బొంతల చెట్లు – నా యాది మనాది

చెట్లు మనుషుల లాంటివే. మనకు ఉన్నట్టే వాటికి కూడా పేర్లు ఉంటాయి. మనకన్నా ముందు నుంచి ఉంటాయి. మన తర్వాత కూడా ఉంటాయి. వాటికీ మనలాగే జనన మరణాలు ఉంటాయి. కొన్ని మన కండ్ల ముందే కనుమరుగు అవుతాయి. అవి బతికినన్ని రోజులు మనకు అందించే సేవలు వెలకట్టలేనివి. అవి మనలను అలరిస్తాయి. సేద దీరుస్తాయి. మన ఆటలకు, మన ముచ్చట్లకు వేదికలవుతాయి. మనకు ఎన్నెన్నో అనుభూతులను మిగులుస్తాయి. మన కుటుంబ ఆస్తిత్వాలలో లేదా మన ఊరి ఆస్తిత్వాలలో అనివార్యంగా భాగమౌతాయి. నాకు బోథ్‍ లో చాలా మంది బాల్య స్నేహితులు ఉన్నట్టే నాకు అత్యంత ప్రియమైన చెట్లు కూడా ఉన్నాయి. అవి నా స్నేహితుల లెక్క జీవితంలో నాకు గొప్ప మధురానుభూతులను మిగిల్చినాయి. వాటి గురించి కొన్ని ముచ్చట్లు.


మా ఇంటి ముందు యాప చెట్టు :
మా ఇంటి ముందు ఒక యాప చెట్టు ఉండేది. అది ఎప్పటి నుంచి ఉన్నదో కానీ నేను నడక మొదలుపెట్టినప్పటి నుంచి ఆ యాప చెట్టును చూస్తూనే గడిపాను. అది మా ఇంటి ఆస్తిత్వానికి చిహ్నంగా ఉండేది. మా ఇంటి జాడ చెప్పే వాళ్ళు యాప చెట్టు గుర్తు తప్పక చెపుతారు. అట్లా మా ఆస్తిత్వంలో విడదీయ లేని భాగం అయిపోయింది. ఒకటిన్నర మీటరు వ్యాసంతో నాలుగైదు మీటర్ల ఎత్తు వరకు బలమైన కాండం ఉండేది. ఆ తర్వాత శాఖోప శాఖలుగా విస్తరించింది. చెట్లు ఎక్కే ఉద్దండ పిండాలకు కూడా దాన్ని ఎక్కడం సాధ్యం కాకపోయేది. ఎన్ని పక్షులకు అది ఆశ్రయం ఇచ్చిందో లెక్క లేదు. మా ఇంటి ముందు మగవాళ్ళు, ఆడవాళ్ళు చెప్పుకునే ముచ్చట్లకు అది మౌన సాక్షిగా ఉండేది. ఎండాకాలం డాబా మీద రాత్రి అదిచ్చే చల్లని గాలి మమ్ములను సుఖ నిద్రలోకి తీసుకుపోయేవి. వానాకాలం వర్షం వచ్చే ముందు వీచే హోరు గాలికి శివమెత్తి ఊగిపోయేది. అప్పుడు అది విరిగి మీద పడతుందేమో అని భయం కలిగేది. అయితే అది దిట్టంగా నిలబడి ఉండేది. పిల్లల ఆటలకు అది నెలవుగా ఉండేది. మా క్రికెట్‍ ఆటకు దాని కాండమే స్టంపులుగా ఉపయోగపడేది. మా పుస్తకాల చిరుగులను అంటించుకోవడానికి, మా పుస్తకాలకు అట్టలు అతికించుకోవడానికి మాకు అద్భుతమైన బంకను ప్రసాదించేది. ఆ వందేళ్ల పైబడిన చెట్టు, అన్నిటినీ తట్టుకొని నిలబడిన చెట్టు ఒకనాడు.. ఎండాకాలం వీచిన హోరుగాలికి వేళ్ళతో సహా నిలువునా కూలిపోయి మా ఇంటి మీదనే వాలిపోయింది. దాని వేర్లు చెదలు పట్టి బలహీనమై పోయిన కారణంగా నిలువలేక కూలిపోయింది. మా కుటుంబ ఆస్తిత్వంలో భాగమైన యాప చెట్టు అట్లా ఎక్‍ దం మాయం అయ్యింది. అది కూలిపోయిన్నాడు నా సన్నిహిత బంధువు పోయినంత విషాదాన్ని అనుభవించాను. ఇప్పుడు అదే జాగాలో మరో యాప చెట్టు.. దాని విత్తనమే కావచ్చు.. ఊపిరి పోసుకున్నది. ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్న ఆ పిల్ల యాప చెట్టు మెల్ల మెల్లగా ఆకాశంలోకి విస్తరిస్తున్నది. ఇంటి ముందు ఉన్న యాపచెట్టుకు తోడుగా ఇంటి పెరట్లో నైరుతి మూలలో కూడా ఒక యాప చెట్టు ఉండేది. ఈ రెండు యాప చెట్లు ఏమి ఊసులాడుకునేవో ఏమో కానీ గాలి వీచినప్పుడు మాత్రం వీటి జుగల్‍ బందీ పిల్లలం మమ్ములను భయపెట్టేవి. నైరుతి దిక్కున ఇంటి కాంపౌండ్‍ గోడ దీని కారణంగా కూలిపోతుంన్నదున మా తండ్రి పెరట్లోని యాపచెట్టుని కొట్టి వేయించాడు. ఈ నరికివేత కార్యక్రమాన్ని నేను చూసిన జ్ఞాపకం ఉన్నది. మొదట ఒక్కోక్క కొమ్మను నరుకుతూ తాళ్లతో వాటిని నేలకు రాల్చి చివరకు కాండం నరికి వేశారు. ఇదంతా ఒక నాలుగైదు గంటల పని. చెట్టుని నరికిన వారి ఓర్పు, నేర్పు నన్ను ఆకట్టుకున్నది. అయ్యో చెట్టుని ఎందుకు నరికేస్తున్నారు అని అనిపించినా పెద్దగా బాధపడలేదు. అప్పుడు నాకు 12, 13 ఎండ్లు ఉంటాయేమో. ఇంటి ముందరి చెట్టు కూలిపోయినప్పుడు మాత్రం 50 ఏళ్ల వయసులో వేదన అనుభవించాను.


మా ఇంటి పెరటి చెట్లు :

మా ఇంటి పెరట్లో మామిడి చెట్టు తప్ప అన్ని చెట్లు ఉండేవి. దానిమ్మ, కల్యమాకు, సీతాఫలం, నిమ్మ, తెల్ల గన్నేరు, బావి పక్కన చామ బొంద, కుంకుడు, జామ, మునగ, మైదాకు చెట్లు, గులాబీ, కనకాంబరం, మల్లే, బంతి, చామంతి తదితర పూల మొక్కలు, బెండ, దొండ, వంకాయ మొక్కలను కూడా శ్రద్ధగా పెంచేది మా ఆయి. వీటికి నీళ్ళు పోయడంలో అప్పుడప్పుడు నేను కూడా పాలు పంచుకునేది. మా కాక కిషన్‍ రావు గారి పెరట్లో రేణ(రేగు)వండ్ల చెట్టు ఉండేది. దాని రుచి (తీపి ం వగరు) మొఖాబులా ఎక్కడా కూడా రేగు పండ్లను తినలేదు. అద్భుతమైన రుచి కలిగిన ఆ చెట్టు మాకందరికి ప్రియమైన చెట్టు. సంక్రాంతికు ముందు రోజున భోగినాడు సాయంత్రం మా తలల మీద బుడుబుక్కలుగా (భోగి పండ్లు) మారేవి ఈ చెట్టు రేగు పండ్లే. ఆ చెట్టు కూడా కూలిపోయింది. ఆ చెట్టు సంతానం కూడా లేకుండా పోవడం ఒక విషాదం.


బుక్కోల్ల యాప చెట్టు :

మరో యాప చెట్టు .. బుక్కోల్ల యాప చెట్టు. బుక్క గులాలు, కుంకుమ తయారు చేసి ఇంటింటికీ తిరిగి మారకం పద్దతిలో వాటికి బదులు బియ్యమో, పప్పులో తీసుకుపోయేది బుక్కోల్ల పెద్దవ్వ. మా ఇంటికి కూడా వారానికి ఒకసారి వచ్చి పోయేది. మా ఆయికి మంచి దోస్తు కూడా. బుక్క గులాల్‍ మారకమే కాదు అక్కడ ఒక పది నిమిషాలు ముచ్చట్ల మారకం కూడా జరిగేది. బుక్కోల్ల యాప చెట్టు బహుజన కులాల వారు నివసించే ఇండ్లకు ఒక కూడలి లాంటి ప్రదేశంలో ఉండేది. ఆ యాప చెట్టు చుట్టూ గద్దె కూడా ఉండేది. వ్యవసాయదారుల సాయంత్రపు ముచ్చట్లకు, యాంగ్రీ యంగ్‍ మెన్‍ లకు కూడా వారి ఆలోచనలు పంచుకునే కూడలిగా ఉండేది. మా కుటుంబానికి యాప చెట్టు ఎట్లా అస్తిత్వ ప్రతీక అయ్యిందో అట్లనే ఈ యాప చెట్టు కూడా బుక్కోల్ల కుటుంబానికి అస్తిత్వ ప్రతీక అయ్యింది. 1989 లో చెన్నారెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విప్లవోద్యమ సంఘాలకు కొద్ది కాలం స్వేచ్చ లభించింది. ఆ స్వేచ్చాకాలంలో బోథ్‍ ప్రాంతం ఒక అగ్ని పర్వతంలా రగులుతూనే ఉండేది. బోథ్‍ లో ఈ అగ్ని పర్వతాన్ని రగిలిస్తున్న యాంగ్రీ యంగ్‍ మెన్‍ బుక్కోల్ల యాప చెట్టు కూడలిలో భగత్‍ సింగ్‍ విగ్రహాన్ని నెలకొల్పడానికి సంకల్పించారు. కూడలి నడిమిట్ల ఉన్న యాప చెట్టును తొలగించక తప్పలేదు. అట్లా బుక్కోల్ల యాప చెట్టు కనుమరుగు అయ్యింది. బుక్కోల్ల పెద్దవ్వ కూచమ్మ యాప చెట్టును కొట్టేవేయద్దని ఎంత విలపించినా భగత్‍ సింగ్‍ విగ్రహ స్థాపన కోసం చెట్టును త్యాగం చేయవలసి వచ్చింది. ఇప్పుడు బుక్కోల్ల యాప చెట్టు కూడలి భగత్‍ సింగ్‍ చౌరస్తాగా పేరు మార్చుకున్నది. అయితే నా లాంటి పాత తరం వారికి మాత్రం బుక్కోల్ల యాప చెట్టు ఒక పురా జ్ఞాపకంగా మిగిలిపోయింది. వారు ఇప్పటికీ బుక్కోల్ల యాప చెట్టు చౌరస్తా అనే పిలుస్తున్నారని మిత్రుడు రావుల శంకర్‍ చెప్పాడు.


హనుమాండ్ల రావి చెట్టు :

హనుమాన్‍ గుడిలో రావి చెట్టును ఎన్నటికీ మరువలేను. గుడి లోపల ఎత్తైన ఈ రావి చెట్టు బజారు వీధిలో మధుకర్‍ సేటు దుకాణం దాకా కనిపించేది. ప్రతీ శని వారం హనుమాన్‍ దర్శనానికి వెళ్ళేవాడిని. అది పిల్లల ఆటలకు కూడా కేంద్రంగా ఉండేది. హనుమాన్‍ విగ్రహం పక్కనే ఈ రావి చెట్టు వెళ్ళూనుకొని ఆకాశంలోకి విస్తరించింది. దాని వేర్లు చుట్టూ పక్కల చాలా దూరం వరకు ఇండ్లలోని బావుల్లోకి కూడా నీటి జాడ వెతుకుకుంటూ చొరబడినాయి. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసే భక్తులు విగ్రహం వెనుక వైపున చెట్టును కౌగలించుకునేవారు. అట్లా ఎందుకు చేసేవారో అప్పుడు తెలియదు. ‘‘శనివారం రోజున రావి చెట్టును కౌగలించుకుంటే మనను అంటిపెట్టుకొని ఉన్న జ్యేష్టాదేవి వదిలిపెట్టి పోతుందని, శని మన దరికి రాదని ఒక నమ్మకం’’ అని ఉపాధ్యాయుడిగా రిటైర్‍ అయిన తర్వాత పౌరోహిత్యం స్వీకరించి హనుమాన్‍ గుడి పూజారిగా మారిన నా బాల్యపు దోస్త్ అరవింద్‍ వివరణ ఇచ్చాడు. పెద్దవారిని అనుకరిస్తూ నా లాంటి పిల్లలు కూడా కౌగలించుకునేవారు. బొంతల ఊరి వయసు ఎంతో హనుమాన్‍ గుడి రావి చెట్టు వయసు కూడా అంతే ఉంటుందని అరవింద్‍ అభిప్రాయపడినాడు. ఊరును పొందిచ్చిన నాడే హనుమాన్‍ గుడి, పక్కనే రావి చెట్టును నాటి ఉంటారు. రావి చెట్టు వయసు సుమారు 200 ఏండ్లకు పైబడే ఉండవచ్చునని ఊహించవచ్చు. హనుమాన్‍ జయంతి రోజున సుభాష్‍ రావి చెట్టు ఎక్కు చిటారు కొమ్మన ఎర్ర రంగు జెండా కట్టేవాడు. ఈ ఫీట్‍ మాలో చాలా ఉత్సుకత కలిగించేది. ఆయన తప్ప ఆ చెట్టు ఎక్కిన వారిని నేను చూడలేదు. ఆయన కూడా హనుమాన్‍ జయంతి నాడు మాత్రమే ఈ ఫీట్‍ చేసేవాడు. ఒక రెండు మూడు నెలల వరకు రావి చెట్టు చిటారు కొమ్మ ఎర్ర జెండా రెపరెపలాడుతూ చాలా దూరం వరకు కనిపించేది. ఇది కమ్యూనిస్టుల ఎర్ర జెండా కాదు. హనుమంతుని ఎర్ర జెండా. ఇటీవలి కాలంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిచే హనుమాన్‍ మందిరం పునర్నిర్మాణం జరిగింది. పాత విగ్రహాన్ని మార్చి పంచముఖ హనుమాన్‍ విగ్రహాన్ని నెలకొల్పినారు. మందిరానికి గోపురం నిర్మించడానికి అడ్డం వస్తున్నదని పురాతన రావి చెట్టును తొలగించినారు. ఇప్పుడీ రావి చెట్టు లేని పంచముఖ హనుమాన్‍ దేవాలయం ఉన్నప్పటికీ రావి చెట్టు సహిత హనుమాన్‍ మందిరాన్నే నేను ఊహించుకోగలను. అదే నా హ•దయంలో చిత్రితమైంది. అయితే మందిరం ముందు మరొక రావి చెట్టును నాటినారని, అదిప్పుడు ఎదిగి నిలదొక్కుకున్నదని గుడి పూజారి అరవింద్‍ చెపితే సంతోషించాను.


బస్టాండ్‍ జువ్వి చెట్టు :

బోథ్‍ బస్టాండ్‍ లో ఉండే జువ్వి చెట్టు ఒక అద్భుతమైన చెట్టు. పిల్లలకు ఎంతో ఇష్టమైన చెట్టు. పెద్ద చెట్టు అయినా కాండం చిన్నగా వాలు కలిగి ఉండేది. దాని కుడి వైపున ఒక కొమ్మ నేలకు సమాంతరంగా పెరిగి ఉండేది. పిల్లలం ఎటువంటి సహాయం లేకుండానే ఉరుక్కుంటా వచ్చి చాలా ఎత్తు వరకు చెట్టుని ఎక్కే సౌకర్యం ఉండేది. అట్లా ఈ చెట్టుని ఎన్ని సార్లు ఎక్కి వేలాడుతూ కిందకు దూకామో లెక్క లేదు. కాల క్రమేణా అభివ•ద్దికి అడ్డం వచ్చిందని జువ్వి చెట్టును తొలగించారు. ఈ జువ్వి చెట్టు కిందనే 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ శిభిరాన్ని ఏర్పాటు చేశారు బొంతల విద్యార్థులు. ఇప్పుడు ఈ జువ్వి చెట్టు స్థానంలో మడిగెలు వచ్చాయి. దుకాణాలు వెలసినాయి. బస్టాండ్‍ జువ్వి చెట్టు మాత్రం ఇప్పటికీ కండ్ల ముందర మెదులుతున్నది.


బస్టాండ్‍ యాప చెట్టు :

బస్టాండ్‍ లో ఒక యాప చెట్టు కూడా ఉంది. దాని చుట్టూ గద్దె. అది ఇప్పుడు కూడా ఉన్నది. కొత్త బస్టాండ్‍ కట్టక మునుపు బస్సులు గిర్రున యాప చెట్టు గద్దె చుట్టూ తిరిగి యాప చెట్టు నీడలో ఆగేవి. బస్సు గిర్రున తిగినదంటే బోథ్‍ వచ్చేసినట్టు బస్సులో నిద్ర పోయిన వాళ్ళకు కూడా తెలిసపోయేది. ఇప్పుడీ యాప చెట్టు ఉన్నా జువ్వి చెట్టు లేని బోథ్‍ బస్టాండ్‍ ను ఊహించుకోవడం కష్టమే.


పెద్ద బడి తొవ్వలో ఎలికి చెట్టు :

బస్టాండ్‍ నుంచి పెద్ద బడికి, కచేర్లకు పోయే దారి వంపులో, ధన్నూరుకు పోయే కాలిబాట / బండి బాట మొదలౌతుంది. అక్కడ ఒక ఎలికి చెట్టు ఉండేది. దానికి గుత్తులు గుత్తులుగా ఎలికి కాయలు వచ్చేవి. ఎలికి చెట్టు బడి పిల్లలకు ఎంతో ఇష్టమైన చెట్టు. చెట్టు ఎక్కగలిగె మగ పిల్లలు ఎలికి చెట్టు ఎక్కి కాయలు, పండ్లు తెంపి కిందకు వేస్తే ఎవరికి అందింది వారు తీసుకొని పోయేవారు. అమ్మాయిలు ఈ ఎలికి పండ్ల కోసం మగ పిల్లలను వేడుకునేవారు. చెట్టు ఎక్కిన పిల్లలు అందరికీ న్యాయం చేసేవారు. అవి తిని పండ్లు కోరలు పోయేది. మాగిన ఎలికి పండు మాత్రం కొంచెం తియ్యగా, కొంచెం వగరుగా ఉండేది.. చింత పండు లాగా. ఈ ఎలికి చెట్టు కూడా వయసు మీద పడి ప్రక•తి ప్రకోపానికి గురి అయి కూలిపోయింది. ఇప్పుడు ఇట్లా ఎలికి చెట్టును యాదికి చేసుకుంటున్నాను.


పక్కీరోని చేను సందులో ఎలికి చెట్టు :
ఇటువంటి ఎలికి చెట్టే పక్కీరోని చేను (ఇప్పుడు మార్కెట్‍ యార్డు) సందులో కూడా ఉండేది. ఆ చెట్టు మీద దయ్యాలు తిష్ట వేసుకొని ఉన్నాయని ఒక కథనం కూడా ప్రచారంలో ఉండేది. ఆ సందులో నుంచి ఒంటరిగా పోవడానికి పిల్లలు భయపడేది. పక్కీరోని చేనుని మార్కెట్‍ యార్డ్ కొసం సేకరించిన తర్వాత మార్కెట్‍ యార్డ్ పక్క నుంచి ఒక సిమెంట్‍ రోడ్డు వేసింది గ్రామ పంచాయతీ. ఆ రోడ్‍ కు ఇరువైపులా ఇప్పుడు ఇండ్లు మడిగెలు లేచాయి. ఈ అభివ•ద్దిలో భాగంగా ఎలికి చెట్టూ పోయింది.


అంజుమన్‍ మర్రి చెట్టు :
ఊరి పాత బజారు వీధికి ఎడమ వైపున అంజుమన్‍ (కోపరేటివ్‍ సొసైటీ) కు ఎదురుగా ఒక పెద్ద ఊడలు వేసిన మర్రి చెట్టు ఉండేది. అది కూడా వందేళ్ల పైబడిన చెట్టే. దాని కింద అంజుమన్‍ కు వచ్చిన వారు, రేషన్‍ కోసం వచ్చిన వారు, అంజుమన్‍ హమాలీలు సేద దీరేవారు. దాని చుట్టూ చిన్నఅ వ్యాపారస్తుల మడిగెలు ఉండేవి. పక్కన డా. దాసరి వెంకన్న గారి క్లినిక్‍ ఉండేది. మంగళవారం అంగడి రోజున మర్రి చెట్టు ఎందరికో ఆశ్రయం కల్పించేది. ఇప్పుడు ఈ మర్రి చెట్టు లేదు. బహుశా కాల గమనంలో వయసు మీరి పోయి కూలిపోయి ఉంటుంది. లేదా కొట్టేసి ఉంటారు.


పెద్ద మసీదులో దూది నిమ్మ చెట్టు :
బొంతల పెద్ద మసీదులో ఉత్తరం వైపు మూలన ఒక దూది నిమ్మ చెట్టు ఉండేది. దూది నిమ్మకాయలు బయటకు కనిపించేవి. మసీదు ముందు నుంచి పోయినప్పుడు నా ద•ష్టి తప్పక ఆ చెట్టు మీదకు పోయేది. అట్లా చిన్నప్పటి నుంచి పెద్ద మసీదులోని దూది నిమ్మ చెట్టు మనసులో స్థిరపడిపోయింది. దూది నిమ్మ చెట్టు అక్కడ తప్ప బోథ్‍ లో మరెక్కడా కనిపించలేదు. పెద్ద మసీదు అభివ•ద్దిలో భాగంగా దూది నిమ్మ చెట్టును తొలగించినట్టు మిత్రులు చెప్పారు.


అంబారావు మర్రి :
ఇది కూడా మా ఇంటి చెట్టు లాంటిదే. కాకపోతే ఊరికి దూరంగా పిప్పల్‍ దరి ఊరి శివారులో ఉన్న మా పట్టా భూమిలో ఉన్నదీ మర్రి చెట్టు. మా తండ్రి పేరు అంబారావు కనుక అది అంబారావు మర్రిగా పేరు గాంచింది. దాని పక్కనే ఒక వొర్రే కూడా పారుతుంది. వొర్రే ఎప్పుడు ఎండిపోదు. కొద్దో గొప్పో నీళ్ళు పారుతూనే ఉంటాయి. కాబట్టి అంబారావు మర్రి అనేక జీవాలకు, గొర్లు బర్లు కాసే పిల్లలకు దప్పిక తీర్చి సేద దీరే తావుగా మారింది. ఆ దారి వెంట పోతే రైతులు అక్కడ కొద్ది సేపైనా సేద దీరి బీడీ తాగి గాని పోరు. ఆ మర్రికి ఉన్న ఆకర్షణ శక్తి అటువంటిది. ఆ మర్రి మూడు చెట్లుగా కనిపిస్తాయి. మధ్యలో ఉండే పెద్ద చెట్టు రాముడు, ఎడమ వైపున కొంచె చిన్నగా ఉన్న చెట్టు లక్ష్మణుడు, కుడి వైపున ఉన్న ఇంకాస్త చిన్న చెట్టు సీతగా అక్కడి ప్రజలు నోళ్లలో ప్రచారంలో ఉన్న మాట. ఈ రెండు చిన్న చెట్లు మధ్యలో పెద్ద చెట్టు ఊడల నుంచి చెట్లుగా ఎదిగినవే. ఇంకా మరెన్నో ఊడలు నేలకు దిగుతున్నాయి. మేము దోస్తులం పిస్కుళ్లు (లేత జొన్న కంకులు కుంపట్లో కాల్చి వొలిచి తినేవే పిస్కుళ్లు) తినడానికి సెప్టెంబర్‍ అక్టోబర్‍ నెలలో వచ్చినప్పుడు ఈ చెట్టు కిందనే మా మకాం. ఆ చెట్లు ఎక్కి దిగుతూ ఎన్నో ఆటలు. ఒర్రెలో తానాలు. ఇట్లా ఒక రోజు పిస్కుళ్ల పిక్నిక్‍ ఆనందంగా గడిచిపోయేది. ఈ చెట్టు కింద ఒక చేదు అనుభవం కూడా ఉన్నది. మా ఎద్దుపాలు పాలేరు అడెల్లు చేనులో బోరు బావి కొట్టించాడు. బోరు యంత్రంతో కాకుండా వడ్డెరలతో కొట్టించాడు. పక్కనే ఒర్రె ఉన్నందున 30 అడుగుల లోతులోనే నీళ్ళు పడినాయి. ఇది 25 ఏండ్ల కిందటి ముచ్చట. ఆ బోరు ఇప్పటికీ నీళ్ళు పోస్తున్నది. బొరులో నీళ్ళు పడినందుకు యాట కోద్దామని అడెల్లు అంటే ఒకే చెప్పాను. నేను నా దోస్తులు, అడెల్లు కుటుంబ సభ్యులు వచ్చారు. అన్ని ఏర్పాట్లు ఈ మర్రి కిందనే చేశాడు అడెల్లు. బోరు బావి వద్ద మ్యాకను కోసి మాంసం ముక్కలు తెచ్చి మర్రి చెట్టు కింద రాళ్ళ పొయ్యిలు రెండు పేర్చి ఒకదాని మీద అన్నం ఎక్కించాడు. రెండో బగోనలో మటన్‍ కూర వండడానికి సిద్దం అయ్యాడు. రెండు పొయిల నుండి లేచిన పొగకు చెట్టు మీద ఉన్నపెత్తెర ఈగలు (పెద్ద ఈగల తేనె తుట్టె) లేచి కిందకి దూసుకు వచ్చి దాడి మొదలు పెట్టినాయి. మేమంతా ఒకే ఒకటే ఉరుకులు పరుగులు. తలో దిక్కున చెల్లాచెదురయ్యాము. ఒక గంట తర్వాత అడెల్లు వొంటి నిండా గొంగడి కప్పుకొని చెట్టు వద్దకు వెళ్ళే సాహాసం చేసినాడు. అప్పటికి ఈగల ఉద•తి తగ్గింది. ఎందుకైనా మంచిదని కొత్త జాగల పొయిలు పేర్చి వంటలు పూర్తి కానిచ్చి మా అందరికి బోరు దావత్‍ తినిపించాడు. ఇట్లా అంబారావు మర్రితో అనేక అనుభూతులు అనుబంధాలు ఉన్నాయి.


దోరోళ్ళ యాప చెట్లు :

బోథ్‍ బస్టాండ్‍ లో బస్సు దిగి ఊరిలోకి పోయే దారిలో ఎడమ వైపున వరుసగా ఒక పదో పన్నెండో యాప చెట్లు ఉండేవి. వాటిని ఆనుకొని దోరోళ్ళ ఇండ్లు ఉంటాయి. కాబట్టి ఈ యాప చెట్లకు దోరోళ్ళ యాప చెట్లు అనే పేరు. ఇవి కూడా మా బొంతల అస్తిత్వంలో భాగం అయినాయి. ఈ చెట్లను చూడగానే ఊర్లోకి ప్రవేశించామన్న త•ప్తి కలుగుతుంది. మనకు ఈ చెట్లే ఊరిలోకి స్వాగతం పలుకుతాయి. ఇప్పుడు ఊరి మార్కెట్‍ అంతా ఇటువైపు మారింది. మంగళవారం జరిగే అంగడిలో ఈ చెట్ల కింద దుకాణాలు వెలుస్తాయి. 1980 వ దశకంలో పి డి ఎస్‍ యు కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వి శంకర్‍ అన్న మా ఊరివాడే. ఆయనే తీసుకున్న చొరవ కారణంగా దోరోళ్ళ ఇండ్ల రూపు రేఖలు మారిపోయినాయి. ముంబాయిలో బిచ్చగాళ్ల సహకార సంఘం నుంచి లోన్‍ తెచ్చి పాత ఇండ్ల ముందు కొత్త మడిగెలు కట్టించి ఇచ్చాడని మిత్రులు చెప్పారు. తెలంగాణ ఉద్యమ కాలంలో బాగ్‍ లింగంపల్లిలో శంకరన్ననిర్వహిస్తున్న సహచర బుక్‍ షాప్‍ కు దాదాపు రోజు వెళ్ళే వాడిని. కానీ ఆయన ఊరి సంగతులు ఏవీ నాతో చర్చించేవాడు కాదు. మడిగెల నిర్మాణంతో వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు అనూహ్యంగా మారిపోయినాయి. ఈ మడిగెల కారణంగా ఈ రోడ్డు ఊరి ప్రధాన బజారు వీధిగా మారిపోయింది. పాత బజారు వీధి కళ కోల్పోయింది. ఈ అభివ•ద్ది కారణంగా ఒకటి రెండు యాప చెట్లు పోయాయేమో కానీ చాలా చెట్లు ఇంకా ఉన్నాయి. బొంతల అస్తిత్వానికి ప్రతీకగా ఇంకా నిలచి ఉన్నాయి.


మరికొన్ని చెట్లు :
ఈ సందర్భంగా మరికొన్ని చెట్లను గుర్తు చేసుకుంటాను. మా బొంతల పెద్ద వాగు అవుతల వాగు పొంటి ఐదారు కిలోమీటర్ల పొడవున ఉండే మాముళ్ల (ఊరుమ్మడి మామిడి తోపు) గురించి ఇది వరకే నా ముచ్చట్లలో చెప్పి ఉన్నాను. వేలాది మామిడి చెట్లు ఉండే ఈ మామిడి తోపు మనిషి స్వార్థానికి కనుమరుగు అయ్యింది. పెద్దవాగుకు ఊరి వైపున తురక రేవు ఒడ్డున ఒక చింతల తోపు కూడా ఉండేది. ఇవి బొంతల పర్యావరణాన్ని సమతౌల్యాన్ని, కరువు కాటకాలు దరి చేరకుండా దశాబ్దాల పాటు కాపాడినాయి. ఈ మామిడి తోపు మధ్యన ఊడలు పోసిన ఒక మర్రి చెట్టు కూడా
ఉండేది. మామిడి తోపుతో పాటు ఈ మర్రి చెట్టూ పోయింది. ఊర్లో కొంత మంది ప్రముఖుల ఇండ్ల ముందు కూడా యాప చెట్లు ఉండేవి. రాంకిషన్‍ రావు దేశ్పాండే, చట్ల శంకర్‍ రావు, ఏనుగు మల్లారెడ్డి గార్ల ఇండ్ల ముందు, విఠలేశ్వరుని గుడి ముందు, పోచమ్మ గుడి ముందు యాప చెట్లు చూసిన జ్ఞాపకం. ఈ చెట్లు కూడా కనుమరుగు అయిపోయినాయి. అయితే మా జ్ఞాపకాల్లో మాత్రం పదిలంగా ఉన్నాయి.


గడచిన పదేళ్ళ కాలంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బోథ్‍ వందలాది కొత్త చెట్లు నాటి ఉంటారు. కానీ బోథ్‍ పర్యావరణ సమతౌల్యాన్ని దశాబ్దాలుగా కాపాడి కనుమరుగైన మాముళ్లు, చింతలు, రావి, మర్రి, యాప, జువ్వి చెట్లకు ఇవి సాటి రావు.

  • శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే, ఎ : 94910 60585

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *