ఒకప్పుడు, కందూరు చోళుల పాలనలో ఒక వెలుగు వెలిగిన భీమారం దేవాలయాలు ప్రస్తుతం దిక్కూ దీవాణం లేకుండా కునారిల్లుతున్నాయి. పదిలపరిచే నాథుడు లేక సొమ్మసిల్లుతున్నాయి. పూనుకొని మునుపటి వైభవాన్ని తెమ్మని పాలకుల్ని గడ్డంపట్టుకు బతిమిలాడుతున్నాయి సూర్యాపేటకు కూతవేటు దూరంలో, ఆమనగల్లుకు అల్లంత దూరాన, కేతేపల్లి మండలంలోని భీమారం, మూసీనది ఒడ్డున, ప్రకృతి ఒడిలో నిమ్మళంగా ఉన్న ఒక చిన్న పల్లెటూరు. కందూరు చోళ రాజైన భీమదేవచోడునిపై వెలసిన ఊరు. గ్రామంలో ఊరు బయట కొప్పోలు వైపు ఒకటి, సూర్యాపేట వైపు మరొకటి, రెండు శివాలయాలున్నాయి. కొప్పోలు వైపు దేవాలయం, ప్రవేశమండపం, విశాలమహా మండపం, అర్థమండపం, గర్భాలయాలతో ఉంది. లోపలి నేలరాళ్లు, కప్పురాళ్లు కదిలిపోయాయి. గర్భాలయంలో విగ్రహాలు పక్కకు తొలిగాయి. బయటి గోడలు ఊడిపోయాయి. విమానం ఏమైందో తెలియదుగానీ, గుడిమీద పచ్చికబయలు, గుడి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి.
సూర్యాపేటవైపు దేవాలయం చిన్నది. మహామండపం, అర్థమండపం, గర్భాలయం శిథిలమైనాయి. ఆలయంలో కొలుదీరాల్సిన భైరవుడు, వినాయకుడు చెరోమూల విసిరి వేయబడ్డారు. శివలింగం, పానదట్టాలు విడివడి చెల్లా చెదురైనాయి. మండపంలో ముళ్లపొదలు జడలు విప్పాయి. చుట్టూ చెట్లు పెరిగి ఆలయాన్ని కమ్మేశాయి. బాగు చేసేవాళ్లే లేరా అని అక్కడున్న ఉమ్మెత్త పూలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్పటికైనా మించి పోయింది లేదు. భీమారం గ్రామానికి చెందిన ఎవరో ఒకరు పుణ్యం కట్టుకొని శిథిల శివాలయాలను పదిలపరచి, మళ్లీ గుళ్లళ్లో గంటలు మోగేట్లు చేయకపోతారా అని రెండు దేవాలయాల్లో మూలనపడి ఉన్న నందులు గంపెడాశతో ఉన్నాయి.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి, ఎ : 9848598446