తెలంగాణ పారిశ్రామిక వృద్ధిలో అమెరికన్‍ కంపెనీలు భాగస్వాములు!

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో, ఫోర్త్ సిటీ నిర్మాణంలో, ఎదుగుదలలో పాలుపంచుకోవాలని అమెరికన్‍ పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. సెప్టెంబర్‍ 24న ఆయన అమెరికాలోని లాస్‍ వేగాస్‍లో ప్రారంభమైన అంతర్జాతీయ మైనెక్స్-2024 ప్రదర్శనలో పాల్గొన్న అనంతరం పలు అమెరికన్‍ కంపెనీల ప్రతినిథులతో సమావేశమయ్యారు. ఆయనతోపాటు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్‍, సింగరేణి సిఎండి ఎన్‍.బలరామ్‍, స్పెషల్‍ సెక్రెటరీ క్రష్ణభాస్కర్‍, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు, వ్యాపారాలకు హైదరాబాద్‍ అత్యంత అనువైన ప్రాంతమని, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తుందని, కనుక ఇక్కడ ఖనిజ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడాలని ఇందుకు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఖనిజాలను రక్షణతో మంచి ఉత్పాదకతతో ఉత్పత్తి చేయడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చవచ్చని తెలిపారు. భూగర్భంలో దాగిన విలువైన ఖనిజాలను వెలికి తీయడంలో, నిలకడగల అభివృద్ధిని సాధించడంలో అమెరికన్‍ కంపెనీలు భాగస్వాములు కావచ్చని సూచించారు. హైదరాబాద్‍కు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫోర్త్ సిటీలో కూడా భాగస్వాములు కావాలని ఆయన అమెరికన్‍ పారిశ్రామిక కంపెనీలకు, వాణిజ్య సంస్థలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఇక్కడ స్థాపించిన అమెరికన్‍ కంపెనీలు ఎంతో సౌకర్యవంతంగా తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నాయని, ఇంకా వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉన్నందున దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


తెలంగాణకు చెందిన ప్రభుత్వ కంపెనీ అయిన సింగరేణికి క్రిటికల్‍ మినరల్స్ అన్వేషణలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన ఇరుదేశాధినేతల సమావేశంలో పరస్పరం రెండు దేశాలు ఒకరికొకరు తోడ్పడాలని అంగీకరించిన నేపథ్యంలో అమెరికన్‍ కంపెనీలు మరింతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


అమెరికన్‍ ప్రభుత్వ ప్రతినిథి బృందానికి నాయకత్వం వహిస్తున్న గ్లోబల్‍ మార్కెట్స్ సహాయ కార్యదర్శి అరుణ్‍ వెంకటరామన్‍ ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్‍లో ఇప్పటికే అమెరికాకు చెందిన పలు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహించుకుంటున్నాయని, ఈ ఒరవడిని కొనసాగిస్తూ మరిన్ని అమెరికన్‍ సంస్థలు తెలంగాణలో తమ వ్యాపారాలు ప్రారంభిస్తాయని ఆయన ఆశాభావం ప్రకటించారు.


భారీ యంత్రాలు, సేవల ప్రదర్శనలో 1900 కంపెనీలు

నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ భారీ అంతర్జాతీయ మైనెక్స్-2024 ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 1900 యంత్ర ఉత్పత్తి సంస్థలు తమ స్టాల్స్ను ఏర్పాటు చేసుకున్నాయి. వీటిలో భారీ మైనింగ్‍ తవ్వకాల యంత్రాలు మరియు ఖనిజ రవాణా వాహనాలు, రక్షణ సేవలు, అనుబంధ యంత్ర విభాగాలను ప్రదర్శనకు ఉంచారు. 121 దేశాల నుండి సుమారు 44,000వేల మంది ప్రతినిథులు దీనిలో పాల్గొం టున్నారు. రాష్ట్రం నుంచి తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు సారథ్యం లోని రాష్ట్ర అధికారుల బృందం ప్రముఖ ఖనిజ పరిశ్రమల యంత్ర తయారీ సంస్థలైన కొమాట్సు, క్యాటర్‍ పిల్లర్‍, బి.కే.టి టైర్స్ తదితర స్టాల్స్ను సందర్శించారు. అథికోత్పత్తి సాధించే రక్షణ సహిత భారీ యంత్రాల గురించి ఆయా కంపెనీల వారు తమ ప్రత్యేకతలను వివరించారు. ప్రదర్శనలో ఉంచిన వాటిలో అత్యాధునిక కంటిన్యూయస్‍ మైనర్‍ యంత్రాలు, లోడ్‍ హాల్‍ డంపర్లు, మైనింగ్‍ డోజర్లు, బ్లాస్ట్ హోల్‍ డ్రిల్స్, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ ఇంకా అత్యాధునిక టైర్లు, స్పేర్లు, వివిధ సేవలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ఉత్పత్తిదారులతో సమావేశాలు నిర్వహించడం జరిగింది.
అమెరికన్‍ ప్రతినిథి బృందంలో ఇంకా గ్లోబల్‍ మార్కెట్స్ సీనియర్‍ పాలసీ అడ్వైజర్‍ ఒలిమర్‍ రివేరానోవా, కమర్షియల్‍ స్పెషలిస్ట్ శాంతను సర్కార్‍, ఇంటర్నేషనల్‍ ట్రేడ్‍ స్పెషలిస్ట్ కార్నిలియస్‍ గ్యాంఫి, గ్లోబల్‍ ఎనర్జీ సెక్టార్‍ లీడర్‍ డేరెక్ట్ శ్లికెషన్‍, గ్లోబల్‍ డిజైన్‍ అండ్‍ కన్స్ట్రక్షన్‍ స్పెషలిస్ట్ జాస్మిన్‍ బ్రాస్‍ వెల్‍ తదితరులు పాల్గొన్నారు.


-చీఫ్‍ పబ్లిక్‍ రిలేషన్స్ ఆఫీసర్‍
ది సింగరేణి కాలరీస్‍ కంపెనీ లిమిటెడ్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *