భల్లూకం పట్టా.. అబ్బె??
మా జంతు ప్రపంచం గూర్చి మానవులు అనేక అభిప్రాయాల్ని ఏర్పర్చుకున్నారు. గాడిదలతో, నక్కలతో, తోడేళ్ళతో, మొసళ్ళతో, పిల్లులతో, కుక్కలతో, దున్నపోతులతో, బల్లులతో సందర్భానుసారంగా ఇతర జంతుజాలంతో పోల్చుతూ వుంటారు. విష్ణుశర్మ రాసిన పంచతంత్ర కథల్లో పాత్రలన్నీ జంతు ప్రపంచమే! మానవులు, దానవులు అంటూ మనుషుల్ని విభజించుకున్నట్లే, మా జంతువుల్ని మీరు రెండు వర్గాలుగా చేసారు. క్రూరమృగాలని, సాధుజంతువులని పేర్కొన్నారు. కాని, మీ మనుషులాంటి విభజన మాకు ఎలా వర్తిస్తుందో మాకైతే తెలియదు. మా జంతు ప్రపంచంలో కడుపు నింపుకోవడానికై తప్ప, ఇతరత్రా వైరుధ్యాలు, వైషమ్యాలు మచ్చుకకు కూడా కానరావు. ఎదుటి జంతువు అపాయం తలపెడుతుందేమో ననే భయమే, మమ్మల్ని స్వరక్షణకై పురి కొల్పుతాయి. కాబట్టే వేలాది రకాల జంతుజాలం ఆడవుల్లో, నీటి ఆవాసాల్లో, సముద్ర జలాల్లో మనగలుగుతున్నాయి. మా భయమంతా మీ మానవులతోటే!
ఇక మీరు ఎలుగుబంటి గూర్చి చెపుతూ, ‘భల్లూకం పట్టు…’ అనే మాట వాడుతారు. నిజానికి దాని అర్థమే మాకు తెలియదు. మీ పరిభాషలో బలమైన పట్టు, లేదా పట్టుదల అని అయితే, అవి ఉత్తుత్తి మాటలే! మీ మాట నిజమైతే, అడవుల్లో, మా ఆవాసాల్లో మా సంఖ్య గణనీయంగా పెరగాలి. కాని, ప్రపంచ వ్యాపితంగా గల మా ఎనిమిది రకాల జాతుల్లో, కొన్ని జాతులు కనుమరుగై పోతున్నాయి. మరి కొన్ని చివరి రోజుల్ని లెక్కిస్తూ బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నాయి. అందులో కొన్ని ఎలుగుబంట్ల గూర్చి మీకు తెలియాలి. వాటి దీనగాథను ఆలకించండి!
బద్దకస్తులైన ఎలుగుబంటి (Sloth Bear)
ఈ పేరు కూడా ఎందుకు వచ్చిందో తెలియదు. ఒకటి మాత్రం నిజం! ఇతర జంతువుల్లా వెంటాడి, వేటాడే చతురత మాకు లేదు. పైగా మేం దట్టమైన అడవుల్లో కాక, కొంతమేర లోతట్టు అడవుల్లో సంచరిస్తూ వుంటాం. అడవులకు ఆనుకొని వున్న పంటపొలాల్ని ఆసరగా చేసుకొని పొట్ట నింపుకుంటాం. మా ప్రధాన ఆహారం శాఖాహారమే! పోతే చీమల్ని, చెదల్ని, తేనెపట్టును తినడం మా అలవాటు. నీటి ఆవాసాల్లో చేపల్ని కూడా వేటాడుతాం! పైగా చీమల్ని, చెదల్ని నియంత్రించి, మీ కోసం పర్యావరణాన్ని కాపాడుతున్నాం. సాధారణంగా మేం సామూహిక జీవనాన్ని ఇష్టపడం. ఒంటరిగా (solitary) తిరగాడడం మా అలవాటు. చిన్నప్పుడు మాత్రమే తల్లితో ఓ రెండు సంవత్సరాలపాటు కలిసి జీవిస్తాం. ఆ తర్వాత ఎవరిదారి వారిదే!
మా ఒంటరి తనాన్ని గుర్తించిన మీ మానవులు (గుడ్డేలుగులవారు) అదను చూసి, వలవేసి మా తల్లి నుంచి మమ్మల్ని దొంగచాటుగా పట్టుకొని తెచ్చి, బెత్తంతో కొట్టి, బెదిరించి, మా నోటికి ఉచ్చును బిగించి, వారి చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు. భయానికి వారు చెప్పినట్టల్లా నిల్చోని సలాం చేయడం, తల ఊపడం చేస్తూ వుంటాం. దీన్ని మీరు నాట్యం (dance) అంటారు. మాకు ఏ నాట్యం రాదు. ఆట అంతకన్నా తెలియదు. మేమే పిరికి వారం. నిప్పును చూస్తే ఆమెడ దూరం పరుగెడుతాం. అలాంటిది, మా వీపుపై పిల్లల్ని కూర్చొబెట్టి, వారికి ధైర్యాన్ని నూరిపోస్తారు. మా వెంట్రుకల్ని పీకి పసిపిల్లల మొలతాడుకు కడుతారు. ఇదంతా గుడ్డేలుగుల వారు పొట్టనింపు కోవడానికి చేసే జిమ్మిక్కులు.
అయితే, ఇప్పుడా పరిస్థితి లేదు. 1995లో న్యూ ఢిల్లీ కేంద్రంగా కార్తీక్ సత్యనారాయణ, గీతా శేషమణి లాంటి జంతూ ప్రేమికులు స్థాపించిన అటవి జంతువుల రక్షణ సంస్థ (Wild Life SOS)తో మా ఎలుగుబంట్లకు మంచి రోజులు వచ్చాయి. ముఖ్యంగా బద్దకం ఎలుగుబంటిగా (sloth) పేరు పొందిన మా జాతిని అధికంగా కాపాడారు. దాదాపు 400 సంవత్సరాల ప్రాచీన ఆచారంగా వస్తున్న గుడ్డేలుగుల విన్యాసాన్ని నిలుపుదల చేయించి, దేశవ్యాపితంగా 628 ఎలుగుబంట్లకు రక్షణ కల్పించారు. మా కోసం ఆగ్రాలో ఎలుగుబంటి రక్షణ కేంద్రాన్ని (rehabilitation centre)ను ఏర్పాటు స్థాపించారు. మాతో పాటు మా సహచర ఇతర జంతువులైన ఏనుగలకు మధురాలో ఏకంగా ఓ దవాఖాననే నిర్మించారు. పులులకు, చిరుతలకు, అలుగులకు (pangolin), పాములకు, మొసళ్ళకు, తాబేళ్ళకు, వివిధ రకాల పక్షులకు వివిధ ప్రాంతాల్లో సంరక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. నిజానికి మేం వీరికి సలాం చేయాలి.
ఇలా ఓ వైపు మాపై దయా, కరుణ చూపే జంతు ప్రేమికులుంటే, మరోవైపు మాపై వేట నిత్యకృత్యమే! మీ మానవులకు పులిగోళ్ళు మెడలో వేసుకోవడం ఓ గొప్ప హోదా! పైగా ఆ గోళ్ళ చివరన బంగారు తొడుగులు తొడిగి దర్జాగా వెలిగి పోతారు. అటవి సంరక్షణ చట్టాలు వచ్చి, పులివేటపై వేటుపడడంతో ప్రత్యామ్నాయంగా మమ్మల్ని వధించి, మా గోళ్ళను పీకి, పులిగోళ్ళలా భ్రమింపచేసి, మోసపూరితంగా అమ్మి సొమ్ము చేసుకోవడం మీ మానవుల కుటిల నీతికి నిదర్శనం కాదా?
మీ మగసిరికి… మా అవయమా..?
ఇంకో తప్పుడు ఆలోచన మాపై, మా అవయవాలపై కల్గించుకున్నారు. మానవుల మగసిరి పెరగడానికి మా పురుషాంగాన్ని కత్తిరించి, అంగళ్ళల్లో యువకులకు ఎరగా చూపి, సొమ్ము చేసుకుంటారు. అయినా, మీ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలమని కథలు చెప్పుకుంటారు. అలాంటి మిమ్మల్ని ఏమనాలి?
బీజవ్యాప్తికి… మా సహకారం…. అంతింత కాదు….
బహుషా జంతు ప్రపంచంలో మాలాగా బీజవ్యాప్తికి తోడ్పడే మరో జంతువు లేదంటే అతిశయోక్తి కాదు. చివరికి పక్షులు, గాలి కూడా మా లాంటి పాత్ర నిర్వర్తించలేవు. మా శరీంరపై వుండే వెంట్రుకలు ప్రకృతి వరప్రసాదంగా భావిస్తాం. దాదాపు వంద చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మేము వృక్ష జాతికి చెందిన వందల రకాల విత్తనాల్ని వ్యాప్తి చెందించి, కొత్త మొక్కల పెరుగుదలకు మాకు తెలియకుండానే దోహదపడుతాం. అయినా, మేం పెంచే మొక్కల్ని, మమ్మల్ని తుదముట్టించడం మీకో సరదా! పరోక్షంగా, మీ ఉనికికి మీరే భంగం కలిగించుకుంటున్నారు. మా ఉనికిని లేకుండా చేస్తున్నారు.
ప్రపంచ వ్యాపితంగా వున్న ఎనిమిది జాతుల్లో, భారత
ఉపఖండంలో నాలుగు రకాల జాతులుగా వున్నాయి. ఇందులో గోధుమ (brown)రంగు ఎలుగుబంటి కనుమరుగు దశలో (extint) వుండగా, మిగతావి అపాయకర (vulnarable) దశలో, అంతరించుపోతున్న స్థితిలో (endangered) వున్నాయి.
అంటే, మాకు ప్రాణ సంకటం గాకా, మా జీవితాలు మీకు చెలగాటంగా మారింది. ఇప్పుడన్నా మీ బుర్రల్లో మంచి ఆలోచనలు రానీయండి! ఇప్పుడు మా జాతిలోని మరి కొన్ని జంతువుల్ని చూద్దాం!
మంచే మా ఆవాసం! అది కరిగితే…? (Polar Bear)
భూమికి గల రెండు ఊపిరితిత్తులో ఉత్తర భాగానగల ధృవం మా ఆవాసం అని తెలిసిందే! సంవత్సరం పొడుగునా మంచుతో కప్పబడే ఈ ప్రాంతంలో చివరికి ఎస్కీమోలు కూడా వుండలేరు. మా ఆవాసాలకు దిగువన దక్షిణ దిశన వారు జీవిస్తారు. మేం అలా కాదు, (-50 C) నుంచి (-200 C) ఉష్ణోగ్రతల్ని కూడా తట్టుకొని జీవించే శక్తిని ప్రకృతి మాకు ప్రసాధిస్తే, మీ మానవ జాతి దుశ్చర్యలతో, మా ఆవాస ప్రాంత మంచు కరిగిపోయేలా చేస్తున్నారు. దీంతో దక్షిణాన గల తిమింగలాలు మా ఆవాసాలకు వచ్చి, మా ఆహారమైన చేపల్ని, ఇతర మంచు ప్రసాదిత ఆహారాన్ని కొల్లగొడుతున్నాయి. చివరికి మాతో సహజీవనం చేసే, చిన్న తిమింగలాల్ని (NARWALS) వాల్‍రసుల్ని (walruses), సీల్స్ (seals)ను లేకుండా చేస్తున్నాయి. దీంతో మంచు నీటి ఆధారిత జంతువులకు, మాకు తీవ్ర ఆహార కొరత ఎదురైంది. రోజుల తరబడి ఆహారం దొరక్క, బక్కచిక్కిన మా శరీరాలు, చివరికి సంతానోత్పత్తికి కూడా జరుపుకోలేని దీనస్థితి. ఈ విధంగా మాకు తెలియకుండానే మానవ తప్పిదాలు మా జాతిని తుదముట్టిస్తున్నాయి. ఈ విషయాల్ని మీకు స్పష్టంగా తెలియాలంటే, మాపై గత 20 సం।।గా పరిశోధన చేస్తూ, మా రక్షణకై పాటుపడుతున్న క్రిస్టిన్ లాయిడ్రె (Kristin Laidre), వాషింగ్‍టన్ విశ్వవిద్యాలయ పరిశోధకురాలిని అడగండి. ఈమె స్థాపించిన పోలార్ సైన్స్ సెంటర్ ద్వారా మా గురించి ఎన్నో వాస్తవాలతోపాటు, మా జీవనం విధానం గూర్చి, మా వినాశకర దశ గూర్చి, మాకు సంబంధించిన ఆహారపు కొరత గూర్చి క్షుణ్ణంగా చెపుతుంది.
ఈ సందర్భంగా మరో విషయం. మీరందరు భావిస్తున్నట్లు మేం తెల్లగా వుండం. నిజానికి మేం గోధుమ రంగు ఎలుగుబంట్ల వారసులం. అయితే మా ఆవాసానికి అనుగుణంగా, మా బాహ్య వెంట్రుకల్ని తెల్లగా (camouflage) మార్చుకుంటాం. ఈ విషయాల్ని తెలియకుండా, మీ పాఠ్యాంశాల్లో, మేమంతా తెల్లని ఎలుగుబంట్లమని తప్పుడుగా రాసుకుంటారు.
మా పరిస్థితి ఇతర ఎలుగు బంట్ల లాంటిదే! పైగా భూమిపై మా జాతి మరే ప్రాంతంలో కానరాదు. అయినా, మీ దృష్టిలో మేం సమిధలమే!
ముద్దులొలుకే పాండా… అయినా ఏమిటంట??
2008లో చైనాలో జరిగిన ఒలింపిక్ క్రీడల చిహ్నం (mascot) పాండా అని జ్ఞాపకం వుండే వుంటుంది. ఇదే కాకుండా, నేను చైనా దేశపు జాతీయ జంతువునే కాక, ప్రపంచ వ్యాపితంగా ఎనిమిది ఎలుగుబంట్ల జాతుల్లో ఒకదాన్ని. చాలా మందికి ఈ విషయం తెలియక ఎలుగుబంటి వేరు, పాండా వేరని అనుకుంటారు. పోతే మిగతా జాతిలా కాకుండా నేను సాధువైన జంతువుని. కొంచెం అపాయం అని భావిస్తే నీటిలో దూకి ఈదడం, దగ్గరలోని చెట్టెక్కడం నా పిరికి తనానికి నిదర్శనం. ధృవ ఎలుగుబంటి ఉత్తర ధృవాలకే పరిమితమైనట్లు నేను, చైనాలోని కొన్ని పర్వత శ్రేణులకే పరిమితమయ్యాను. తల నిర్మాణ పరంగా, కళ్ళతీరు ఇతర ఎలుగుబంట్లకు భిన్నంగా వుండి, ముద్దుగుమ్మలా అగుపిస్తాను. పోతే, నేను చైనాలోనే ఎందుకు నివసిస్తానో తెలుసా? నా ప్రధాన ఆహారం వెదురు బొంగులే! దాదాపు 98 శాతం ఆహారంగా తీసుకునే ఈ వెదురు చైనాలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వుండడంతో పాటు, అక్కడి వాతావరణం నాకు ఆవాస ప్రాంతంగా మారింది.
భారత్‍లో కూడా నా ఉనికి సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‍లో వున్నట్లు చెపుతున్నారు. వుంటే ఇందులో వాస్తవం వుండవచ్చు! కాని, నా భద్రతకై ఎలాంటి చర్యలు మాత్రం లేవు! 1985 దాకా నన్ను ఎలుగుబంటిగా గుర్తించని వైనం. raccons జాతిగా భావించడం జరిగింది. ఏ జంతువుకులేని విధంగా నా పంజాకు ఆరువేళ్ళుంటాయి. మీ మానవులు ఇలా వుంటే అదృష్టవంతులని భావిస్తారు. కాని మాకా అదృష్టం కనుచూపు మేరలో కానరాదు. పుట్టుకతో కళ్లు తెరవని మా కూనలు, ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాతగాని, బాహ్య ప్రపంచాన్ని చూడలేవు ఈ విధంగా ఓ ప్రత్యేకతను కలిగిన మా జాతి కూడా కనుమరుగు దశలో వుండడం మీకు బాధాకరంగా లేదా!
నేటి వెదురు వనాలకు, అడవులకు మా పాండాలే కారణమంటే మీరు నమ్మరుగాక నమ్మరు. వాటిని మేమెంతగా ఆహారంగా తిన్నా, అంతకన్నా రెట్టింపుగా వాటి బీజవ్యాప్తిని (కాండం ప్రత్యుత్పత్తి) చేస్తున్నాం. ఇలా మా ఆవాసాన్ని మేం కాపాడుకుంటే, మాకే రక్షణ లేకుండా మీ మానవ జాతి చేస్తుంది. అందుకే కాబోలు, మా మాదిరి బొమ్మల్ని మీ పట్టణాల్లో అమ్మి, మీ పిల్లలకు ఆనందాన్ని పంచుతున్నారు. మాకు మాత్రం ఉరి తాళ్ళను బిగిస్తున్నారు. (వచ్చే సంచికలో మరికొన్ని జంతువుల దీనస్థితిని చూద్దాం!)
- డా।। లచ్చయ్య గాండ్ల, ఎ : 9440116162