దామగుండంను కాపాడుకుందాం!

ఈ మధ్య బాగా వినిపిస్తున్న పదం పర్యావరణం. మేధావులనుంచి సామాన్య ప్రజల దాకా, అంతర్జాతీయ సంస్థల నుంచి గ్రామీణ యూనిట్స్ దాకా ఏనోట విన్నా ఈ పర్యావరణం అన్న పదమే. ఇది విషాదకరమూ, ఆనందకరమూనూ. రోజురోజుకీ విధ్వంసమవుతున్న పర్యావరణ సమతుల్యత గురించి నిరంతరం ఆందోళన చెందవలసిరావటం విషాదకరం. అన్ని విపత్తులకీ ఈ విధ్వంసమే కారణమనే స్ప•హ సామాన్య ప్రజలలో కూడా పెరిగి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం ఆనందకరం.


ప్రజల జీవన వికాసానికి వివిధ రంగాలలో సమగ్రాభివృద్ధి కీలకమైన అంశం. అయితే ఈ అభివృద్ధి సుదీర్ఘ ప్రయోజనాల పునాదిగా సమగ్ర ప్రణాళికలతో సాగవలసి వుంటుంది. మనిషి మనుగడకి, మనిషి సంక్షేమానికి ఉపయోగపడని అభివృద్ధి, హాని కలిగించే అభివృద్ధి, విధ్వంసకర అభివృద్ధి అవుతుంది. ఈ అవాంఛనీయ అభివృద్ధిని నిరాకరించడం అభివృద్ధిని నిరాకరించడం కాదు.


హైద్రాబాద్‍ విశ్వనగరంగా రూపొందుతున్న దశలో హైద్రాబాద్‍కి, తెలంగాణాకు పెను ప్రమాదం దామగుండం అటవీ విధ్వంసం రూపంలో పొంచివుంది. వికారాబాద్‍ సహజ అటవీ ప్రాంతంలో ఈ దామగుండం వుంది. ఇక్కడ ఏడెనిమిది శతాబ్దాల చరిత్ర వున్న రామలింగేశ్వరస్వామి ఆలయం వుంది. దీనికి 2,713 ఎకరాల ఎండోమెంట్‍ భూమి వుంది. దానిలో 12 లక్షల వృక్షాలున్నాయి. 150 రకాల ఔషధీ మొక్కలు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడున్న గుండం 365 రోజులూ పుష్కలమైన, స్వచ్ఛమైన నీటితో కలకల లాడుతుంది. ఇక్కడ చుట్టుపక్కల వున్న 20 పల్లెల్లో 60వేల మంది ప్రజలు, వారి పశువులుతో ఈ అడవిని ఆసరా చేసుకుని జీవిస్తున్నారు. ఇప్పుడు ఈ భూమి ఎండోమెంట్‍ నుంచి అటవీ శాఖకు అప్పగించబడి రాడార్‍ కేంద్ర నిర్మాణం కోసం నేవీకి యివ్వడం జరిగింది. రాడార్‍ నిర్మాణం కోసం 12 లక్షల చెట్లను నరకబోతున్నారు. దీనివల్ల జరిగే పర్యావరణ అసమతుల్యతను, నష్టాలను, భవిష్యత్‍ ప్రమాదాలను అంచనా వేయడం సాధ్యంకాదు. ఇక్కడే పుట్టిన మూసీనది, ఇక్కడ ప్రవహించే ఈసా, కార్నా నదులు ధ్వంసమవుతాయి. వరదలు, పొల్యుషన్‍, ప్రకృతి విపత్తులకు, నీటికొరతకు హైద్రాబాద్‍ నగరం, తెలంగాణా గురవుతాయి.


ఒక వైపున అడవుల పెంపుకోసం, మూసీనది ప్రక్షాళన కోసం కృషి జరుగుతున్న సమయంలో దామగుండం అడవులను నరికవేత, రాడార్‍ కేంద్ర నిర్మాణం అభిషణీయం కాదు.


హైద్రాబాద్‍ రక్షణ కోసం, తెలంగాణా రక్షణ కోసం దామ‘గుండం’ను కాపాడుకుందాం

 (మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *