వైదిక బ్రాహ్మణ మతశాఖల్లో సామరస్యం కోసం పూనుకొన్న ఆదిశంకరాచార్యులు ఒకే ప్రాంగణంలో ఐదుగురు ప్రధాన దేవతల ఆరాధనకు వీలు కల్పించే పంచాయతన అనే ఐదు దేవాలయాల సముదాయ నిర్మాణానికి ఒక కొత్త నమూనా నిచ్చాడు. ఏ దేవతను మధ్యలో పెట్టి ఆలయాన్ని నిర్మిస్తారో ఆ దేవత పేరున ఆ పంచాయతనం పిలువ బడుతుంది. అదుగో, అలా విష్ణు పంచాయతనంగా కొలువైంది మహ బూబ్‍నగర్ జిల్లా, జడ్చర్ల మండలం, గంగాపురంలోని చెన్నకేశవాలయం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తొలి విష్ణు పంచాయతనం. కళ్యాణ చాళుక్య వంశ తొలిరాజైన రెండో తైలపుని (క్రీ.శ.973-96) పాలనలో కొచ్చింది గంగాపురం. ఆ తరువాత త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుని (క్రీ.శ. 1077-1126) రెండో కొడుకైన కుమార తైలపుడు క్రీ.శ.1080 ప్రాంతంలో, మహబూబ్‍నగర్ పరిసరా ల్లోని కోడూరు మండలాన్ని కుమార వృత్తిగా స్వీకరించి గంగాపురం రాజధానిగా పాలించాడు.
ఇతని కాలంలోనే గంగాపురంలోని చెన్నకేశవాలయం విలక్షణ వాస్తుశైలిలో నిర్మింపబడింది. గంగాపురలో, కళ్యాణ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుని క్రీ.శ.1081 నాటి శాసనంలో సాగరేశ్వర, క్రీ.శ.1091 నాటి శాసనంలో కేశవ దేవర, క్రీ.శ.1116 నాటి శాసనంలో గంగేశ్వరదేవర, క్రీ.శ.1117 నాటి శాసనంలో భీమేశ్వర దేవర క్రీ.శ.1126-27 నాటి శాసనంలో బ్రహ్మేశ్వర దేవరల ఆలయాల నిర్వహణకు చేసిన దానాల వివరాలున్నాయి. సువిశాల ప్రాకార ప్రాంగణంలో ఎత్తైన ఉపపీఠంపై మధ్యలో చెన్నకేశవ, దానికి నాలుగు మూలల్లో నాలుగు విడి ఆలయాలతో ఉన్న ఈ సముదాయం 11వ శతాబ్దంలో కొత్తగా రూపుదిద్దుకొన్న పంచాయతన ఆలయ వాస్తుకు చక్కటి ఉదాహరణ. ప్రధానాలయం, గర్భాలయ, అర్థ మండప, 3 ద్వారాల మహా మండ పంతో తూర్పుకు, కుడివైపున ఆ మూలా, ఈ మూలా ఎదురెదురుగా గర్భాలయం, అర్థమండపం, ముఖ మండపాలతో రెండు, అలాగే ఎడమ వైపున మరో రెండు ఆలయాలతో చూడముచ్చటగా ఉంది ఆలయ సముదాయం.
ప్రధానాలయం, అధిష్ఠాన, పాదవర్గ ప్రస్తరాలతోనూ, గోడలపై 3 అంచెల మంచెలను పోలిన కోష్టం, పొడవాటి స్థంభాలు, వాటిపై చిన్న విమానాలు ముమ్మూర్తుగా, క్రీ.శ.1213లో పాలంపేటలో రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్ప దేవాలయానికి నమూనాగా స్ఫూర్తి నిచ్చిందని చెప్పొచ్చు. ఈ అద్భుత ఆలయంపైన శిఖరం ఎపుడో కూలిపోగా ఇప్పటి అధికారులు అవగాహనా రాహిత్యంతో దానిపై పొంతనలేని విమానాన్ని నిర్మించారు. మూలల్లో ఉన్న చిన్న ఆలయాలపైన శిఖరాలు కూడా కూలిపోగా, పైన ఉన్నంతలో సున్నంతో ముగించారు.
ఆలయ అధిష్ఠానం, ద్వారశాఖలు, కోష్టపంజరాలు, కప్పు, స్థంభాలు, ఇంకా తూర్పు ద్వారం దగ్గర నిలువెత్తు ద్వారపాలకుల శిల్పాలు నాటి శిల్పుల పనితనానికి మచ్చుతునకలు. ఈ ఆలయ సముదాయానికి ఎదురుగా ఆంజనేయ, గంగేశాలయాలు, గ్రామంలో 36 స్థంభాల కళ్యాణ మండపం, ఊరినిండా ఆలయ విడిభాగాలు, విరిగిన శిల్పాలు ఒకప్పటి వైభవానికి మసకబారిన ప్రతీకలు. ఇష్టంవచ్చిన రంగులు, ఎక్కడ బడితే అక్కడ ఇనుపరాడ్ల క్యూలైన్లు, చెల్లా చెదురుగా పడిఉన్న శిల్పాలు, కూలటానికి సర్వసన్నద్ధంగా ఉన్న ప్రాకారం, దాని ప్రవేశమండపాలు గంగాపురం చెన్నకేశవాలయాన్ని చూడాలన్న తపనతో వచ్చే వారసత్వ ప్రేమికుల్ని నిరాశ పరుస్తున్నాయి. ఇకనైనా మేల్కొని గత వైభవ ప్రాభవాలను తెస్తారా? లేదా? అని ప్రశ్నిస్తూనే ఉన్నాయి.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446