తోకలేని పిట్ట అక్టోబర్‍ 9 ‘వరల్డ్ పోస్ట్ డే’

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉత్తరం నేడు పెద్దగా కనిపించడం లేదు. ఎన్నో వార్తలను మోసుకువచ్చే పోస్టు మాన్‍ సైకిల్‍ బెల్లు నేడు మూగబోతోంది. టెక్నాలజీ కారణంగా నేడు క్షణాల్లోనే సమాచారం చేరే పరిస్థితి ఉండడంతో పోస్టు లెటర్‍ అవసరం పెద్దగా లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఎన్ని రకాల సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా.. పోస్టల్‍ సర్వీసులను ఆదరించేవారు, వాటితో అనుబంధం కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు ప్రపంచ పోస్టాఫీస్‍ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..


నిన్న మొన్నటి వరకూ టెలిఫోన్‍ కలిగిన వారు. మధ్యతరగతి, పేదవాడికి పోస్ట్కార్డ్. కనీసం ఐదు దశాబ్దాల భారతీయుల జీవన భావోద్వేగాలు లేఖలు, ఉత్తరాలు, ఇంటర్వ్యూ కార్డులు, మనీ ఆర్డర్‍, తోకలేని పిట్ట తొంబై ఆమడలు అనే కథలు వీటి చుట్టే తిరిగాయి.
ఉత్తరం లేకపోతే… పోస్ట్మేన్‍ లేకపోతే ఆ జ్ఞాపకాలు ఉండేవా?
గాంధీ గారికి ఉత్తరాలు రాయకుండా ఏ రోజూ గడవలేదు. నెహ్రూ జైలులో ఉండి తన కుమార్తె ఇందిరకు తెగ ఉత్తరాలు రాశారు. ఉత్తరం రాయడం ఒక మర్యాద.
ఉత్తరం అందుకోవడం ఒక గౌరవం. ఉత్తరాలు ఒకరికొకరు రాసుకుంటూ ఉండటం స్నేహం. కాని ఉత్తరం కేవలం పెద్దవాళ్ల వ్యవహారంగా కొంతకాలమే ఉంది. పేదవాళ్లు, మధ్యతరగతి వారు ఉత్తరాలను మొదలెట్టారు. వీధి మొదలులో వేలాడదీసి ఉండే ఎర్రటి పోస్ట్ డబ్బాను గుర్తించారు. ఊళ్లో ఆ రోజుల్లో స్కూల్‍ మేష్టారు లేదంటే పోస్ట్మేస్టారే కదా గౌరవనీయులు.


ఇక కథల్లో, నవలల్లో, సినిమాల్లో ఉత్తరాలు సృష్టించిన ‘డ్రామా’ అంతా ఇంతా కాదు. ‘పోస్ట్ అన్న కేకతో పడక్కుర్చీలోని పరంధామయ్య గారు ఉలిక్కిపడ్డారు’ అనే లైనుతో ఎన్నో కథలు మొదలయ్యేవి.
ఉత్తరాలు అందక ఏర్పడిన అపార్థాలు, ఒకరి ఉత్తరం ఇంకొకరికి చేరి చేసే హంగామాలు, ఒకరి పేరుతో మరొకరు రాసే ప్రేమ లేఖలు.. వీటిలో పోస్ట్మేన్‍లది ఏ పాపమూ ఉండదు. కాని వారికి తెలియకనే వ్యవహారమంతా వారి చేతుల మీదుగా నడుస్తుంటుంది. ఉత్తరాలు బట్వాడా చేయాల్సింది వారే కదా.
కొందరు పోస్ట్బాక్స్ నంబర్‍ తీసుకుని ఆ నంబర్‍ మీదే సవాలక్ష వ్యవహారాలు నడిపేవారు. బుక్‍పోస్ట్ను ఉపయోగించి పుస్తకాలు పంపని కవులు, రచయితలు లేరు. రిజిస్టర్డ్ పోస్ట్ విత్‍ డ్యూ అక్నాలెడ్జ్ మెంట్‍ అయితే ఆ ధీమా వేరు. ‘టెలిగ్రామ్‍’కు పాజిటివ్‍ ఇమేజ్‍ లేదు. అది వచ్చిందంటే ఏదో కొంపలు మునిగే వ్యవహారమే.
సంతవ్సరం పొడుగూతా సేవ చేసే పోస్ట్మేన్‍ మహా అయితే అడిగితే దసరా మామూలు. అది కూడా ఇవ్వక వారిని చిన్నబుచ్చేవారు కొందరు. చాలీ చాలని జీతంతో, ఎండనక వాననక సైకిల్‍ తొక్కుతూ ఇల్లిల్లు తిరిగి క్షేమ సమాచారాలు ఇచ్చి ఊరడింప చేసే ఆత్మీయుడు పోస్ట్మేన్‍ మధ్యతరగతి భారతదేశంలో కనిపించని పాత్ర పోషించాడు.


ఇవాళ కథే మారిపోయి ఉండవచ్చు. ప్రతి ఒక్కరి సెల్‍ఫోన్‍లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్‍ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్‍లో ఎక్కడిది. చేతిరాతతో అందుకునే ఉత్తరం జాడ ఎక్కడిది. ఆ చెరగని గుర్తు ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు. ఆ కాలానికి ధన్యవాదాలు. థ్యాంక్యూ పోస్ట్మేన్‍.


వరల్డ్ పోస్ట్ డే హిస్టరీ..
ప్రతీ సంవత్సరం అక్టోబరు తొమ్మిదిన వరల్డ్ పోస్టాఫీస్‍ దినోత్స వాన్ని నిర్వహిస్తారు. 1874లో స్విట్జర్లాండ్లోని బెర్ల్నో యూనివర్సల్‍ పోస్టల్‍ యూనియన్‍ (UPU)ను ఇదే తేదీన స్థాపించారు. ప్రపంచ దేశాలలో సమాచార మార్పిడికి బెస్ట్ కమ్యూనికేషన్‍ వ్యవస్థగా నిలిచిన పోస్టల్‍ శాఖల సేవలు ఈ తరం వాళ్లకు అంతగా తెలియకపోవచ్చు. కానీ కొందరు గొప్ప వ్యక్తుల లేఖల ద్వారా లక్షలాది మంది ప్రభావితం అయ్యేవారు. గొప్ప వ్యక్తుల సేవల్ని స్మరించు కుంటూ వారి పేరిట పోస్టల్‍ స్టాంపులను పోస్టల్‍ డిపార్ట్మెంట్‍ విడుదల చేస్తుంది.

  • ఎసికె. శ్రీహరి,
    ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *