గోండుల దివాళి నృత్యోత్సవం

హిందువులు ఆశ్వయుజ మాసంలో (అక్టోబర్లో ) దసరా, దీపావళి పండుగలను జరుపుకుంటే ఇవే పండుగలను గోండు గిరిజనులు ‘దివాడి’ మాసంలో జరుపుకుంటారు. హిందువుల పండుగలకు, గోండుల పండుగలకు మధ్య చాలా భిన్నత్వం ఉంది. హిందువుల దీపావళి పండుగలో భాగంగా మొదటి రోజు భోగి కాల్చడం, తరువాత రోజున నరక చతుర్దశి పేరున దీపాలు వెలిగించి, టపాసులు, బాణసంచా కాల్చడం ప్రధాన అంశాలు కాగా… గోండులు దీపావళి పండుగ జరుపుకునే మాసానికే ‘దివాడి’ అని పేరు పెట్టుకొని భోగి, దివాడి, దివాడి అనంతర రోజులలో ‘దండారి పండుగ’ పేరిట ‘గుస్సాడి న•త్యోత్సవాలు’ జరుపుకుంటారు. గుస్సాడి న•త్యాలు ఇంకా వైభవంగా నిలిచి ఉన్నది తెలంగాణలోనే. ఆ వైభవ విశేషాలను, ప్రత్యేకతలను తెలుసుకోవడం తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకించి నర్తకులకు చాలా అవసరం.


దండారి పండుగను పద్ధతి ప్రకారమైతే ఐదు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజైన భోగి నాడు గుస్సాడీ నర్తకులు, వారి సహాయకులైన పోరిక్‍లు వేషధారణ చేసుకుంటారు. గుస్సాడీలు నటరాజ శివుడిలాగా, పోరిక్‍లు అంటే మగపిల్లలే ఆడపిల్లలలాగా తయారవుతారు. వీరందరు  నృత్యం చేయాలి కాబట్టి వారికి  నృత్య పద్ధతులను (చాల్‍లు) సూచించే ‘కోల వెహె’ కూడా ఆ రోజే తయారవుతాడు. ఈయన మాత్రం తెల్లగుడ్డను తల చుట్టూ చుట్టుకొని వెనుక వైపు ముడి వేసుకుంటాడు.
వీరు అందరు ఆ రోజు నుంచి స్నానం చేయకుండా పండుగ అయిపోయే వరకు నిష్టగా ఉండాలి. అలా ఉంటామని ‘కుద్ద తిరివల్‍’ పేరిట ప్రమాణం చేయాలి. అంటే… గోండు పటేల్‍ (తెగ పెద్ద) ఇంటి ముందర పందిరి కింద తవ్విన బద్ది (రంధ్రం)లో ఒకరి తరువాత ఒకరు తమ కుడి కాలు మడమ పెట్టి తమ చుట్టు తాము ఒకసారి తిరగాలి. అదొక విజయ ఘట్టం, పవిత్ర సూచన కాబట్టి ఇతర గోండులు కుద్ద తిరిగినవారికి అభినందనలు తెలుపుతారు.


భోగి నిర్ణయం,  నృత్యం:
అయితే ఈ భోగి దినాన్ని మాత్రం ఒక్కో గోండు గ్రామస్థులు ఒక్కోలాగ నిర్ణయించుకుంటారు. అంటే అందరికీ భోగి ఒకే రోజు ఉండదు. ఎవరి అనుకూలతలను బట్టి వారు నిర్ణయించుకుంటారు. దండారి పండుగను జరిపే గ్రామాలు మరో గ్రామానికి ఆతిధ్యం ఇస్తారు, ఇంకో గ్రామానికి అతిథులుగా వెళ్తారు. మరి కొందరు గోండు గ్రామస్థులు గోదావరి ఒడ్డున ఉన్న పద్మల్పురి కాకో వంటి దేవతల దర్శనానికి వెళ్తారు. ఇలాంటి పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని భోగి రోజును ఒక్కో గ్రామస్థులు ఒక్కో రోజుగా నిర్ణయించుకుంటారు.
భోగినాడు గుస్సాడీలు, పోరిక్‍లు ధరించే ఆహార్యం, వాయిద్యాలను కలిపి ‘ఏత్మసూర్‍’ (ఆత్మదైవం) పేరిట పూజించి, ‘పాతి భోజనం’ పేరిట ఒక పెద్ద తలె (ప్లేట్‍)లో గుస్సాడీలు, పోరిక్‍లు కలిసి ‘సహ’ విందు భోజనం చేసిన తరువాత అందరూ కలిసి రాత్రి వరకు ఉత్సాహంగా నృత్యం చేస్తారు.
దండారి అతిథులుగా, ఆతిథ్యులుగా:
రెండవ రోజు నుంచి ఒక గ్రామస్ధుల గుస్సాడీల బృందo తమను ఆహ్వానించిన ఆతిధ్య గ్రామానికి దండుగా వెళ్తారు. కాబట్టి ఈ పండుగను ‘దండారి’ అంటారు. గుస్సాడీలను పవిత్రులు, దైవ సమానులుగా భావిస్తారు. కాబట్టి వారికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి ‘డియ్యూర్‍’లు అనే బృందo సభ్యులను నియమిస్తారు. వీరు దండారి ఊరికి వెళ్ళే ముందు కుద్దు తిరుగుతారు. అలా తిరిగిన తరువాత వీరు కూడా పండుగ ముగిసే వరకు స్నానం చేయకుండా నిష్టగా ఉండాలి. మగవారు దండారి పోవడం దీపావళికి ముందే జరగాలి.
ఈ పండుగలో నర్తించే ‘డియ్యాన్‍’లు అనే స్త్రీలు మాత్రం దివాడికి ముందు కుద్దు తిరుగరాదు, దండారికి పోరాదు. దివాడి తెల్లారి కుద్దు తిరుగవచ్చు. నృత్యం చేయవచ్చు. అయితే ఈ స్త్రీలు కుద్దు తిరిగిన తరువాత దండారి పండుగ అయిపోయే వరకు స్నానం చేయకుండా నిష్టగా ఉండాలి. మధ్యలో బహిష్టు / ముట్టు అయినా కూడా స్నానం చేయకుండా అలాగే ఉండాలి.


ఒక రోజు ఒక గ్రామస్థులు మరో గ్రామానికి వెళ్తే మరో రోజు ఇంకో గ్రామస్థులను అతిథులుగా తమ గ్రామానికి ఆహ్వానిస్తారు. డియ్యూర్‍లు అతిథులకు మర్యాదలు చేస్తారు. భోజనాలైన తరువాత అతిథులుగా వచ్చినవారు, ఆతిథ్యం ఇచ్చినవారు అందరూ కలిసి రాత్రంతా గుస్సాడీ నృత్యం చేస్తారు. స్త్రీలు వలయాకారంలో ‘డియాన్‍’ నృత్యం చేస్తుండగా వారికి వెలుపల గుస్సాడీలు నర్తిస్తూ తిరుగుతుంటారు.
నర్తకులు… ప్రత్యేకించి యువకులు అందరు తమ తమ నృత్య ప్రావీణ్యతలను ప్రదర్శిస్తారు. తద్వారా అతిథి గ్రామపు అమ్మాయిల మనసును దోచుకోగలిగితే తదనంతరం వారి పెద్దలు వరసైనవారికి పెండ్లి చేస్తారు. అర్ధరాత్రి సమయానికి గుస్సాడీ నృత్యాలు బాగా ఊపందుకుంటాయి. సాధారణంగా పద్ధతి ప్రకారం నర్తించే గుస్సాడీలు అకస్మాత్తుగా ప్రేక్షకుల మధ్యలోకి దూసుకొచ్చి తమ చేతిలో ఉన్న ‘రోకల్‍’ అనే కట్టెతో పొడుస్తూ ప్రేక్షకులకు గిలిగింతలు కలిగిస్తారు. అలాంటి ఊహించని చర్యలకు కొందరు ప్రేక్షకులు భయపడుతుంటారు.


ఏడుం చాల్‍ (సప్తవిధ నృత్యాలు):
అయితే గుస్సాడీ నృత్యాన్ని మాత్రం ఒక క్రమ పద్ధతి ప్రకారమే ప్రదర్శిస్తారు. గుస్సాడీ నృత్యంలో ‘ఏడుం చాల్‍’ (ఏడు రకాల నృత్యాలు) ఉంటాయి. మొదటి నృత్తాన్ని ‘సూర్‍ చాల్‍’ అంటారు. అంటే ప్రారంభ (షురూ) నృత్తం అని. ముగ్గురు నలుగురు డప్పులను ‘చుంచనకుం చుంచనకుం…’ అంటూ మంద్ర గతిలో వాయిస్తుండగా గుస్సాడీలు రెండు మూడు వరుసలలో నిలబడి తమ చేతుల్లో ‘గంగరాం సోట’ (సన్నటి రోకలి కర్ర) ను ముందుకు, ఆ పక్కకు, ఈ పక్కకు చూపుతూ ఎగురుకుంటూ ముందుకు వస్తారు. ఇది నమస్కార పూర్వక నృత్తం.
‘గుస్సాడి చాల్‍’ అనే రెండవ నృత్యంలో ‘డినడిడ్డనకనక డినడిడ్డనకనక…’ అనే డప్పు శబ్దాలకు అనుగుణంగా వరుసలుగా ఉన్న గుస్సాడీలు కొద్దిగా వంగి తమ కుడి చేతిలోని రోకల్‍ ను, తమ కుడి కాలును ఒకేసారి అటూ ఇటూ మారుస్తూ నర్తిస్తారు.
‘మహదేవన చాల్‍’ అనే మూడవ నృత్యంలో ‘జన్‍ జన్‍ జజ్జనక, జన్‍ జన్‍ జజ్జనక…’’ అనే డప్పు అనే దరువుకు అనుగుణంగా నృత్యం చేస్తారు.సూర్‍ చాల్‍, గుస్సాడీ చాల్‍, మహదేవన చాల్‍ అనే ఈ మొదటి మూడు నృత్యాలు శివారాధన నృత్యాలు కాగా తరువాతి మూడు నృత్యాలు పశుపక్ష్యాదులు అనుకరణ నృత్యాలు.
నాల్గవ నృత్యమైన ‘ఉరుం చాల్‍’లో గుస్సాడీలు ఉడుము ఆటను ప్రదర్శిస్తారు. ముందుగా డిప్సీలు తీస్తున్నట్లు అరచేతులను, కాళ్ళ మునివేళ్ళను భూమి మీద ఆనించి ‘డడ్డనకుంఢం డడ్డనకుంఢం…’ అనే డప్పు శబ్దాలకు స్పందిస్తూ అదే స్థితిలో పైకి ఎగిరి ఒకసారి తలను ఎడమ వైపు, మరోసారి కుడి వైపు తిప్పుతూ నర్తిస్తారు. ఈ నృత్యాన్ని ప్రదర్శించడానికి గుస్సాడీలకు చాలా శక్తి, ప్రావీణ్యం ఉండాలి.
‘హెడ్జ్ చాల్‍’ అనే ఐదవ రకపు నృత్యంలో గుస్సాడీలు వరుసల్లో నిల్చుని ఎడమ చంకలో రోకల్‍ పెట్టుకొని వంగి ‘డంనకడంచిక డంనకడంచిక…’ అనే డప్పు శబ్దాలకు అనుగుణంగా ఎలుగుబంటి వలె ఎగురుతూ ముందుకు కదుల్తుంటారు. ‘మల్పూరి చాల్‍’ అనే ఆరవ రకపు నృత్యంలో వరుసల్లో నిల్చున్న గుస్సాడీలు తమ కుడి చేత రోకల్‍ పట్టుకుని కొద్దిగా వంగి ‘రగ్ధినకరధింకన రగ్ధినకరధింకన…’ అనే డప్పు శబ్దాలకు అనుగుణంగా ఓసారి కుడి వైపుకు, మరోసారి ఎడమ వైపుకు ‘నెమలి’ వలె గెంతుతారు.


‘సాక్రి చాల్‍’ అనేది గుస్సాడీ నృత్యాల్లో ఏడవది, చివరిది. దీనికంటే ముందటి నృత్యాలలో క్రమంగా వేగాన్ని పెంచుకుంటూ వస్తారు. ఈ చివరి నృత్యంలో నృత్య వేగాన్ని పరాకాష్టకు చేరుస్తారు. వరుసల్లో నిల్చున్న గుస్సాడీలు కొంచెం వంగి రెండు చేతులతో రోకల్‍ పట్టుకొని దానిని ముందుకు చూపుతూ ‘చుంచనక చుంచనక…’ అనే డప్పు శబ్దాలు వేగంగా ధ్వనించగా వాటికి అనుగుణంగా అంతే వేగంగా తిరుగుతూ నర్తిస్తారు. అలా కొంత సేపు నర్తించిన తరువాత ‘నకరనకర డంటనకర నకరనకర డంటనకర…’ అనే డప్పు శబ్దాలకు అనుగుణంగా మరింత వేగంగా గొలుసు (ఇంగ్లీషు అక్షరం ఎస్‍) ఆకారంలో తిరుగుతూ నర్తిస్తూ చివరిగా వచ్చే పెద్ద ‘ఢం’ శబ్దానికి స్పందనగా పైకి ఎగిరి దూకి నృత్యాన్ని ఆపేస్తారు.


ముగింపు ఉత్సవాలు:
ఇలా దండారి పోయి, దండారిని ఆహ్వానించి అందరూ కలిసి ఆడుకున్న తరువాత, కొత్త గుస్సాడీలకు, పోరిక్‍లకు, డియ్యూర్‍ లకు, డియాన్‍లకు నృత్యాలు నేర్పించిన తరువాత, సుమారుగా దివాడి తెల్లారి అందరూ కలిసి గోండు పటేల్‍ ఇంటికి, ఆ తరువాత గ్రామంలోని ప్రతి గోండు ఇంటింటికి వెళ్ళి మాన్‍ కోల (ఆహ్వానం), సార్‍ కోల (వీడ్కోలు) నృత్యాలు చేసి, మధ్య మధ్యలో ఇతర నృత్యాలు చేసి, ఏత్మసూర్‍ పేన్‍, జంగుబాయి పేన్‍, ఆకి పేన్‍, అవ్వల పేన్‍ మొదలైన దేవతలకు భక్తితో పాటలు పాడి హారతులిస్తూ ప్రతి ఇంటి నుంచి వడ్లను స్వీకరించి, వాటిలో కొన్నింటిని ఇచ్చినవారికే దేవుడి ప్రసాదంగా ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని ‘హారతులు జమచేయడం’ అంటారు.
చివరి ఐదవ రోజున ‘కోలబోడి’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు కూడా అందరూ మనస్పూర్తిగా ఆడుకున్న తరువాత ఏత్మసూర్‍ పేన్‍ కు అర్పణగా కోడిని కోసి అందరూ మొక్కుకొని పండుగను ముగిస్తారు.
ఆశ్వయుజ పౌర్ణమి మొదలుకొని దీపావళి తరువాత రెండు రోజుల వరకు గోండు గ్రామీణులు తమ తమ వెసులుబాటు, స్తోమత, ఉత్సాహాన్ని బట్టి ఐదు నుంచి పదిహేను రోజుల వరకు దండారి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంలోనే గోండులు తమ ఇళ్లను, తమను బాగా అలంకరించుకుంటారు. కాబట్టి గోండుల అందాలను చూడాలన్నా, వారి గ్రామ సౌందర్యాలను చూడాలన్నా అందుకు దండారి పండుగ సమయమే సరైనది.


పరిరక్షకుడికి పద్మశ్రీ:
నటరాజు స్వరూపమైన గుస్సాడీ నృత్యానికి నాలుగు దశాబ్దాల క్రితం నుంచి పాత ఆదిలాబాద్‍ జిల్లాకు చెందిన పలువురు గోండు పెద్దలు ప్రచారం కల్పించాలని ప్రయత్నించారు. ఆ జిల్లా ఉట్నూర్‍ సమీపపు లకెట్టిపేటకు చెందిన ఐ.ఏ.ఎస్‍. అధికారి కీ. శే. శ్రీ మడావి తుకారాం గారు కుమ్రం భీమ్‍ ఆసిఫాబాద్‍ జిల్లా పిట్టగూడలో గుస్సాడీ నృత్యాన్ని గోండు యువకులకు నేర్పించారు. నేర్పించిన వారిలో ప్రముఖులు శ్రీ కనక రాజు గారు. వీరికి స్ఫూర్తినిచ్చింది వారి మాతామహులు ఆత్రం లచ్చు పటేల్‍ గారు. రాజు గారి దగ్గర శిక్షణ పొందిన వందకు పైబడిన గోండ్‍ యువకులలో లయగతులు (స్టెప్స్) వెయ్యడంలో సుమారు సగం మంది విఫలం కాగా సుమారు 65 మంది సఫలులయ్యారు. వారు, వారి ప్రశిష్యులు అంతరించే ప్రమాదంలో పడిన గుస్సాడీ నృత్యాన్ని కాపాడారు.


శ్రీ కనక రాజు గారు ఈ నృత్యాన్ని 1982లో ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన భారత గణతంత్ర దినోత్సవాలలో భాగంగా అప్పటి భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారి ముందు అద్భుతంగా ప్రదర్శించారు. ఆ ప్రదర్శన చూసి ముగ్ధురాలైన శ్రీమతి ఇందిరా గాంధీ తానూ గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తానని ఉత్సాహం చూపగా శ్రీ కనక రాజు గారు వెంటనే తన కాళ్ళ గజ్జెలను ఆమె కాళ్ళగా కట్టగా ఆమె కనక రాజు గారి  బృందంతో పాటు ఆనందంగా నర్తించారు. ఆ అరుదైన సంఘటనను రాజు గారు తన చివరి శ్వాస వరకు మననం చేసుకుంటూండేవారు. ఆ తరువాత మరో రెండు దశాబ్దాలకు… 2002లో అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ అబ్దుల్‍ కలాం గారి ముందు కూడా గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.
భారత ప్రభుత్వం శ్రీ కనక రాజు గారి ప్రావీణ్యాన్ని గుర్తించి 2020లో వీరికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. వీరు ఆ పురస్కారాన్ని 2021 నవంబర్‍ 9న ఢిల్లీలో ఆనాటి భారత రాష్ట్రపతి శ్రీ రామ్‍ నాథ్‍ కోవింద్‍ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆనాటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్‍ శ్రీమతి తమిళిసై గారు, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు, సాంస్కృతిక శాఖామాత్యులు, పలు సంస్థల నిర్వాహకులు సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. కోటి విలువ చేసే భూమి, ఇల్లు, వాహనం ఇచ్చి సత్కరించింది. గిరిజన సంక్షేమ శాఖ అదిలాబాద్‍ జిల్లా ఉట్నూరులో ఉన్న ఐటీడీఏ (సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ)లో పద్మశ్రీ కనక రాజు నృత్యాలయం (డాన్స్ స్కూల్‍) ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో వందలాది గిరిజన విద్యార్థులకు గుస్సాడీ నృత్యంలో శిక్షణనిప్పించింది. అలా వారి కళ భావి తరాలకు అందుతున్నది.
గత కొంత కాలంగా ముదిమి వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న గుస్సాడి మాస్టర్‍ శ్రీ కనక రాజు గారు గుస్సాడి ఉత్సవాల ప్రారంభ దినమైన 25.10.2024న కుమ్రం భీమ్‍ ఆసిఫాబాద్‍ జిల్లా జైనూర్‍ మండలం మార్లవాయి గ్రామంలో తన స్వగృహంలో తుది శ్వాస విడువడం ఆదివాసీ కళా లోకానికి విషాదాన్ని మిగిల్చింది. శ్రీ కనక రాజు గారికి నలుగురు కొడుకులు, తొమ్మిది మంది బిడ్డలు. వారిలో వారి రెండవ కొడుకు శ్రీ సుదర్శన్‍ గారి తండ్రి కళా వారసత్వాన్ని కొనసాగిస్తుండడం ముదావహం. రాష్ట్ర ప్రభుత్వం గుస్సాడి నృత్యోత్సవాల నిర్వహణకై నిధులు విడుదల చేస్తూ ఈ అరుదైన నృత్యకళను ఆదరిస్తుండడం ఆనందించదగ్గ విషయం.

  • ద్యావనపల్లి సత్యనారాయణ,
    ఎ : 94909 5707

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *