ఈనాటి పిల్లలకు గాంధీతాత పరిచయం -బాలల తాతా బాపూజీ

డా।। పత్తిపాక మోహన్‍ రాసిన ‘‘బాలల తాతా బాపూజీ’’ అనే బాల గేయాల పుస్తకం 2020లో వచ్చింది. కవర్‍ పేజీమీద సకిలం ముకిలం వేసుకుని కూర్చున్న గాంధీతాతను వెనకనుంచి ప్రేమతో పెనవేసుకున్న ఓ చిన్న పాప, పక్కన నిలబడి ఓ ఆనంద గీతం చదువుతున్న బాబూ, వాళ్ళందరి ముఖాల్లో పున్నమి వెన్నెలల్లాంటి నవ్వులూ అందరినీ ఆ పుస్తకంలోకి రమ్మని ఆహ్వానిస్తాయి.


బాపూజీ గేయాల్లో గొప్ప గుణాలు, ఆయన చేసిన మంచి పనులు, సమాజోద్ధరణ కార్యక్రమాలు, ఆయన జీవన శైలీ, ఆయననుంచి ఈనాటివాళ్ళు నేర్చుకోవలసిన మంచి లక్షణాలు వెన్నముద్దలు తినిపించినట్టు వినిపించాడు. వాటిలో ‘జోతలు’ గేయంలో గాంధీజీ గురించి ఇలా అంటాడు.‘‘శివమెత్తిన స్వేచ్ఛకు నీ పిలక ప్రతీక/ నీ బోసి నవ్వే కదా భరత జాతి జ్ఞాపిక’’ ఎంత గొప్ప ప్రతీక లివి! తాత పిలక పిలలకు నవ్వు తెప్పించేది. బోసి నవ్వులు బాగుంటాయా అంటే పిల్లల బోసి నవ్వులు చాలా బాగుంటాయి, కానీ పళ్ళూడిపోయిన పెద్ద వాళ్ళనవ్వులు మనం బాగుంటాయని అనుకోం. కానీ ఎప్పుడూ నవ్వుతూ కనిపించే బాపూజీ బోసినవ్వు ఎంతో అందమైన ‘భరతజాతి జ్ఞాపిక’ అని చెప్పడం ఎంతో అద్భుతమైన పిల్లలకు నచ్చే భావన!


ప్రపంచీకరణలో పల్లెలన్నీ తమ నిజమైన ఉనికిని కోల్పోతున్న ఈ తరుణంలో బాపూజీ ఆశించిన ‘గ్రామరాజ్యాల’ గురించి రామరాజ్యం అనే గేయంలో పల్లెలంటే తెలియని పట్నం పిల్లలకు పల్లెల్ని ఇలా పరిచయం చేస్తాడు. ‘‘పల్లెటూర్లు దేశానికి ప్రగతి పట్టుకొమ్మలు/ గాంధితాత ఆశించిన/ గ్రామరాజ్య కేంద్రాలు/… పల్లెలు సమృద్ధిగుంటె/ అదే రామరాజ్యం… పల్లెలు బాగుంటేనే/ సంపదలు, సౌభాగ్యం’’ అంటూ గాంధీ బోధల వెలుగులో పల్లెల్ని కాపాడుకోవాలనే అవగాహన బాలలకు ఇస్తాడు.


బాపూజీ గురించి ఇలా ఇన్ని అద్భుతమైన, ఆశ్చర్య కరమైన విషయాలు పాడుకున్న పిల్లలు తరువాత• తప్పకుండా బాపూజీ కథ పూర్తిగా చెప్పాలని అడిగి తీరుతారు. కనుక తరువాత గేయకథలో బాపూజీ జీవితాన్ని పూర్తిగా ఓ పూల చెండులా, చిలుకల దండలా మొదలుపెట్టి, అందంగా, ముద్దుగా, కుతూహలం కలిగించేలా వినిపిస్తాడు. పిల్లలు హాయిగా పాడుకోగలిగేలా ఉండే ఈ గీతాల పుస్తకంలో ప్రతి పేజీలో బాపూజీ, పిల్లలూ కలిసివున్న బొమ్మలు ప్రత్యేక ఆకర్శణగా కనిపిస్తాయి.


ఈ వ్యాసం ముగిస్తుంటే ఇప్పుడే అందిన శుభవార్త! డా।। పత్తిపాక మోహన్‍ రాసిన ఈ ‘‘బాలల తాతా బాపూజీ’’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. ఇది బాల సాహిత్యాభి మానులందరికీ పట్టలేనంత సంతోషాన్ని కలిగించే విషయం. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత మన పత్తిపాక మోహన్‍కు హృదయపూర్వక అభినందనలు!!


ఈ సంతోష సందర్భంలో డా।। పత్తిపాక మోహన్‍ గురించి ఇప్పుడు ఇక్కడ క్లుప్తంగానైనా పరిచయం చేయవలసిన అవసరం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు దశాబ్ద కాలంగా పునరుజ్జీవనంతో వికసిస్తున్న బాల సాహిత్య వికాసానికి ఆయన చేసిన, చేస్తున్న సేవలు, ఇస్తున్న సహకారం అత్యంత అమూల్యమైనవి. తెలంగాణ రాష్ట్రంలో తొలి బాలల సృజనాత్మక కార్యశాల నిజామాబాద్‍లో వారి నిర్వహణలోనే జరిగింది. ఆనాటి నుంచి తెలుగురాష్ట్రాల్లో వందలాది సృజనాత్మక కార్యశాలల ఏర్పాటులోనూ, నిర్వహణలోనూ, బాలసాహిత్య పుస్తకాల ప్రచురణలోనూ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆయన సేవలు, సహకారాలు అసామాన్యమైనవి. అలా బాలసాహిత్య బంతిపూల హారాలు అల్లూతూ, అందంగా తీర్చి దిద్దుతున్న పత్తిపాక మోహన్‍ అందరికీ ఇష్టమైన, ఆత్మీయుడు, స్నేహితుడు, సోదరతుల్యుడు.


కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం పొందిన ‘‘బాలల తాతా బాపూజీ పుస్తకం’’ అట్ట చివరిపేజీలో పత్తిపాక మోహన్‍ను గురించి చేసిన చిన్న పరిచయం ఇక్కడ ఇస్తున్నాను.


‘‘డా।। పత్తిపాక మోహన్‍ కవి, రచయిత, విమర్శకులు, బాల సాహితీవేత్త. మహాకవి డా।। సి. నారాయణ రెడ్డి గారిచే ‘వ్యాఖ్యాన దక్షుడు’గా ప్రశంసలు పొందిన వ్యాఖ్యాత. స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్ల. నేషనల్‍ బుక్‍ ట్రస్ట్ ఇండియాలో సహాయ సంపాదకులు. ‘సముద్రం’, ‘బంతిపూలు’, ‘పచ్చబొట్టు’, ‘కౌముది’ సాహిత్య వ్యాసాలు, ‘తెగిన పోగు’ దీర్ఘ కవిత, ‘కఫన్‍’ చేనేత నానీలు మొదలగు ముప్పైకి పైగా పుస్తకాలు వీరి రచన, సంపాదకత్వంలో వచ్చాయి.
‘పిల్లల కోసం మన కవులు’ (2005), ‘చందమామ రావే’ (2009), ‘వెన్న ముద్దలు’ (2016), ఆకుపచ్చని పాట’ స్వచ్ఛ సర్వేక్షణ తొలి బాల గేయాలు, ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ బాలల బతుకమ్మ పాటలు (2018), ‘అఆ ఇఈ’ బాల లయలు (2019), పిల్లల కోసం సినారె కథ’ (2020) బాల సాహిత్య రచనలు.‘పిల్లల కోసం మన పాటలు’ (2014), ‘పిల్లల కోసం పొడుపు కథలు’ (2017), ‘వానావానా వల్లప్పా’ బాల గేయాలు, ‘ఆకుపచ్చని ఆశలతో’ (2019) తెలంగాణ బడి పిల్లల కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఆంగ్లం, ఇతర భారతీయ భాషల్లోంచి పదహారు పుస్తకాలు పిల్లల కోసం తెలుగులోకి అనువదించారు.
తెలంగాణా ప్రాథమిక స్థాయి తెలుగు పాఠ్య పుస్తక సంపాదకుల్లో ఒకరు. 1997లో ‘ఆంధప్రదేశ్‍ రాష్ట్ర తొలి యువ విశిష్ట సాహిత్య పురస్కారం’, 2009లో తెలుగు విశ్వ విద్యాలయం ‘కీర్తి పురస్కారం’, 2011లో ‘తెలుగు విశ్వ విద్యాలయం బాల సాహిత్య పురస్కారం’ లభించాయి. 2017 తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ‘రాజన్న సిరిసిల్ల జిల్లా విశిష్ట సాహిత్య పురస్కారం’, ’డా.నన్నపనేని మంగాదేవి బాల సాహిత్య పురస్కారం’, ‘డా. తిరుమల శ్రీనివాసాచార్య సాహిత్య పురస్కారం’, ‘మధురకవి మల్లవరపు జాన్‍ కవి స్మారక సాహిత్య పురస్కారం’, ‘డా. వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం’, 2018 లో ‘అంగలకుదుటి సుందరాచారి సాహిత్య పురస్కారం’, బాల గోకులం ‘బాలనేస్తం’ పురస్కారం, ‘డా. చింతోజు బ్రహ్మయ్య- బాలమణి బాల సాహిత్య పురస్కారం’, 2019లో ‘సాంస్కృతిక బంధు సారిపల్లి కొండల్‍రావు జన్మదిన లలిత కళా పురస్కారం’, ‘శకుంతలా జైని స్మారక తొలి బాల సాహిత్య పురస్కారం’, ‘మై గిఫ్ట్ యువ సాహిత్య పురస్కారం’, ‘కాళోజీ కర్మయోగి పురస్కారం’, ‘బాలబంధు సమతారావు బాల సాహిత్య పురస్కారం’ అందుకున్నారు.’’


తెలంగాణలో జరిగిన బాల వికాస కార్యక్రమాల్లో పత్తిపాక మోహన్‍, తనను నడిపించిన మిత్రబృందం పాత్ర గణనీయమైందని అంటాడు. అందులో 2017 నుంచి దాదాపు రెండేండ్ల పాటు జరిగిన ‘బాలచెలిమి ముచ్చట్లు’ కార్యక్రమం ఒకటి. ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమి’ నిర్వహణలో మణికొండ వేదకుమార్‍ గారి సారధ్యంలో జరిగిన బాలచెలిమి ముచ్చట్లకు పత్తిపాక మోహన్‍ కన్వీనర్‍గా ఉన్నాడు. తెలంగాణలోనే కాక రెండు తెలుగు రాష్ట్రాల బాలసాహితీ వేత్తలను ఒక వేదికపైకి రప్పించి బాలసాహిత్య వికాసదిశగా జరిగిన అనేక చర్చలకు ఈ ముచ్చట్లు భూమికగా నిలవడమే కాక, బాల వికాసానికి సంబంధించిన అనేక అంశాలను వెలుగులోకి ‘బాలచెలిమి ముచ్చట్లు’ తెచ్చాయి, ఆలోచింపజేశాయి. ‘తనది టీం వర్క్ అనీ, గరిపెల్లి అశోక్‍, చొక్కాపు వేంకటరమణ, మాడభూషి లలితా దేవి, డా.వి.ఆర్‍.శర్మ, డా. సిరి, డా।। అమరవాది నీరజ, పైడిమర్రి గిరిజ, డా.వాసరవేణి పరుశురాములు, ఇంకా మరికొందరు బాల సాహిత్య మిత్రులతో కలిసి తాను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థలతో నిర్వహించిన, నిర్వహిస్తున్న సృజనాత్మక రచనాశాలలు ఈనాడు బాల సాహిత్యాన్ని ప్రధాన స్రవంతి సాహిత్యం సరసన నిలబెట్టడానికి తోడ్పడుతున్నాయని పత్తిపాక మోహన్‍ తన మనసులో మాటగా చెప్తుంటాడు.


కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి బాలసాహిత్య పురస్కారం అందుకున్న ఆత్మీయ మిత్రునికి బాల సాహిత్య ప్రపంచం తరఫున మరోసారి హృదయ పూర్వక అభినందనలు!

  • డా।। వి. ఆర్‍. శర్మ
    ఎ : 91778874

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *