ఐఏఎంసీ హైద్రాబాద్‍కి మరో కలికితురాయి

ఆర్బిట్రేషన్‍ అంటే మధ్యవర్తిత్వం. ఈ ఆర్బిట్రేషన్‍ భారతదేశ గ్రామీణ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. భార్యాభర్తల తగాదాలు, వారసత్వ ఆస్తుల వివాదాలు, భూసరిహద్దు వివాదాలు, కుల మత ఘర్షణల వంటివి పోలీసు కేసుల వరకూ, కోర్టుల వరకూ వెళ్లకుండా ఊరి పెద్దలే మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించడం మనకు తెలుసు.


ఆధునిక జీవితంలో వచ్చిన మార్పులు వివిధ సామాజిక వ్యవస్థలపై పరోక్షంగానో, ప్రత్యక్షంగానో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అనేక కారణాల వల్ల కోర్టుల్లో కేసుల పరిష్కారం ఆలస్యమవుతుంది. దశాబ్దాల కాలం పడుతుంది. ముఖ్యంగా ఈ ఆలస్యం దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పెద్ద పెద్ద వ్యాపార కంపెనీల వివాద పరిష్కారాల్లో జరుగుతున్న ఆలస్యం వల్ల వ్యాపారాభివృద్ధి కుంటుపడుతుంది. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. వ్యాపార కంపెనీలు వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లకూడదని, మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలనే నిబంధనను తమ ఒప్పందాల్లో చేర్చుకుంటున్నాయి. అందువలన ఆర్బిట్రేషన్‍ మీడియేషన్‍ సెంటర్లు పెద్ద సంఖ్యలో అవసరమవుతున్నాయి. ఇవి ఆధునిక చట్టాల వెలుగులో పని చేస్తాయి. ఇప్పటికే లండన్‍, సింగపూర్‍, ఢిల్లీ, ముంబైల్లో
ఉన్నాయి. మన కంపెనీలు లండన్‍, సింగపూర్‍లకు వెళ్తున్నాయి. ఈ కేంద్రాలకు ఏ మాత్రం తీసిపోని అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో హైదరాబాద్‍లో ఇటీవల ఆర్బిట్రేషన్‍, మీడియేషన్‍ కేంద్రాన్ని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణగారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‍ గారు ప్రారంభించారు. జాతీయ, అంతర్జాతీయ వినియోగదారులు హైదరాబాద్‍ వస్తారు. అన్ని రకాల కుటుంబ, వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఈ కేంద్రం ఒక గొప్ప కేంద్రంగా నిలుస్తుంది. రాష్ట్రంలో జరిగే కాంట్రాక్టులు ఇక ఇక్కడికే రావాలనే నిబంధనలు అవసరమౌతాయి. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‍కి ఈ కేంద్రం మరో కలికితురాయి. హైదరాబాద్‍లో ఈ కేంద్రం ఏర్పాటులో ముఖ్యమంత్రి కెసిఆర్‍ గారి పట్టుదల, ఎన్వీ రమణ గారి సహకారం అభినందనీయం.


వరంగల్‍లో ఇటీవల ఎన్వీ రమణ గారు ప్రారంభించిన 10కోర్టుల సముదాయం సాధారణ కోర్టు భవన నిర్మాణ పద్ధతులకు భిన్నంగా ఉంది. ఆవరణ పరిసరాలలో పూల మొక్కలపెంపకం, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం, ఆట వస్తువుల ఏర్పాటు, చదువుకోవడానికి గ్రంధాలయం ఏర్పాటు, ఫ్యామిలీ కేసులకు హాజరయ్యే స్త్రీలు, పిల్లలు బయటికి కనిపించకుండా రహస్య గదులు, రాకపోకల సౌకర్యం యింతకుముందు ఎక్కడాలేవు. భయానికి, అనుమానాలకు తావివ్వని భద్రత, ప్రశాంతత నిస్తుంది. పాలనా వ్యవహారాలలో మానవీయత, ఈస్తటిక్స్ చోటుచేసుకోవడం సంతోషదాయకం.


అంటార్కిటా ఖండం గురించి ఫ్రాన్స్కి చెందిన భూరసాయన శాస్త్రవేత్త క్లాడ్‍ లోరియన్‍ సుదీర్ఘ కాలం పరిశోధనలు చేసాడు. మిలియన్‍ సంవత్సరాల క్రితం నాటి భూ ఉష్ణోగ్రతల్ని, వాతావరణాన్ని, పరిస్థితులను ఈ ఆధునిక ప్రపంచానికి తెలియజేసాడు. పర్యావరణ, వాతావరణ, భూ పరిరక్షణ వైపుగా ఆలోచించేటట్లు చేసాడు. ఇప్పటికీ భారత్‍తో సహా 30 దేశాలు ఈ ఖండంపై పరిశోధనలు చేస్తున్నాయి. ఈ ఖండంపై ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. ఈ పెంగ్విన్‍ల నివాస కేంద్రం ఎవరికి దక్కుతుందో. ఇవన్నీ పక్కన బెట్టి క్లాడ్‍ హెచ్చరికను దృష్టిలో పెట్టుకొని వాతావరణ, భూతాప, పర్యావరణ పరిరక్షణల పట్ల సరైన చర్యలు తీసుకోవాలి.


భారతదేశంలోని సుందరమైన పర్వతశ్రేణుల్లో నిర్మించిన డార్జిలింగ్‍, నీలగిరి, కల్కాసిమ్లా మౌంటెన్‍ రైల్వేలు సమిష్టిగా వారసత్వ ప్రదేశాలుగా యునెస్కోచే 2005లోనే గుర్తింపు పొందాయి. ఇవి మన సాంకేతిక నైపుణ్యాలకు గీటురాయి. ప్రకృతి సౌందర్యం, సొరంగాలు, వివిధ మలుపులు, వంతెనలు, పర్వత అంచుల వెంట ప్రయాణంతో పర్యాటకులను, ప్రయాణీకులను ఆనంద పెట్టే ఈ మౌంటేన్‍ రైల్వేలు మనకు గర్వకారణం.


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *