తెలంగాణ మలి ఉద్యమానికి దిక్సూచిలా నిలిచిన దక్కన్‍ ల్యాండ్‍ పత్రిక!


అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక.. అని ప్రజాకవి, పద్మవిభూషణ్‍ కాళోజీ నారాయణరావు గారు అర్ధ శతాబ్దం కిందటే అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమానికి నెగడై నిలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తొలి తరానికి చెందిన పెద్దలు కాళోజీ, ఆచార్య కొత్తపల్లి జయశంకర్‍, డా. మర్రి చెన్నారెడ్డి తదితరులు పునాదులై నిలిచారు. ప్రస్తుత విషయానికి వస్తే తెలంగాణా మలి ఉద్యమం ద్వారా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైనాక, కొన సాగుతున్న ఎనిమిదేళ్ళ వర్తమాన అభివృద్ధి గూర్చి ప్రజలకు సవివరంగా చెప్పాల్సి ఉంది. ప్రముఖ చరిత్ర కారుడు, పర్యావరణ వేత్తయిన మణికొండ వేదకుమార్‍ సంపాదకత్వంలో వస్తున్న దక్కన్‍ ల్యాండ్‍ మాసపత్రిక ప్రారంభించిన ఒక దశాబ్ది కాలంలోనే ఒక చరిత్ర సృస్టించింది. దక్కన్‍ ల్యాండ్‍ పత్రిక ISSN (ఇంటర్నేషనల్‍ స్టాండర్డ్ సీరియల్‍ నంబర్‍) ఆమోదాన్ని పొందడం ద్వారా మరొక మెట్టు ఎక్కి గొప్ప ప్రతిష్టను, విజయాన్ని సాధించిందని చెప్పవచ్చును. ఉత్తమ పీరియాడికల్‍ పత్రికగా తన ప్రతిష్ఠను పొందింది. ISSN 2581-3188. దీని వల్ల ఇందులోని వ్యాసాలకు తగినంత ప్రాచుర్యత అందివచ్చినట్లయింది. పత్రిక దశాబ్ది విజయంగా సాధించిన ఒక గొప్ప అంశమని చెప్పవచ్చును. పత్రిక దశాబ్దికాలపు పయనంతో నాకూ ఎంతో అనుబంధం ఉంది. ఈ కాలంలో పత్రిక తీరు తెన్నులపై ఒక సమీక్షా అభిప్రాయాన్ని వారు రాయమని నన్ను కోరినపుడు నేనెంతగానో ప్రతిస్పందించి, ఆనందించాను.


పత్రికలు ప్రజల ఆశయాలకు భిన్నంగా పని చేయరాదు. ప్రజా ఉద్యమాలను నీరు కార్చరాదు. తెలంగాణా మలి ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న కాలంలో ఆంధ్రా పెట్టుబడి పత్రికల దారుల తీరు తెలంగాణ ఉద్యమానికి భిన్నంగా ఉండేది. విజయవాడ నుండి వివిధ దినపత్రికల ఎడిషన్లు 1980 కాలంలో హైదరాబాద్‍కు తరలి వచ్చినా, పత్రికల ఎడిటింగ్‍ విధానం తెలంగాణా ఉద్యమానికి అనుకూలంగా ఉండేదికాదు. ఇందుకు సంబంధించిన వార్తలు సరిగా రాయలేదు. తెలంగాణా పల్లెల్లో, మారుమూలల్లో జరుగుతున్న వాస్తవ ఉద్యమ వార్తలను, అట్టి సమాచారాన్ని అంతగా పట్టించుకొని రాసేవి కావు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణా ప్రజా ఉద్యమ కారుడు, తెలంగాణ రిసోర్స్ సెంటర్‍ వ్యవస్థాపకులు, సుప్రసిద్ధ చరిత్ర కారులు, బాలల చిత్రోత్సవాల నిర్వాహకులు, బాలల సాహిత్యోద్దారకులు అయిన మణికొండ వేదకుమార్‍ గారి సంపాదకత్వంలో దక్కన్‍ ల్యాండ్‍ మాస పత్రిక ప్రారంభమై ఒక దశాబ్ది కాలపు చరిత్రను పావనం చేసుకొంది. ప్రధాన పత్రికల భిన్న స్థాయి ధోరణులకు తెరచింది, తెలంగాణా అభివృద్దికి, తెలంగాణా ఉద్యమానికి వెన్నుపూసై నిలిచింది. తెలంగాణ మలి ప్రజా ఉద్యమానికి ఆలంబనగా నిలిచి ప్రత్యేక తెలంగాణ సాధనలో పాలు పంచుకొని తనదైన ఉద్యమ స్వరూప పుటలను ఎంతో విశిష్టతగా ఆవిష్కరించుకొందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరో రకంగా చెప్పాలంటే మలి తెలంగాణా ఉద్యమానికి ఊపిర్లు అందించి, ఉద్యమ సాహిత్యాన్ని గంగా యమునా తెహజీబ్‍ లాగా పరవళ్లు తొక్కించింది. నిఖార్సైన తెలంగాణ ఉద్యమ చరిత్ర రికార్డ్ కావడానికి అసలు సిసలైన డాక్యుమెంట్‍గా, తెలంగాణాకి పెద్ద రిసోర్స్ సెంటర్‍గా నిలిచింది. మలి తెలంగాణ ఉద్యమానికి సూత్రధారియై, పాత్రధారియై మూసీ దక్కన్‍ సంస్కృతి నిరంతర ప్రవాహమై, అక్షర ఆయుధంగా తన ఉనికిని సుసార్థకం చేసుకోవడంలో పత్రిక విజయం సాధించిందని చెప్పవచ్చును.


ప్రజాభిప్రాయాన్ని విస్తృతస్థాయిలో వ్యక్తం చేయడానికి మేధావులు, విద్యావంతులు, సామాజిక ఉద్యమ కార్యకర్తల నుంచి మేలైన రచనలను ఆహ్వానిస్తున్నట్లు, ఇది ప్రజా స్వామ్యవాదుల గొంతుక, ఉద్యమకారుల వేదికగా ఈ పత్రిక తన పయనాన్ని ప్రారంభిస్తుందని సంపాదకులు వేదకుమార్‍ గారు 2012లో సెప్టెంబర్‍ ప్రారంభ సంచికలో తన లక్ష్యాలను నిర్దేశిస్తూ స్పష్టం చేసారు. పత్రిక ప్రారంభించి పది వసంతాలను విజయ వంతంగా పూర్తి చేసుకొని, 11వ సంవత్సరం లోకి అడుగిడడం చూస్తే, పత్రిక ప్రజల హృదయాలలోకి ఎంతగా చొచ్చుకెళ్లిందో రుజువైంది. సంపాదకులు వేదకుమార్‍ గారు సహజంగానే సౌమ్యులు, హితైషులు, విద్యావంతులు. వారికి వివిధ రంగాలకు చెందిన సాహిత్య, చరిత్ర కారులు, మేధావులతో దగ్గరి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇవన్నీ వారి పత్రిక విజయ వంతం కావడానికి తోడ్పాటు నందించాయని చెప్పవచ్చును.
మూసీ పరివాహక ప్రాంతంలోని ఒక చింత చెట్టయి చక్కటి ఫలితాలను అందిస్తోంది. ఈ పత్రికతో నాకున్న అనుబంధం గాఢమైందని చెప్పాలి. ఒక పాఠకుడిగా, ఒక రచయితగా పత్రికతో నేను అడుగులు వేశాను. ఒక చరిత్రకారుడిగా వారితో రెండు దశాబ్దాల పరిచయం ఉంది.
మా ఉమ్మడి కరీంనగర్‍ జిల్లాలో శాతవాహన స్థావరమైన కోటిలింగాల, కోట్ల నర్సింహులపల్లి, కురిక్యాల త్రిభాషా బొమ్మలమ్మ గుట్ట-కంద పద్య శాసనం, చారిత్రక స్థావరాలైన ధర్మపురి, ఎలగందుల, సైదాపూర్‍ మండలంలోని సర్వాయి పాపన్న గుట్టలను సందర్శించాము. సిద్దిపేటలో జరిగిన బాల చెలిమి సాహిత్యవేత్తల చర్చా గోష్టిలో పాలు పంచుకొన్నాను. తెలంగాణాలో గుట్టలు, చారిత్రకాంశాల పరిరక్షణ, రామప్ప గుడుల పరిరక్షణ గూర్చి వారితో కలిసి పనిచేశాము. తెలంగాణా రిసోర్స్ సెంటర్‍తో కూడా నాకు అనుబంధం ఉంది. నేను పంపిన వ్యాసాలు ఎడిట్‍ చేస్తూ వారు నాతో ఆత్మీయంగా చర్చిస్తూ ఉండేవారు. సలహాలు కూడా ఇస్తుండే వారు. అవి క్రమం తప్పక వస్తుండేవి. ఉస్మానియా యూనివర్సిటీ శత వసంతాల ఉత్సవాల వ్యాసం రాసినపుడు వారు నాతో సమాచారం మదింపు గూర్చి చర్చించారు. వేదకుమార్‍ గారు టీ.ఆర్‍.సి. జర్నల్‍ ఆఫ్‍ తెలంగాణా స్టడీస్‍ ఆధ్వర్యంలో జూన్‍ 20, 2019లో ప్రారంభించిన జర్నల్‍ ప్రారంభోత్సవ సమాచారాన్ని ఒక వ్యాసంగా అందించగా, వారు దక్కన్‍ ల్యాండ్‍ పత్రికలో ఆగస్ట్ సంచికలో ప్రచురించారు.


నేను వారి సహృదయతకు కృతజ్ఞతగా 2018లో సుమారు మూడు వందల పేజీలతో ప్రచురించిన తెలంగాణా ఉద్యమంలో చారిత్రకాంశాలు అనే వ్యాస పుస్తకాన్ని వారికే అంకితం ఇచ్చాను. వారు ఎంతో గౌరవంతో స్వీకరించడం నాకు ఆనందమనిపించింది. నేను వారికి అంకితం ఇచ్చే సందర్భంలో రాసిన నాలుగు మాటలను ఇక్కడ ఉదహరిస్తున్నాను. నేను రాసిన చరిత్ర సంబంధిత వ్యాసాలను ఆత్మీయతతో తమ పత్రికలో ప్రచురించి వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతతో అంకితం ఇస్తున్నాను. వేదకుమార్‍ గారు ఒక చరిత్రకారుడిగా, పురాతత్వ వేత్తగా, బాల సాహిత్య ఉద్యమ నేతగా, తెలంగాణా ఉద్యమ వీరుడిగా, ఇంటాక్‍ సంస్థలో క్రియాశీలిగా, ఆర్కిటెక్‍ ఇంజనీర్‍గా, పర్యావరణ వేత్తగా, సినిమా నిర్మాతగా అన్నింటినీ మించిన సంపాదక సుగుణ శీలిగా, హితుడిగా, సన్నిహితుడుగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని రాశాను.
ఉద్యమ సుస్థిరతను సాధించుకొని ఉద్యమకారుల అభిమాన పాతమై, ఉద్యమ కారులో సరికొత్త వెలుగుల్ని ఆత్మ స్థైర్యాన్ని నింపింది. సంపాదకులు వేదకుమార్‍ గారు మొదట్లో పేర్కొన్న ఆశయాలకు కట్టుబడి నిలిచిందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. భారతీయ నాగరికతకు ఎనుగర్రయి నిలిచిన సత్యమేవ జయతే నినాదానికి ఈ పత్రిక వందకు వంద శాతం ప్రాణం పోసింది. అయోమయాలు, గందర గోళాలు, గ్లోబల్‍ ప్రచారాల సమాచారాల వంటి అవాస్తవాల జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే సంపాదకులు వేదకుమార్‍ గారు నిఖార్సయిన తెలంగాణ ఉద్యమ వాది, జాతీయ దృక్పథం గల చరిత్రకారులు కావడమే.
2012లో వెలువడిన పత్రిక ప్రారంభ సంచికకు తిరిగి చూశాను. ఈ పది సంవత్సరాల సమయంలో ప్రధాన మీడియాకు భిన్నంగా, ప్రత్యామ్నాయ పత్రికగా సమాజం పట్ల నిర్వర్తించవలసిన బాధ్యతను నిబద్దతతో నిర్వర్తించిందని సంపాదకులు అభిలషించి చెప్పిన వాక్యాలు సత్యాలే. ఈ పదేళ్ళ సంచికలు పరిశీలిస్తే, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న తీరు అభినందించదగినది. రాజ్యాంగ స్పృహ, ఫెడరల్‍ విధానాల ఆచరణ, ఆవశ్యకత, ప్రపంచ పరిణామాలను అర్దం చేసుకోవాల్సిన పద్దతిని తెలియజేసే విశ్లేషణాత్మక వ్యాసాలను అందించాయని ఎడిటర్‍ గారు వెలిబుచ్చిన అభిపాయం అక్షరాల సమంజసమైనదే.


ప్రత్యేక తెలంగాణా సాధించుకొన్న తర్వాత రాజధాని నగరం నేటి హైదరాబాద్‍ ఎంతగా అభివృద్ధికి నోచుకుందో మనకు అరటి పండు ఒలిచి పెట్టినట్లుగా అర్థమవుతుంది. అధునాతన మౌలిక, సాంకేతిక సౌకర్యాలు, ఐటి, లాజిస్టిక్‍, పారిశ్రామిక, ఉన్నత విద్యా హబ్‍గా హైదరాబాద్‍ ఎదిగిన ప్రస్థానాన్ని మనం నేడు గమనించ వచ్చును. సుమారుగా ఒక లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జరిగిన ఇరిగేషన్‍ ప్రగతిని మన ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో గమనిస్తాము. అపర భగీరథుడిగా మన ముఖ్యమంత్రి కెసీఆర్‍ గారు కీర్తించబడ్దారు. అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేసుకున్న పవిత్ర గోదావరి జల కాళేశ్వరం ఎత్తి పోతల పథకాల అభివృద్ధి మనకు కళ్ల ముందు సాక్షాత్కారం అవుతోంది. ప్రపంచ చరిత్రలోనే ఇదొక ఇంజనీరింగ్‍ నిర్మాణ మహాద్భుతంగా ప్రశంసలు నిపుణుల నుండి దక్కాయి. ఉమ్మడి మహబూబ్‍ నగర్‍ జిల్లాలో పాలమూర్‍-రంగారెడ్డి కృష్ణ ఎత్తిపోతల పథకాలు నిర్మాణ దశలో వేగవంతంగా జరుగుతున్నాయి.
2012 డిసెంబర్‍ సంచికలో తిరుపతిలో డిసెంబర్‍ 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు జరుగబోయే చివరి నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని అప్పటి తెరవే అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్‍ ఇచ్చిన పిలుపు అప్పటి తెలంగాణా వాదులకు ఎంతో శిరోధార్యమైంది. దక్కన్‍ల్యాండ్‍లో వచ్చిన ప్రకటనకు నాతో పాటుగా, ఎంతోమంది తెలంగాణా వాదులు స్పందించి బహిష్కరించారు. నమ్మకమైన వార్తలు రాసే పత్రిక దక్కన్‍ ల్యాండ్‍లో అట్టి వార్త రావడంతో, మేము అట్టి సభలను బహిష్కరించాము. అందుకే తెలంగాణా ఉద్యమ వాదానికి జవసత్వాలు అందించిన పత్రికగా నిలిచింది, చెరగని ముద్ర వేసుకొంది.


మొదటి ప్రారంభ సంచిక మన ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యాలు దక్కన్‍ శిలలు అనే ముఖ చిత్రంతో కమనీయం చేసింది. హైదరాబాద్‍ దక్కన్‍ శిలలకు 68 మిలియన్‍ సంవత్సరాల చరిత్ర ఉందని, వెల్లువెత్తిన లావా పొరలు పొరలుగా ఘనీ భావిస్తే అవి శిలలా రూపంలో ఆకృతిని కల్గి ప్రకృతి సౌందర్యాన్ని ఇనుమడింప జేస్తాయని సంపాదకులు వేదకుమార్‍ గారు పేర్కొన్నారు. వారికి గుట్టలు, కొండలు వంటి ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ పట్ల ఉన్న ఆసక్తి మనకు తెలియ జేసింది. ఒక సమగ్ర పూర్వ చరిత్రను ఆవిష్కరించే పర్యావరణ వేత్తను మనం వారిలో గమనిస్తాం.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం, థర్మల్‍ విద్యుత్‍ కేంద్రాలు, త్రాగు, సాగు నీటి కొరత, విద్యుత్‍ సమస్య, ప్లోరైడ్‍ బాధితులు, పోలవరం, టైగర్‍ ప్రాజెక్టులు, గనులు, సెజ్జులు, రైతుల భూముల స్వాధీనం ఇలా ఎన్నో అంశాలు కుదిపేస్తుంన్నాయని తెలంగాణ ప్రత్యేక ఉద్యమ ఆందోళనను సంపాదకుల వారు వ్యక్తం చేయడం చూస్తే వీరు తెలంగాణా ఉద్యమం పట్ల ఉన్న మెండైన అభిమానం మనకు కనిపిస్తుంది. తెలంగాణా భూములు, వనరులు, జలాలు, ఉద్యోగాల దోపీడీల నుండి విముక్తం కావడానికే జరుగుతున్న మలి ఉద్యమానికి ఆసరాగా దక్కన్‍ల్యాండ్‍ నిలిచి తన విశిష్టత్వాన్ని గొప్పగా చాటుకొంది.


తెలంగాణా రిసోర్స్ సెంటర్‍ ప్రాముఖ్యతను వివరిస్తూ ఇలా చెబుతారు. తెలంగాణా ప్రజల చరిత్రను, సంస్కృతిని జీవన విధానాన్ని మరియు మానవుడు జీవ రాశులు, ప్రాంత సంపద జీవన విధానం, జీవన వైవిధ్యాలు, జీవన విధానంలో ముఖ్యముగా సంస్కృతి, ఇక్కడి కళలు, వృత్తులు, వాటికి సంబంధించిన పరికరాలు, ఉపకరణాల సమాచారాన్ని నేటి తరానికి ప్రింట్‍, ఆడియో, వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తుందని సంపాదకుల వారు తన బృహత్‍ ఆశయ సాధనలో భాగంగా ఏర్పాటు చేసుకున్న రిసోర్స్ సెంటర్‍ లక్ష్యాన్ని పాఠక లోకం ముందు ఉంచి అనేక సదస్సులు, కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజా హితాన్ని తన పథ లక్ష్య గామిగా నిర్ధేశించు కోవడం కనిపిస్తుంది. ఇలా వారు రిసోర్స్ సెంటర్‍ ద్వారా చేసిన కార్యక్రమాలను దక్కన్‍ల్యాండ్‍లో వరుసగా ప్రచురిస్తూ ప్రజా చైతన్యానికి అహరహం కృషి చేశారని విడతమం అవుతుంది.


తెలంగాణా ఉద్యమంలోని వివిధ సంఘట నలను అంశాలను సంకలనాలుగా ప్రచురించారు. ప్రజలను విస్మరించిన శ్రీ కృష్ణ నివేదిక, ఎనిమిదో అధ్యాయంలో ఏముంది, అణచివేత ఉరఫ్‍ 177 జీవో, తెలంగాణా జీవనది ఆచార్య కొత్తపల్లి జయశంకర్‍, సీమాంధ్ర రాజకీయ నాయకుల కుట్ర, ఉరఫ్‍ 14 – ఎఫ్‍ , తెలంగాణా సాధనకై మిలియన్‍ మార్చ్ 2011, ఈ ఆరు అంశాలను ప్రచురిస్తున్న సమయంలో ఈ సంకలనాలు నెగడు (తెలంగాణా ఉద్యమం సంకలనం) అనే శీర్షిక పేరు పెట్టడం జరిగింది. నెగడు-7 తెలంగాణా సాధనకై సకల జనుల సమ్మె-1, నెగడు-8, తెలంగాణ సాధనకై సకల జనుల సమ్మె-2, నెగడు-9, మానవ ప్రకృతి విధ్వంసం-పోలవరం, తెలంగాణ రిసోర్స్ సెంటర్‍ ఇప్పటి వరకు అంటే పత్రిక ప్రారంభించిన కొద్ది కాలం లొనే సమాంతరంగా పలు పుస్తకాలను వరుసగా ప్రచురించు కొంటూ వస్తోంది.
పరిమితమైన ప్రకటనలు వచ్చినా రాకున్నా, అసలు ప్రకటనలతో పెద్దగా ప్రమేయం లేకుండా పత్రిక నిర్విఘ్నంగా, నిరంతరాయంగా కొనసాగి పదేళ్లు పూర్తి చేసుకొని, 11వ ఏడులో 121వ సంచికగా సెప్టెంబర్‍ 2022తో తాజాగా అడుగిడడం మామూలైన విషయం కాదు. ఆషామాషీ వ్యవహారం కాదు. 121 వ సంచికలో సంచిక ప్రపంచ పర్యాటక దినోత్సవ ముఖచిత్రం, దీనికి సంబంధించిన వ్యాసంతో పాఠకుల చేతికి అందింది. అదే ప్రారంభ స్థాయి ఎనర్జీ తో , సమున్నత ప్రమాణాలతో పత్రిక అందడం దీని వెనుక ఉన్న సంపాదకుల వారి మాటల్లో చెప్పలేని శ్రమ ఎంతో ఉందన్న కఠోర వాస్తవం మనకు అర్థమవుతుంది. మఖలో పుట్టి పుబ్బలో మాసిపోయి, మాయమయ్యే ఎన్నో పత్రికలను నేడు మనం చూస్తున్నాం. ఇంటర్నెట్‍, టివి ప్రత్యక్ష వార్తా ప్రసారాలు హోరెత్తి నడుస్తున్న అడ్వాన్సుడ్‍ సాఫ్ట్వేర్‍ కాలంలో కూడా దక్కన్‍ ల్యాండ్‍ పత్రిక నిజాయితీగా మనుగడ, పురోగమనతలు గొప్పవి, ఉదాత్తమైనవని చెప్పవచ్చును. దాచుకోవాల్సిన విలువైన సమాచారం ఈ దశాబ్ది కాలపు 121 సంచికల్లో నిక్షిప్తమై ఉంది. ఇది తెలంగాణ చరిత్రను వివిధ కోణాలలో రాయాలనుకునే వారికి ఒక రెఫరెన్స్ మెటీరియల్‍గా ఉపయోగ పడుతుది. ఈ మొత్తం సంచికల్ని పరిశీలిస్తే ఒక పురావస్తు, పర్యావరణ అంశాల, హైదరాబాద్‍ దక్కన్‍ చరిత్ర సమగ్రాంశాల బాండాగారం, వివిధాంశాల ఒక గ్రంథాలయ నిధి, ఒక ఆర్క్వివ్స్ అని నిస్సంకోచంగా చెప్పవచ్చును.


పర్యావరణము, పురావస్తు, వారసత్వ సంపద పరిరక్షణ-పర్యాటక రంగం అభివృద్ది, ఆవశ్యకత, బెటర్‍ హైదరాబాద్‍ సిటీ గా ఎదుగుదల, శతాబ్దాల నాటి శాసనాలు, పురావస్తు మ్యూజియములు, సాంకేతిక విజ్ఞానం, జీవవైవిధ్యం, దక్కన్‍ చరిత్ర అంటే ముఖ్యంగా 4వందల ఏండ్ల హైదరాబాద్‍ పాలకుల చరిత్ర, తెలుగు, ఉర్దూ సాహిత్యం, సాంస్కృతిక కళారంగం, కుల వృత్తులు, సామాజిక న్యాయం, న్యాయ వ్యవస్థ సమాచారం, కొంగొత్త ఆవిష్కరణలు, గిరిజనుల సంస్కృతి, ఆచారాలు, వివిధ విశ్వవిద్యాలయాల సమాచారం, సిద్ధాంత రచనలు, సమీక్షలు, జాతీయ పండుగలు, జాతీయ సమైక్యత, దేశభక్తి, ఆర్థిక, ద్రవ్య, వినిమయ, వినియోగదారుల రంగం తదితర అంశాలపై రాయబడ్డ ఎన్నో వ్యాసాలు ఈ దశాబ్ది సంచికల్లో విశేషంగా రికార్డ్ చేయబడ్డాయి. కరోనా వంటి విశ్వమహమ్మారి విలయ తాండవం చేస్తున్న రెండేళ్ల వికృత కాలంలో పత్రిక కొనసాగింది. ఇందుకు సంబంధించిన చికిత్స విధానాలు, భయాలు అపోహాలు లేకుండా వైద్యనిపుణుల చేత ఇంటర్వ్యూలు, వ్యాధి నివారణ పరిస్కారాలు, ముందస్తు జాగ్రత్తలు వంటి అంశాలపై పత్రిక దృష్టి సాధించి పాఠక లోకానికి విలువైన సమాచారాన్ని అందించగల్గింది.
రి-డిస్కవరింగ్‍ తెలంగాణా, తెలంగాణా చారిత్రక వారసత్వాన్ని, ఏకత్వంలో భిన్నత్వంగా దక్కన్‍ సంస్కృతిని కొనసాగిస్తూ సచిత్ర వ్యాసాల పరంపరతో పత్రిక ఒక రకంగా సమున్నతమైన చారిత్రక విజయాన్ని సాధించిందని చెప్పవచ్చును. రాష్ట్ర పురావస్తు శాఖ వారు ఒ నాలుగేళ్ళ పాటు నిర్వహించిన సెమినార్‍ల పరంపర వ్యాసాలను కవర్‍ చేయడంలో పత్రిక ముందంజలో ఉంది. తెలంగాణా పురావాస్తు శాఖ సంచాలకురాలు శ్రీమతి విశాలాక్షి గారు 2017 ప్రాంతంలో వరుసగా నిర్వహించిన తెలంగాణా పురావస్తు సదస్సుల సమాచారాన్ని, ముఖ్య వ్యాసాల వివరాలను అందించింది.


సంపాదకులు వేదకుమార్‍ గారు అప్పుడప్పుడు ఫోన్‍ చేస్తూ, దక్కన్‍ ల్యాండ్‍ పత్రిక గూర్చి ఫీడ్‍ బ్యాక్‍ అడిగే వారు. అందులో భాగంగా నేను రాసిన అభిప్రాయాలను రాసి వారితో పంచుకొన్నాను.
2012 నుండి నెలసరిగా నేటి సంచిక వరకు తెలంగాణా సబ్బండ వర్ణాల సర్వస్వాన్ని భుజానికెత్తుకొని నిస్పాక్షికంగా సాగుతున్న మీ మా దక్కన్‍ ల్యాండ్‍ పయనం విలక్షణమైనది, ఆదర్శవంతమైనది. ఉద్యమ తెలంగాణా నుండి, బంగారు తెలంగాణా కోసం అహరహం తాపత్రయ పడుతూ తన నడకని సార్థకం చేసుకొని సమధిక ఉత్సాహంతో కొనసాగిస్తున్నది. పాఠకులనుండి ఆర్థికపరమైన మద్దతు ఉన్నా లేకున్నా ఒడిదుడుకులను చేదిస్తూ కొనసాగుతున్నది. పాఠకుల పరంగా, ప్రజా పక్షం నిలుస్తూనే, సమున్నత నిజాయితీ విలువలతో కొనసాగుతున్నది. ఎందరెందరో రచయితలు మీ పత్రిక ద్వారా కథనాలను పరిశోధనాత్మకంగా వెలుగులోకి తెస్తూ, వెలుగులోకి వస్తున్నారు. పాటల వాగ్గేయకారులు గోరేటి వెంకన్న గారి నుండి, ఆచార్య జయధీర్‍ తిరుమల రావు గారి వరకు, పరవస్తు లోకేశ్వర్‍ గారి నుండి పురావస్తు డా।। శివనాగిరెడ్డి మరియు డా।। ద్యావనపల్లి సత్యనారాయణ వరకు, డా. సినారె నుండి ఆచార్య్ ఎన్‍. గోపి వరకు, జీవధారాలతో మనగల్గుతున్నది. విపక్షం నుండి విరసం, అరసం, ప్రభుత్వం వరకు తమపర భేదాలు లేకుండా ఒకే నాదం, జనామోదంతోనే మార్గదర్శకంగా ప్రజ్వలిస్తున్నది.
కరోనా సోకి హోం క్వారంటైన్‍లో చికిత్స పొందుతున్నపుడు…
నేను, నా శ్రీమతి కరోనాతో బాధపడుతున్నపుడు జూన్‍ 2020వ సంచిక మాకు చేరింది. అప్పుడు నేను రాసిన సంక్షిప్త అభిప్రాయం. వారు తర్వాత ఫోన్‍ చేసి మా ఆరోగ్యం, చికిత్స గూర్చి ఆత్మీయంగా పది నిమిషాలు మాట్లాడటం మాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది.


గుజరాత్‍ తర్వాత ముత్యాల తయారీకి హైదరాబాద్‍ కేరాఫ్‍గా నిలిచింది. కుతుబ్‍సాహి కాలం నాటి నుండి ముత్యాల నగిసీలతో రాణులకు వస్త్రాలు తయారవుతుండేదివి. నాణ్యమైన ముత్యాల ఆభరణాల తయారీకి, పాత బస్తీ కేంద్రంగా ఉండడం, గులాబీ, తెలుపు ముత్యాలకు చందన్‍ పేట ప్రాముఖ్యాన్ని చక్కగా రచయిత చెప్పారు. ములుగు జిల్లా అడవుల్లో బయట పడిన దేవుని గుట్ట కట్టడాల గూర్చి ప్రముఖ చరిత్రకారులు శ్రీ రామోజు హరగోపాల్‍ గారు రాసిన వ్యాసం విశ్లేషణాత్మకంగా ఉంది. నిర్మల్‍లో చారిత్రాత్మకమైన నాటి కోట ఫిరంగీల తయారీ గూర్చి చరిత్ర కారులు తుమ్మల దేవారావు గారు చక్కగా, పరిశోధనాత్మకంగా రాశారు. హైద్రాబాద్‍ దక్కన్‍ చరిత్రను, సంస్కృతిని ఔపోసనం పట్టిన పరవస్తు లోకేశ్వర్‍ గారి వ్యాసం చదువుతూ ఉంటే, నాటి చరిత్ర కాలంలోకి వెళ్లిన మధుర స్మృతులను సృశింప జేశారు. పాత బస్తీ వీధులను, అక్కడి ప్రజల జీవన విధానాల గూర్చి సూక్ష్మ అధ్యయనం చేశారు. హైదరాబాద్‍ చరిత్రను రాసిన నరేంద్ర లూతర్‍ తర్వాత వీరే సుప్రసిద్ధులు. ఇలా సంచిక సర్వాంగ సుందరంగా ఉంది. తెలంగాణా సినిమాకు తొలి చిత్రకారుడు బి.నర్సింగరావు గురించి హెచ్‍. రమేశ్‍ బాబు రాసిన తెలంగాణా సినిమా రంగపు ఆణిముత్యాలు, ఆ పాత మధురాలుగా రాసిన వ్యాసాలను, తెలంగాణా చిత్రకారులు సొంతంగా తాము రాసుకొన్న వ్యాసాలను పత్రిక సచిత్రకంగా ప్రచురించి విలువైన సమాచారాల్ని అందించింది. అంతేకాక దక్కన్‍ ల్యాండ్‍ తాను సొంతంగా రాసిన ఆర్టికల్స్ ఎన్నింటినో ప్రచురిస్తున్న విధానం అభినందించదగిన విషయం. అలాగే తెలంగాణా ఉద్యమ కాలంలో విడుదలైన తెలంగాణ ఉద్యమ పుస్తకాలను, వాటి సమీక్షలను అసాధార ణంగా ప్రచురిస్తూ, ఉద్యమ కారులకు గొప్ప చైతన్యాన్ని అందించింది.


డిసెంబర్‍ 9 , 2009 నాటి పోరాట ఫలాన్ని తిరిగి సాధిద్దాం అని సంపాదకుల వారు కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణా ఇస్తున్నట్లు చేసిన ప్రకటన గూర్చి డిసెంబర్‍ సంచిక లో సంపాదకుల వారు ఆశించారు. 1969 నాటి తొలి తెలంగాణా ఉద్యమాన్ని కూడా ప్రస్తావిస్తూ 2014 ఎన్నికల వరకు ఆగకుండా తెలంగాణా సాధన జరిగి తీరే అవకాశం ఉందని అంచనా వేసి చెప్పడం చూస్తే సంపాదకుల వారికున్న తెలంగాణా సాధన పట్ల ఉన్న అంకిత భావాన్ని మనం గమనిస్తాము. సెప్టెంబర్‍ 30 న జరిగిన తెలంగాణా మార్చ్ ఉద్యమానికి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్‍ రాష్ట్రం లోని పాలకులు ఎంత కుట్ర చేస్తున్నారని రాసిన వ్యాసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాధనాస్తిని మనకు ఒక చరిత్ర అంశంగా గమనించ వచ్చును.
గత సంచికల నుంచి విలువైన రచనలను, ఈ దశాబ్ది పురోగమనాన్ని వివరించే, విశ్లేషించే సమీక్షా వ్యాసాన్ని రాయమనడం మణికొండ వేదకుమార్‍ గారి ఔదార్యానికి, వారి సహృదయతలకు నిదర్శనం. తెలంగాణ విలీన, విముక్తి వజ్రోత్సవ జేజేలు పలుకుతూ వారికి సలాం చేస్తున్నాను. తెలంగాణా ఉత్తమ పీరియాడికల్‍ మ్యాగజైన్‍ సంపాదకులుగా వేదకుమార్‍ గారు నిలిచిపోయారు. వారికి అభినందన.


-సంకేపల్లి నాగేంద్రశర్మ, ఎ : 80748 26371

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *