జ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి విద్యారంగమే కీలకం

మానవ జీవితంలో ప్రయారిటీస్‍ అంటే ప్రాధాన్యతలు ప్రధాన పాత్ర వహిస్తాయి. రాజకీయ నిర్మాణం యొక్క ప్రయారిటీస్‍ విధి విధానాల తయారీని, అమలును నిర్ణయిస్తాయి. మన అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికలు – అధికారాలకు యిచ్చే ప్రయారిటీ ప్రజల మౌలిక అవసరాలకివ్వడంలో ఆసక్తి కలిగిలేవు. అలా ప్రయారిటీ యివ్వని రంగాలలో విద్యారంగం ముఖ్యమైనది.


ఆరోగ్యవంతమైన, జ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి తొలి, ప్రాధమిక సాధనం విద్య. అందరికీ విద్య రాజ్యాంగం యిచ్చిన చట్ట బద్ధమైన హక్కు. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య ఆనాటి మన ఉద్యమ వాగ్దానం. ఒక భరోసా మన విద్యా ప్రయాణం. ఆ దిశగా సాగవలసి వుంది. దేశవ్యాప్తంగా జరిగిన నేషనల్‍ అచీవ్‍మెంట్‍ సర్వే యిచ్చిన నివేదికలోని అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయి. మౌలిక వసతులు, అభ్యాసన ఫలితాలు, పాలనా పక్రియ, విద్యార్థుల నమోదు, ఉపాధ్యాయులకు విద్యాశిక్షణ వంటి ఆరు అంశాలలో వివిధ రాష్ట్రాల కంటే మన రాష్ట్రం వెనుకబడి వుంది. ఇది ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రయివేట్‍ విద్యా సంస్థలకూ వర్తిస్తుంది.


నాణ్యమైన విద్యాలోపం, భాషా, గణిత శాస్త్రాల నైపుణ్య లోపం భావితరాలకు పెనుముప్పుగా ఉన్నాయి. వీటి గురించి క్షేత్రస్థాయిలో ఆలోచించాలి. జవాబుదారీతనం కలిగిన నిర్మాణాత్మక విధి విధానాల రూపకల్పన, ఆచరణ ద్వారా వీటిని అధిగమించగలం. వాస్తవ పరిస్థితులను గుర్తించి తగు మార్పులకు కృషి చేయగలిగిన నిబద్ధత, నిజాయితీ కలిగిన యంత్రాంగం ఏర్పాటు కావాలి. ఇవి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు చేయాలి. ఇందులో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ ప్రతినిధుల ప్రాతినిధ్యం, భాగస్వామ్యం ఉండాలి. విద్యారంగం పనితీరును ఈ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ వుండాలి.


భవిష్యత్‍ అవసరాలకు తగినట్టు పాఠశాలలను ఏర్పాటు చేయాలి. తగిన భవనాలను నిర్మించాలి. దాని కనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ, మైనారిటీ విద్యార్థులకు, బాలికలకు హాస్టల్స్ నిర్మించి తగిన సిబ్బందిని, సెక్యూరిటీ స్టాఫ్‍ను నియమించాలి. బోధనాసిబ్బందిని బోధనేతర సిబ్బందిని, సబ్జెక్ట్ టీచర్స్ను నియమించాలి. రిటైర్‍మెంట్‍తో ఖాళీలైన పోస్ట్లను వెంటనే భర్తీ చేయాలి. వాష్‍రూమ్‍లను, టాయిలెట్లను నిర్మించడమే కాక వాటి నిర్వహణకు సిబ్బందిని కేటాయించాలి. మధ్యాహ్న భోజనశాలను, సిబ్బందిని కేటాయించాలి. ఆరోగ్యవంతమైన, బలమైన ఆహారాన్ని అందించాలి. విద్యార్థుల మానసికాభివృద్ధికి అవసరమైన గ్రంథాలయం, విద్య, సాహిత్య, సాంస్క•తిక కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యత యివ్వాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి విముక్తి కలిగించి వారిని తరగతి గదులకే పరిమితం చేయాలి. బోధనలో నైపుణ్యత కొరకు శిక్షణా తరగతులను తరచుగా నిర్వహిస్తూ వుండాలి. దీనికి తగినంతగా ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్‍లో విద్యారంగానికి 20 శాతం నిధులను కేటాయించాలి.


ఇవన్నీ సక్రమంగా జరిగిన రోజున ఉన్నత విద్యాప్రమాణాలు, నైపుణ్యాలు పెరిగి జ్ఞానవంతమైన సమాజం ఏర్పడుతుంది.

(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *