ఉద్యోగం అనేది వ్యక్తులలో మానసికంగా భద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, సమాజంలో గుర్తింపును, స్థాయిని సమకూర్చి పెడ్తే అదే నిరుద్యోగం వ్యక్తులలో అభద్రతా భావాన్ని అధైర్యాన్ని, ఆత్మవిశ్వాసం లేకపోవడాన్ని కల్గిస్తుంది. అందుకే ఆధునిక సమాజంలో మనిషికి ఉద్యోగం అనేది క్రమంగా ఓ జీవనాధారంగా పరిణామం చెందింది. ఉద్యోగాల కోసం ప్రతి నిరుద్యోగి ప్రయత్నించడం సహజం. ఉద్యోగాలు లభించిన కుటుంబాలు ఆనందంగా సుఖశాంతులతో ఉంటే నిరుద్యోగుల కుటుంబాలు నిరాశ నిస్ప•హలతో అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతయి. ఉద్యోగం సగటు మనిషి జీవితానికి భద్రత కల్పిస్తుంది. అందుకేనేమో ఉద్యోగం పురుష లక్షణమని పలువురు వ్యాఖ్యానించింది. ఉద్యోగాలు ఒక్క ప్రజాస్వామ్య వ్యవస్థలోనే కాదు ఉండేది. రాచరిక వ్యవస్థలో కూడా ఉంటాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికంగా ఉంటే రాచరిక వ్యవస్థలో తక్కువగా ఉంటయి అంతే తేడా. తెలంగాణ ప్రాంతం చరిత్రలో కొన్ని శతాబ్దాల కాలంపాటు, 1948 వరకు రాచరిక వ్యవస్థలో కొనసాగింది. 1948 వరకు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన బహమనీలు, కుతుబ్‍షాహీలు, అసఫ్‍జాహీలు తమ ప్రభుత్వ యంత్రాంగంలో స్థానిక తెలంగాణ వాసులను విస్మరించి వివిధ కారణాలతో స్థానికేతరులకు ఉద్యోగాలు కట్టబెట్టేవారు. దీన్ని స్థానిక నిరుద్యోగులు నిరసించి ఉద్యమబాట పట్టిన ఉదంతాలు కోకొల్లలు. వీరి కాలంలో ఉద్యోగాల కోసం స్థానిక మరియు స్థానికేతరుల మధ్య పోటీ తీవ్రంగా ఉండేది. ఈ తీవ్రమైన పోటీ స్థానికుల మరియు స్థానికేతరుల మధ్య వైషమ్యాలకు, వైరుధ్యాలకు, వివాదాలకు దారి తీసింది. స్థానిక మరియు స్థానికేతరుల మధ్య జరగిన ఈ వివాదాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ చరిత్ర క్రమములోనే బహమనీల, కుతుబ్‍షాహీల, అసఫ్‍జాహీల రాజ్యాలకు కాలదోషం పట్టింది.
ముల్క్ అనగా దేశం. ముల్కీ అనగా దేశీయుడు లేదా స్థానికుడు అని అర్థం. ముల్కీ ఉద్యమానికి దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. దక్కన్‍లో వివిధ రాజవంశాల కాలంలో అనేక ముల్కీ ఉద్యమాలు తలెత్తినయి. క్రీ.శ. 1294-1351 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యంపై ఢిల్లీని పాలించిన పాలకుల కన్ను పడింది. ఢిల్లీని పాలించిన అల్లావుద్దీన్ ఖిల్జీ, మహ్మద్‍బీన్ తుగ్గక్‍ల సైన్యాలు ఓరుగల్లును ఆక్రమించుకుని తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోగా వారి సైన్యంలోని కొంత సైన్యాన్ని దాని నాయకున్ని ఇక్కడే ఉంచి ఆ సైన్యాధిపతి ద్వారా పరిపాలన కొనసాగించేది. ఢిల్లీ సుల్తాన్ మహ్మద్‍బీన్ తుగ్లక్ ఢిల్లీ వెళ్ళిపోగానే తుర్కీ లేదా ఆఫ్ఘన్ సేనానాయకుడైన జఫర్‍ఖాన్ తిరుగుబాటు చేసి బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ తొలిముస్లిం రాజ్యం ఇదే. ఖీల్జీ, తుగ్గక్ సైన్యాలతోపాటు దక్షిణ భారత దేశానికి వచ్చి స్థిరపడిన వారినందరిని దక్కనీలు అన్నారు. బహమనీ సుల్తానుల కాలంలో వీరు దక్కనీలుగా అనగా స్థానికులుగా చెలామణి అయి అనేక పదవులు, ఉద్యోగాలు నిర్వహించారు. బహమనీలు కాలంలోనే ఇరాన్, ఇరాక్, అరేబియా, టర్కీల నుండి వచ్చి దక్కన్‍లో స్థిరపడ్డ వారిని అపాకీలు అనేవారు. దక్కనీలుగా పిలువబడ్డ స్థానికేతరులంతా షియాలు. వివిధ దేశాల నుండి వచ్చిన ఈ అపాకీలు వర్తక వాణిజ్యాలలో స్థిరపడి సైన్యంలో, ఉన్నత ఉద్యోగాలలో మంత్రిపదవుల్లో స్థిరపడ్డారు. దక్కనీలంతా రెండవ శ్రేణి పౌరులుగా చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునేవారు. క్రమంగా దక్కనీలు అపాకీల మధ్య అంతరాలు పెరిగి శతృత్వం ఏర్పడి మతవిభేదాలు కూడా పొడసుపినయి. బహమనీ పాలకుడైన ఒకటవ అహ్మద్‍షా 1422-25 కాలంలో ప్రధానిగా ఉన్న ఖలఫ్‍హసన్ బఫ్నీ అపాకీ కావడంతో అతను అపాకీలకు ఉన్నత పదవులు దక్కనీలకు చిన్న ఉద్యోగాలిచ్చేవారు.
దీన్ని జీర్ణించుకోలేని దక్కనీలు గుజరాత్ యుద్ధంలో అహ్మద్‍షాకు సహాయనిరాకరణ చేయడంతో అతను ఆ యుద్ధంలో ఓటమి పాలయ్యాడు. రెండవ మహ్మద్‍షా 1436-589 లలో దక్కనీల సహాయనిరాకరణతో శత్రువుల చేతిలో చిక్కి హతుడైనాడు. ఆ పిదప మూడవ మహ్మద్ షా 1463-1482 కాలంలో ప్రధానిగా ఉన్న మహ్మద్ గవాన్ కూడా ఆపాకీయే. ఇతను బీదరులో విశ్వవిద్యాలయాన్ని స్థాపించి అక్కడ బోధన బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థులందరిని అపాకీలనే నియమించారు. ఇతని కాలంలో అపాకీలకు దక్కనీలకు మధ్య వైషమ్యాలు వైరుధ్యాలు తారాస్థాయికి చేరుకున్నది. ఇలాంటి ముల్కీ గైర్ ముల్కీ అంతకలహాలు అనేకం జరిగి చివరికి 1525 లో బహమనీ రాజ్యం పతనమై ఐదు ముస్లిం రాజ్యాలు ఏర్పడ్డవి. అందులోనిదే గోల్కొండ కుతుబ్‍షాహీ రాజ్యం. కుతుబ్‍షాహీలు 1512-1687 వరకు గోల్కొండ ప్రాంతాన్ని పాలించారు. కుతుబ్‍షాహీలు అపాకీలే అయినప్పటికీ ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడంతో స్థానిక స్థానికేతరుల మధ్య వైరుధ్యాలు చాలా వరకు తగ్గాయి. ఈ స్థానికేతర రాజులను ప్రజలు స్థానికులుగానే పరిగణించారు. అందుచే వీరి కాలంలో ముల్కీ సమస్య తలెత్తలేదు.
అసఫ్‍జాహీలు మొగలు చక్రవర్తి ప్రతినిధిగా ఉత్తర భారతం నుండి వచ్చి స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. వీరికి ఉత్తర భారతీయులతో ఉన్న సంబంధాల పట్ల అనేక మంది ముస్లింలు లక్నో, ఢిల్లీ, ముర్షిదాబాద్, అవద్ ప్రాంతాలనుండి హైదరాబాదుకు వలసవచ్చి ఇక్కడి ఉద్యోగాలలో స్థిరపడిపోయారు. నిజాం ఉల్‍ముల్క్ అసఫ్‍జాహీ రాజ్యాన్ని 1724లో స్థాపించిండు. ఈయన వచ్చినప్పుడు అతనికి విశ్వాస పాత్రులైన పెక్కుమందిని ఇక్కడికి తీసుకొచ్చి వారికి జాగీర్లు కీలకమైన పదవులు కట్టబెట్టిండు. వీళ్లంతా స్థానికేతరులే. 1857లో సిఫాయిల తిరుగుబాటులో ఉత్తరభారతంలో కల్లోల పరిస్థితి ఏర్పడింది. అక్కడి వారికి శాంతియుత జీవన గడపడానికి దక్కన్ సురక్షిత ప్రాంతంగా కనిపించింది. అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన వారితోపాటు వృత్తివిద్యానిపుణులంతా హైదరాబాదుకు వలసవచ్చి వివిధ ఉద్యోగాలలో స్థిరపడిపోయినారు. నాల్గవ, ఐదవ, ఆరవ నిజాంల కాలంలో ఏకధాటిగా ముప్పది సంవత్సరాలు ప్రధానిగా ఉన్న సాలార్‍జంగ్ తన సంస్కరణల అమలుకై అలీఘర్ విశ్వవిద్యాలయం నుండి మరియు ఇతర ప్రాంతాలనుండి విద్యావంతులను హైదరాబాద్ రప్పించారు. ఆ క్రమములో వచ్చినవారే కాయస్థులు, ఖత్రీలు, బిల్‍గ్రాం, సఖ్వీ, మాధూర్, చటోపాధ్యాయ వంటి ప్రముఖ వంశస్తులు. మద్రాసు లాంటి ప్రాంతాలనుండి ఇంగ్లీషు పండితులు కూడా అప్పుడే రావడం జరిగింది. వలస వచ్చిన వారంతా ఇక్కడే స్థిరపడి వారు తమ బంధుమిత్రులందరిని ఇక్కడికి రప్పించి తమ పలుకుబడిని ఉపయోగించి వారికి ఉద్యోగాలను జాగీర్లను ఇప్పించారు. హైదరాబాద్ సంస్క•తిపై నాన్‍ముల్కీల ప్రభావం వారి ఆధిపత్య ధోరణిని పసిగట్టిన ఐదవ నిజాం అఫ్జలుద్దౌలా ముల్కీలను విద్యావంతులుగా తీర్చిదిద్ది వారినే ఉద్యోగాలలో నియమించాలని 1868 లో అభిప్రాయపడి అధికారులకు ఆదేశాలిచ్చారు. కానీ బ్రిటీష్ వాళ్ళ జోక్యంతో అతని ఆదేశాలు అమలు కాలేదు. దీన్ని ఆసరగా చేసుకుని దివాన్ సాలార్‍జంగ్ అనేక మంది స్థానికేతరులను ఉద్యోగాలలో నింపాడు. దీంతో ముల్కీలకు నాన్‍ముల్కీల మధ్య వైషమ్యాలు వైరుధ్యాలు పెరిగినవి. దీనికి తోడుగా ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ 1884 లో అప్పటివరకు అధికార భాషగా కొనసాగుతూ వచ్చిన పర్షియన్ స్థానంలో ఉర్ధూను అధికార భాషగా చేసిండు. అయితే నిజాం ప్రవేశపెట్టింది లిఖ్నవీ ఉర్ధూ. అది అపాకీలు వాడే భాష. స్థానికులది దక్కనీ ఉర్ధూ. ఇది లఖ్నవీ ఉర్ధూకు భిన్నమైంది. కోర్టుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో లఖ్నవీ ఉర్ధూనే వాడేవారు. ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంగ్లీషు పరిజ్ఞానం అవసరమని స్థానికులకు ఇంగ్లీషు పరిజ్ఞానం లేదనే మిషతో బయటి రాష్ట్రాలవారిని నియమించేవారు. చేసేది ఒకే ఉద్యోగమైనా స్థానికేతరులకు ఎక్కువ జీతాలిచ్చి స్థానికులకు తక్కువ జీతాలిచ్చే వారు. 1886 లో హైదరాబాద్ సివిల్ సర్వీసు ఉద్యోగుల్లో 246 మంది ముల్కీలుంటే 230 మంది నాన్‍ముల్కీలు.
ముల్కీ ఉద్యోగుల సంఖ్య నూటికి 52 వరకున్నా వేతనాలలో వారికి లభించిన వాటా 42 శాతం మాత్రమే. నాన్ ముల్కీల సంఖ్య నూటికి 48 మాత్రమే ఉన్నా వారికి వేతనాలలో లభించిన వాటా 58 శాతం వరకు ఉండేది. హైదరాబాదు రాజ్యంలో ఉర్ధూభాషకు సైతం ముల్కీ నాన్‍ముల్కీ గొడవలుండేవి. నాన్‍ముల్కీ ఉర్ధూ అంటే ఉత్తరాది లేదా లఖ్నవీ ఉర్ధూ అని దానినే బాబాయె ఉర్ధూ (ఉర్థూ పిత) అనేవారు. దీనికి డాక్టర్ అబ్దుల్ హక్ సారథ్యం వహించగా దక్కనీ ఉర్ధూకు డాక్టర్ ఖాదీర్ మొహియుద్దీన్ జోర్ సారథ్యం వహించేవారు. ఉత్తరాది ఉర్ధూను ఇదా-రే-అబాయత్ ఉర్ధూ అనే సంస్థ పోషించిగా, దక్కనీ ఉర్ధూను అంజుమన్ తరక్కీ ఉర్ధూ అనే సంస్థ పోషించేది. 1884-1894 మధ్యకాలంలో నాన్‍ముల్కీల పెరుగుదల ఉద్యోగాల్లో 48 శాతం నుండి 66 శాతానికి పెరిగింది. 1889 లో హైదరాబాద్ దివాన్‍గా బాధ్యతలు చేపట్టిన అస్మాన్‍జా ముల్కీలకు న్యాయం చేయలేకపోయాడని హైదరాబాద్ రికార్డు పత్రిక పేర్కొంది. 19వ శతాబ్దం చివరి నాటికి హైదరాబాద్ లోని ఉన్నత ఉద్యోగాలన్నీ నాన్‍ముల్కీల చేతుల్లోకి పోయినవి. ఉస్మానియా యూనివర్సిటీలో పాఠ్యగ్రంథాల అనువాదం కోసం ఏర్పడిన దారుల్ తర్జుమా ఉత్తరాది ఉర్ధూనే వాడేది. ఈ విశ్వవిద్యాలయంలోని బోధనా సిబ్బంది అంతా స్థానికేతరులే. స్థానిక, స్థానికేతర ఉద్యోగస్థులకు సంబంధించిన వివరాలు అధికారికంగా మనకు లభ్యమవుతుంది. 1886 నుండి మాత్రమే అంతకుముందు లేవు. స్థానిక తెలంగాణ ఉద్యోగస్థులలో అత్యధికం ముస్లింలు. స్థానికేతర ఉద్యోగస్థులలో కూడా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ముస్లింలు కాయస్తులే అధికం. స్థానికేతర ఉద్యోగస్థుల్లో బ్రిటీష్ ఇండియాలో తర్ఫీదు పొంది పదవీవిరమణ జేసిన ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగస్థులు, ఢిల్లీలో ముస్లిం రాజ్యం పతనం కావడంతో అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన అక్కడి ఉన్నత ఉద్యోగస్థులు మరియు ఆలిగడ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించిన వాళ్లు హైదరాబాదు రాజ్యంలోని ఉద్యోగాల కొరకు బారులు కట్టేవారు.
1884లో జరిగిన 421 నియామకాల్లో 274 మంది అంటే 65 శాతం స్థానికులు వాళ్ళ జీతభత్యాలు 37 శాతంగా ఉంటే మిగతా 147 మంది స్థానికేతరులు అంటే 35 శాతం వీళ్ల జీతభత్యాలు 63 శాతంగా ఉండేవి. 1894లో ప్రభుత్వం విడుదలచేసిన సివిల్ లిస్ట్ ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మొత్తం గెజిటెడ్ ఆఫీసర్లు 680 మంది వీరిలో స్థానికేతరులు 447 మంది స్థానికులు 233 మంది.
స్థానికులు సమర్థులు కారని పెద్దగా తెలివిగలవారు కాదని వారికి అధికారమిస్తే హైదరాబాద్ పాలనాయంత్రాంగం కుప్పకూలుతుందని స్థానికేతరులు వాదించేవారు. ఉన్నత ఉద్యోగాలలో వున్న ఈ స్థానికేతరులు కిందిస్థాయి ఉద్యోగాలకు తమ బంధుమిత్రులను తెచ్చుకుని నింపేవారు. దీంతో అప్పటికే అలిగడ్ ముస్లిం యూనివర్సిటీ బనారస్ హిందూ యూనివర్సిటీ మరియు నిజాం కాలేజీలలో ఆంగ్లమాద్యమంలో ఉన్నత విద్యనభ్యసించి వచ్చిన తొలితరం హైదరాబాద్ రాష్ట్ర విద్యావంతులకు సంస్థానంలో కొలువులు లభించుట దుర్లభంగా మారింది. హైదరాబాద్ స్టేటులో విద్యాబోధనంతా ఉర్ధూ మాధ్యమంలోనే కొనసాగేది. ప్రాథమిక స్థాయినుండి ఉన్నత విద్యవరకు అంతా ఉర్ధూ మాధ్యమంలోనే కొనసాగేది. ఉర్ధూ మాధ్యమంలో విద్యాభ్యాసం చేసిన వీరికి తాము పుట్టిపెరిగిన హైదరాబాద్ రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క పక్కరాష్ట్రాలకెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే మీవన్నీ ఉర్ధూ చదువులే దేనికి పనికిరాని చదువులని తిరస్కరించేవారు. 1910 లో నాటి ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేసింది. గైర్ ముల్కీల ఉద్యోగాలన్నీ తాత్కాలిక మైనవనీ, స్థానికులకు తగినన్ని అర్హతలున్నప్పుడు వారినే నియమించాలని స్థానికేతరులను నియమించరాదని పేర్కొంది. కానీ అనేక కారణాల వల్ల ఈ ఉత్తర్వులు అమలు కాలేదు. దాంతో నిరాశకు నిస్ప•హలకు లోనైన తెలంగాన ప్రాంతపు విద్యావంతులు స్థానికులకు ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వాలనే వాదనను లేవనెత్తారు. క్రమంగా స్థానికులకే ఉద్యోగాలివ్వాలనే నినాదం బలపడి 1910-1918 మధ్యకాలంలో ఉద్యమరూపం సంతరించుకుంది. బలపడుతున్న ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని నాటి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుర్దాద్ 1354 ఎఫ్‍లో (1919) ముల్కీ నిబంధనలను ప్రకటించారు. ముల్కీ అంటే స్థానికుడని, ప్రాంతంవాడని అర్థం.
ఈ ముల్కీ నిబంధనల ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలోని ఒకస్థాయి వరకు ఉద్యోగాలన్నీ స్థానికులకే చెందుతాయి. స్థానికేతరులు ఈ ఉద్యోగాలకు అనర్హులు. స్థానిక అభ్యర్థి అంటే ఇక్కడే పుట్టిపెరిగినవాడు లేదా కనీసంగా 15 సంవత్సరాల నుండి ఇక్కడే స్థిరనివాస మేర్పరచుకుని నివాస ముంటున్న వారు, తిరిగి తమ స్వస్థలానికి పోవాలనే ఆలోచన లేని వాళ్లు. అట్లాంటి వాళ్లు ఉద్యోగ విరమణ పిదపకూడా ఇక్కడే నివాసముంటామనే ప్రమాణపత్రాన్ని మెజిస్ట్రేటు నుండి పొందిన వారు మాత్రమే స్థానికులుగా లేదా ముల్కీలుగా పరిగణిం• •బడతారు. స్థానికేతరులను పెళ్ళిచేసుకున్న స్థానిక మహిళలు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నంతకాలం వాళ్లు స్థానికులుగానే పరిగణించబడతారు. పెళ్ళి పిదప స్వరాష్ట్రం వదిలి వేరే ప్రాంతానికి వెళ్లి మళ్లీ ఏవైన కారణాలవల్ల భర్త చనిపోయిన పిదపగానీ లేదా విడాకులు తీసుకునిగానీ వాళ్లు తిరిగి వెనక్కి వొస్తే వారిని ముల్కీలుగానే పరిగణిస్తరు. స్థానిక హైదరాబాద్ రాష్ట్ర నివాసి స్థానికేతర మహిళను పెళ్లిచేసుకుంటే అట్టి స్థానికేతర మహిళ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నంతకాలం స్థానికురాలిగానే పరిగణించ బడుతుంది. హైదరాబాదు రాష్ట్రంలో పనిజేసే స్థానికేతర ఉద్యోగస్థులు 15 సంవత్సరాలు ఇక్కడే నివాసముండి ఉద్యోగాల్లో కొనసాగితే వారి పిల్లలను స్థానికులుగా పరిగణిస్తరు. ఈ నిబంధనలన్నీ ఒకస్థాయి ఉద్యోగాలకే వర్తిస్తయి. గెజిటెడ్ ఉద్యోగాలకు ముఖ్యంగా పర్యవేక్షనాధికారాలతో కూడిన ఉన్నత ఉద్యోగాలకు వర్తించవు. అంతేగాకుండ కొన్ని ఉద్యోగాలకు స్థానిక అభ్యర్థులు దొరక్కుంటే స్థానికేతరులను నియమించుకోవచ్చు అనే మినహాయింపు ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నత ఉద్యోగాలలో వున్న స్థానికేతరులు ఈ ముల్కీ నిబంధనలలో ఉన్న లొసుగులను, మినహాయింపులను వాడుకుని ఉద్యోగాల్లో స్థానికేతరులను నింపేవారు.
- ప్రొ.జి.లక్ష్మణ్, ఎ : 9849136104