మెయిన్స్ లో విజయం సాధించిన వారికి రూ.లక్ష అందజేస్తాం…
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
సివిల్స్లో తెలంగాణ సత్తా చాటి తెలంగాణ గౌరవాన్ని జాతి స్థాయిలో నిలపాలి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
సివిల్స్ మెయిన్స్కు క్వాలిఫై అయిన 135 మందికి
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద రూ.లక్ష చొప్పున చెక్కుల అందజేత
జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం పెరగాలని.. ముఖ్యంగా సివిల్స్లో మన వారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి కాలరీస్ సామాజిక బాధ్యత నిధులతో ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ మెయిన్స్కు ఎంపికైన 135 మంది అభ్యర్థులకు రాష్ట్ర సచివాలయంలో రూ.లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
సివిల్స్లో ఎంపిక కావడమనే ఏకైక లక్ష్యమే ఉండాలని, కుటుంబ, ఆర్థిక, ఇతర సమస్యలను పట్టించుకోవద్దని సూచించారు. మెయిన్స్లోనూ ఉత్తీర్ణత సాధిస్తే మరో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలంగాణ మేధోసంపత్తిని దేశవ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతో సివిల్స్కు హాజరవుతున్న యువతకు ఆర్థిక ఇబ్బందులు తగ్గించడానికి రాజీవ్‍గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించి తొలివిడతగా 135 మంది తెలంగాణ వ్యాప్త అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ విశిష్టమైన పథకం రూపకల్పనకు కృషిచేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సింగరేణి సంస్థ సహకారాన్ని ప్రశంసించారు.
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ పేద వర్గాల పిల్లలు ఆర్థిక ఇబ్బందుల వల్ల సివిల్స్ లక్ష్యానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సహకారం అందించడం ద్వారా ఎక్కువ మంది సివిల్స్ పట్ల ఆసక్తి పెంచుకోవడం కోసం ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. సింగరేణి సహకారంతో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న అభ్యర్థులందరూ తమ లక్ష్యసాధన పైన దృష్టి ఉంచి ఎక్కువమంది విజయం సాధించాలని, తెలంగాణ గడ్డకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సివిల్స్ అభ్యర్థుల కోసం సింగరేణి సౌజన్యంతో చేపట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం వినూత్నమైన పథకమని దీని వల్ల తెలంగాణ నుంచి ఎక్కువమంది సివిల్స్లో విజయం సాధిస్తారన్నారు.
ఈ కార్యక్రమానికి ముందుగా సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ సభకు స్వాగతం పలుకుతూ ఈ పథకం ప్రారంభించిన నెల రోజుల్లోనే 172 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా అర్హులైన 135 మందిని ఎంపిక చేసామని వీరిలో ఈ డబ్ల్యూఎస్ కేటగిరీలో 21 మంది, ఓబీసీ కేటగిరీలో 62 మంది, ఎస్సీ కేటగిరీ నుంచి 19 మంది, ఎస్టీ కేటగిరీ నుంచి 33 మంది ఉన్నారన్నారు. వీరిలో 22 మంది యువతులు ఎంపికయ్యారని పేర్కొన్నారు.
135 మందికి స్వయంగా చెక్కులు ఇచ్చిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
సాధారణంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే మంత్రులు లేదా ఎమ్మెల్యేలు ఐదు లేక పది మందికి చెక్కులు స్వయంగా అందజేయటం చూస్తుంటాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హాజరైన 135 మంది కూడా తాను చెక్కులు ఇవ్వటానికి ఉంటామని చెప్పి అందరికీ చెక్కులను పంపిణీ చేయడం విశేషం. దీనిపై సివిల్ అభ్యర్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐటీ, కమ్యూనికేషన్స్ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు, సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి, చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, మాలోత్ రాందాస్ నాయక్, డాక్టర్ కవ్వంపల్లి సత్యానారాయణ, రాష్ట్ర కనీస వేతనాల అమలు కమిటీ ఛైర్మన్ బి.జనప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సింగరేణి సంస్థ డైరెక్టర్లు డి సత్యనారాయణ రావు, ఎన్ వి కే శ్రీనివాస్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎస్డీఎం సుభాని, అధికారుల సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
-చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ప్రభుత్వ సంస్థ)
ప్రజా సంబంధాల విభాగం, హైదరాబాద్