ఎన్నికల సంరంభం ముగిసి ఫలితాల కోసం ఉత్సుకతో ఎదురుచూస్తున్న వేళ ‘దక్కన్‌ల్యాండ్’ ప్రజల ముందుకు వస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణా సాధనలో ప్రధాన నినాదాలయ్యాయి. గడిచిన కాలంలో అనేక కారణాల వలన నియామకాలలో ఎదురయిన ఆటంకాలు, వైఫల్యాలు నిరుద్యోగ యువతలో ఆందోళనకు కారణమయ్యాయి. రాబోయే నూతన ప్రభుత్వం ముందు నిరుద్యోగ సమస్య సవాలుగా నిలువనుంది. ఏ ప్రభుత్వమయినా సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తుంది. ఆ క్రమంలో అనేక రూపాలలో ఆటంకాలు ఎదురై ఆలస్యం జరగొచ్చు. ఆ కారణాలు గుర్తించి వాటిని అధిగమించి సమస్య పరిష్కార దిశగా కృషి చేయాల్సి ఉంటుంది.
నియామకాలలో ప్రధాన భూమిక పబ్లిక్ సర్వీస్ కమీషన్. భర్తీ చేయవలసిన ఉద్యోగాలు, నూతన ఉద్యోగాలు వాటికి సంబంధించిన పరీక్షలు, ఫలితాలు, నోటిఫికేషన్లు, సెలక్షన్లు, ఈ క్రమాన్ని ఒక క్రమంలో నిర్వర్తించడానికి పబ్లిక్ సర్వీస్ కమీషన్‌కు అవసరమైనంత సిబ్బంది, తగినంత సమయమూ అవసరము. దీనికి తోడు స్టేట్ సివిల్ సర్వీసెస్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్, గురుకుల టీచర్స్ బోర్డు బలోపేతం చేసి విధి విక్రేదీకరణ జరగాలి. ముందుగా జాబ్ కేలండర్‌ను ప్రకటించాలి. మన చిన్న రాష్ట్రంలో ఏ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉందో అంచనా వేసి ప్రకటించాలి. జాబ్ కేలండర్ అమలుకు మరే ఇతర అంశాలు క్లాష్ రాకుండా చూడాలి. మిగతా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, బ్యాంకు రుణాలివ్వటం ద్వారా స్వయం పోషక ఉపాధి అవకాశాలు కల్పించాలి. గత అనుభవాల నేపథ్యంలో చిత్త శుద్ధితో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. లక్షలాది నిరుద్యోగ యువతకు భవిష్యత్ భరోసా యివ్వాలి.
డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణాకు, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టుకు జూన్‌లో జరిగిన ఒప్పందం ఒక చారిత్రక సంఘటన. ఈ ఒప్పందం ద్వారా నారాయణ పేట జిల్లాలో కృష్ణా మండలంలోని ‘ముడుమాల’ గ్రామంలో ఉన్న నిలువురాళ్ళ తిమ్మప్ప ప్రాంతం పరిరక్షణకు, పరిశోధనకు అవకాశం ఏర్పడింది.
3000 సం।।ల నాటి చరిత్ర ఉన్న ప్రాచీన మానవుల సంస్క•తి, ఆచారాలు, వారి ఖగోళ విజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం ఈ ప్రాంతం. 15 అడుగులు ఎత్తున్న 80 నిలువురాళ్ళు, కొన్ని వేల గుండ్రాళ్ళ వరస, నక్షత్ర మండలాలు, సప్తర్షి మండలాలు, సింహరాశి ధృవతారలతో కూడిన ఈ అమరిక అద్భుతం. ఈ ప్రదేశం త్వరలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుంది. ఈ ప్రదేశానికి UNESCO SITE STATUSప్రపంచ సాంస్కృతిక గుర్తింపు సాధించగలమని విశ్వశిస్తూ…
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్