ఆణిముత్యం, కడిగిన ముత్యం, ముత్యాల సరాలు ఇలా స్వచ్ఛమైనవి, అందమైనవాటిని ముత్యాలతో పోలుస్తారు. ముత్యాలు ఇలా ఆభరణాలలోనే కాకుండా మన నాగరికత మరియు జీవనవిధానంలో భాగంగా మారాయి. సాధారణ జనానికి కూడా ఇంత దగ్గరగా ముత్యాలు ఉండడానికి వాటి లభ్యతలో సులువు, రత్నాలకన్న తక్కువధరలో దొరకటం, మరియు వాడకానికి పెద్దగా ప్రాసెసింగ్ మరియు cutting వంటి పనులులేక పోవటం ముఖ్య కారణాలు.
ముత్యాలు భారతదేశంలో వేద కాలం నుండి సుపరిచితాలు. వీటిని కువలం, మౌక్తికం అనే పేర్లతో కూడా వ్యవహరిచేవాళ్ళు. 2250 BC నాటికి చైనాలో వీటి వాడకం ఉండేది. ఈజిప్ట్, రోమన్ నాగరికతలకు కూడా ఇవి సుపరి చితాలు. భారతదేశ సాహిత్యంలో వీటిని నవరత్నాలలో ఒకటిగా, మహారత్నంగా గుర్తించారు. వరాహ మిహిరుడు పేర్కొన్న 22 రత్నాలలో ముత్యం కూడా ఉన్నది.
వరాహమిహిరుని బృహత్సంహిత ప్రకారం ‘‘ద్వీప భుజగ శుక్తి శంఖాభ్రవేణు తిమిసూకర ప్రసూతాని ముక్తఫలాని తేషాం బహుసాధు చ శుక్తిజం భవతి’’
‘ముత్యాలు ఏనుగుల కుంభము, పాము నోరు, ముత్యాల అల్చిప్ప, శంఖం, మేఘాలు, వెదురు కణుపు, తిమింగలాలు మరియు వరాహాల కోరలలో’ ఉంటాయి. వీటన్నిటిలో ఆల్చిప్పలో లభించే ముత్యాలు శ్రేష్ఠమైనవి. ఇది మన పూర్వీకుల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. కాని, ఇది నిజం కాదు. చెట్లు మరియు మేఘాలు ఎటువంటి ముత్యాలను ఉత్పత్తి చేయలేవు. పందులు, ఏనుగులు మరియు పాములు వంటి జంతువులు కూడా ముత్యాలు ఇవ్వవు.
‘‘మత్స్యమణి’’గా విక్రయించబడే రత్నం వాస్తవికతను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సాహిత్యంలో పేర్కొన్న ‘‘తిమిమణి’’ కూడా ముత్యం కాదు, బహుశా అది అధిక విలువ కలిగిన తిమింగలాల వాంతి (Whale Vomit) కావచ్చు.

వరాహమిహిరుడు సింహళ, పరలోకం, సౌరాష్ట్రం, తామ్రపర్ణి, పర్షియా, ఉత్తరదేశం, పాండ్య, వాకాటక మరియు హిమాలయాలు ముత్యాలు దొరికే ప్రదేశాలుగా పేర్కొన్నారు. ఈ జాబితాలో ముత్యం దొరికే ప్రాంతాలు మరియు ముత్యాల వ్యాపార కేంద్రాలు కలిపి పేర్కొనబడ్డాయి.
పరలోకం అనే ప్రదేశానికి సంబంధించి భౌగోళిక స్పష్టత లేదు. ఈ ప్రదేశం బహుశః బంగాళాఖాతంలో దూరపు ద్వీపాలు కావచ్చు.
పురాతనకాలంలో, ఆల్చిప్పలు కాకుండా ఇతర జంతువులలో ఇంకా ఇతర విధాలుగా ముత్యాలు పుడుతాయని నమ్మేవారు. అదే నమ్మకాన్ని వరాహమిహిరుడు కొనసాగించాడు.
నమ్మకం ఎలా ఉన్నప్పటికీ, ముత్యాలు మొలస్క్ల నుండి, ఎక్కువగా ద్వికవాటియులు ఓస్టెర్ (oyster), మస్సెల్స్ (వీmussels) కొన్ని రకాల శంఖాల నుండి ఉద్భవిస్థాయి. మొలస్కాన్ షెల్ యొక్క శరీర కుహరంలోకి ఇసుక వంటి ఏదైనా బయటి కణాలు ప్రవేశించి నప్పుడు, జీవి కాల్షియం కార్బోనేట్ మరియు కాంచోలిన్ అనే ప్రోటీన్‍తో కూడిన ముత్యపుపొరను స్రవిస్తుంది. ఇది దాని శరీరాన్ని రక్షించు కోవడానికి ఒక రక్షణ యంత్రాంగం. ఈ ముత్యపు (nacreious) పొర ఆ బయటి రేణువు చుట్టు అనేక పొరలుగా ఏర్పడి ముత్యంగా మారుతుంది. రసాయన పరంగా ఇది కాల్షియం కార్బోనేట్, అరగోనైట్‍తో కూడిన జీవఖనిజం మరియు ప్రోటీన్ వంటి జీవ స్థూల అణువుల కలయిక. ఈ పొర మెరుస్తు గట్టిగా, కంటికి ఇంపుగా ఆకర్షణీయంగా ఉంటుంది.
Melo Melo Pearls:
ఇవి వోలుటిడే (volutidae) గ్యాస్ట్రోపాడ్స్లో తయారయ్యే ముత్యాలు. ఇవి ఒక్కొక్కసారి నారింజరంగులో ఉండవచ్చు. వీటిని ‘‘మెలో ముత్యాలు’’ లేదా ‘‘డ్రాగన్ ముత్యాలు’’ అంటారు. ఇవి నాక్రియస్ లేని (non nacreious) ముత్యాలు. ఈ ముత్యపు ఉపరితలంపై జ్వాలలు నర్తిస్తున్నట్లుగా కనిపించే వాటి క్లిష్టమైన నమూనాల కారణంగా ఇవి అత్యంత విలువైన ముత్యాలుగా కీర్తించబడ్డాయి. పింగాణీ వంటి ఆకృతి మరియు ఉపరితలం యొక్క మృదువైన అనుభూతి ఈ ముత్యాల యొక్క మరొక ప్రత్యేకత.
మెలో-మెలో ముత్యాలు కంబోడియా, థాయిలాండ్, మయన్మార్, అండమాన్ సముద్రంలో దొరుకుతాయి. ఒక అరుదైన రకం ‘మెలో పెర్ల్’ 2010లో క్రిస్టీ వేలం హౌస్‍లో $ 7,22,500కు విక్రయించబడింది.

ఆల్చిప్ప (ద్వికవాటిక-Bivalves)లలో దొరికే ముత్యాలు ముత్యాల పరిశ్రమకు ముఖ్య ఆధారాలు. ఇప్పుడు వీటిని సముద్రం నుంచి సంగ్రహించడమే కాకుండా సాగు చేస్తున్నారు. ఉప్పునీటిలో, మంచినీటిలో కూడా సాగు చేస్తారు. కృత్రిమ పద్ధతుల ద్వారా వివిధ రంగుల ముత్యాలను కుడా ఉత్పత్తి చేస్తున్నారు.
దక్షిణ సముద్రపు ముత్యాలు ముత్యాల పరిశ్రమలో కీలక పాత్రను వహిస్తాయి. తాహితీ ముత్యాలు జపాన్ (Akoya) ముత్యాలు బసరా ముత్యాలు ముత్యాలలో చాలా విలువైనవి.
మార్కెట్‍లో లభించే ముత్యాలు ముఖ్యముగా మూడు రకాలు:
అవి
1.కృత్రిమమైనవి
2.సహజమైనవి మరియు
3.సాగు చేయబడ్డవి
తెలుపు రంగురంగుల ‘‘గిగా పెర్ల్’’గా ప్రసిద్ధమయిన ముత్యం అతిపెద్దదిగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. దీని బరువు 27.65 కిలోలు 22.86 ఐ20.95 కొలతలు. ఇంతకు ముందు ప్రపంచ రికార్డుగా Lao Tzu అనే ముత్యం
ఉండేది.
ముత్యాలు సాధారణంగా తెలుపు రంగులో, మృదువుగా చంద్రకాంతి వలె ఉంటాయి. ఇప్పుడు ముత్యాలు వివిధ రంగులలో కూడా లభిస్తున్నాయి. నీలం రంగు ముత్యాలు చాలా అరుదైనవి మరియు విలువైనవి.
ఆకారాన్ని బట్టి ముత్యాలను
సీడ్ ముత్యాలు
బియ్యం ముత్యాలు
గుండ్రటి ముత్యాలు
బటన్ ముత్యాలు
నాణెం ముత్యాలు
పొక్కు (Blister) ముత్యాలుగా పేర్కొంటారు. ఇంకా
మంచినీటి ముత్యాలు
ఉప్పు నీటి ముత్యాలు,
తాహితీయన్ ముత్యాలు
బరోక్ ముత్యాలు,
కేశి ముత్యాలు మొదలైనవి భారతదేశ మార్కెట్‍లో లభిస్తున్నాయి.

The City of Pearlsగా హైదరాబాద్:
హైదరాబాద్‍ను ‘‘ముత్యాల నగరం’’గా పిలుస్తారు. హైదరాబాద్ ముత్యాల పరిశ్రమకు ఒక ముఖ్య కేంద్రం గా గత 400 సంవత్సరాల నుండి పేరు గాంచింది. ఇక్కడి పాలకులు రత్నాలు వజ్రాల పరిశ్రమతో పాటుగా ముత్యాల పరిశ్రమను కూడా ప్రోత్సహించారు.
హైదరాబాద్‍కు దగ్గరలో తూప్రాన్ వద్ద ఉన్న చందాపేట ముత్యాల డ్రిల్లింగ్ మరియు ప్రాసెసింగ్‍కు ప్రసిద్ధి. ఈ గ్రామంలోని నైపుణ్యం కలిగిన కార్మికులు ముడిసరుకు నుండి ఆభరణాలకు ఉపయోగపడే విధంగా ముత్యాలను తయారు చేస్తారు.

దీని కోసం ముత్యాలను 4 రోజులు ఉడకబెడతారు. ఆపై వాటిని హైడ్రోజన్ పెరాక్సైడ్ నీరు మరియు ఈథర్ ఉన్న గ్లాస్ బాక్స్ లో ఉంచుతారు. ఈ పక్రియకు ముందు ముత్యాలను 4 లేదా 5 రోజుల పాటు అద్దపు అడుగు కలిగిన గాజు పెట్టెలో ఎండబెట్టడం జరుగుతుంది. చివరగా ముత్యాలను శుభ్రంగా కడుగుతారు . తరువాత వాటి పరిమాణం మరియు ఆకృతి ప్రకారం వేరుచేయబడతాయి. ముత్యాలు వాటి రంగు మరియు మెరుపును బట్టి వర్గీకరించబడతాయి.
చందాపేట పనివారు అనుసరించే బ్లీచింగ్ టెక్నిక్ దేశ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ప్రస్తుతం ముంబై ముత్యాల పరిశ్రమకు కీలకంగా ఉంది. ముత్యాల రిటైల్ విక్రయాలకు హైదరాబాద్ పెద్ద వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది.
ముత్యాల ఉపయోగాలు:
వీటిని అలంకారాలు మరియు ఆభరణాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. నవరత్నాలలో భాగం కావడం వల్ల అవి జ్యోతిష్య ప్రయోజనాలకు ఉపయోగ పడతాయి. మదర్ ఆఫ్ పెర్ల్ (MOP) అనేక రకాల అలంకరణలు, బటన్లు మొదలైన వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముత్యాలను వస్త్రాల తయారీకి కూడా ఉపయోగిస్తారు. ముత్యాలు మరియు వాటి ఉత్పత్తులను సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు.

ముత్యాలలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని మానసిక వ్యాధి, నిద్రలేమి, చర్మ వ్యాధి, స్త్రీ సంబంధిత సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు క్షయవ్యాధిని నయం చేయడంలో సహాయపడే ఔషధ ఉపయోగాలు ఉన్నాయి. వీటిని చైనీస్ ఔషధం అంటారు. ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. మెటాఫిజికల్ ఉపయోగాలు కూడా ఉన్నాయి.
ముత్యాల గురించి మరికొన్ని వాస్తవాలు:
ఇతర రత్నాలతో పోలిస్తే ముత్యాల చుట్టూ చాలా నమ్మకాలు ఉన్నాయి. ముత్యాలు కాని రాళ్లను కుడా ముత్యాలుగా వ్యవహరిస్తారు.Durr Al Najaf (Pearl of Najaf) ఆనే గాజు వంటి స్పష్టమైన రత్నాలు క్వార్టజ్ కుటుంబం లోనివి, ఇవి వాది అల్ సలామ్ అనే ప్రదేశములో దొరుకుతాయి. వాటి పోలిక కారణంగా ముత్యం అనే పదం వాటికి వాడబడ్డది.
గుహ ముత్యాలు (Cave Pearls)గా వ్యవహరించబడేవి గుహలలో కనిపించే కాల్షియం కార్బోనేట్ గోళాకారాలు స్టాలక్టైట్స్ వంటి పదార్థాలు. అవి ముత్యాలకు సంబంధించినవి కావు .
ముత్యాల తలంబ్రాలు:
శ్రీరామనవమి పండుగనాడు జరిపే రాముని కళ్యాణోత్సవంలో తలంబ్రాలుగా ముత్యాలను వాడుతారు. భద్రాచల రాముని కళ్యాణోత్సవంలో ముత్యాల తలంబ్రాలు ప్రసిద్ధం. భదాద్రి రామకల్యాణంలో ముత్యాల తలంబ్రాలు హైదరాబాద్ నుంచి ప్రభుత్వ లాంఛనంగా సమర్పించటం కంచర్ల గోపన్న కాలం నుండి ఈనాటి వరకు కొనసాగుతున్న ఆనవాయితీ. ఇది హైదరాబాదుకు ముత్యాల పరిశ్రమతో ఉన్న అనుబంధానికి అద్దం పడుతోంది.
-చకిలం వేణుగోపాలరావు,
డిప్యూటి డైరెక్టర్ జనరల్ జిఎస్సై(రి)
ఎ: 9866449348
శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698