జ్ఞాపిక అనగానే గుర్తుకొచ్చేవి పెంబర్తి హస్తకళారూపాలు అంటే అతిశయోక్తి కాదు. వరంగల్ జిల్లా జనగాం మండలానికి చెందిన గ్రామం పెంబర్తి. హస్త కళాఖండాలకు దేశవ్యాప్తంగా గొప్ప పేరున్నది. ఇక్కడ తయారయ్యే ఇత్తడి కళారూపాలు, నగిషీలు, జ్ఞాపికలు ప్రసిద్ది.
పెంబర్తి లోహ హస్తకళలు ఎక్కువగా ఇత్తడి, కంచు లోహాల మీద ఉంటాయి. కాకతీయుల కాలం నుండి పెంబర్తి గ్రామం హస్త కళలకు నిలయంగా మారింది. కాకతీయ శైలిని అనుసరించడం వీరి కళ ప్రత్యేకత.
మధ్యలో కొంతకాలం ఈ కళకు ఆదరణలేక అంతరించి పోయింది. తర్వాత నిజాం నవాబు కాలంలో ఈ కళను ప్రభువులు బాగా ఆదరించడం ఈ కళకు జీవం పోసింది.
వీరు రాను రాను తమ నైపుణ్యాన్ని పెంచుకొని ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారు. యాదగిరి గుట్ట నుండి తిరుపతి వరకు- గుడి, బడి సంబంధిత పనులను, సచివాలయం నుండి కళాతోరణం వరకు ప్రభుత్వ, ప్రైవేటు మెమొంటోలు ఇక్కడ తయారు చేస్తారు
విశేషాలు…
పెంబర్తి హస్తకళాకారులు తయారుచేస్తున్న షీల్డస్, మెమెంటోలు, గృహోపకరణాల వస్తువులకు ప్రపంచ మార్కెట్‍లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారైన కళాత్మక వస్తువులను అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. వీరు వివిధ దేవాలయాల గోపురాలకు, ఇత్తడి, రాగి, వెండి, బంగారు తాపడాలను తయారు చేశారు. ధ్వజస్తంభ తొడుగులు, గోపుర కలశాలు, కవచాలు రూపొందించడంలో వీరు దిట్ట. లోహాలు, లోహ మిశ్రమాలతో కుడ్యాలంకరణ చేయడంలో, గీతోపదేశం, దశావతారాలు, అష్టలక్ష్మీ, సీతారామ పట్టాభిషేకం, కాకతీయ కళాతోరణం, చార్మినార్, గణేష్, లక్ష్మీదేవి, సరస్వతి, హంస తదితర రూపాలను హ•ద్యంగా ఆవిష్కరిస్తారు.
కాకతీయుల కాలం నుంచి…
కాకతీయ రాజుల కాలంలో కళలు పరిఢవిల్లాయి. రామప్ప, వేయి స్తంభాల గుడి, ఏకశిలా తోరణాలు మాత్రమే కాదు, ఈనాటికీ తెలంగాణ మారుమూల పల్లెల్లో సైతం నాటి శిల్పకళ సజీవంగా అబ్బురపరుస్తుంది. వారి కళకు ముగ్దులైన నాటి ఏలికలు వారికంతా ఒకేచోట నివాసాల ఏర్పాటుకు సంకల్పించారు. అలా రూపుదిద్దుకున్నదే ‘పెంబర్తి’. హైదరాబాద్‍కు 55 మైళ్ల దూరంలో ఉన్నది. తంగెళ్లపల్లి, మల్యాల, పోలంపల్లి, బెజ్జంకి తదితర గ్రామాల్లో ఉన్న కళాకారులంతా పెంబర్తి ప్రాంతానికి ఉపాధి కోసం తరలి వచ్చారు. రాగి, ఇత్తడి, కంచు లోహాల మిశ్రమంతో వీరు చేసే కళాకృతులు కళా ప్రేమికుల హృదయాలను నాటి నుంచి నేటి దాకా దోచుకుం టూనే ఉన్నాయి. నగిషీలతో గంగాళాలను వివిధ పరిమాణాల్లో తయారు చేయడం వీరికే చెల్లింది. దేవాలయాలలో మూల విరాట్టు నుంచి ఎన్నెన్నో విగ్రహాలను తయారు చేసిన ఘనత వీరి సొంతం. గీతోపదేశం, దశావతారాల చిత్రికలను లోహంతో తయారు చేసి ఎలాంటి కర్రను వాడకుండా గోడలపై తాపడంలో నేర్పరితనం ఎప్పటికీ పెంబర్తి కళాకారులదే. సంప్రదాయంగా వీరిది పూర్తిగా చేతి పని.
లోగోలు.. షీల్డులు.. సమస్తం
తొలి తెలుగు ప్రపంచ మహాసభలకు (1975) లోగోలు, షీల్డులను తయారు చేసిన ఘనత వీరిదే. అంతకు ముందే ఐదో దశకం
ఉత్తరార్థం నుంచి అయిలా చారి అనే కళాకారుడు ఈ గ్రామ ఘనతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆయనకు రాని అవార్డు లేదు. 1956లో అయిలా చారి నేతృత్వంలో ‘విశ్వకర్మ బ్రాస్, కాపర్, సిల్వర్, ఇండస్ట్రియల్ సొసైటీ’ ఏర్పాటైంది. ఆయన పర్యవేక్షణలో కేందప్రభుత్వం 30 మాసాల శిక్షణ కోర్సును ప్రారంభించింది. అందులో శిక్షణార్థులకు డ్రాయింగ్, డిజైనింగ్ నేర్పేవారు. ఆయన హయాంలో జపాన్ దేశస్తులు సైతం హోమ కలశాలను ఇక్కడి నుంచే తయారు చేయించి తీసుకెళ్లారు.
తాపడ రారాజులు…
తాపడ కళలో పెంబర్తి వాసులను మించిన వారు కానరారు. వివిధ దేవాలయాలపై ఉన్న ఇత్తడి, రాగి, వెండి, బంగారు తాప డాలను తయారు చేశారు. ధ్వజస్తంభ తొడుగులు, గోపుర కలశాలు, కవచాలు రూపొందించడంలో వీరు దిట్టలు. లోహాలు, లోహ మిశ్రమాలతో కుడ్యాలంకరణ చేయడంలో వారు అద్వితీయులు. హైకోర్టు భవనంపైనున్న లోహ తాపడం ఇక్కడి కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్నదే. మహారాష్ట్రలోని తుల్జాభవానీ మాత దేవాలయంలో వీరి కళాకృతులు ఉన్నాయి.
ఇ-కామర్స్ ద్వారా అమ్మకాలు…
పెంబర్తి బ్రాస్ సొసైటీని స్ఫూర్తి పథకం కింద అభివృద్ధి చే యనున్నట్లు కేంద్ర హస్తకళల అభివృద్ధి సంస్థ కమిషనర్ కుంతాటి గోపాల్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో 70 కార్యాలయాల ద్వారా అభివృద్ధి అధికారులు హస్త కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వడం, గ్రూపులు, ఫెడరేషన్లు ఏర్పాటుచేసి వారికి ముద్ర పథకం ద్వారా బ్యాంకు రుణాలు, బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్, పెంబర్తి వంటి ప్రాంతాల్లో 1.50లక్షల మంది కళాకారులు వివిధ సొసైటీలు, సంస్థల ద్వారా ఆయా రంగాల్లో ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించా మన్నారు. ముంబై నుంచి ముడిసరుకు తీసుకువచ్చి స్థానికంగా ఒక బ్యాంకు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉందన్నారు. ఒకేచోట సామూహికంగా పనిచేసేందుకు వర్క్షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అభివృద్ధి చెందబోతున్న యాదాద్రిలో పెంబర్తి బ్రాస్ ఎంపోరియం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందన్నారు. త్వరలో హస్తకళలకు సంబంధించి ఒక వెబ్ పోర్టల్ దేశవ్యాప్తంగా రూపొందించి ప్రత్యేక యాప్ ద్వారా కళాకారులు తయారుచేసే వస్తువులను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, సొసైటీల ద్వారా ఇ-కామర్స్తో అమ్మకాలు సాగించాలని నిర్ణయించామన్నారు. కళాకారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆధునిక ఉత్పత్తుల తయారీకి అవకాశం కల్పించాలని స్థానిక కళాకారులు వినతిపత్రం అందజేశారు.
కీర్తితోరణం వెనుక పెంబర్తి కళ!…
ఓరుగల్లు ఘనమైన వారసత్వ సంపదకు ఇంతకాలం గుర్తుగా ఉన్న కాకతీయుల శిలాతోరణం ప్రభుత్వ అధికారిక చిహ్నంగా మారింది. కాకతీయులు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కీర్తి తోరణం. కాకతీయుల కీర్తితోరణానికి ప్రచారం తీసుకురావడంలో పెంబర్తి గ్రామానికి చెందిన ఐలాచారి కీలకపాత్ర పోషించారు.
రుద్రోజు శ్రీనివాస చారి: ఈయనకు 2001లో రాష్ట్ర స్థాయి ప్రథమ పురస్కారం లభించింది. దాదాపు 210 కిలోల ఇత్తడితో కెప్టెన్ ఉమ్రావ్‍సింగ్ ఇత్తడి విగ్రహాన్ని రూపొందించినందుకు ఆ పురస్కారం లభించింది.
అయిల వేదాంతాచారి: ఈయన సైతం రాష్ట్ర పురస్కార గ్రహీత.
రంగు వెంకటేశ్వర్లు: రాష్ట్ర ప్రభుత్వ పురస్కార గ్రహీత. జాతీయ స్థాయి అవార్డును సాధించారు.
అయిలా సోమ బహ్మ్రచారి: పంచలోహ కళాకృతులను తయారు చేయడంలో దిట్ట. అవార్డు గ్రహీత కూడా.
పెంబర్తి విశ్వకర్మ బ్రాస్ సొసైటీ…
పెంబర్తి గ్రామంలో 1990 ముందు వరకు పెంబర్తి విశ్వకర్మ బ్రాస్ సోసైటీ కార్యక్రమాలకు బాగా డిమాండ్ ఉండేది. విశ్వకర్మ కుల వృత్తివారు ఈ వృత్తి మీద ఆధారపడి జీవించే వారు. హస్త కళాకారుల వల్ల ఆ గ్రామంలో పెరిగిన సందర్శకుల తాకిడికి- ఇతర వృత్తులవారైన గీత కార్మికులు- ఆరె కటిక, కిరాణ షాపుదారుల వస్తువులకూ బాగా ఆదరణ ఉండేది. ప్రపంచ పటంలో ఒక వెలుగు వెలిగిన పెంబర్తి హస్తకళలు నేడు మసకబారుతున్నవి. ప్రపంచీకరణ, ఆధునికీకరణ- వీరివృత్తి పైన తీవ్రమైన ప్రభావం చూపుతున్నవి. రెండు దశాబ్దల క్రితం ఉన్న హస్తకళల మార్కెట్ నేడు లేకుండా ఉన్నది. కొంతమంది హైద్రాబాద్‍కు వలస వచ్చి కొత్తగా హస్త కళల షాపులు పెట్టుకొని జీవిస్తున్నారు. ఇత్తడి, రాగి, వెండి మొదలగు వాటికి ధరలు పెరగడంతో మార్కెట్‍లో తగిన రేటు రావడం లేదు. ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్ముడు పోక పోవడం, ఆధునిక పద్ధతిలో హస్త కళా ముద్రణ మిషన్లు రావడంతో హస్త కళల వృత్తి రోజు రోజుకూ క్షీణిస్తున్నది. ఇత్తడి స్థానంలో కొత్త పద్ధతి, ప్లైవుడ్ షీట్స్పై స్టిక్కరింగ్ మెమొంటోలు తయారై అవి అన్ని ప్రాంతాలలో అందు బాటులోకి రావడంతో- ఈ వృత్తి దారులకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆధునిక పద్ధతులను సైతం వీరు ఎప్పటికప్పుడు చేరదీసుకొని ముందుకు వెడుతున్నారు. స్వయం ఆధారిత వృత్తివారైన హస్త కళా కారులను ప్రభుత్వం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా హస్త కళాకారులకు ఇత్తడి, రాగి, వెండి రేకులకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. ఆధునికతతో భాగంగా వీరికి హస్తకళా మిషన్లను ప్రభుత్వం కొని ఇవ్వాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేపాక్షి హ్యండి క్రాఫ్టస్లో వీరి వస్తువులకు స్థానం కల్పించి, ప్రభుత్వం ముందుగానే వీరి వస్తువులకు డబ్బు చెల్లించాలి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న హస్తకళల నైపుణ్యంపైన వీరికి ప్రతి సంవత్సరం వర్క్షాపులు నిర్వహించాలి.
పెంబర్తి గ్రామంలో హస్తకళల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. హస్త కళాకారుల కుటుంబాలకు హస్తకళా సోసైటీ హౌస్ కమ్యూనిటీ ఏర్పాటు చేయాలి. 60 సంవత్సరాలు నిండిన ప్రతి వృత్తిదారుడికి నెలకు రూ. 3000 పెన్షన్ ఇవ్వాలి. వారి కుటుం బాలకు విద్య, వైద్యం అందించాలి. ఎంతో విశిష్టమైన పెంబర్తి హస్తకళలను భవిష్యత్ తరాలకు అందించ వలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం హస్తకళాకారుల జీవితాల్లో వెలుగులు నింపాలి. పూర్వవైభవం తీసుకు రావాలి.
ఇప్పుడు యాంత్రీకరణ ప్రభావం మాపై ఉన్నది. జాతీయ రహదారి ఇరుపక్కలా గ్రామ దుకాణాల్లోని వస్తువులన్నీ ఇక్కడే తయారయ్యా యనుకోవద్దు. అడిగి తీసుకోవాలి. గతంలో విశ్వకర్మ ‘కులవృత్తి’గా కొనసాగినా.. ప్రస్తుతం ఇతర కులస్తులు సైతం ఇందులో ప్రవేశించారు. మా సంఘంలో విశ్వకర్మలు కేవలం 20 శాతం మందే ఉన్నారు. మిగతా వారు ముదిరాజ్, కుమ్మరి, రజక, తురక, మాల- మాదిగ, గౌడ, కురుమ తదితర కులాల వారున్నారు. మా సభ్యులకు ప్రభుత్వం మరింత మెరుగైన శిక్షణ కల్పించి మార్కెటింగ్ మెలకువలు నేర్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ‘’గోల్కొండ’’ (గతంలో లేపాక్షి) ఎంపోరియం కొంత మేర మా మార్కెటింగ్ అవసరాలను తీరుస్తోంది అని అంటారు పెంబర్తి కళాకారులు.
పెంబర్తి ప్రముఖులు…
అయిలాచారి: రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన కళాకారుడు. ఆయా స్థాయిల్లో అవార్డులందుకున్నారు. ఎందరికో స్ఫూర్తి ప్రదాత. గురువు. ఈయనంటే గ్రామస్తులం దరికీ ఎనలేని అభిమానం.
-వెంకట్