ఆంధప్రదేశ్ అవతరించిన సంవత్సరమది.
ఆ రోజులలో ఒకానొక సాయంత్రం చార్‍సౌ సాల్ హైద్రాబాద్ పాతనగరం శాలిబండల మా ఇంటెనుక పెరట్ల నిండుపున్నమి పండు వెన్నెల మల్లె పందిరి క్రింద ఘుమఘుమల మత్తుగాలుల మధ్య ముషాయిరా శురువయ్యింది. రంగు పూల షత్రంజీ మీద మల్లెపూవులాంటి తెల్లని చాదర్ పరిచి అందులో గుండ్రంగా కూర్చున్న వాళ్ల మధ్యల వెలుగుతున్న ‘షమా’ సాక్షిగా కమనీయ కవితాగానానికి అంతా తయార్ అయ్యింది. నాజూకు నడుము లాంటి తెల్లని పొడుగు పొడుగు సీసపు గ్లాసులల్ల ఎరెర్రని ఖర్బుజా షర్బత్తులు సరఫరా అవుతున్నాయి. అక్కడ అలరించిన షాయర్‍ల శేర్వానీలకు చమేలీ అత్తరులను అలవోకగా అద్ది వారికి నవరతన్ పాన్ సుపారీలను సగౌరవంగా అందించారు. ఉజ్వలంగా వెలుగుతున్న షమా పక్కన తళతళలాడే కిస్తీలో తాజారోజా ఎర్రగులాబీలు ఒద్దికగా ఒప్పుల కుప్ప వొయ్యారి భామలా బుద్దిగా కూచున్నాయి. అక్కడి మాహోల్ మొత్తం మురిపించి మైమరిపించే మాయాజాలంగా, మంత్ర నగరిగా మారిపోయింది.
ఆనాటి ముషాయిరా మా బాపు సదారత్‍లనే (అధ్యక్షత) శురువయ్యింది. ఆయన జిగ్రీదోస్తులు జనాబ్ ఉస్మాన్ సాబ్, జిలానీ సాబ్, లతీఫ్‍సాబ్, జాఫర్ మియా, గంగారాం, లక్ష్మీనరసయ్యలే గాక ఇంకా నాకు పేరు తెల్వని
వాళ్లు చాలా మంది అక్కడ హాజరైనారు. రాత్రి రగులుకుని రంజుగ రాణిస్తుంటే అందరి తభ్యత్ ఖుష్ ఐపోయింది.
సదర్ ముందు షమా నిలబడింది. ఆయన ప్రారంభించాలని సూచన అది. మా బాపు ఆశువుగా ఒక షేర్ వినిపించాడు.
హమే దునియా సే క్యా మత్‍లబ్
కుతుబ్‍ఖానా హై వతన్ అప్నా
మరేఁగే హమ్ కితాబోఁ పర్
హర్ వరఖ్ హై కఫన్ అప్నా
(ఈ లోకంతో మాకేం సంబంధం
గ్రంథాలయమే మా స్వదేశం
పుస్తకాల కోసం ప్రాణాలు విడుస్తాం
ప్రతి కమ్మను కప్పుకుని లోకాన్ని వదులుతాం)
మల్లెపందిరి క్రింద మల్లెపూల వాన కురిసినట్టు అక్కడ వాహ్వా వాహ్వాల ప్రశంసల జల్లు కురిసింది. దాంతో ఆయన మరొకటి అందుకున్నాడు.
‘‘పూల్‍బన్ కర్ ముస్కురానా జిందగీ
ముస్కురాకే గమ్ బులానా జిందగీ
హర్ దిన్ న మిల్ పాయేతో క్యాహువా
దూర్ రహకర్ భీ దోస్తీ నిభానాజిందగీ’’
(పూవు వలె చిర్నవ్వులు చిందించటమే జీవితం
చిర్నవ్వులతో చింతలను మరిపించటమే జీవితం
ప్రతిరోజు కలిసిమెలిసి జీవించకపోతేనేం
దూరాలనుండి స్నేహాన్ని కొనసాగించటమే జీవితం)
మా బాపుకు తెలుగు కన్నా ఉర్దూ మీదనే మక్కువ ఎక్కువ. నైజాం జమానాలో ఆయన చదువంతా ఉర్దూ భాషలనే జరిగింది. అప్పుడు ఉర్దూ రాజభాష. ఆయన పనిచేసేది కూడ ఉర్దూ మీడియం బడిల ఉర్దూ టీచర్‍గనే. ఇంటికి ప్రతిరోజు సియాసత్ అక్బార్ తెప్పించెటోడు. తెలుగు దినపత్రిక తెప్పిస్తే మేం కూడ చదువుతం కదా అని అమ్మ కొట్లాట. ఇగ రైన్‍బజార్ నుండి మా మేనమామ సైకిల్ తొక్కుకుంట మా ఇంటికి వొస్తే చాలు బావాబామ్మర్దులిద్దరూ కల్సి ఉర్దూలనే మాటాముచ్చట, మజాక్‍లు. మాకు మా చిన్నతనంల ఇంగ్లీష్ కంటె ముందు ఉర్దూనే పరిచయం అయ్యింది. అట్ల మాకు ఇద్దరు అమ్మలు. ఒకరు తెలుగు మరొకరు ఉర్దూ. త్రివేణీ సంగమంలాగ అరబ్బీ, ఫార్సీ, హిందీల మేలు కలయిక ఉర్దూ. అది ఒక మతానికో, ప్రాంతానికో పరిమితం కాదు. భారతదేశ భాషా కుటుంబంలో మరో ముద్దుబిడ్డ. ఉర్దూను లష్కరీ భాష అంటే సైనికుల భాష అని కూడా అనేవారు. తొలి దశలో ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చిన ముస్లిం సైనికులు ఈ భాషను మాట్లాడేవారు. తర్వాత అది ప్రజల భాషగా రాజ భాషగా మారింది.
జిలుగు వెలుగుల వెన్నెల చిక్కబడుతుంటే ముషాయిరా జోర్ అందుకుంది. ఉస్మాన్‍సాబ్, జిలానీసాబ్‍ల కవితాగానం అయిపోంగనే షమా జాఫర్ మామూ ముందు హాజిర్ అయ్యింది. దీపశిఖ సాక్షిగా ఆయన తన రాగయుక్త సంగీత స్వరంతో శ్రోతలను మంత్ర నగరిలోకి ఎత్తుకపోయిండు.
‘‘ఆఁఖేఁ తుమారీ హో తో ఆఁసూ మేరీ హో
దిల్ తుమారీ హో ధడ్కన్ మేరీ హో
అల్లా కరే హమారీ ప్యార్ ఇత్నా గహరా హో
సాఁస్ తుమ్హారీ రుకేతో మౌత్ మేరీ హో’’
(కనులు నీవైతే కన్నీళ్లు నావి
హృదయం నీదైతే స్పందన నాది
అల్లా దయవలన మన ప్రేమ ఎంత గాఢమో
ఆగిన శ్వాస నీదైతే మరణం మాత్రం నాది కావాలి)
ఆ కవితామృతాన్ని ఆస్వాదించిన రసికుల నరనరాలలో పరవశత్వం పరవళ్లు తొక్కింది.
హమ్‍తో ‘‘లుట్‍గయే’’ అని ఒకరంటుంటే హమ్‍తో ‘‘బర్‍బాద్’’ హోగయే అని మరొకరన్నారు.
శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఎట్లనో మా బాపుకు జాఫర్ మియా అట్ల. మా బాపు స్కూలుకు సదర్ సాబ్ అయితే అండ్ల జాఫర్ మియా ఒక చప్రాసీ. అతను పిల్లల కోడిలాంటోడు కనుక స్కూలు పిల్లలంతా అతన్ని జాఫర్ మామూ అని పిల్చె టోళ్లు. నాకు కూడ అట్లనే అలవాటు అయ్యింది. ఉద్యోగ అంతస్తులు మతాల అంతరాలు మరిచిపోయి వాళ్లిద్దరు ‘‘అక్కన్న మాదన్నలు’’ గా జిగ్రీదోస్తులుగ కల్సిఉండెటోళ్లు. బాపు ఆయన్ని చనువుతో ప్రేమగా ‘‘హమారే జాఫర్ మియా’’ అని పిలవగానే ‘‘జీసాబ్ అనో లేక హాఁ సాబ్ అనో’’ వెంటనే బదులు పలికెటోడు.
బడి పనులన్నీ జిమేదారిగ ఎట్ల చేసెటోడో మా ఇంటి పనులు కూడ అట్లనే నెత్తిల వేసుకుని చేసెటోడు. అమ్మకు బజారు పనులల్ల ఆయన ఆసరాగ ఒక పెద్ద కొడుకుగ ఉండెటోడు. అమ్మకు ఉర్దూరాదు. ఆయనకు తెలుగురాదు. వారిద్దరి మాటామంతి, ఆ అవస్థను చూసి మా పోరలకు ఉచిత వినోద ప్రదర్శనమై పొట్టలు పగిలేటట్టు నవ్వుకునేవోళ్లం.
జాఫర్ మామూ రూపం హైద్రాబాద్ దక్కన్ ఆమ్ ఆద్మీకి ప్రతిరూపంగ ఉండేది. నెత్తి మీద నల్లని టర్కిష్ బూరు టోపీ, మందంగా ఉండే ఊదారంగు బిన్నీ శేర్వానీ, లోపల తెల్లని మస్లిన్ లాల్చీ, దాని క్రింద తెల్లటి ఇరుకిరుకు కాటన్ పైజామా వేసుకుని మధ్యస్థంగా ఎత్తు లావులతో ఉండెటోడు. ముఖమంతా గుబురు గడ్డం మీసాలే గాక చాలా అస్పష్టంగా అమ్మవారు సోకిన మచ్చలు కూడా ఉండేవి. ఖిమామీ జర్దా పాన్ నమిలి, నమిలి ముదురు రంగుకు మారిన పెదుముల మీద వాడిపోని ఒక చిర్నవ్వు మాత్రం హమేషా చమ్కాఇస్తుండేది.
ఎండాకాలం తాతీళ్లల్ల (సెలవులు) కూడా మా ఇంటికి వచ్చి పనేమైనా ఉందా అని అడిగి పనులేమీ లేకపోతే దివాన్‍ఖానా ఆరాం కుర్చీల పురుసత్‍గ కూర్చుని బాపుతో వొడవని ముచ్చట్లల్ల మునిగి తేలెటోడు.
పెంజీకట్లు కమ్ముకొస్తున్న ఒకానొక సాయంకాలం తన ఎద లోపలి విషాద గాధను వినిపించాడు. చరిత్ర చెక్కిలి మీద ఘనీభవించిన కాలం కన్నీటి గాధ అది.
× × ×
కోహీర్..
తెలుగులో వజ్రాల గుట్ట అని అర్థం. జాఫర్ మియా పుట్టి పెరిగిన వతన్ అది. ప్రకృతి పొత్తిళ్లల్లో పసిపాపలా ముడుచుకుని పడుకున్న పల్లె అది. చుట్టూ నల్లరాళ్ల గుట్టల మధ్య ఎర్ర మట్టినేల మీద ఆకుపచ్చని పచ్చల పతకంలా మెరిసే పల్లె కోహీర్. కోహీర్ తియ్యటి జామపండ్లకు అవ్వల్ దర్జా నంబర్ వన్ అన్నమాట. మొత్తం నైజాం రాజ్యంలనే ఆ పండ్లు మహామషూర్. ఆ పండ్ల ముందు బార్కాస్ జామపండ్లు కూడా బేకార్. హైద్రాబాద్‍కు నూరు కిలోమీటర్ల దూరంల బీదర్‍కు పోయే సడక్‍కు ఎడమ పక్కమీద ఆ పల్లె ఉంటుది. గంగాయమునల సంగమం వోలె హిందు ముస్లింలు అక్కడ సహజీవనం చేస్తుంటరు. కాని 1948 సెప్టెంబరు పదిహేను తారీఖు మాత్రం ఆ పల్లెను అతలాకుతలం చేసి హైద్రాబాద్ చరిత్రగతిని ఉల్టాపల్టా చేసింది.
ఆ రాత్రి జాఫర్ మొదటి బుక్కను బిస్మిల్లా అనుకుంటూ నోట్లో పెట్టుకోంగనే ఆకాశం పగిలిందా అన్నట్లు ఫెళాఫెళా చప్పుళ్లు. అటువంటి చప్పుడు జిందగీల ఎప్పుడూ వినలేదు. చెవులు చిల్లులుపడి భీరిపోయాడు. మరుక్షణమే మరో వింత చప్పుడు. అది సైరన్. మృత్యుదేవత పిలుపు లాగ అది కర్ణకఠోరంగా ఉన్నది. ఏమీ సమజ్‍గాక ఎంగిలిచేయి కడుక్కోకుండనే ఇంట్ల నుండి ఇతలకి ఉరికొచ్చిండు. అప్పటికే అందరూ అక్కడికి చేరి చీకటి ఆకాశం దిక్కు తలెత్తి దిక్కులు చూస్తుండ్రు. భూతాల్లాంటి గాలి మోటార్లు మబ్బుల్ని చీల్చుకుంట పట్నంవైపు పరుగులు తీస్తున్నయ్. వాటి పొట్ట క్రింద ఊరంతట్ని పట్టపగలుగ వెలిగిస్తున్న లైట్లు. అవి దయ్యం కండ్లవోలె మిరిమిట్లు గొల్పుతున్నయ్. అది సరిపోదన్నట్లు మీదికెల్లి చెవులు దిబ్బడపడే సైరన్ చప్పుళ్లు. ఎవరికీ ఏమీ సమజ్ కాలేదు. మెడలు విరిగేటట్లు నెత్తులు మీది కెత్తి బొమ్మలోలె వరుసగ ఉరుకుతున్న ఆ ఇనుప డేగలను నోరెళ్లబెట్టుకుని చూస్తున్నరు. అవి యుద్ద విమానాలని, మిలిటరీ జనరల్ జె.యన్. చౌదరీ నేతృత్వంలో అవి హైద్రాబాద్ పట్నాన్ని దిగ్బంధం చేసి నిజాం నవాబును గద్దె దించటానికి పోతున్నయని వాళ్లకు తెలియదు. ఆ ఊరికి అక్బార్ రాదు, రేడియో లేదు. ఇగ వాండ్లకు దునియ మీది ముచ్చట్లు, సియాసత్ సంగతులు ఏం తెలుస్తయ్. అందరూ అయోమయం జగన్నాథంలే!
గాలిమోటర్లు అట్ల పోయినయో లేదో ఊర్లకు వచ్చే సడక్ మీద బుర్రుబుర్రున చప్పుడయ్యింది. మళ్లీ ఇదేం పరేషాన్ అని అందరూ అనుకుంట అటువైపు చూడంగనే మిలిటీట్రక్కులు కనబడినయ్. అండ్ల ఇనుప చిప్ప టోపీలు, ఖాకీ రంగు డిరస్సులు, భుజాల మీద యాల్లాడే 303 తుపాకీలు, కాళ్లకు బూట్లు కనిపించినయ్. ట్రక్కు క్యాబిన్ మీద చిన్నసైజు ఫిరంగి ఫిట్ చేసి ఉంది. టైర్లమీద ఎర్రటి దుబ్బమన్ను ఫుల్లుగ నిండిపోయి ఆ ట్రక్కులు చాలా దినాలా నుండి చాలా దూరం నుండి దేశదేశాలు తిరిగి వస్తున్నట్లు చూడంగనే వాల్లకు తెల్సిపోయింది. అవి లాల్ ఖిలా నుండి ఉక్కుమనిషి సర్దార్ పటేల్ పంపిన సైన్యాలని వాల్లకేం తెలుసు? హైద్రాబాద్ స్టేట్ బార్డర్‍లల్ల – గుల్బర్గా, రాయచూర్, షోలాపూర్, బీదర్, బీడ్, పర్బనీ, నాందేడ్, ఔరంగాబాద్ బార్డర్‍లల్ల నైజాం సైన్యం, రజాకార్ దళాల్ని తమ ఉక్కు పాదాల క్రింద తొక్కి, నలిపి, నాశనం చేసి పట్నాన్ని పట్టుకునేందుకు పోతున్న యూనియన్ సైన్యాలని వాల్లకేం తెలుసు?
ఆ ట్రక్కులల్ల నుండి దబ్బుదబ్బున క్రిందికి దుంకుతున్న మిలిట్రీని చూడంగనే వాళ్లు సోయిలకు వచ్చిండ్రు. మామూలు పోలీసు జవాన్నో లేకపోతే అమీన్‍సాబ్‍నో చూస్తునే పంచెలు తడుపుకునే ఆ అనాడీలు మిలిట్రీ కనబడంగనే దస్కుతిని కలుగులకు దూరిన ఎలకల్లాగ తమ ఇండ్లల్లకు జొర్రి తలుపులు బిగ్డాయించు కున్నరు.
సైన్యం ఊరి మధ్యల నిలబడి ఒక వర్గం గుండెలలో భయాన్ని సృష్టించి ఇంకో వర్గం మనస్సులలో భరోసాను కల్గించే ఆలోచనతో తొలుత ఆ ఊర్ల కనబడుతున్న ఆకుపచ్చ మసీదు గుంబజ్‍ను ఫిరంగితో పేల్చేసిండ్రు. ఆ రాత్రి వాండ్లు జరుపబోయే హింసాకాండకు ఆ చర్య నాందీప్రస్తావన అయ్యింది. ఓడిపోయిన శత్రుదేశంపై గెలిచిన సైన్యానికి విజయోన్మాదం తలకెత్తితే ఏం జరుగుతుందో ఆ రాత్రి ఆ ఊర్ల అదే జరిగింది.
మసీదు గుంబజ్ తునాతునకలు కాంగనే ఆ హమ్లా ఎవరిమీదనో ముస్లింలకు ఖుల్లంఖుల్లగా సమజయిపోయింది. ఎవరి ప్రాణాలు వాళ్లు అరచేతులల్ల పెట్టుకుని ఇంటెనక తలుపులు తీసి ఊరి బయటి పొలాలల్లకు ఉరికిండ్రు. వయసుల ఉన్న వాళ్లు అట్ల తప్పించుకుంటే ఇగ ఇండ్లల్ల ఆడోళ్లు, పిల్లలు,
ముసలోళ్లు మిగిలిపోయిండ్రు. ఇరవై ఏండ్ల జాఫర్ భీ అన్నతో కల్సి అడివిలకు పరారయ్యిండు. కాని ఏం ఫాయిదా? మిగిలిన కుటుంబం మాత్రం బర్బాద్ అయిపోయింది.
జాఫర్ వొదినా, అమ్మతోపాటు ఊర్ల ఉన్న ముస్లిం ఆడోళ్లందరు అన్యాయానికి గురయ్యిండ్రు. జాఫర్ అబ్బాజాన్‍తో పాటు మరికొందరు మిలిట్రీకి చిక్కితే వాళ్లందర్ని వరుసగా నిలబెట్టి లుంగీలు విప్పి ముస్లింలేనని నిర్దారణ చేసుకున్నంక కాళ్లు చేతులు బిగించికట్టి నిండుగ నీళ్లున్న మోటబావులల్లకు విసిరేసిండ్రు. ముస్లింలందరూ రజాకార్లు కాదని, నిజాం నవాబు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని అమాయకులని ఆ సైన్యం ఆలోచించ లేదు. ఆ సైనికులలో ఎక్కువ మంది పంజాబి సిక్కులు. దేశ విభజన చేసిన గుండె గాయాలను వారు ఆ అమాయక ముస్లింలపై చేసే దుర్మార్గం ద్వారా మాన్పుకోవాలని అనుకున్నారు. చేసేదంతా చేసింతర్వాత ఆ ఊరి మాలి పటేల్, పోలీస్ పటేళ్లకు హుకుం జారీ చేసి కోళ్లు, మేకలు కోయించుకుని సుష్టుగా తిని మర్నాడు పట్నంవైపు ఆ పటాలం ప్రయాణమయ్యింది.
మిలిట్రీ ఊరు విడిచిందన్న సంగతి తెల్సుకుని అప్పటి వరకు చెరుకు తోటలల్ల, జొన్న చెల్కలల్ల దాక్కున్న ముస్లింలందరూ ఆ అన్నా తమ్ముళ్లతో సహా ఊర్లకు తిరిగి వచ్చిండ్రు. ముస్లింల వాడకట్టు అంతా బర్బాద్ అయిపోయింది. ఖబరస్తాన్ వోలె కనబడుతుంది. మొగోళ్ల శవాలు మో•బావులల్ల తేలితే బ్రతికున్న ఆడ శవాలు మాత్రం కుళ్లి కుళ్లి ఏడుస్తున్నాయి. ఊరు ఊరంతా ఏడ్పులు, అర్పులతో నిండిపోయింది. కాని ఆ దుఃఖగాథ అంతటితో అయిపోలేదు.
ఆ పగటిపూట మరొకటి మిడతల దండు ఊరిమీద ఇర్సుకపడింది. వాండ్లు మరట్వాడా ప్రాంతం నుండి వచ్చిన హిందూ గుండాలు. ఆ గుంపు గుర్రాల మీద వచ్చింది. చేతులల్ల తల్వార్లు, జంబియాలు, లాఠీలు, తాళ్లు, దొరికిన ముస్లిం మగవాండ్ల తలలను తేజ్ తల్వార్లకు బలిఇచ్చిండ్రు. ఇండ్లల్లకు చొచ్చుకొచ్చి వెండి బంగారాన్ని మూటగట్టుకున్నరు. తాళ్లతో ఆడవాండ్లను మూటల్లాగ కట్టి గుర్రాల మీద అడ్డంగా వేసుకుని తమదేశంవైపు మెరుపు తీగల్గా మాయమయ్యిండ్రు. తర్వాత దినాలల్ల ఆ ఆడోళ్లను అందరూ కల్సి ఉమ్మడి వొస్తువుల్లాగ వాడుకున్నరు. ఇండ్లల్ల కట్టుబానిసల్లాగ పెట్టుకున్నరు. వస్తుమార్పిడుల్లాగ అమ్ముకుని అనేక గ్రామాల సరిహద్దుల్ని దాటించిండ్రు. కొందర్ని బలవంతంగా హిందూమతంలకు మార్పించి హిందూ స్త్రీల పేర్లు వారికి పెట్టిండ్రు. వాడుకుని వాడుకుని యాష్టకొచ్చినప్పుడు దోస్తులకు నజరానాలుగ సమర్పించుకుండ్రు. ఆఖరికి అండ్ల కొందరు అంగడిబొమ్మలుగ మారి రోగాలు, నొప్పులతో నవిసి, నవిసి చచ్చిపోయిండ్రు. జగన్నాథ రథ చక్రాలక్రింద విరిగిన చీమలకాళ్ల చప్పుళ్లు ఎవరు వింటారు? ఆ ‘షైతాన్ కా దౌర్’లో ఒక ఘోర దృశ్యాన్ని మాత్రం ఆ ఊరి ప్రజలు ఎన్నడూ మరిచిపోలేదు. (తరువాయి వచ్చే సంచికలో)
-పరవస్తు లోకేశ్వర్, ఎ: 91606 80847