పరుల కోసం

పూర్వం క•ష్ణా నది ఒడ్డునున్న శేరు గూడెంలో రాఘవయ్యనే జాలరి నివసిస్తుండే వాడు. తనకు పిల్లలు లేరు. తెల్లవారు జామున్నే వల తీసుకొని నది వద్దకు వెళ్ళేవాడు. పడవ మీద నీళ్ళ లోకి వెళ్ళి, తను పెట్టిన మావులు, బుట్టలు చూసుకునే వాడు. వాటిల్లో పడ్డ చేపల్ని తీసి, పడవలో ఉన్న తాటాకు బుట్టలో వేసుకొని తిరిగి యధా స్థానంలో వాటిని పెట్టేవాడు. తరువాత నది మీద పడవలో తిరుగుతూ వల విసిరే వాడు. పడిన చేపల్ని పడవలో వేసుకొని బుట్ట నింపుకునే వాడు.


నాలుగు బారల పొద్దెక్కే సరికి, భార్య కాంతమ్మ అన్నం తీసుకొని నదివద్దకు వచ్చేది. తను రాగానే వేట చాలించి, పడిన చేపలతో పడవను ఒడ్డుకు తెచ్చేవాడు. కాంతమ్మ కొర్రమట్ట, చిత్తర, వాలగ వంటి పెద్ద చేపల్ని ఒక బుట్టలో వేసేది పట్నంలో అమ్మడం కోసం. పరకలు, జెల్లలు వంటి చిన్న చేపల్ని గిన్నెలో వేసి, పక్కనే ఉన్న బండ మీద ఎండ బెట్టేది. తను చేపల్ని వేరు చేస్తుండగానే, అన్నం తినేవాడు రాఘవయ్య.
అప్పటికే నది పక్కన ఉన్న రావి చెట్టు కింద, పట్నం వెళ్ళడం కోసం ప్రయాణీకులు ఎదురు చూస్తుండే వారు. వారికి రాఘవయ్య పడవ తప్ప, నది దాటెందుకు వేరే అవకాశం లేదు. ఆలశ్యం కలిగినందుకు క్షమాపణలు చెప్పుకొని, పడవ వేసేవాడు. అందరూ పడవ ఎక్కగానే, తెడ్డు వేస్తూ నదిని దాటించే వాడు. వాళ్ళు దయతో ఇచ్చిన పదో, పరకో తీసుకునే వాడు. ఎవరినీ బలవంత పెట్టేవాడు కాదు. అందరూ తమ గ్రామం వారే కావడంతో, ఇంటికి పిలిచి కందులో, పెసలో, కూరగాయలో, పాలో, పెరుగో ఏదో ఒకటి ఇచ్చేవారు రాఘవయ్య దంపతులకు. ‘పాపం మనకోసం రోజూ పడవ వేసి, సాయపడుతున్నాడు కదా. అతని రుణం మనం ఉంచుకోకూడదు’ అని గ్రామస్తులు భావించుకునే వారు. భార్యా, భర్తలిద్దరూ గ్రామస్తులకు తలలో నాలుకలా మెలిగే వారు.


పట్నంలో చేపలు అమ్మేసి, ఇంట్లోకి కావలసిన సరంజామా తీసుకొని తిరిగి సాయంత్రం నది వద్దకు చేరుకునే వాడు రాఘవయ్య. అప్పటికే పక్క ఊళ్లలో పనులు ముగించుకొని వచ్చిన వారంతా, వేప చెట్టు కింద ఎదురు చూస్తుండే వారు. వారిని పడవలో ఎక్కించుకొని నదిని దాటించే వాడు.
అదే గ్రామంలో చలమయ్యనే వ్యాపారి ఉండేవాడు. నిత్యం పట్నం వెళ్ళి సరుకులు తెచ్చుకుని, ఇంటి ముందు దుకాణంలో అమ్ముకునే వాడు భార్యతో కలిసి. ఏనాడు డబ్బులు ఇచ్చేవాడు కాదు. ‘ఇంటి వైపు రా. పొగాకు అడుక్కొని పో’ అనేవాడు ఉదారంగా. సన్నగా నవ్వి ఊరుకునే వాడు. రాఘవయ్యకు చుట్ట తాగే అలవాటుంది.


ఒకనాడు చలమయ్య, రాఘవయ్యను దుకాణం ముందు నిలబెట్టి, ‘‘ఇలా ఎంత కాలం ఎదుగూ, బొదుగూ లేని జీవితాన్ని గడుపుతావు. నీ మెత్తదనాన్ని చూసి, చాలా మంది డబ్బులు ఎగొడుతున్నారు. నదిని దాటించినందుకు ఎంతో కొంత రుసుము ఖచ్చితంగా వసూలు చెయ్యి. కష్టానికి ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదు. నేనైతే, ఇప్పటికే గుడిసె తీసి, డాబా కట్టుకునే వాడ్ని’’ అన్నాడు.


‘‘అయ్యా ! దేవుడి దయవల్ల మాకు కూటికి, గుడ్డకు ఏ లోటు లేదు’’ అన్నాడు సౌమ్యంగా.
‘వీడిని మార్చడం నావల్ల కాదు. పరిస్థితులే మార్చాలి’ అనుకున్నాడు చలమయ్య మనసులో.
ఒకనాడు అర్ధ రాత్రి వ్యాపారి పరిగెత్తుకుంటూ వచ్చి, రాఘవయ్య గుడిసె తలుపు తట్టాడు. తలుపు తీసిన కాంతమ్మతో ‘‘కాస్తా మీ వారిని లేపండి. నా కొడుకు కడుపు నొప్పితో, మెలికలు తిరిగి పోతున్నాడు. ఆలశ్యం చేస్తే, ప్రాణానికే ముప్పన్నాడు ఆచారి గారు. వెంటనే పట్నం ఆసుపత్రికి తీసుకెళ్లాలి అన్నాడు హడావిడిగా.


‘‘నిన్న వర్షంలో తడిసి, జ్వరంతో ఉన్నాడు. ఇప్పుడు కూడా వర్షం వస్తుంది. రాలేడు. మీరు చంద్రయ్య పాలెం నుంచి పట్నం తీసుక పొండి’’ అంది కాంతమ్మ.
‘‘అది కూడా ఆలోచించామమ్మా. పాలెం చెరువు కట్ట తెగి, దాటనీయడం లేదంట. రాఘవయ్య నది దాటిస్తే తప్ప, నా కొడుకు బ్రతకడు. ఇవి చేతులు కావు. కాళ్ళనుకో’’ అని కంటనీరు పెట్టు కున్నాడు చలమయ్య.
గుమ్మంలో అలికిడికి నిద్రలేచాడు రాఘవయ్య. మెల్లగా గుడిసె వెలుపలకు వచ్చాడు. రాఘవయ్య చేతులు పట్టుకొని తన బాధ చెప్పుకుంటూ బ్రతిమిలాడ సాగాడు చలమయ్య.


‘‘మన పడవ కొట్టుకపోయి, ఆపదలో ఉంటే కరుణ చూపలేదు. మన అవసరంతో, తను వ్యాపారం చేశాడు. మనం మాత్రం ఎందుకు జాలి చూపాలి. పది వేలు ఇవ్వందే, పడవ వేయనని చెప్పండి. చచ్చినట్లు ఇస్తాడు’’ అంది భార్య కోపంగా.
‘‘ఊర్కోవే పిచ్చిదానా. ఒకడు డబ్బుకు గడ్డి తింటున్నాడని, మనమూ తిందామా..? ఊరన్నాక ఒకరికొకరు సాయం చేసుకుంటూ బతకాల. పక్కోడికి సాయం చేయనివాడు మనిషే కాడు. వస్తున్న పదండి’’ అని తలకు రుమాలు చుట్టుకున్నాడు. మూలనున్న తెడ్డు అందుకొని అడుగు బైట పెట్టాడు.
‘‘ఈ రోజు నుండి నేను మారతాను. న్యాయంగా వ్యాపారం చేస్తూ, ధర్మ బద్దంగా జీవిస్తాను. నా ఒక్కగానొక్క కొడుకు మీద ప్రమాణం చేసి చెపుతున్న. పాత చలమయ్యను నీ మంచితనంతో చంపేశావు. ఇంక కొత్త చలమయ్యనే కనిపిస్తాడు’’ అన్నాడు రాఘవయ్య చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తూ.


రావూరి రమాదేవి, ఫోన్‍: 93923 6065

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *