ఆమాట నిజమే. కాకతీయ గణపతి దేవుని కాలంలో నిర్మింపబడిన ఆ త్రికూటాలయంలో తిరునాళ్లు ఘనంగానే జరిగాయి. అప్పటి దాకా ఎందుకు గత 50 ఏళ్ల క్రితం కూడా చుట్టు పక్కల ఊర్ల నుంచి బళ్లు కట్టుకొని వచ్చిన ప్రజలు ఒళ్లంతా కళ్లు జేసుకొని ఆ తిరునాళ్లను చూచేవాళ్లని ఇప్పటికీ గుర్తున్న పెద్దలు చెబుతున్నారు. అది ఎక్కడో కాదు. నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలం, రహమంతాపూర్ శివారులో నున్న రామేశ్వరం గుట్ట మీదున్న త్రికూటా లయమే. మూడు గర్భాలయాలు, అర్ధమండ పాలు, వాటిని కలుపుతూ నిర్మించిన రంగమండపం, ఎదురుగా ఉన్న ఆలయంలో విగ్రహం లేదు. కుడి వైపు ఆలయంలో తవ్వేసి భిన్నంగావించిన శివలింగం, ఎడమవైపు ఆలయంలో పీఠాన్ని పెకలించి, కాళ్లు తెగిన అందమైన విష్ణుమూర్తి విగ్రహం. సాదాసీదా గోడలతో, చక్కటి చిక్కటి శిల్పాలున్న ద్వారాలు, అందంగా మలచిన స్థంభాలతో అలరారుతూ, కప్పు రాలి పోయి, దూలాలు కూలిపోయి, అస్తవ్యస్తంగా పడిపోయిన చూరురాళ్లు, చూపరులకు తెప్పిస్తున్నాయి కన్నీళ్లు.
మధ్యయుగ అనంతర కాలంలో ఆదరణ కోల్పోయిన ఈ ఆలయం ఆలనాపాలనా లేక శిథిలమైంది. నిత్యహారతుల మధ్య మోగిన గుడిగంటలు మూగవోయాయి. అఖండదీపాలు ఆరిపోయాయి. మూల విరాట్టులు మూలన బడ్డాయి. పడిపోయిన రాళ్లు పక్కదారులు పట్టాయి. ధూపదీపనైవేద్యాలతో కళకళలాడిన ఆలయాలు గబ్బిలాలకు నిలయాలైనాయి. ఎప్పుడన్నా, ఎవరన్నా ఆ గుళ్ల దగ్గరకొస్తే, వాళ్ల గడ్డంబట్టుకొని బతిమాలుతున్నాయి, బామాలు తున్నాయి. మళ్లీ మాకు మంచిరోజులెప్పుడొస్తాయా అని, మునుపటి మంత్రోచ్చారణలు మళ్లీ వినిపిస్తాయా అని ప్రశ్నలను సంధిస్తున్నాయి, సనాతన ధర్మాన్ని కాపాడమని మొర పెట్టుకొంటున్నాయి.
ఎదురుగా సువిశాలమైన జలాశయం చుట్టూ పచ్చటి పొలాలతో, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లిన ఆలయస్థావరం అన్నీ గొంతు కలిపి మూకుమ్మడిగా గతవైభవప్రాభవాల కోసం పరితపిస్తున్నాయి, శిథిలాలను పదిలపరిచే వారి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి. వారసత్వ ప్రేమికుల గుండెల్ని బరువెక్కిస్తున్నాయి. బాధ్యతను గుర్తుచేస్తున్నాయి.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446