18వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం పతనావస్థకి చేరుకుంది. కానీ అప్పుడు ఢిల్లీ గొప్ప ఉర్దూ కవులకు నిలయంగా మారింది. 1800 వ దశకం ప్రారంభంలో మీర్జా ఆసదుల్లాఖాన్ గాలీబ్ అందరి కంటే ఉన్నతంగా ఆవిర్భవించాడు. గాలీబ్ ప్రేమ గురించి, బాధ గురించి మద్యం గురించి మాత్రమే కాదు జీవితంలోని బాధల గురించి గొప్ప కవిత్వం రాశాడు.
చట్టంతో గాలిబ్ సంబంధం
గాలీబ్ తండ్రి మీర్జా అబ్దుల్లా బేగ్‍ఖాన్, అతను 1803వ సంవత్సరంలో చనిపోయాడు. అప్పుడు గాలీబ్ వయస్సు ఐదు సంవత్సరాలు. గాలీబ్ తండ్రి చనిపోయిన తరువాత గాలీబ్, అతని సోదరుల బాగోగులని అతని మేనమామ మీర్జా నజరుల్లా బేగ్ చూడటం ప్రారంభించాడు. అప్పుడు అతను మరాఠాల ఆధీనంలో వున్న ఆగ్రా ఫోర్టులో కమాండర్‍గా పనిచేసేవాడు. ఆ తరువాత బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కమాండర్ ఇన్ చీఫ్‍గా నియమించింది. అప్పుడు అతని జీతం నెలకి 17,000/ల రూపాయలు. అతను 1806వ సంవత్సరంలో చనిపోయాడు. అతని పెన్షన్ని నెలకి 10,000/- రూపాయలుగా బ్రిటీష్ ఈస్ట్ ఇండియా నిర్ణయించింది. అయితే ఆ పెన్షన్‍ని కొన్ని కారణాల వల్ల ఫిరోజ్‍పూర్ జిర్కాతో ముడిపెట్టినారు. 1822వ సంవత్సరంలో షంషాద్దీన్‍ని ఎస్టేట్ మేనేజర్‍గా ఫిరోజ్‍పూర్ నవాబు ప్రకటించాడు. షంషాద్దీన్ అతని కొడుకు. ఫిరోజ్‍పూర్ నవాబు మేనకోడలు ఉమ్రాద్. గాలీబ్ భార్య. బేగ్ కుటుంబ పెన్షన్‍ని 3,000 రూపాయలకి కుదించినారు. అందులో గాలీబ్ వాటా 62.50 రూపాయలు.
ఈ పెన్షన్ కోసం పోరాటం చేస్తూ గాలీబ్ తన సగం జీవితాన్ని గడిపాడు. శక్తివంతులైన తన స్నేహితుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. కానీ విఫలమయ్యాడు. అందుకని న్యాయపరంగా ఈ సమస్యను ఎదుర్కోవాలని అనుకున్నాడు. అయితే అది ఆయన జీవితంలో ప్రధాన అంశంగా మారిపోయింది.
1811వ సంవత్సరంలో తన పెన్షన్ కోసం ఢిల్లీలోని బ్రిటీష్ రెసిడెంట్ సర్ చార్లీస్ మోట్ కాల్ప్ని సంప్రదించాడు. ప్రత్యక్షంగా కలువడాన్ని విఫలయత్నం చేశాడు. కలకత్తాలో వున్న గవర్నర్ జనరల్ ఎలియమ్ ఆమ్హోర్టస్ అతనికి సహాయం చేయగలరని గాలీబ్‍కి ఎవరో చెప్పారు.
1826 గాలీబ్ కలకత్తాకి బయల్దేరాడు. ఫిబ్రవరి 21, 1828 నాడు కలకత్తా చేరుకున్నాడు. చాలాకాలం అక్కడే వుండిపోయాడు. బ్రిటీష్ చీఫ్ సెక్రటరీని కలిసి తన క్లెయమ్‍ని వివరించినాడు అతని కేసు వివరాలని గవర్నర్ జనరల్ ముందు వారు ఉంచారు. కానీ ఆ గవర్నర్ ఆ కేసుని వినడానికి నిరాకరించాడు. ఢిల్లీ రెసిడెంట్ ద్వారా వస్తే తప్ప కేసుని విననని, పరిశీలించనని గవర్నర్ చెప్పాడు. అప్పటికీ మెట్‍కాల్ఫ్ స్థానంలో ఎడ్వర్ట్ కోలే బ్రూక్ రెసిడెంట్‍గా వచ్చారు. అతను గాలీబ్‍కి పరిచయం వుంది. వెంటనే గాలీబ్ పండిట్ హీరానంద్‍ని న్యాయవాదిగా ఎంపిక చేసుకొని తన కేసుని రెసిడెంట్ ముందు ప్రజెంట్ చేయమని కోరినాడు. తన వస్తువులని కొన్నింటిని అమ్మి ఆ డబ్బులని కేసు కాగితాలకి, వకాత్ నామాని తన న్యాయవాదికి పోస్ట్ ద్వారా గాలీబ్ పంపించాడు. కానీ కేసు దాఖలు చేసే లోపు కొల్‍బ్రూక్ ఢిల్లీ నుంచి బదిలీ అయినాడు. అతని స్థానంలో విలియమ్ ప్రేషర్ వచ్చాడు. కేసు త్వరగా పరిష్కారం అవుతుందన్న గాలీబ్ ఆశలపై నీళ్ళు చల్లినట్టు అయ్యింది. ఒకానొక సమయంలో గాలీబ్ కలకత్తాలోని సదర్‍దివాన అదాలత్‍ని బాగా సంప్రదించాడు. కానీ ఆ అదాలత్‍కి అధికార పరిధి లేదన్న కారణంగా అతని కేసుని కొట్టివేసినారు.
సమస్య విచారణలో వుండగా బాధాతప్తుడైన గాలీబ్ 1929వ సంవత్సరంలో ఢిల్లీకి వచ్చాడు. కలకత్తాలో గడిపిన కాలాన్ని అత్యంత బాధాకరమైన కాలంగా గాలీబ్ పేర్కొన్నాడు.
కలకత్తా గురించి పేరు ప్రస్తావించి
మిత్రమా
నా గుండెను బాణంతో గుచ్చావు అని అనేవాడు గాలీబ్.
ఢిల్లీ రెసిడెంట్ ముందు అతను దాఖలు చేసిన దావాను కూడా కొట్టివేసినారు. ఈ తీర్పుకి వ్యతిరేకంగా గాలీబ్ అప్పీలు దాఖలు చేసారని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. దాన్ని కూడా బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తిరస్కరించిందని చెబుతారు.
ఇక్కడితో గాలీబ్ పెన్షన్ కథ అయిపోలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ గాలీబ్ కేసుని కొట్టివేసిన కొద్దిసేపటికే అతని భార్య బంధువు నవాబు షంషుద్దీన్ అతనికి అనుకూలంగా నిర్ణయించడానికి ప్రేషర్‍ని ఒప్పిస్తానని చెబుతాడు. గాలీబు అప్పు చేసి అతనికి డబ్బు ఇస్తాడు. అయితే విధి వక్రించి నవాబు బ్రిటీష్ వారిపై విరుచుకుపడతాడు. అదే సమయంలో నవాబు షంషుద్దీన్ వాజీర్‍ఖానూకుని వివాహాం చేసుకుంటాడు. ఆమె గానంతో ఫ్రేష•ర్ దృష్టిని ఆకర్షించిన మహిళ. మార్చి 22, 1835లో ఫ్రేష•ర్‍ని ఎవరో హత్యచేశారు. ఝంషొద్దీన్‍ని ముద్దాయిగా అరెస్టు చేశారు. కుట్ర హత్యలకి పాల్పడినాడని మరణదండనని అతనికి విధిస్తారు. ఘంషాద్దీన్ మరణంతో తిరిగి పెన్షన్ పొందే గాలీబ్ ఆశలని కోల్పోతాడు.
ఢిల్లీకి వచ్చిన తరువాత మరిన్ని అప్పులని గాలీబ్ చేశాడు. ఇంగ్లీషు మతాన్ని చౌసర్ జూదాన్ని గాలీబ్ ఎక్కువ ఇష్టపడేవాడు. అప్పుల్లో కూరుకొని పోయాడు గాలీబ్. 1837వ సంవత్సరంలో గాలీబ్ మీద మనీరికవరీ కోసం కేసు దాఖలైంది. కేసు డిక్రీ అవుతుంది. అతని తరపున అతని స్నేహితుడు డబ్బు చెల్లించారని చెబుతారు. (మిగతా వచ్చే సంచికలో)
–మంగారి రాజేందర్ (జింబో), ఎ : 9440483001