గత సంచికలో మనం ముడుమాల నిలువురాళ్ళ ప్రాముఖ్యాన్ని గురించి అక్కడ రాళ్ళపై చెక్కిన సప్తర్షి మండలం, సింహారాశి, ధృవ నక్షత్రం గురించి తెలుసుకున్నాం. ముడుమాల నిలువురాళ్ళ అధ్యయనం డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ స్టేట్ మరియు దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరిశోధన నిరంతరాయంగా సాగు తున్నది. జనవరి నెల 10, 11 తారీఖులలో ముడుమాల నిలువు రాళ్ళ ప్రాంతాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలలోను డ్రోను సాయంతో నిశిత పరిశోధన, చిత్రీకరణ, శాస్త్రీయ పద్ధతిలో చేపట్టడం జరిగింది. ఈ డ్రోన్ పరిశోధన వలన మనకు ఇంకా ఎన్నో కొత్త విశేషాలు బయటపడే అవకాశం ఉంది. అదే కాకుండా ఈ డ్రోన్ చిత్రాలు మనకు ఈ మొత్తం ప్రాంతం యొక్క శాశ్వత రూపాన్ని నేడు ఎలా ఉన్నదో అలా ఫోటో వీడియో రూపంలో భద్రపరచడం జరుగుతుంది. రాబోయే కాలంలో ప్రకృతి వైపరిత్యాల మూలంగానో లేక మానవ తప్పిదాల కారణంగానో ఈ చారిత్రక ప్రదేశానికి ఎంత చిన్న నష్టం జరిగినా అది గుర్తించడానికి, నష్టాన్ని సరిచేయడానికి ఉపయోగపడతాయి.
జనవరి నెల 17వ తారీఖున పరిశోధనా బృందం జుతీ. వేదకుమార్ మణికొండ గారి ఆధ్వర్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణా డైరెక్టర్ శ్రీమతి భారతి హోళికేరి, IAS గారిని కలవటం జరిగింది. ఈ సమావేశంలో ప్రొ।। కె.పి.రావు, శ్రీ సూర్యనారాయణ మూర్తి మరియు డక్కన్ హెరిటేజ్ ట్రస్టు సభ్యులు డైరెక్టరు గారికి ముడుమాల నిలువురాళ్ళ చారిత్రక విశిష్టత, దాని ప్రత్యేకతలు ఫోటో ప్రదర్శన ద్వారా వివరించడం జరిగింది. వారికి గత సంవత్సరం జూన్ నెల నుండి ముడుమాల ప్రాంత పరిశోధనకు, పరిరక్షణకు డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ బాధ్యతలు చేపట్టిన పిదప చేపట్టిన చర్యలను ట్రస్ట్ చైర్మన్, ప్రాజెక్టు హెడ్ అయిన Er. వేద కుమార్ మణికొండ వివరించడం జరిగింది.
ముడుమాల ప్రాంత చరిత్ర సమగ్ర అధ్యయనానికి పురాతత్వ త్రవ్వకాలు (Excarvations) చేపట్టవలసిన అవసరం వుంది. ఈ త్రవ్వకాలతో మనకు ముఖ్యంగా ముడుమాలలో ఉన్న సమాధుల కాల నిర్ణయం ఖచ్చితత్వంతో తెలుసుకునే అవకాశం వుంది. ఈ త్రవ్వకాలలో మనకు మృణ్మయ పాత్రలు, ఇనుప, తామ్ర వస్తువులు, మానవ అస్తిపంజరాలు లేదా వాటి భాగాలు బయటపడే అవకాశం వుంది. వీటి ఆధారంతో ఇక్కడ నివసించిన మన పూర్వీకుల చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేయటానికి అవకాశం ఉందని సమావేశంలో చర్చించారు. మరియు నారాయణ పేట జిల్లా కలెక్టరు శ్రీ కోయా శ్రీహర్ష, IAS గారు అందిస్తున్న సహకారాన్ని DHAT వారు తెలియజేసారు.
- డా।। చిట్టూరి ప్రవీణ్ రాజు
ఎ : 8978381209