మానవాళి మనుగడికి మూలధాతువు భూమి. భూమి, ఆకాశం, నీరు, గాలి, నిప్పు కలిస్తే ప్రకృతి. సహజంగానే వీటి మద్య సమత్యులత ఉంటుంది. ఈ సమతుల్యతనే పర్యావరణమంటాం. ప్రకృతితో సామరస్యం కొనసాగినంత కాలం సుస్థిర జీవనం సాధ్యం. ఈ సామరస్యతకు హానికలిగినప్పుడు వివిధ సంక్షోభాలు తలెత్తుతాయి.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొనే సంక్షోభాలన్నీ సహజమైనవి కావు. మానవ ప్రమేయమే ప్రధాన కారణమవుతున్నది. ఈ సంక్షోభాలు ప్రకృతి పరంగానే కాదు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాలనూ ప్రభావితం చేస్తున్నాయి. సకల జీవరాసులకు కన్న తల్లి భూమి. ఈ భూమిపై వున్న జీవరాసులలో మనిషి కూడా ఒక భాగమని గుర్తించాలి. భూమి తన ఒక్కడి సొత్తు అనే ఆధిపత్య భావన విడిచిపెట్టాలి. సకల జీవరాసుల ఉనికిని కాపాడే వనరులన్నిటికీ భూమి వివిధ రూపాలలో అందిస్తున్నది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. భూగర్భజలాలు, నదులు, సముద్రాలు, గాలి పారిశ్రామిక వ్యవర్థాలతో విషపూరిత మవుతున్నాయి. అడవుల నరికివేత, మడ అడవుల నిర్మూలన, ఖనిజ సంపద వంటి సహజ వనరులన్నిటినీ ధ్వంసం చేసి కలుషితం చేస్తున్నాము. వీటి ఫలితంగా వివిధ జీవరాసులు తన ఉనికిని కోల్పోయి జీవ వైవిధ్యం దెబ్బతింటున్నది.
పర్యావరణ వ్యవస్థలు బలంగా ఉండటానికి మానవ వ్యవస్థలు దోహదం చేసినప్పుడు మానవ వ్యవస్థలు బలంగా ఉండటానికి సహజంగానే పర్యావరణ వ్యవస్థలు తోడ్పడతాయి.
మానవులు ప్రకృతితో సామరస్య జీవనం సాగించేందుకు కృషి చేయాలి. దానికి అనుగుణంగా మన విధాన నిర్ణయాలు, ప్రణాళికలు ఉండాలి.
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎనిమిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా పయనించి తీసుకొన్న కొన్ని నిర్ణయాలలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, హరితహారం వంటివి పర్యావరణ సమతుల్యానికి తోడ్పడ్డవి. ప్లోరైడ్ రహిత ప్రాంతంగా తెలంగాణా నిలిచింది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పునర్నిర్మాణం కొనసాగాలి.
జూన్ 5న జరుపుకోబోతున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ కృషికి మరింత ప్రేరణగా నిలుస్తోందని ఆశిద్దాం.
1972లో స్టాక్‍హోమ్‍లో జరిగిన మొదటి సదస్సు ‘ఓన్లీ ఒన్ ఎర్త్’ని ప్రధాన నినాదంగా తీసుకుంది. ఏభై ఏళ్లు గడిచిన తర్వాత యిప్పుడు కూడా అదే ప్రధాన నినాదంగా ఉంది. ఆ నినాదం యిచ్చిన అవగాహన చైతన్యం ఆచరణలో ఇప్పటికే సఫలీకృతం కావాల్సి వుంది. కాని పరిస్థితి మరింత క్లిష్టతరమై సవాలుగా నిలిచింది. మరింత అవగాహనతో, చైతన్యంతో యుద్ధప్రాతిపదికన ఆచరణవైపు ప్రయాణించి ‘ఒకే ఒక్క భూమి’ని నిలబెట్టుకోవాలి. కాపాడుకోవాలి. కాలుష్యరహిత మానవ స్వభావమే ఈ కర్తవ్యాన్ని నెరవేర్చగలుగుతుంది. లేకుంటే మానవాళి ఉనికే ప్రశ్నార్థకమవుతుంది.
మణికొండ వేదకుమార్
ఎడిటర్