా సంస్థలు :
ఇస్లాం బోధనకు పాఠశాలలు ఏర్పాటుకావడాన్ని స్ఫూర్తిగా తీసుకొని శివరామశాస్త్రి సంస్కృతంలో వేదిక ధర్మప్రకాశిక అనే హిందుమత సంస్థను స్థాపించాడు. దీనిని నడపడానికి హిందువులు చాలా మంది విరాళాలిచ్చారు. కొంత ధనం విద్యాశాఖ కూడా ఇచ్చేది. ఇందులో సంస్కృతంతో పాటు మరాఠి, పర్షియన్, ఇంగ్లీషు భాషలు కూడా నేర్పబడేవి. 1899లో మరొక సంస్కృత కళాశాల మతపరమైనది తెరువబడింది.
ప్రైవేటు పాఠశాలలు :
మొదటగా ప్రారంభించబడిన ప్రైవేటు స్కూళ్ళు ఇంగ్లీషు విద్యను బోధనా మాధ్యమంగా ఎంచుకున్నాయి. 1880లో రెండు ప్రైవేటు పాఠశాలలు ఇంగ్లీషు మాధ్యమంలో బోధించడానికి ఏర్పడ్డాయి. అవి ధర్మవంత్ హైస్కూలు మరియు మఫీదుల్-ఆనం-హైస్కూలు అయితే 1883 నుండి వీటికి ప్రభుత్వం నుండి ఎయిడ్ (సహాయం) లభించింది. కులమత ప్రాతిపదికతో పని లేకుండా ఇందులో ప్రవేశం లభించేది.
1877లో సిటీ హైస్కూలు, మరియు చాదర్‍ఘాట్ హైస్కూలు (దీనికి గ్లోరియా హైస్కూలు అని కూడా అనేవారు) ను అఘోరనాధ ఛటోపాధ్యాయ ప్రారంభించాడు. అనంతరం ఇవి రెండు కలిసిపోయి చాదర్‍ఘాట్ హైస్కూలుగా మద్రాసు యూనివర్శిటీ ఆధ్వర్యంలో సెకండరీ గ్రేడ్ కళాశాలగా నడిచింది. 1881లో ఇది మొదటి గ్రేడ్ కాలేజీగా మారి నిజాం కాలేజి పేరుతో నడిచింది. ఈ సమయానికి పెద్ద కళాశాలలు ఏర్పడ్డాయి. 1. నిజాం కాలేజీ హైదరాబాద్‍లో 2. దారుల్-ఉల్-ఉలుమ్ ఓరియంటల్ కాలేజీ హైదరాబాద్‍లో 3. ఔరంగాబాద్ కాలేజీ ఔరంగాబాద్‍లో. మహబూబ్ అలీఖాన్ రాజ్య సంస్థాపనా సమయంలో ఆయన పేరుమీద మహబూబ్ కళాశాల కట్టబడింది. 1895లో అసిఫియా హైస్కూలు అనే రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూలు ప్రారంభించబడింది. ఇది రాజ్య సైనిక అధికారుల పిల్లల కోసం ఏర్పాటు చేసినది.
ప్రాంతీయ భాషలలో పాఠశాలలు :
మరాఠీ మాతృభాషలో ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలని ఉద్దేశ్యంతో సర్ డింగ్రే మరియు శ్రీకర్మాకర్ 1901లో మొదటి మరాఠీ ప్రైవేటు పాఠశాలను స్థాపించాడు. ఈ పాఠశాలనే వివేక వర్ధినీ పాఠశాలగా మారింది. అదే విధంగా తెలుగు పాఠశాలలుండాలని 1904లో రంగారావు కాళోజీ, రాధాబాయి కాళోజీ జ్ఞాపకార్థం చాదర్‍ఘాట్‍లో ఒక పాఠశాల స్థాపించాడు. ఉర్దూ బోధన మాధ్యమంగా మౌల్విమహమ్మద్ అబ్దుల్ రజాక్ అన్వరులూమా కళాశాలను స్థాపించాడు.
ప్రభుత్వ పాఠశాలలు :
1859లో దారుల్-ఉల్-ఉలూమ్ ప్రారంభించిన తర్వాత ప్రతి తాలూకాలో రెండు పాఠశాలలు ఒకటి పర్షియన్ ఒకటి స్థానిక భాషల్లో ఏర్పాటు చేయాలని ఆజ్ఞలు విడుదల చేయబడ్డాయి. వాటిలో గణతం, వ్యాకరణం, భూగోళం చరిత్ర బోధింపబడేవి. 1893లో పదివేలు జనాభా ఉన్న ప్రతి టౌన్‍లో ఆంగ్లో వెర్నాక్యులర్ మిడిల్ స్కూళ్లు ప్రారంభించబడ్డాయి. స్థానిక సంస్థలలోని పాఠశాలలో ఇద్దరు పటేళ్ళు ఇద్దరు పట్వారీలు ఒక తహసిల్దారు ప్రెసిడెంట్‍గా ఉన్న తాలుకలో ఒక పటేల్ ఒక పట్వారీ తహసిల్దార్ ప్రెసిడెంట్‍గా వారి ఆధ్వర్యంలో ఈ స్కూళ్లు నడిచేవి. తాలుక్‍దారు విద్యా ఇన్‍స్పెక్టరుగా వ్యవహరించేవాడు. అతను స్కూళ్ళను పర్యవేక్షణ చేసేవాడు. 1868 నాటికి ఈ బాధ్యతలు రెవెన్యూ అధికారులకు బదిలీ చేయడం జరిగింది. 1870లో పబ్లిక్ ఇన్స్ప్టెకర్ పైన పర్యవేక్షణ, అదుపును వరంగల్ ఇంజనీరింగు కళాశాల ప్రిన్సిపల్‍కు ఇవ్వడం జరిగింది.
1871లో ప్రాంతీయ పర్యవేక్షణకు ఒక డైరెక్టర్ నియమింపబడ్డాడు. అతను జిల్లాలోని అన్ని స్కూళ్ళ అభివృద్ధిని పర్యవేక్షించేవాడు. విద్యకోసం కేటాయించిన పద్దును 2.29 లక్షలకు పెంచబడింది. 1906లో ఇమామల్ ముల్క్ సిరాజుల్ హసన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ శాఖకు డైరెక్టర్‍గా నియమించబడ్డాడు. ఈయన కాలంలో బాలికల విద్యకు అధిక ప్రోత్సాహం లభించింది. 1910లో ఎం.ఏ.టి. మాథ్యూ విద్యా సలహాదారుగా నియమితుడయ్యారు. ఈయన విద్యావిషయంలో అనేక కీలకమైన సూచనలు చేశాడు. ఫలితంగా ప్రాథమిక విద్య, పాఠశాలలపై తనిఖీ, ఉపాధ్యాయుల నియామకం, పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం, గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఇవన్నీ ప్రారంభించబడ్డాయి. 1884లో బ్లంట్ హైదరాబాద్‍లో ఉన్నప్పుడు ఇక్కడ ఒక మహమ్మదీయ యూనివర్శిటీ ఉంటే బాగుంటుదని అప్పటి దివాను రెండవ సాలార్జంగ్‍తో చర్చించారు. ఆయన దానికి ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్‍కు చెప్పడం ఆయన దానిని ఆమోదించడం జరిగింది. కానీ అది ఆయన కుమారుని కాలంలో ఫలవంతమైంది.
మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలం నాటికి విద్య చాలా అభివృద్ధిని సాధించింది. 1911లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ తండ్రి మరణానంతరం సింహాసన మధిష్ఠించాడు. ఆయన కాలంలో హైదరాబాద్ రాజ్యం అన్ని రంగాలలో అభివృద్ధిగాంచింది. ఆ సమయంలో విద్యా సలహాదారు అయిన ఎం.ఎ.టి మాథ్యు రాజ్యంలోని విద్యావ్యవస్థపై కూలంకష సర్వే నిర్వహించి ఒక రిపోర్టు తయారు చేశాడు. అందులో విద్యాభివృద్ధికి కొన్ని సంస్కరణలను సూచించాడు. అవి 1. ప్రైమరీ విద్యను బాగా విస్తరింపచేయాలని 2. ప్రాథమిక విద్యలో మాతృభాషనే వాడాలి 3. వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు 4. విద్యా సంస్థలను తనిఖీ చేయడానికి ఇన్‍స్పెక్టర్ ఉండాలి. 5. మహిళా ఇన్‍స్పెక్టర్లను నియమించాలి 6. దారుల్-ఉల్-ఉలుమ్‍ను ఓరియంటల్ విద్యా సంస్థగా గుర్తించాలి 7. ఇంగ్లీషు హైస్కూళ్ళలో సిబ్బందిని బలోపేతం చెయ్యాలి 8. ముఖ్యమైన హైస్కూళ్ళపైన అర్హతగల బ్రిటీష్ అధికారులను నియమించాలి 9. ముఖ్య కేంద్రాలలో ఉన్న నార్మల్ స్కూళ్ళను మార్చాలి. 10. జిల్లాల్లో శిక్షణ కేంద్రాలను ప్రారంభించాలి. 11. ప్రైమరీ, సెకండరీ పాఠశాలలు మరియు పారిశ్రామిక పాఠశాలలో పాఠ్యప్రణాళికను పునర్విమర్శ చేయాలి. 12. పాఠ్యపుస్తకాల కమిటీని ఏర్పాటు చేయాలి. 13. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్‍ను ఏర్పాటు చేయాలి. 14. హైదరాబాద్‍లో ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. ఈ సంస్కరణలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం మొదట ప్రైమరీ విద్యను విస్తరింపజేసి అనంతరం సెకండరీ విద్యను బలోపేతం చేసే ప్రయత్నం చేసింది. ప్రైమరీ విద్యను పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింపజేసే ఉద్దేశ్యంతో డా।। ఆల్మలతీఫ్‍ను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‍స్ట్రక్టర్‍గా నియమించారు. అతను విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. అతని సంస్కరణలలోనే భాగంగా బాలికల పాఠశాలలపై మహిళా ఇన్‍స్పెక్టర్‍లను నియమించడం జరిగింది. ప్రాథమిక విద్యా విధానంలో పరీక్షలు విధివిధానాలు మార్చబడ్డాయి. ప్రాంతీయ భాషలలో అధికారులకు పరీక్షలు నిర్వహించి వారిపేర్లను డిపార్ట్మెంట్‍లో నమోదు చేశారు. మాథ్యూ ప్రతిపాదనల ప్రకారం ప్రాథమిక విద్యావ్యవస్థ మొదలయ్యింది. ఫలితంగా సరైన భవనాలు వసతులతో సరిపోయినంత సిబ్బందితో సాహీ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక నిధులతో నడిచే పాత పాఠశాలలను అవసరమున్న చోటుకు మార్చడం జరిగింది. ఈ కాలంలోనే 243 పరిశోధనాత్మక పాఠశాలలను స్థాపించడం జరిగింది. 77 స్కూళ్లకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. అందులో 46 పాఠశాలలు అమ్మాయిల కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ఈ దశాబ్దంలోనే ప్రాథమిక అభివృద్ధికి పంచవర్ష ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకం క్రింద 12.5 లక్షల నిధులను ప్రైమరీ విద్యకు అదనంగా మంజూరు చేసింది ప్రభుత్వం. నూతనంగా ప్రారంభించిన పాఠశాలలకు 8 సం।। వరకు ప్రతి సం।। రూ. లక్ష ఇస్తామని చెప్పింది. రెండు భాషలలో బోధన చేసే పాఠశాలలో సిబ్బందిని పెంచింది. ఉర్దూనే గాక స్థానిక భాషలను బోధించే విధంగా పాఠ్యప్రణాళికను మార్చడం జరిగింది. ప్రాథమిక పాఠ్యప్రణాళిక మార్పు చేయడం జరిగింది. 1938 నుండి నూతన పాఠ్యప్రణాళికను ప్రారంభించాలని నిర్ణయం జరింది. అంతేగాక జాతీయ ప్రాంతాలు, సంస్థానాలు, పైగా ప్రాంతాలలో ఓపెన్ స్కూల్‍లను ఏర్పాటు చేసారు. 1989లో ప్రాథమిక విద్య బాధ్యతను పునరావృత ఖర్చు భత్యాల నుండి వాడాలని నిర్ణయించడం జరిగింది. 1948 వరకు విద్యలోని అన్ని దశలలో బోధనా భాషప ఉర్దు మరియు ఇంగ్లీషుగా ఉండాలి. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలి అనుకున్న దానికి తగిన ప్రత్యామ్నాయము చేయలేదు. 1948లో ప్రైమరీ పాఠశాలలో తెలుగులో బోధనను ప్రారంభించారు.
అనంతరం సెకండరీ పాఠశాలలో కూడా ప్రారంభించారు. మూడవ తరగతి నుండి హిందీని అదనపు భాషగా ప్రవేశపెట్టారు. హైయ్యర్ సెకండరీ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టారు. అంతేగాక అన్ని పాఠశాలలో 5వ తరగతి నుండి ఇంగ్లీషు తప్పనిసరి విషయంగా ప్రవేశపెట్టారు. ప్రైమరీ సెకండరీ స్కూళ్ళలో అన్ని విషయాలను చూసుకోవడానికి దానికి ఒక సలహా సంఘాన్ని నియమించారు. వీరు ప్రతి రెండు సంవత్సరాలకు విద్యాభివృద్ధిపై సర్వేలు జరిపి ప్రజాభిప్రాయాలు తెల్సుకునేవారు. ప్రాథమిక మరియు సాంఘిక విద్యను ఏర్పాటు చేశారు. వీరు విద్యార్థులకు తరగతులకు తగిన పుస్తకాలను ప్రచురించారు. జిల్లాలలో ప్రాథమిక విద్యాభివృద్ధికి మరొక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అధికార, అనధికార సభ్యులు ఉండేవారు. జిల్లాలలో విద్యాభివృద్ధి ఈ కమిటి ముఖ్యలక్ష్యం. ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలను ఈ కమిటీ సమీక్షిస్తుంది. గ్రామాలల విద్యాభివృద్ధికి మరొక కమిటి ఏర్పాటు చేయడం జరిగింది. 1949లో ఎన్నిక చేసిన 10 ప్రాంతాలలో నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా 6-8 సం।। వయస్సున్న దాదాపు 98% మంది పిల్లలను విద్య చక్రంలోకి తీసుకురావడం జరిగింది. ప్రైమరీ విద్యపై తీసుకున్నంత శ్రద్ధ సెకండరీ విద్యపై తీసుకోలేదు. ఫలితంగా ప్రాథమిక విద్యలో ఉన్నంత అభివృద్ధి సెకండరీ విద్యలో కన్పించలేదు.
సెకండరీ విద్య:
20వ శతాబ్దంలో సెకండరీ విద్యపై శ్రద్ధ తీసుకున్నారు. ఇది రెండు శాఖలుగా విభజింపబడింది. ఆంగ్లో వెర్నిక్యులర్ మరియు ఎర్నాక్యులర్. 1920-21లో సెకండరీ విద్య విద్య ప్రణాళికలను మార్చడం జరిగింది. ఈ పాఠశాలలన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం కిందికి తీసుకొని వచ్చారు. ముందు ఇవన్నీ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేవి. ప్రాథమిక విద్య అభివృద్ధి జరగడం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటు తర్వాత సెకండరీ విద్య బాగా అభివృద్ధి చెందింది. ప్రతి తాలూకాలో ఒక మిడిల్ స్కూలు ఏర్పాటు చేశారు. దాదాపు 49 సెకండరీ స్కూళ్ళను ప్రారంభించారు. ఇందులో పట్టా పొందిన, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించారు. ఉపాధ్యాయులంతా శిక్షణ తప్పనిసరి చేశారు. వారి జీతాలను పెంచారు. ఫలితంగా సెకండరీ విద్య పరుగులు తీసింది. నిజాం రాజ్యంలో ఈ కాలంనాటి మూడు రకాల పాఠశాలలు ఉండేవి.
1.విద్యార్థులను హెచ్.ఎస్.ఎల్.సి పబ్లిక్ పరీక్షలు లేదా లోకల్ కేంబ్రిడ్జ్ సర్టిఫికెట్ పరీక్షను చదివించే పాఠశాలలు. ఇవి ఇంగ్లీషు మీడియం పాఠశాలలు.
2.ఉస్మానియా విశ్వవిద్యాలయం కింద మెట్రిక్యులేషన్ పరీక్షకు సిద్ధం చేయించే స్కూళ్ళు
3.పై రెండు కలిపి విద్యార్థులను తయారు చేసే స్కూళ్ళు, మొత్తం మీద రాజ్యమంతటా 940 నాటికి ఇంగ్లీషు హైస్కూళ్ళుకీ, ఉస్మానియా హైస్కూళ్ళు 33 ఉండేవి. ఇంకా 196 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండేవి. 1943 నాటికి సెకండరీ స్కూళ్ళలో కంబైన్ విధానాన్ని రద్దు చేశారు. బోర్డు పూర్తిగా సెకండరీ విద్యపై ఆధిపత్యం తీసుకుంది.
- డా।। బొల్లేపల్లి సుదక్షణ
ఎ : 98495 20572