ప్రకృతే సౌందర్యం! 24 ప్రకృతే ఆనందం!! స్వేచ్ఛా విహంగులం! అయినా, అనునిత్యం ప్రాణసంకటం!!

గోడలపై పులి చర్మాలు, ద్వారాల పైభాగంలో దుప్పుల కొమ్ములు, మెడలో పులిగోళ్ళు, తలపైన అందమైన పక్షి ఈకలతో చేసిన టోపీలు ఉన్నత వర్గాల దర్పానికి చిహ్నం! ఇలాంటి ప్రతీకల్ని సినిమాల్లో చూస్తూ వుంటాం! పాశ్చాత్య దేశాల్లో రాణులు, మహా రాణులు, రాజులు, యోధులు పక్షుల ఈకలతో చేసిన అలంకరణ ఆహార్యాలతో కనిపిస్తూ వుంటారు. పక్షి ఈకల రకాల్ని బట్టి వారివారి హోదా ఎగిసిపడేది. ఇప్పటికి ఈ విధానం లాటిన్‍ అమెరికా, ఆఫ్రికా దేశాల్లోని వివిధ గిరిజన తెగలల్లో కనిపిస్తాయి. గోండులు గుస్సాడి నృత్యంలో నెమలి ఈకలతో చేసిన అలంకరణలు వాడేది మనకు తెలిసిందే! ఇతిహాస కృష్ణుడు తలలో నిరంతరం నెమలి పింఛాన్ని (ఈక) ధరించడం గుర్తెరిగిందే!


మాదో వైవిధ్యభరిత జాతి:
మీ మానవుల అంచనాల ప్రకారమే ప్రపంచ వ్యాపితంగా సుమారు పదివేల రకాలకు పైగా పక్షుల జాతులున్నట్లుగా అంచనా! (ఇంతకు రెండింతలని అంటారు) ఇందులో భారత్‍లో సుమారు 1400 రకాలున్నాయంటున్నారు. పోతే, ఇతర జంతువుల లాగా మా పక్షిజాతిని అంచనా వేయడం కష్టమే! కారణం, మేం వుండే విభిన్న ఆవాసప్రాంతాలు. చిటారు చెట్ల కొమ్మల్లో, నీళ్ళల్లోకి దూకి, ఇసుక బొరియల్లో దాక్కొని, చిత్తడి నేలల్లో, ఏపుగా పెరిగిన గడ్డి ప్రాంతాల్లో అంటే, నింగి, నేల, నీరు మా ఆవాసాలే అయినా, అంత సులువుగా మేం దొరకం. చిన్న అలికిడి విన్నా తుర్రున లేచి ఎగిరిపోవడం మా భయానికి కారణం. మా జీవన గమనాలు, నిర్మించుకునే గూళ్లు ఒక్కో జాతిది ఒక్కోరకం. మా గూళ్లను బట్టి, ఎగిరే విధానాన్ని బట్టి, ఆకాశంలో మా గుంపుపోతున్న అమరికను బట్టి మేం ఏ జాతో మీరు అట్టే గుర్తు పడుతారు. మా పక్షి జాతులకున్న విశిష్టలక్షణాల్లో మా కూతలు, అరుపులు, శబ్దాలు వుంటాయి. ఒక్కో జాతి పక్షి ఒక్కో వైవిధ్యభరిత శబ్దాన్ని కల్గిస్తాయి.


అందుకే ఆబాలగోపాలం, మమ్మల్ని చూసి ఆనందిస్తువుంటారు. కాని, ఆ ఆనందం వెనుక అత్యధిక మానవులది కపట ప్రేమని తెలిసినా మేమేమి చేయని నిస్సాహాయులం! జంతువుల్ని ఇష్టపడని వారు వుంటే వుండవచ్చు! కాని, పక్షుల్ని ఇష్టపడిని వారు బహుషా వెతికినా కానరారు. పల్లెల్లో, పట్టణాల్లో, చెట్లతోపుల్లో, ఉద్యానవనాల్లో, గడ్డిభూముల్లో, పంట చేళ్లల్లో మా కీలారావములు అనునిత్యం వింటున్నదే! ఉదయాన్నే నిద్రలేపే కాకి, మీ ఇంటి చూరుల్లో ఎగురుతూ కిచకిచలాడే పిచ్చుక, వచ్చిరాని మాటల్ని పలికే రామచిలుక, వసంతగానం చేసే కోకిల, ఇంటి పెరట్లో నడయాడే కోళ్లు, వెనక తిరుగాడే బాతులు, మేఘ గర్జనకు పురివిప్పి ఆడే నెమలి. ఇలా ఎన్నీంటి గూర్చి చెప్పినా తక్కువే! అయితే ఇవన్నీ ఒకనాటి మధుర జ్ఞాపకాలు. నేటి తరానికి ఇవి ఊహకు కూడా అందని కథలు. మా పక్షి జాతులకు మీరేమి నేర్పారో తెలియదు గాని, మా నుంచి మీరే ఎన్నో సంగతుల్ని నేర్చుకున్నారు. మీరు కట్టుకునే నివాసాలకు ఇంజనీర్లం మేమే! గగనయాంలో పయనించే గాలిమోటర్ల నిర్మాణం, మా ఎగిరే కళతోనే కదా! నీటిలోకి దూకే (•ఱఙవ) మా నైపుణ్యాన్ని పసిగట్టి, మీరు సముద్రలోతుల్ని తడుముతున్నారు. అంటే, మీ మానవుల నైపుణ్యతలకు మేమే హక్కుదారులం. పేటెంట్లం! అంతెందుకు, మా పలుకులు, శబ్దాలు, కూతలు మీకు మాటల్ని, భాషని నేర్పాయంటే మీరు ఒప్పుకుంటారా?


మా అందమైన ఈకలే మాకు ఉరితాళ్లు!

ఇలాంటి వైవిధ్యభరిత జాతి నేడు ఏ పరిస్థితల్లో వుందో, రోజురోజుకు మా విభిన్న జాతి పక్షులు ఎలా చివరి శ్వాసను విడుస్తున్నాయో మీరు గ్రహించండి మీ వక్రబుద్ధిని పోనిచ్చుకోకుండా, యమధర్మరాజుకే నీతులు బోధించే రకం కదా!
ఈ సందర్భంగా కొన్ని సంఘటనల్ని మీ దృష్టికి తెస్తున్నాం. నిజానికి మా పక్షిజాతి అంతం పారిశ్రామిక విప్లవం తర్వాతనే వేగవంతం అయినా, మానవ జనాభా పెరుగుతున్న కొద్ది, స్థిరనివాసం ఏర్పర్చుకొని, వ్యవసాయం వృత్తిగా మారినప్పటి నుంచే, మాపై వేట ఎక్కువైంది. విద్యుత్‍ కేంద్రాలు స్థాపన, ఉత్పాదక ఫ్యాక్టరీలు, ప్రాజెక్టుల నిర్మాణం ఊపందుకున్నప్పటి నుంచి మా మృత్యుగడియలు కూడా ప్రారంభ మయ్యాయి. మాంచెస్టర్‍ మెట్రోపాలిటన్‍ విశ్వవిద్యాలయ పక్షుల పరిశీల కుడైన (ornithologist) అలెగ్జాండర్‍ లీస్‍ (Alexander Lees) ప్రకారం క్రీ.శ 1500సం।। నుంచే మా క్షీణదశ ప్రారంభం కాగా, ఇప్పటికి సుమారు 187 పక్షుల జాతులు మన ఊహల్లో కూడా లేకుండా పోయాయి. భారత్‍కు చెందిన జయశ్రీ నంది లెక్కల ప్రకారం భారత్‍లో గత అయిదు సంవత్సరాలల్లోనే సుమారు 146 పక్షిజాతులు కానరాకుండా పోయాయి. అంటే, అయిదు వందల సంవత్సరాలలో జరిగిన పక్షుల విధ్వంసం గత ఐదేళ్లలోనే జరిగిందన్న మాట!
మా పక్షులు ఏయే కాలాల్లో, ఎలా అంతం అయ్యోయో చూడండి! బ్రిటన్‍ గణాంకల ప్రకారమే 1875లో సుమారు 14,500 కి.గ్రా.
ఉష్ట్రపక్షి ఈకలు ఆఫ్రికా నుంచి యూరప్‍కు దిగుమతి అయ్యాయి. సాధారణంగా పక్షుల మాంసం అనేక రోగాలకు పనిచేస్తాయనే నమ్మకం మానవులది. అందులో కావల్సినంత మాంసకృత్తులుండడం కూడా ఓ కారణం! అయినా, మాంసానికే కాక, కేవలం ఈకల్నే యూరప్‍ దిగుమతి చేసుకోవడానికి కారణం, వాటితో అందమైన అలంకరణ సామాగ్రిని, టోపీలను, బుట్టల్ని, బ్యాగుల్ని తయారు చేసి వ్యాపారం చేసుకుకోవడమే! అయితే, యూరప్‍ ఈకలచే వ్యాపారం చేసుకుంటే, ఆఫ్రికన్లు మమ్మల్ని చంపి ఈకలు అమ్ముకొని మాంసాన్ని స్థానికంగా వినియోగించుకున్నారు.


ప్రపంచ పక్షిజాతుల్లో అతి చిన్న పక్షిజాతిగా గుర్తించబడ్డ హమ్మింగ్‍ పక్షి (Humming) ఓ అందాల రాసి. 20వ శతాబ్దం మొదటి భాగంలో సుమారు నాలుగు లక్షల హమ్మింగ్‍ పక్షుల చర్మాల్ని లండన్‍ దిగుమతి చేసుకున్నది. అలాగే 50వేల పారడైస్‍ పక్షుల్ని (Paradise) పోలోనేసియా నుంచి లండన్‍కు బంధించి పంపించారు.


ఆల్బాట్రోస్‍ (Albatross):

సుమారు మూడున్నర మీటర్ల రెక్కల పొడవుతో, సముద్ర ప్రాంతాలలో నైపుణ్యంతో ఎగిరే ఈ పక్షి చూడడానికి బాతులా కనిపిస్తుంది. సముద్ర గగనతలంలో తుఫానులకు, ఉప్పెనలకు కూడా నెరవని ఈ పక్షి సంతానోత్పత్తి సమయంలో తీరంలోని ఇసుక తిన్నెలపై నివాసం వుండి, గుడ్లు పెట్టి పొదుగేదాకా కదలదు. ఆ సమయంలో శక్తిలేక, రెక్కల్లో కొవ్వుశాతం పెరిగి నిస్సాహాయంగా వుంటుంది. దీన్ని అదనుగా భావించిన వేటగాళ్ళు కర్రలతో, శూలాలతో దాడి చేసి చంపి మాంసాన్ని, ఈకల్ని వ్యాపారం చేసుకుంటారు. 1887-1903 మధ్య కాలంలో పసిఫిక్‍ తీరప్రాంతంలోనే ఈ పక్షులు సుమారు 17 మిలియన్లు చంపబడగా, చివరి పక్షి రెండో ప్రపంచ యుద్ధ ప్రారంభానికి ముందు కనుమరుగై పోయింది.


నారాయణ పక్షి (White Heronx)
కొంగలుగా గుర్తించబడే ఈ పక్షులు వివిధ రంగుల్లో వుంటాయి. దాదాపు నీటి ఆవాస ప్రాంతాల్లో ప్రపంచమంతా అగుపించే ఈ పక్షుల ఈకల్ని పీకి వ్యాపారం చేసుకుంటారు. కొంతమేర మాంసాన్ని కూడా వినియోగిస్తారు. అయితే, వేటకాడు వలల్ని పెట్టినప్పుడు వందల సంఖ్యల్లో ఇవి చిక్కుకుంటాయి. చిక్కినవాటిని చంపి, ఈకల్ని పీకి అవసరం వున్నంతకు ఎగుమతి చేయడం, చంపబడ్డ మిగతా పక్షుల్ని అలాగే పారవేయడం జరుగుతుంది. ఒక్క వెనిజులా నుంచే ప్రతి సంవత్సరం రెండు మిలియన్ల తెల్లరకం నారాయణ పక్షుల్ని చంపి ఎగుమతి చేస్తున్నారంటే, మీరు నమ్ముతారా?
కార్మోరెంట్‍ (Cormorant-షాగ్‍) పక్షి
కొంగలకు, బాతులకు మధ్యస్థంగా వుండే ఈ రకం పక్షులు ఎక్కువ దూరాల్ని ఎగురలేవు. వీటిపై పరిశోధనలు చేసిన జార్జి స్టెల్లర్‍, చివరి పక్షి 1850లోనే కనుమరుగైనట్లు గుర్తించాడు. చిన్న రెక్కలు కలిగిన ఈ జాతి పక్షులు మంచి ఈత గాళ్లు. ఎగరడానికి కన్నా, ఈదడానికి తక్కువ శక్తిని ఉపయోగించే ఈ పక్షులు భారత ఉపఖండంలో, తూర్పు ఆసియా దేశాల్లోని సరస్సు ప్రాంతాల్లో ఇంకా ఉనికిలో వున్నాయి. ఇవి కూడా త్వరలో అంతరించిపోయే దశకు చేరుకున్నట్లు కథనాలు.


లాబ్రాడార్‍ పక్షి (Labrador)
బాతుల జాతికి చెందిన ఈ పక్షులు ఉత్తరార్ద్ర గోళంలో ఒకప్పుడు కనువిందు చేసేవి. నలుపు, తెలుపు రంగుల్లో, ఎరుపు పసుపు రంగు ముక్కులతో వుండే ఈ పక్షులు నీటి మడుగుల్లోని చేపల్ని తిని జీవించేవి. రాను, రాను నీటి ఆవాసాలు దెబ్బతినడంతో విపరీతమైన ఆహార కొరత ఏర్పడి, ఇవి చివరి దశకు చేరుకున్నాయి. అలాగే వీటి మాంసం రుచికరంగా వుండడంచే, చాలా ప్రాంతాల ప్రజలు వేటాడి చంపడం జరుగుతున్నది. కొన్ని బాతుల ఈకల్ని దుస్తుల్లాగా నడుముకు కట్టుకోవడం కోసం కూడా వీటిని వేటాడడానికి కూడా కారణం. చివరి పక్షి 1878లో కనిపించినట్లుగా కథనాలు.
పెట్రెల్‍ (Petrel)పక్షి :
తుఫానులను కూడా తట్టుకొని సముద్రతలాలపై ఎగిరే ఈ పక్షుల తల నల్లని టోపిలా కలిగి వుంటాయి. వీటి పాదాలు నీటిపై నడవడానికి అనుకూలంగా వుంటాయి కాబట్టి, పెటర్‍ అనే బైబిల్‍ పదంతో వీటిని పెట్రెల్‍ అని పిలుస్తారు. ఇందులో కొన్ని రకాల పక్షులు అంతరించిపోగా, కొన్ని దక్షిణార్ద్ర గోళంలో అక్కడక్కడా ఉనికిలో వున్నాయి. ఇవి కూడా సంతానోత్పత్తి దశలో ఎగరలేకుండా వుండడంతో, వేటగాళ్ళు శూలాలతో చంపి, మాంసాన్ని తినడం ఈకల్ని ఎగుమతి చేయడం, జరుగుతుంది. పోతే, చంపబడ్డ పక్షుల మాంసాన్ని మొత్తంగా వాడకున్నా, వాటి ఈకల్ని పీకి సొమ్ము చేసుకోవడం మామూలైంది. మిగిలిన చివరి పక్షులు కూడా అంతరించే దశకు చేరుకున్నాయి.
ఆక్‍ (Auk) పక్షి :
వీటిని ఆల్సిడ్‍ అనికూడా అంటారు. అతి చిన్న రెక్కలుండడంతో ఇవి ఉష్ట్రపక్షిలా ఎగరలేవు. నల్లని మెడ, తెల్లని శరీరంతో బాతుల్లాంటి తలతో వుండే ఈ పక్షుల పొడవు 75 సెం.మీ. వరకు వుంటుంది. కాని, ఇవి మంచి డైవర్స్. సుమారు 180 సం।। క్రితమే 3-7-1844న ఆక్‍ పక్షి చివరిశ్వాస తీసుకున్నట్లుగా రికార్డులున్నాయి. వీటి ఆచూకిని తెలిపిన వారికి నజరానాల్ని ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. 19వ శతాబ్దం ప్రారంభంలోనే నావికులు వీటిని వేటాడి అంతమొందించారు. ఒకప్పుడు ఆర్కిటిక్‍ ప్రాంతానికి అలంకరణగా అగుపించే ఈ జాతి అంతరించడంతో ఇప్పుడు ఈ ప్రాంతం బోసిపోయింది.


ప్రయాణికుల పావురం (Passenger Pigeon):
ఉత్తర అమెరికాకు చెందిన ఈ రకం పావురాలు అంతరించి పోయాయి. వీటి వలస లక్షణాలతో ఈ పేరు వచ్చినట్లుగా చెపుతారు. మన ప్రాంతాల్లో కనపడే పావురాలు, ఈ పావురాలు ఒకటి కాదు. పాసింజర్‍ పావురాలు పెద్ద ఆకారాన్ని కలిగి అటవికే పరిమితంగా వుండేవి. 20వ శతాబ్దం ప్రారంభంలో బిలియన్ల సంఖ్యలో వున్న ఈ పక్షులు, 1909 నాటికే కనుమరుగైనట్లు రికార్డులు తెలుపుతున్నాయి. వీటి ఆచూకి గాని, నిర్మించుకున్న గూళ్ళనుగాని గుర్తించి తెలిపిన వారికి ఆయా ప్రభుత్వాలు బహుమతుల్ని కూడా ప్రకటించినా ఎలాంటి ఆచూకి లేకుండా పోయింది. ఒక్క మిచిగాన్‍ రాష్ట్రంలోనే 1.5 మిలియన్ల పావురాలకు పైగా చంపబడ్డాయి. చివరికి సిన్సినాటి జూలో గల ఏకైక పాసింజర్‍ పావురం సెప్టెంబర్‍ 1, 1914లో కన్నుమూసింది.
ఈ పక్షులవేట తెల్లవాళ్ళు అమెరికాను ఆక్రమించుకున్న తర్వాతనే అధికమయ్యాయి. ఒకప్పుడు స్థానికులు ఆహారం కోసం వారి అవసరానికి తగ్గట్లుగానే వీటిని చంపేవారు. ముఖ్యంగా అవి సంతానోత్పత్తి జరిపే సమయంలో వాటి జోలికి పోకపోగా, ఏనాడు వాటి పిల్లల్ని స్థానికులు ముట్టుకునే వారు కాదు. కాని నాగరిక ప్రపంచమే ఈ పక్షులకు మరణశాసనాన్ని ప్రకటించింది.


ఎన్నింటికో మేమే మీ ప్రతీకలం!
మయూరి నాట్యం, హంస నడక, కోయిల కూత, కాకి అరుపు, గుడ్లగూబ (చూపు), కిచకిచలు (ముచ్చట్లు) ఇలా మా పక్షుల గుణగణాల్ని మీ మానవులు వాడి మమ్మల్ని, మా ఔన్యత్యాన్ని చాటుకుంటారు. మీ విష్ణుశర్మ రాసిన పంచతంత్ర కథల్లో అన్నీ జంతువులే! కాని, అన్ని పాత్రల్లో మమ్మల్ని విష్ణుశర్మ స్నేహశీలురుగా అభివర్ణించాడు. చివరికి వాల్మీకి రామాయణ గాధలో, ఓ స్త్రీని (సీత) రక్షించడానికి ప్రయత్నం చేసింది కూడా మా జాతే కదా!
ఇలాంటి ఉన్నతమైన మా పక్షిజాతుల్ని, మీ మానవులు మీ అవసరాలకు మించి, విచ్ఛలవిడిగా మారణకాండ సాగిస్తూ మమ్మల్ని అంతమొందిస్తున్నారు. మా ఉపయోగాలు పర్యావరణానికే కాదు, మీ మానవ సమాజానికి ఎంత మేలో గత చరిత్రను తిరగేయండి. రాజుల కాలంలో మేం వార్తాహరులం. ప్రేమికుల మధ్యన రాయభారం నడిపే సందేశకులం. ఇలా ఎన్ని చెప్పినా మా గూర్చి తక్కువనే! ఇక వ్యవసాయ రంగలో, మీ ఆహార పంటలకు మేం ఎలాంటి సేవ చేస్తామో తర్వాతి కథనంలో చూద్దాం! ఇంతగా ఉపయోగపడే మా జాతులు రోజురోజుకు వేలల్లో, లక్షలల్లో అంతమైతున్నాయి. మా చివరి గడియల తర్వాతనే మీరు మా రక్షణకై పూనుకుంటున్నారు. ఇదైనా నిజాయితితో కాదు కదా!
వాస్తవం చెప్పాలంటే, మా మనుగడే మీ మనుగడని గుర్తించండి! (వచ్చే సంచికలో మరిన్ని వివరాల్ని చూద్దాం!)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *