క్షణాల్లో సమాచారం చేరవేసే బుల్లి తెర నవంబర్‍ 21న ప్రపంచ టెలివిజన్‍ దినోత్సవం


ప్రపంచ టెలివిజన్‍ దినోత్సవం 1996లో ప్రారంభమైంది. 1996లో మొదటి ప్రపంచ టెలివిజన్‍ ఫోరం నవంబర్‍ 21న నిర్వహించబడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్‍ 21న ప్రపంచ టెలివిజన్‍ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
టెలి‘విజన్‍’ అందరికీ ప్రపంచం అంటే ఏంటో తెలియజేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలను, విశేషాలను ప్రతిరోజూ మన కళ్ల ముందు కట్టినట్టు చూపింది. చూపుతోంది. పిల్లలు, పెద్దలు, యువత అనే తేడా లేకుండా అందరినీ తన కంట్రోల్‍ లోకి తెచ్చుకుంది.


మొట్టమొదటి టెలివిజన్‍ అక్కడే..
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత టెలివిజన్‍ బాగా ప్రాచుర్యం పొందింది. ఒకప్పుడు దీన్ని వేస్ట్ బాక్సుగా పిలిచినా.. తర్వాత దీనిని బెస్ట్ బాక్సుగా పిలవడం మొదలెట్టారు. ఇలాంటి టెలివిజన్‍ మొట్టమొదట అమెరికాలో ఇళ్లలో కనిపించింది. అక్కడ 1948లోనే 1 మిలియన్‍ మంది ఇళ్లలో టెలివిజన్లు ఉండేవట. మొట్టమొదటి టెలివిజన్‍ ప్రకటన జూలై 1941న న్యూయార్క్ నగరంలో ప్రసారం చేయబడింది. ఈ ప్రకటన బులోవా వాచ్‍ కోసం 20 సెకన్ల పాటు కొనసాగింది.
బ్లాక్‍ అండ్‍ వైట్‍ నుండి కలర్‍ లోకి..
టెలివిజన్‍ మొదట బ్లాక్‍ అండ్‍ వైట్‍ కలర్లో ఉండేది. దాన్ని రోజురోజుకు డెవలప్‍ చేస్తూ కలర్‍ టీవీగా మార్చారు. అది కాస్త ప్రస్తుతం స్మార్ట్ టీవీగా మారిపోయింది. ఇక ఇంటర్నెట్‍ వాడకం పెరిగాక చాలా మంది ప్రజలు స్మార్ట్ ఫోన్లలోనే టివి ఛానెళ్ల కార్యక్రమాలను చూస్తున్నారు. ఇక ఇండియాలో అయితే దీనికి చాలా మంది బానిసలుగా మారిపోయారు. అంతలా ప్రభావితం చేస్తోంది టెలివిజన్‍.
ఒకప్పుడు దూరదర్శన్‍..
ఒకప్పుడు మన దేశంలో బ్లాక్‍ అండ్‍ వైట్‍ టీవిలో దూరదర్శన్‍ మాత్రమే వచ్చేది. అందులో వచ్చే కార్యక్రమాలకు చాలా విలువ ఉండేది. ఓ అరగంట పాటలకు, ఓ అరగంట వార్తలకు, ఓ అరగంట కల్చరల్‍ పోగ్రామ్స్కు ఇలా ఓ పద్దతిగా కార్యక్రమాలు వచ్చేవి. కానీ కాలం మారుతున్న కొద్దీ దూరదర్శన్‍ ప్రాధాన్యత పడిపోయింది. డిష్‍ ఛానెల్స్ వచ్చి వీక్షకులకు విపరీతమైన ఆప్షన్లు ఇచ్చేశాయి..
ప్రాంతీయ భాషల్లోనూ..
ఇది వరకు అనేక రకాల ఛానెళ్లు కేవలం ఇంగ్లీష్‍ లో మాత్రమే వచ్చేవి. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికి ఏ ప్రాంతీయ భాషలో కావాలో వారికి అర్థమయ్యే విధంగా అనువాదం చేసి మరి చూపుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి వీక్షకుడికి తమ కార్యక్రమం గురించి తెలిపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి ఛానెళ్లకు రోజురోజుకు మద్దతు కూడా బాగా పెరుగుతోంది.
ఎలాంటి సమాచారమైనా..
టీవీ ఛానెళ్లు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత భిన్నరకాల ప్రజలకు భిన్నమైన సమాచారం అందించడమే లక్ష్యంగా ఛానెళ్లు ప్రసారం చేయడం ప్రారంభించాయి. ఉదాహరణకు సినిమాలకు, సంగీతాలకు, క్రీడలకు, వార్తలకు, వినోదాత్మక కార్యక్రమాలకు, బ్యాంకింగ్‍, ఆరోగ్యం, వైద్యం, వంటలు ఇలా అన్ని రకాల సమాచారాన్ని మన కళ్ల ముందుకు క్షణాల్లో కట్టిపడేస్తున్నాయి.
టెలివిజన్‍ దినోత్సవానికి గల కారణమేంటంటే..
ఐక్య రాజ్య సమితి టెలివిజన్‍ కు సంబంధించి నవంబర్‍ 21వ తేదీనే ఎందుకు ప్రకటించిందంటే ప్రపంచంలో అత్యంత ప్రభావాత్మకంగా జనాలకు సామాజిక, రాజకీయ, అంశాలతో పాటు ఇతర సమాచారాలను క్షణాల్లో చేరవేసే శక్తివంతమైన సాధనంగా టెలివిజన్‍ను గుర్తించినందుకే.
అంతులేని వినోదం..
నేటి ఆధునిక యుగంలో అనేక మంది అంతులేని వినోదాన్ని కోరుకుంటున్నారు. ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది జీవితంలో టీవి చూడటం అనేది దినచర్యగా మారిపోయింది. ప్రతిరోజూ వారికి ఇష్టమైన సీరియల్స్ను, కార్యక్రమాలను, ప్రదర్శనలను, వార్తలను చూడటానికి టీవిల ముందు గంటల కొద్దీ గడుపుతున్నారు. బయట ఎన్నో పనులు చేసి వచ్చిన వారు ఈ టివిలో వారికి నచ్చిన షోలను చూసి వారి అలసట నుండి ఉపశమనం పొందుతున్నారు.

  • దక్కన్‍న్యూస్‍,
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *