గోదావరికి వందేండ్లలో కనీవినీ ఎరుగని వరద. తెలంగాణలో మూడున్నర దశాబ్దాల కాలంలో జూలైలో ఎన్నడూ లేనంత గరిష్ఠ వర్షపాతం. వారం రోజులుగా ముంచెత్తుతున్న వాన రాష్ట్రాన్ని గుక్కతిప్పుకోకుండా చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితి ఇటీవలి కాలం లో ఎన్నడూ చూడనిది. అయినా రాష్టప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించి ఆస్తి, ప్రాణ నష్టాలను గణనీయంగా తగ్గించగలిగింది. స్వయంగా సీఎం కేసీఆర్ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ అటు అధికారులను, ఇటు మంత్రులను, నేతలను క్షేత్రస్థాయిలో మోహరింపజేసి ప్రజలకు భరోసా కల్పించారు. ప్రాకృతిక విపత్తులను మనిషి నివారించలేడు. చేయగలిగిందల్లా ముందుజాగ్రత్త మాత్రమే.
నైరుతి రుతుపవనాలతోపాటు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో క్రమంగా పెరిగిన వర్షాల ఉద్దృతి ఒక్కసారిగా జడివానగా, కుంభవృష్టిగా మారిపోయింది. ప్రమాదాన్ని ముందే అంచనా వేసిన సీఎం కేసీఆర్ వెంటనే కార్యాచరణ చేపట్టారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తూనే, సంబంధిత ప్రభుత్వ విభాగాలన్నింటినీ యుద్ధప్రాతిపదికన మోహరించారు. చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలో నీటిమట్టాల వివరాలను సమీక్షించారు. ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించటానికి రెస్క్యూ టీంలను ఏర్పాటు చేయాలని, ఎన్డీఆర్‍ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే హెలికాప్టర్లను వాడాలని అధికారులకు సూచించారు. ప్రతి ఆరుగంటలకు ఒకసారి పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‍కు ఆదేశాలు జారీ చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్తలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖకు దిశానిర్దేశం చేశారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఒకవైపు క్షేత్రస్థాయి పరిస్థితిని, మరోవైపు పైస్థాయి అధికారులను ఏకకాలంలో సమన్వయపరిచారు.
తెలంగాణపైకి దూసుకొచ్చిన ఈ జలఖడ్గాన్ని ఎదుర్కోవటంలో సీఎం కార్యాలయమే వార్‍రూమ్‍గా మారిపోయింది. జీపీఎస్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాష్ట్రవాప్తంగా సహాయక చర్యలకు దిక్సూచిగా నిలిచింది. సీఎం ప్రతిరోజూ 12 నుంచి 15 గంటల పాటు ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షించారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు స్థానికంగా పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. వంతెనలు, జలాశయాలు, లోతట్టు ప్రాంతాల వద్ద పోలీసుశాఖ నిరంతర పహారా చేపట్టింది. ఇక ఇంజినీర్ల కృషిని, సాహసాన్ని మాటల్లో వర్ణించలేం. రోడ్లు దెబ్బతిని రాకపోకలకు ఆటంకం ఏర్పడిన ప్రాంతాల్లో అప్పటికప్పుడు తాత్కాలిక ఏర్పాట్లు జరిపి రవాణాను పునరుద్ధరించారు అధికారులు. కరెంటు సరఫరా దెబ్బతినకుండా విద్యుత్‍శాఖ సమర్థవంతమైన ఏర్పాట్లు చేసింది. ఒక్కటని ఏమిటి, ప్రతి శాఖ, ప్రతి అధికారి బాధ్యతతో ముందుకువచ్చి తమ వంతు పాత్ర పోషించారు. పూర్తి సమన్వయంతో రాష్టప్రభుత్వ యంత్రాంగం కదిలిన ఫలితంగానే విపత్తు నుంచి దాదాపుగా బయటపడగలిగాం.
వణికిన గోదావరి పరీవాహక ప్రాంతాలు
గోదావరి పరీవాహకం వణుకుతోంది. ముంపు నుంచి ఎప్పుడు బయటపడతామా అని ఎదురుచూస్తోంది. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో సగానికి పైగా గ్రామాల ప్రజలు ఇళ్లు విడిచి.. ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. కొందరి ఇళ్లు ఇప్పటికీ నీళ్లలోనే
ఉన్నాయి. మరికొన్ని ఇళ్లు బయటపడగా, ఇంకొన్ని ఆనవాళ్లుగా మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ రెండు మండలాల్లో 30కి పైగా గ్రామాలు, కాలనీలు పూర్తిగా ముంపులో ఉన్నాయి. దాదాపు 50 వేల మంది నిరాశ్రయులైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ముంపులో మోతె గ్రామం…
సారపాక నుంచి ఐటీసీ పేపర్ మిల్లు పక్క మార్గంలో అయిదు కిలోమీటర్ల దూరాన ఉంది మోతె గ్రామం. 300 కుటుంబాలున్న ఈ పల్లె రూపురేఖలు మారిపోయాయి. ఎక్కడ చూసినా బురద. శనివారం ఉదయం ప్రధాన మార్గంలోని ఒకవైపు కొన్ని ఇళ్ల నుంచి వరద కొంత మేర వెనక్కు తగ్గింది. మిగిలిన ఊరంతా ముంపులోనే ఉంది. ఇళ్లలో బురదను తొలగించేందుకు ప్రభుత్వ అధికారులు నానాతంటాలు పడుతున్నారు. మోతె, సారపాకల మధ్య రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలు లేవు. ఎన్డీఆర్‍ఎఫ్ సిబ్బంది ప్రత్యేక పడవ ద్వారా బాధితులను అటూ ఇటూ చేరవేస్తున్నారు. సారపాక గ్రామంలోని చేదబావులు, బోరుబావుల్లోకి బురద చేరింది. ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పట్టుకుంటున్నారు. స్థానిక సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్‍రావు ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. మోతె, ఇరవెండి గ్రామాల్లో పూరిళ్లు ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
కాలనీలు అతలాకుతలం
బూర్గంపాడు మండలంలో సగం గ్రామాలు ఇంకా తేరుకోలేదు. బసవప్ప క్యాంపు, భాస్కర్‍నగర్, గాంధీనగర్, పాత సారపాక, సుందరయ్య నగర్ కాలనీలు అధికభాగం ముంపులోనే ఉన్నాయి. ఇళ్ల స్లాబు స్థాయి వరకు నీళ్లున్నాయి. ఇరవెండి, మోతె, పట్టేనగర్, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, బూర్గంపాడు పంచాయతీలను నీళ్లు చుట్టుముట్టాయి. విద్యుత్, తాగునీరుకు అంతరాయం జరిగింది. ప్రభుత్వ అధికారులు సమస్యలు పరిష్కారానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. బూర్గంపాడుకు రాకపోకలు నిలిచిపోయాయి.
తాగునీటికి కటకట
తాగునీటి పంపిణీకి ఏర్పాటు చేసిన ట్యాంకర్ల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. అక్కడక్కడ పనిచేస్తున్న బోర్ల వద్ద కూడా గుమిగూడుతున్నారు. స్తంభాలన్నీ నీట మునగడంతో శుక్రవారం నుంచి బూర్గంపాడు మండలంలో గ్రామాలకు విద్యుత్‍ను నిలిపివేశారు.
పునరావాస కేంద్రాలు…
బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాల వారికి సారపాకలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని కేంద్రాల్లో ఆహార సరఫరా శుక్రవారం రాత్రి, శనివారం మధ్యాహ్నం ఆలస్యంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. పిల్లల కోసం కొందరు తల్లిదండ్రులు అన్నాన్ని మిగిల్చి.. దాచుకుకున్నారు. విద్యుత్ లేక.. కేంద్రాల్లో ఫ్యాన్లు పనిచేయక దోమలు విజృంభిస్తున్నాయి. కొవ్వొత్తి వెలుగులతో నెట్టుకొస్తున్నారు.
చుట్టూ నీరే…
మహోగ్రరూపం దాల్చి తీరప్రాంతాలను కకావికలం చేస్తున్న గోదారమ్మ ధాటికి ఇప్పటికీ చాలా గ్రామాలు ముంపు నీటిలో మగ్గుతున్నాయి. భదాద్రి-కొత్తగూడెం జిల్లాలో నదికి ఇరువైపులా ఆనుకుని ఉన్న చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లోని వందల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ వరద పరిస్థితిపై అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో పాలు పంచుకునేందుకు సైనిక బలగాలు భద్రాచలం చేరుకున్నాయి.
రామాలయానికి వరద పోటు
భదాద్రి రామాలయం అయిదు రోజులుగా వరద గుప్పిట్లోనే ఉంది. గోదావరికి వరద తగ్గినప్పటికీ వెనక్కి తన్నిన నీటితో ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. పంపింగ్ వ్యవస్థలోని పైపులు మునిగిపోవడంతో ఆ నీటిని నదిలో కలిపే దారి మూసుకుపోయింది.
కరకట్ట పొడిగించాలని డిమాండు:
దశాబ్దాలుగా ఏటా వర్షాకాలంలో వరద ముప్పు ఎదురవుతున్న, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భద్రాచలంలోని సుభాష్‍నగర్ వాసులు డిమాండ్ చేశారు. కరకట్ట నిర్మాణాన్ని పొడిగించి బలోపేతం చేయాలంటూ కోరారు.
గోదావరికి పూజలు:
గోదారమ్మ శాంతించాలని కోరుతూ స్నానఘట్టాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి తల్లికి పసుపు, కుంకుమ, చీర, పూలు, పండ్లు సమర్పించారు. ప్రత్యేక అధికారులుగా నియమితులైన సింగరేణి సీఎండీ శ్రీధర్, సీసీఎల్‍ఏ డైరెక్టర్ రజత్ కుమార్ సైనీ, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, భదాద్రి కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్ పాల్గొన్నారు. అనంతరం వారు పునరావాస కేంద్రాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు.
నెమ్మదిగా తగ్గుతూ…
ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చిన గోదారమ్మ నెమ్మదిగా తగ్గుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజీ నుంచి భద్రాచలం వరకు భారీ నీటి ప్రవాహం కొనసాగు తోంది. శనివారం ఉదయం భద్రాచలం వద్ద నది 71.3 అడుగుల మట్టం నమోదైంది. నదిలో 24.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. రాత్రి 11 గంటలకు 67.10 అడుగులకు చేరగా 22.03 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వెళ్తోంది. పన్నెండు గంటల వ్యవధిలో 3.3 అడుగులు మాత్రమే తగ్గింది. ప్రమాద హెచ్చరికల లోపునకు నీటిమట్టం తగ్గడానికి ఎంత సమయం పడుతుందోననే ఆందోళన వ్యక్తమవుతుంది.
రాష్ట్ర సగటు కన్నా 125% ఎక్కువ
రాష్ట్రంలో రికార్డుస్థాయిలో వర్షాలు కురిశాయి. గత జూన్ ఒకటి నుంచి శనివారం (16.7.2022) నాటికి రాష్ట్ర సగటు వర్షపాతం 236.3 మిల్లీమీటర్లకన్నా 125 శాతం అదనంగా కురిసిందని వాతావరణశాఖ తెలిపింది. ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలో 245 శాతం జగిత్యాల 226, నిర్మల్ 208, కరీంనగర్ 202, కుమురంభీం 188, మంచిర్యాలలో 170 శాతం అదనంగా నమోదైంది. ఈ స్థాయిలో 200 శాతానికి మించి వర్షపాతం నెల వ్యవధిలోనే నమోదవ్వడం కొత్త రికార్డు. ఈ లెక్కలు జూన్ ఒకటి నుంచి చెప్పినా… వాస్తవానికి నైరుతి రుతు పవనాలు 2022 జూన్ 13న రాష్ట్రంలో ప్రవేశించి 16 నాటికి పూర్తిగా విస్తరించాయి. అప్పటినుంచే వానలు పడినప్పటికీ… గత వారం రోజుల్లో ఏకంగా 3, 4 రోజులు కుంభవృష్టి కురిసింది. దీంతో సగటు వర్షపాతం లెక్కలన్నీ ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో జూన్ 1 నుంచి జులై 16 వరకూ 47 రోజుల్లో కురవాల్సిన సాధారణ వర్షపాతం 271.8 మి.మీ.లైతే.. ఏకంగా 937 మి.మీ.లుగా నమోదైంది. ఒడిశాపై బంగాళాఖాతం తీరంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉత్తర భారతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రుతుపవనాల ద్రోణి ఏర్పడి దేశమంతా గత వారం రోజులుగా విస్తా రంగా వానలు పడ్డాయి. ఈ అల్పపీడనం ఒడిశా మీదుగా ఎక్కువ రోజులు న్నందున తెలంగాణపై కుంభవృష్టి కురిసింది. అది పశ్చిమబెంగాల్ వైపు వెళ్లి బలహీనపడటంతో శుక్ర, శనివారాల్లో వర్షాలు తగ్గిపోయాయి. మళ్లీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీగా వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న చెప్పారు. జులై 16నాటికి ఈ స్థాయి వర్షాలు కురవడం ఇదే తొలిసారన్నారు. (తేది : 28.7.2022)