తల్లికాకి ఆహారం తీసుకుని ఇంటికి వచ్చేసరికి పిల్లకాకి గూట్లో లేదు. తల్లి కాకికి బోలెడంత దిగులేసింది.
‘‘ఎగరటం కూడా పూర్తిగా రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో!’’ అని బాధపడుతూ కిందకు వెళ్ళి చూసి వచ్చింది. ఎక్కడా లేదు. తల్లికాకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
తెచ్చిన ఆహారం వైపు చూస్తూ.. ‘‘తీసుకురాగానే గబగబా తినేసేది. ఎంత బాగుందో అమ్మా. కడుపు నిండిపోయింది’’ అని కూడా అనేది. అని కళ్ల నీళ్ళు పెట్టుకుంది. ఇంతలో మెల్లగా వచ్చింది పిల్లకాకి.
దానిని చూడగానే చాలా ఆనందపడిపోయింది తల్లికాకి. గబగబా దగ్గరకు తీసుకుని ముద్దులు పెడుతూ.. ‘‘ఎక్కడికి వెళ్ళావు? ఎంత భయపడ్డానో తెలుసా. ఆకలి వేస్తుందా? ఇదిగో తిను’’ అంటూ గబగబా తెచ్చిన ఆహారాన్ని పిల్లకాకికి తినిపించబోయింది.
‘‘అమ్మా..! నాకు వద్దు. ఆకలిగా లేదు’’ అంది పిల్లకాకి దూరంగా జరుగుతూ.
‘‘చాలసేపు అయ్యింది కదా తిని! ఆకలి ఎందుకు లేదు?’’ అంది బాధగా తల్లికాకి. అది విని..
‘‘ఇప్పుడే తిన్నానమ్మా?’’ అంది పిల్ల కాకి. ‘‘ ఎక్కడ తిన్నావు?’’ అంది తల్లికాకి ఆశ్చర్యంగా చూస్తూ.
‘‘పైన ఉంటున్న కొంగ మామ వాళ్ళింట్లో..’’
‘‘అవునా. వాళ్ళెలా తెలుసు నీకు?’’ అంది తల్లికాకి అయోమయంగా.
‘‘తెలుసమ్మా. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడూ మన ఇంట్లో నుండి బయటికి వచ్చి మెల్ల మెల్లగా కొమ్మలన్నీ తిరిగేదాన్ని కదా. అప్పుడు ఒక కొంగ పిల్ల జత అయ్యింది. నాకు బతికి ఉన్న చేపని పెట్టిందమ్మా. భలే ఉందమ్మా.’’ అంది పిల్ల కాకి ఆ రుచినే తలచుకుంటూ.
ఏం చెప్పాలో తెలియలేదు తల్లికాకికి. ఆ తర్వాత కూడా చాలాసార్లు అక్కడే తింటూ ఉండటంతో ఇక చెప్పక తప్పదు అనుకుని ఒక రోజు తల్లికాకి పిల్ల కాకిని పిలిచి..
‘‘నువ్వు పెద్దదానివి అవుతున్నావు. నేను తెచ్చిన ఆహారమో, వాళ్ళు పెట్టిందో ఏదో ఒకటి ఇప్పటి వరకూ తిన్నావు. ఇక నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకునే వయసు వచ్చింది నీకు. రేపటి నుండీ నువ్వు నా వెంట రా. ఆహారం ఎలా సంపాదించుకోవాలో నేర్పుతాను..’’ అంది.
‘‘మనంతట మనం కష్టపడి సంపాదించుకున్న ఆహారం రుచి ఎవరో పెట్టిన దానిలో నీకు కనిపించినదా? అయినా చేపలు కొంగల ఆహారం. అవి బతికి ఉన్న వాటినే పట్టుకుని తింటాయి. అది వాళ్ల అలవాటు. చేపలు మన ఆహారంలో ఒక భాగం మాత్రమే. అయినా ఎన్నాళ్ళు పెడతారు వాళ్ళు నీకు? స్నేహం కొద్దీ మరి కొద్ది రోజులు పెట్టవచ్చు. అవీ, మనమూ ఎప్పుడూ ఇక్కడే ఉండము కదా. చెట్లు మారి పోతాము. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాము. కాబట్టి అలా వాళ్ల మీద ఆధారపడకు’’ గట్టిగా చెప్పింది తల్లికాకి.
‘‘పసిపిల్లలు అంతే. ఎవరు ఏది చెప్తే అదే వింటారు. కూడా వెళ్ళి ఒక కంట కనిపెడుతూ ఉండు. తప్పదు.’’ అనేసరికి మర్నాడు పిల్లకాకికి తెలియకుండా దానిని అనుసరించింది. అనుకున్నట్టుగానే పిల్ల కొంగ.. పిల్లకాకిని చేపల వేటకి నది దగ్గరకి తీసుకు వెళ్ళింది. వాళ్ల వెనుకే వెళ్ళిన తల్లికాకి దగ్గర్లో చెట్ల కొమ్మల్లో దాగి వాటిని గమనించసాగింది.
పిల్ల కొంగ నది మధ్యలో ఉన్న చిన్న రాయి మీద ఒంటికాలి మీద నిలబడి పిల్లకాకిని అలా నిలబడమని చెప్పింది. పిల్లకాకి ఎంత ప్రయత్నించినా అలా నిలబడలేక అనేక అవస్థలు పడసాగింది.
అదే నదిలో ఉన్న ఒక పిల్ల మొసలి వీళ్ళిద్దర్నీ చూసింది. ‘‘అబ్బా. ఈ కాకి ఆహారంగా దొరికితే అమ్మ దగ్గర గొప్పలు పోవచ్చు. బహుశా అమ్మ కూడా ఎపుడూ కొంగమాంసమే తప్ప కాకి మాంసం తిని ఉండి ఉండదు’’ అనుకుని నోట్లో నీళ్ళు ఊరుతుండగా మెల్లగా వీటి వైపు రాసాగింది.
అది తెలియని కొంగపిల్ల ఒంటికాలి మీద ఎలా నిలబడాలో కాకిపిల్లకి చెబుతూనే ఉంది.
ఈలోపు పిల్ల మొసలి దగ్గరకంటా వచ్చేసి అవకాశం కోసం ఎదురు చూడసాగింది.. అది గమనించిన తల్లికాకి పిల్లలకు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి అరుచుకుంటూ అక్కడికి వచ్చేసింది. అది గమనించిన పిల్ల మొసలి ఇక ఆలస్యం చేయకూడదని గబుక్కున వాటి మీదకి ఒక్క దూకు దూకింది. దాంతో అలవాటైన కొంగ పిల్ల గబుక్కున ఎగిరి తప్పించుకుంది. పిల్లకాకి కాలి వేలు మాత్రం మొసలి నోటికి చిక్కిపోయింది. దాంతో తల్లికాకి పిల్లని ఎలాగైనా రక్షించుకోవాలని తన కాళ్లతో మొసలి మూతి మీద బలంగా గీరుతూ ‘‘బలంగా పైకెగురు…పైకెగురు’’ అని పిల్లకాకికి వినిపించేలా అరవసాగింది.
తల్లి అరుపులతో పిల్లకాకి ఒక పక్క ఏడుస్తూనే తన రెక్కల్లోకి బలం అంతా తెచ్చుకుని పైకి ఎగరటానికి ప్రయత్నించింది. ఈలోపు కాకి తన్నిన తన్నులతో.. పిల్ల మొసలి లేత మూతికి గాయాలు అయ్యాయి. దాంతో భయపడిపోయిన పిల్ల మొసలి పిల్లకాకిని వదిలేసింది.
దాంతో తల్లికాకి, పిల్లకాకి గోల గోలగా అరుచుకుంటూ ఇంటి దారి పట్టాయి.
‘‘ఇకనుండీ నువ్వేది పెడితే అదే తింటానమ్మా..’’ అంటూ పిల్లకాకి తల్లిని గర్వంగా చూసింది.
దాంతో.. ‘‘కొత్త ఆహారమే కాదు, స్నేహాలూ మంచివే. కానీ ఎవరి పరిధి వారిదే. అది తెలిసేంతవరకూ జాగ్రత్తగా ఉంటే చాలు..’’ అంది తల్లికాకి పిల్లని దగ్గరకి తీసుకుంటూ..
-కన్నెగంటి అనసూయ, ఫోన్ : 924654124