అసలు మోనో క్లోనల్ యాంటీ బాడీస్ అంటే:
రోగనిరోధక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించే ఏదైనా పదార్థాన్ని యాంటిజెన్ (ప్రతిజనకాలు) అంటారు. వ్యాధి కారకాలు (బ్యాక్టీరియా మరియు వైరస్‍లు), రసాయనాలు, టాక్సిన్స్ మరియు పుప్పొడి వంటి ఏదైనా బాహ్య ఆక్రమణదారులు యాంటీజైన్‍లు కావచ్చు. రోగలక్షణ పరిస్థితుల్లో, సాధారణ సెల్యులార్ ప్రొటీన్లు స్వీయ యాంటిజెన్‍లుగా మారవచ్చు. శరీరంలోని ప్రతిజనకాలను గుర్తించి వాటిని శరీరం నుండి తొలగించే రక్షిత ప్రొటీన్లను యాంటీ బాడీస్ (ప్రతి రక్షకాలు) అంటారు. వీటినే ఇమ్యునోగ్లోబ్యులిన్ అని కూడా పిలుస్తారు. ఇక మోనో క్లోనల్ యాంటీబాడీస్ అంటే – మోనో అనగా single, క్లోన్ అనగా similar copies. కాబట్టి ఒకే పేరెంట్ సెల్ నుండి ఉద్భవించిన క్లోన్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన యాంటీబాడీస్‍ను మోనో క్లోనల్ యాంటీ బాడీస్ అంటారు.
రామాయణం గురించి మీకందరికీ తెలుసు కదూ, శ్రీరామచంద్రునికి, రావణుడికి యుద్ధం జరిగే సమయంలో ఇంద్రజిత్తు ఆయుధం దెబ్బకు లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. లక్ష్మణుడు స్పృహనుండి కోలుకోవడానికి సుమేరు పర్వతానికి వెళ్ళి సంజీవని మొక్క తీసుకురావాలని చెప్పడంతో, హనుమంతుడు సంజీవని మొక్కను గుర్తుపట్టలేక మొత్తం సుమేరు పర్వతాన్నే ఎత్తుకొని వస్తాడు. లక్ష్మణుడికి ఆ మొక్క రసాన్ని పోయగా స్పృహ కోల్పోయిన స్థితి నుండి తిరిగి లేస్తాడు. అది సంజీవని మొక్క ప్రత్యేకత. (అప్పటి నుండి ప్రాణాపాయస్థితి నుండి మనుషులను కాపాడే ఔషధాలను సంజీవనిగా పిలవడం మొదలైందని మన పూర్వీకులు చెబుతారు) అయితే ఇది ప్రాచీన కాలం నాటి గాథ. అక్కడి నుండి తిరిగి ఆధునిక యుగానికి వస్తే పూర్వపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్-19 బారిన పడి, తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితికి చేరినపుడు, అతన్ని రక్షించడానికి అమెరికన్ వైద్యులు అతనికి యాంటీ బాడీ కాక్‍టెయిల్ డ్రగ్ (Antibady Cocktail drug) అన్న ఔషధాన్ని ఇవ్వడంతో, ట్రంప్ కొన్ని గంటల వ్యవధిలో కోవిడ్-19 నుండి కోలుకోవడంతో, యాంటీవైరల్ కాక్‍టెయిల్ డ్రగ్‍కు ప్రపంచవ్యాప్తంగా అపర సంజీవనిగా పేరొచ్చింది. ఆ డ్రగ్ అంత సమర్థవంతంగా పనిచేయడానికి, దానికి అంత ప్రాముఖ్యత రావడానికి మూలకారణం మోనోక్లోనల్ యాంటీబాడీస్. అద్భుత ఔషధాల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న మోనోక్లోనల్ యాంటీబాడీస్ కథేంటో మనమూ తెలుసుకుందామా!!
మోనోక్లోనల్ యాంటీబాడీస్ – లక్షణాలు :
- వీటిని కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేస్తారు. ఇవి ఎక్కువ రోగనిరోధకతను కలిగి ఉండి వ్యాధికారక సూక్ష్మజీవులను శరీరం నుండి వెలుపలికి పంపించేందుకు తోడ్పడతాయి.
- ఈ రకమైన యాంటీ బాడీస్‍ను కొన్ని రకాల యాంటీజెన్లను అతుక్కునే విధంగా తయారు చేస్తారు. ఇవి సహజ యాంటీ బాడీస్‍ను అనుకరిస్తాయి. దీంతో మానవ నిరోధక వ్యవస్థ పటిష్ఠం అవుతుంది.
- ఈ రకమైన ప్రతిరక్షక వ్యవస్థ ద్వారా మానవ శరీరానికి రోగనిరోధకత అత్యంత సమర్థవంగా అందుతుంది.
- మానవ శరీరంలోకి ప్రవేశించిన వ్యాధికారక ప్రతిజనకాల (యాంటీజెన్) పై ప్రొటీన్స్ మాలిక్యూల్స్ ఉంటాయి. వాటిని ఎపిటోప్స్ అంటారు. ఇవి ఆ వ్యాధికి సంబంధించిన సమాచారాన్ని తమలో నిల్వ ఉంచుకుంటాయి. ఒక్కో యాంటీ జెన్‍పై సుమారు నాలుగైదు ఎపిటోప్స్ ఉంటాయి.
- ఈ ఎపిటోప్‍లకు వ్యతిరేకంగా, వాటిని శరీరం నుండి వెలుపలికి పంపడానికి ప్రతిరక్షకాలు (యాంటీ బాడీస్) తయారవుతాయి. అన్ని ఎపిటోప్‍లతో కాకుండా, కేవలం ఒకే ఒక్క ఎపిటోప్‍తో అనుసంధానమై దానికి వ్యతిరేకంగా పనిచేయడం మోనోక్లోనల్ యాంటీ బాడీస్ ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు.
- కేరళలో నిఫావైరస్‍ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా నుండి మోనో క్లోనల్ యాంటీ బాడీస్‍ను కొనుగోలు చేయడానికి భారత్ ప్రణాళికలు రూపొందించింది.
ఎవరు కనుగొన్నారు
మోనో క్లోనల్ యాంటీ బాడీస్‍ను తొలిసారిగా నీల్స్కె. జెర్న్, జార్జెస్ ఎఫ్. కోహ్లెర్ మరియు సీజర్ మిల్ స్టెయిన్‍లు 1975లో మానవుల కొరకు ఉపయోగించారు. “The Principle for production of Mono colonal Antibodies” (మోనోక్లోనల్ యాంటీ బాడీస్ ఉత్పత్తి సూత్రం)పై చేసిన కృషికి 1984లో మెడిసిన్‍లో నోబెల్ బహుమతి పొందారు.
ఎలా తయారు చేస్తారు.
మోనో క్లోనల్ యాంటీ బాడీస్‍ను ఈ క్రింది పద్ధతుల ద్వారా తయారు చేస్తారు.
i) హైబ్రిడోమా టెక్నాలజీ:
మోనోక్లోనల్ యాంటీ బాడీస్ తయారు చేయడంలో మొదటి మరియు ప్రసిద్ధి చెందినదిగా హైబ్రిడోమా టెక్నాలజీని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తు న్నారు. హైబ్రిడోమా అనగా హైబ్రిడ్ అంటే సంకర మరియు ఈ సాంకేతి కతలో మైలోమా కణాలను ఉపయోగిస్తారు. కాబట్టి వాటి నుండి ‘‘లోమా’’ అన్న పదంతో తీసుకోవడం జరిగింది. తద్వారా ఈ సాంకేతికతకు హైబ్రిడోమా సాంకేతికత అన్న పేరు వచ్చింది.
ఈ సాంకేతికతలో ప్రతి రక్షకాలను తయారు చేసే తెల్ల రక్తకణాల యొక్క లింఫోసైట్స్లోని దీ కణాలను మరియు మైలోమా కణాలు (అసాధారణ ప్లాస్మాకణాలు) కలిపి హైబ్రిడ్ పద్ధతిలో మోనోక్లోనల్ యాంటీబాడీస్‍ను తయారు చేస్తారు. మైలోమా కణాలు నియంత్రణ లేకుండా అపరిమితంగా విభజన చెందే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ii) రీకాంబినెంట్ డీఎన్‍ఏ టెక్నాలజీ:
రీకాంబినెంట్ డీఎన్‍ఏ టెక్నాలజీ జంతువులు లేదా మానవుల నుండి కూడా పొందిన సెల్‍లైన్లలో (cell lines) mabs(Monoclonal Antibadies) ఉత్పత్తిని అనుమతిస్తుంది. ఈ విధానం ద్వారా తగ్గిన రోగ నిరోధక శక్తితో ప్రతిరక్షకాలను తయారు చేయవచ్చు. ఈ ప్రతిరక్షకాలు మానవ ప్రతి రక్షకాలను పోలి ఉంటాయి.
iii) ఫేజ్ డిస్‍ప్లే టెక్నాలజీ:
ఈ విధానం ద్వారా బ్యాక్టీరియా ఫేజ్‍లను ఉపయోగించి వాటి ఉపరితలంపై ప్రతిరక్షకాలను ప్రదర్శించడానికి ఉపయోగించే ఒక ప్రత్యామ్నాయ పద్ధతి. ఈ సాంకేతికత నిర్దిష్ట బైండింగ్ లక్షణాలతో ప్రతిరక్షకాల ఎంపికను అనుమతిస్తుంది.
ఎలా పనిచేస్తాయి!!
i) చర్యా యంత్రాంగం (Mechanism of Action):
mabs క్యాన్సర్ కణాలు, వైరస్ లేదా బ్యాక్టీరియాలలో నిర్దిష్టంగా నిర్దేశించిన లక్ష్య యాంటీజెన్‍ను సమర్థ వంతంగా బంధిస్తాయి. ఈ విధంగా బంధించడం వల్ల mabs యాంటిజెన్ పనితీరును నిరోధిస్తాయి. లక్ష్య నిర్దేశిత యాంటిజెన్‍ను రోగ నిరోధక వ్యవస్థ ద్వారా నాశనం చేసేందుకు అనువైన పరిస్థితులను సృష్టిస్తాయి. అంతే కాకుండా నిర్దేశిత యాంటిజెన్‍ను నిర్వీర్యం చేసేందుకు కావలసిన ఔషధాలను సరఫరా చేస్తాయి.
ii) నిర్దిష్టత మరియు ఎంపిక (Specificity and selectivity):
mabs అసాధారణ స్థాయి నిర్దిష్టతను (specificity) ప్రదర్శిస్తాయి. శరీరంలోని బహుళ పక్రియలను ప్రభావితం చేసే సాంప్రదాయ ఔషధాలతో పోలిస్తే, నిర్దిష్ట లక్ష్యాన్ని గుర్తించి, దానితో పరస్పర చర్య జరపడంలో ఇవి మరింత ప్రత్యేకతను ప్రదర్శిస్తాయి.
iii) సాంప్రదాయ ఔషధాలతో పోలిక (comparison with Traditional Drugs):
తరచుగా విస్తృత ప్రభావాలను కలిగి ఉండే సాంప్రదాయ ఔషధాలతో పోల్చితే లక్ష్య నిర్దేశిత యాంటీజెన్‍ను నిర్వీర్యం చేయడంలో mabs మరింత నిర్దిష్టతను ప్రదర్శిస్తాయి. mabs యొక్క ఈ ప్రత్యేక లక్షణం, వ్యాధి చికిత్సా విధానాన్ని మెరుగుపరచడానికి, సైడ్ ఎఫెక్టస్ను తగ్గించడానికి తోడ్పడుతుంది. అయినప్పటికీ వాటిని అభివృద్ధి చేయడానికి మరియు ఉత్పత్తి చేయడానికి అధిక నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మోనో క్లోనల్ యాంటీ బాడీస్ – వాటి రకాలు :
i) మ్యురిన్ (మౌస్ ఉత్పన్నం) యాంటీబాడీస్ Murine (Mouse – Derived) Antibodies) :
ఈ ప్రతి రక్షకాలను పూర్తిగా ఎలుకల నుండి ఉత్పత్తి చేస్తారు. వీటిని మానవులపై ప్రయోగించినపుడు రోగ నిరోధక ప్రతి స్పందనను పెంపొందిస్తాయి. ఇవి వైద్యపరమైన వినియోగానికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి.
ii) చిమెరిక్ యాంటీ బాడీస్ (Chimeric Antibodies):
ఎలుక మరియు మానవుని యొక్క ప్రొటీన్లను సమ్మిళితం చేయడం ద్వారా వీటిని తయారు చేస్తారు.
iii) హ్యూమనైజ్డ్ యాంటీ బాడీస్ (Humanized Antibodies):
ఈ రకమైన యాంటీ బాడీస్‍ను ఉత్పత్తి చేయడంలో అధిక భాగం ప్రొటీన్లను మానవుల నుండి తీసుకోగా, యాంటీజెన్ బైండింగ్ కారక ప్రొటీన్లను మాత్రం ఎలుకల నుండి తీసుకొంటారు.
iv) పూర్తిస్థాయి హ్యూమన్ యాంటీ బాడీస్ (Fully Human Antibodies):
ఈ రకమైన ప్రతిరక్షకాలను పూర్తిగా మానవుల నుండి సేకరించిన ప్రొటీన్లతోనే ఉత్పత్తి చేస్తారు. అయితే ఇవి తక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉండి, వ్యాధుల చికిత్సా విధానంలో మంచి ఫలితాలనిస్తాయి.
మోనోక్లోనల్ యాంటీ బాడీస్ – అనువర్తనాలు:
i) క్యాన్సర్ థెరపీ :
లక్ష్య నిర్దేశిత క్యాన్సర్ థెరఫీలలో మోనో క్లోనల్ యాంటీ బాడీస్ కీలక పాత్ర పోషిస్తాయి. క్యాన్సర్ కణాలపై నిర్దిష్ట యాంటీజెన్‍లను గుర్తించడంలోనూ, వాటి వృద్ధిని నిరోధించడం లోనూ, వ్యాధికారక యాంటీజెన్‍లపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేసే విధంగా సంకేతాలు ఇవ్వడం లేదా నేరుగా క్యాన్సర్ కణాలకు విషపూరిత పేలోడ్‍లను పంపిణీ చేయడం లాంటి క్రియలను నిర్వర్తించవచ్చు.
ii) ఆటో ఇమ్యూన్ డిసీజెస్ :
మన శరీంలోని రోగనిరోధక వ్యవస్థనే, మన శరీరంలోని ఆరోగ్యకర కణాలపై దాడులు చేసినట్లయితే అలాంటి వ్యాధులను ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటారు. ఉదా।।కు మల్టిపుల్ స్ల్కీరోసిస్, స్ల్కీరోడెర్మా, టైప్-1 డయాబెటిస్ మొ।।నవి. ఇలాంటి వ్యాధులు చికిత్సలో mabs కణజాలాల వాపును తగ్గించడం మరియు ఆరోగ్యకరమైన కణజాలాల క్షీణతను తగ్గించడంలోనూ సహాయపడడంతో పాటు, రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కణజాలాలకు హాని చేయకుండా సరైన రీతిలో పనిచేసే విధంగా నియంత్రిస్తుంది.
iii) సాంక్రమిక వ్యాధులు (infections diseases) :
బ్యాక్టీరియా మరియు వైరస్ సాంక్రమిక వ్యాధుల చికిత్స mabs మంచి ఫలితాలను అందిస్తాయి. ఈ క్రమంలో వ్యాధికారక యాంటీజెన్ల పనితీరును తటస్థం చేయడం లేదా యాంటీజెన్లు అతిథేయి కణాలలోకి ప్రవేశించకుండా నిరోధించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి.
iv) న్యూరోలాజికల్ డిజార్డర్స్ :
అల్జీమర్స్ మరియు మల్టిపుల్ స్ల్కీరోసిస్ లాంటి నాడీ సంబంధిత అపసవ్యతలను నివారించడంలో mabs ద్వారా మెరుగైన చికిత్సా విధానాలను అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
v) కోవిడ్19 చికిత్స :
కోవిడ్-19ను నిరోధించి, వ్యక్తులు పూర్తిగా కోలుకునేందుకు mabs అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి.
vi) డయాగ్నోస్టిక్ టూల్స్ :
మోనోక్లోనల్ యాంటీ బాడీస్ రోగి నమూనాలలో నిర్దిష్ట ప్రొటీన్లు లేదా వ్యాధి కారకాలను గుర్తించడానికి ELISA(ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సోర్బెంట్ అస్సే) వంటి రోగ నిర్థారణ పరీక్షలలో ఉపయోగించబడతాయి.
vii) పరిశోధన సాధనాలు :
నిర్దిష్టప్రొటీన్లు మరియు కణాల పనితీరును అధ్యయనం చేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో మోనోక్లోనల్ యాంటీబాడీలను ఉపయోగిస్తారు. రోగ నిరోధకశాస్త్రం, కణజీవశాస్త్రం మరియు జన్యు శాస్త్రం వంటి రంగాలలో మోనో క్లోనల్ యాంటీ బాడీస్ విలువైన సాధనా లుగా ఉపయోగించ బడుతున్నాయి.
viii) బయోటెక్నాలజీ రంగం:
మోనో క్లోనల్ యాంటీ బాడీస్ బయోటెక్నాలజీ పరిశ్రమలో ప్రొటీన్ల శుద్ధీకరణ మరియు ఐసోలేషన్ కోసం ఉపయోగిస్తారు. ఔషధాల ఆవిష్కరణ మరియు అభివృద్ధి పక్రియలలో mabsను కీలక ఉపకరణాలుగా వినియో గిస్తున్నారు.
సవాళ్ళు మరియు పరిమితులు
i) ఇమ్యునోజెనెసిటీ :
మానవేతర జీవుల నుండి సేకరించిన ప్రొటీన్లతో నిర్మితమైన కొన్ని mabsరోగులలో రోగనిరోధక వ్యవస్థ ప్రభావాన్ని తగ్గించడంలోనూ, రోగుల శరీరంలో అనేక ప్రతికూల విపరిణా మాలకు దారితీసేందుకు తోడ్పడుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. దీనికి శాస్త్రవేత్తలు పరిష్కారం అన్వేషించాల్సి ఉంది.
ii) ఖర్చుతో కూడుకొన్నవి :
mabs అభివృద్ధి మరియు ఉత్పత్తి చాలా ఖరీదైనది. ప్రధానంగా వనరుల లభ్యత తక్కువగా ఉన్న ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలలో మానవాళికి వీటి లభ్యత పరిమితంగా ఉంటుంది.
iii) కొన్ని కణజాలాలలోకి పరిమిత ప్రవేశం :
mabs కొన్ని కణజాలాలోకి చొచ్చుకు పోవడంలో లేదా రక్త – మెదడు సంబంధిత కణజాలలను దాటి ముందు కెళ్ళడంలో మెరుగైన పని తీరును ప్రదర్శించలేక పోతు న్నాయి. అందువల్ల మెదడు, రక్త కణజాలాలకు సంబంధిం చిన వ్యాధుల నివారణలో ఇవి పరిమిత ప్రభావాన్ని కలిగి
ఉన్నాయి.
iv) నైతిక సమస్యలు :
mabs ఉత్పత్తిలో జంతువుల వినియోగం నైతిక సంబంధిత ప్రశ్నలను లేవనెత్తుతోంది. జంతువుల వినియోగాన్ని తగ్గించడానికి మరియు ప్రత్యామ్నాయ పద్ధతుల అన్వేషణకు కృషి కొనసాగాల్సిన అవసరం ఉంది.
చివరగా :
ప్రపంచాన్ని ప్రస్తుతం విభిన్న రకాల వైరస్‍లు చుట్టు ముడుతూ మానవాళి ఆరోగ్యాన్ని చిగురుటాకులా వణికిస్తున్నాయి. ఇటీవలే మంకీపాక్స్ వైరస్ మహ మ్మారిగా రూపాంతరం చెందడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి(International Health Emergency)ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోవిడ్-19, మంకీపాక్స్, నిఫా వైరస్‍ల్లాంటి మొండి వ్యాధులను నియంత్రించడంలో మోనో క్లోనల్ యాంటీ బాడీస్‍తో కూడిన చికిత్సా విధానం కారు చీకట్లో కాంతి రేఖలా మానవాళికి ఉపశమనం కలిగిస్తోంది. mabs వల్ల తలెత్తే ప్రతికూల ప్రభావాలను తగ్గించి, వాటి పనితీరును మెరుగు పరిచినట్లయితే పురోగమన దిశలో ప్రపంచం ఆరోగ్యరంగంలో ఇంకో మెట్టు అధిరోహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
–పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్ అసిస్టెంట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప
ఎ : 9550290047