పేదవాడి కలప, ఆకుపచ్చ బంగారంగా పేరొందిన వెదురు- అడవులకు స్థిరీకరణ శక్తిగా పనిచేస్తుంది. అడవుల్లో వర్షాల ధాటికి మట్టి కొట్టుకొని పోకుండా నిలువరిస్తుంది. అడవులపై ఆధారపడిన గిరిజనులతోపాటు, గ్రామీణుల జీవితాలతోనూ వెదురు పెనవేసుకుపోయింది. జీవనోపాధి మార్గంగానే కాకుండా, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాల్లోనూ ఒక భాగంలా మారింది. వెదురుకు ఉన్న బహుళ ప్రయోజనకర లక్షణాల కారణంగా గిరిజనులు తదితరులకు ఆదాయ, ఉపాధి కల్పనలో తోడ్పడుతోంది. గిరిజనుల వేట, ఆహార సేకరణ, వ్యవసాయ పనిముట్లు, సంగీత వాయిద్యాలు, గృహోపకరణాలు తదితరాలెన్నో వెదురుతో తయారవుతాయి. బతుకు తెరువు చూపిస్తున్న వెదురుతో గిరిజనులకు పవిత్రమైన సహజీవన సంబంధం ఏర్పడింది. పుట్టుక నుంచి మరణందాకా వారి జీవన చక్రంలోని ఆచారాల్లో వివిధ రూపాలలో వెదురుతో చేసిన ఉపకరణాలు ఉపయోగించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
దుస్తులన్నీ దేంతో తయారవుతాయి… పత్తీ, పట్టూ లేదా కృత్రిమ దారాలతోనే కదా… ఇప్పుడిప్పుడు వీటితోపాటు మరో సుతిమెత్తని దారం కూడా కనిపిస్తోంది. అదే బ్యాంబూ ఫైబర్. ఒకప్పుడు ఇళ్ల నిర్మాణంలోనూ ఫర్నిచర్‍లోనూ మాత్రమే వాడుకునే వెదురు, ఇప్పుడు టెక్స్టైల్ రంగంలోకీ అడుగుపెట్టింది. అంతేనా… ‘రోజువారీ అవసరమయ్యే ప్రతి వస్తువునీ వెదురుతో చేసుకోవచ్చు’ అంటోంది నవతరం… అందుకే ఒకప్పుడు ఏ అడవుల్లోనో కనిపించే వెదురు, ఇప్పుడు పంటపొలాల్లోనూ పెరుగుతోంది.
‘తినడానికి తిండీ ఉండటానికో ఇల్లూ కట్టుకోవడానికి బట్టలూ… ఈ మూడూ మనిషి కనీసావసరాలు… వీటన్నింటినీ ఇవ్వగలిగే గడ్డిమొక్కే వెదురు. అందుకే ‘పుట్టినప్పుడు వేసే ఉయ్యాల నుంచి చనిపోయాక మోసుకెళ్లే పాడె వరకూ వెదురు తోడుగా
ఉంటుంది…’ అన్న నానుడి కొన్నిచోట్ల వాడుకలో ఉంది. దీన్ని నిజం చేస్తూ- దైనందిన జీవితంలో అవసరమయ్యేవన్నీ వెదురుతో చేస్తున్నారిప్పుడు. అంటే- వేసుకునే దుస్తులూ కప్పుకునే క్విల్ట్లూ తాగే బాటిలూ తినే ప్లేటూ… ఇలా సకలం వెదురుమయంగా మారే రోజు ఎంతో దూరంలో లేదన్నమాట.
‘వెదురుని పెంచినా వాడినా తిన్నా… అంతా మన మంచికే… నేలను సారవంతం చేస్తూ గాలిని శుద్ధి చేస్తూ మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఆదాయాన్నీ ఇస్తోంది వెదురు పంట. కాబట్టి తృణ, చిరుధాన్యాలతోపాటు ఈ పచ్చ బంగారాన్నీ పెంచండి’ అంటోంది ప్రభుత్వం. వెదురు నుంచి నారను తయారుచేసే ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టే ఆలోచనా చేస్తోంది. మనదేశంలో వెదురు కొరత తీవ్రంగా ఉండటంతో అగరుబత్తుల తయారీకి కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే అటవీశాఖ పరిధిలోనే ఉండే వెదురు మొక్కని హార్టీకల్చరల్ విభాగంలోకి చేర్చి, పెంచేందుకు సబ్సిడీనీ అందిస్తోంది ప్రభుత్వం.
వెదురే ఎందుకు?
మిగిలిన చెట్లతో పోలిస్తే వెదురు పది రెట్లు వేగంగా వాతావరణం నుంచి కార్బన్‍డై ఆక్సైడ్‍ను తొలగిస్తుంది… అంతే ఎక్కువగా ఆక్సిజన్‍ను విడుదల చేస్తుంది. ఒక వెదురు పొద, అంతే విస్తీర్ణంలో ఉన్న చెట్టుకన్నా 35 శాతం ఎక్కువ ప్రాణవాయువుని ఇస్తుంది. పోతే, కాగితం తయారీలో వాడే కలప గుజ్జుకోసం చెట్లను కొట్టడంతో వాతావరణం వేడెక్కడంతోపాటు అడవుల్ని తిరిగి పెంచడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుంది. దాంతో కలప గుజ్జు తయారీ తగ్గింది. అందుకే ఆ చెట్లకు బదులు వెదురుని పెంచితే వేగంగా పెరుగుతుంది. ఎంతంటే- రోజుకి 35 నుంచి 47.6 అంగుళాల చొప్పున చూస్తుండగానే ఎదిగిపోతుంది. రోజుకి మూడు అడుగుల వరకూ పెరిగేవీ ఉన్నాయి. అంటే- గంటకి ఒకటిన్నర అంగుళాలన్నమాట. మొత్తమ్మీద పదీ ఇరవయ్యేళ్లపాటు పెరిగే కలపతో పోలిస్తే, వెదురు మూడు నుంచి ఐదేళ్లలోనే పెరుగుతుంది. కాబట్టే కలపకీ కలపగుజ్జుకీ చక్కని ప్రత్యామ్నాయంగా మారింది వెదురు.
వెదురు ఉత్పత్తులెన్నో..!
ఒకప్పుడు వెదురుతో ఇంట్లో వాడుకోవడానికీ వ్యవసాయానికీ అవసరమయ్యే బుట్టలూ తట్టలూ చేటలూ తడికెలూ… వంటివి అల్లడమే తెలుసు. గిరిజన తెగలు మాత్రం వెదురు ఇళ్లు కట్టుకుని, వస్తువులూ తయారుచేసుకుంటాయి. అందుకే దీనికి పేదవాడి కలపగా పేరు. అయితే పర్యావరణ ప్రియమనో లేదా కొత్తదనంకోసమో గానీ ఇప్పుడు అవన్నీ ఆధునికులకీ నచ్చుతున్నాయి. ఇంట్లోనూ బాల్కనీలోనూ పెరట్లోనూ వెదురు మొక్కల్ని పెంచడమే కాదు, దాంతో అల్లిన హస్తకళాకృతుల్నీ అలంకరిస్తున్నారు. రిసార్టుల్లోనూ ఫామ్‍హౌసుల్లోనూ వెదురిళ్లు కట్టుకోవడంతోపాటు ఫ్లోరింగ్ నుంచి ఫర్నిచర్ వరకూ వెదురే అందం అనుకునేవాళ్ల సంఖ్యా పెరుగుతోందిప్పుడు.
- చైనాలో పూర్వకాలం నుంచీ వెదురుతో చేసిన కాగితం వాడుకలో ఉంది. అడవుల విస్తీర్ణం రోజురోజుకీ తగ్గడంతో ప్రపంచ దేశాలన్నీ వెదురు కాగితంమీద దృష్టి సారిస్తున్నాయి. పైగా కలప నుంచి కన్నా దీంతో సులభంగా తయారు చేయవచ్చు. వెదురుగుజ్జుతో కాగితంతోపాటు డిస్పోజబుల్ పేపర్ కప్పులూ, టాయ్‍లెట్ పేపరూ, రీయూజబుల్ ప్లేట్లూ, గిన్నెలూ, కార్డుబోర్డులూ… వంటివెన్నో చేస్తున్నారు
- ఎకరంలో పండే పత్తితో పోలిస్తే వెదురు నుంచి యాభై రెట్లు ఎక్కువ ఫైబర్ వస్తుంది. అందుకే క్విల్ట్లూ దుప్పట్లూ టవల్సూ టీషర్టులూ చీరలూ ఫ్రాకులూ… ఇలా అన్ని రకాల దుస్తులకీ ప్రాసెస్ చేసిన వెదురు నారని వాడుతున్నారు. ఇవి వేసవిలో చల్లదనాన్నీ చలికాలంలో వెచ్చదనాన్నీ అందిస్తాయనీ వెదురుకి సహజంగా ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలవల్ల ఒంటికి మేలుచేస్తాయనీ చెబుతున్నారు.
- చెక్క, ప్లాస్టిక్కు వాడకాన్ని తగ్గించే క్రమంలో యాక్సెసరీలు, వంటింటి సామగ్రి, డిన్నర్‍వేర్‍లతోపాటు బయో ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, జ్యువెలరీ, వాహనాలు, పిల్లల ఆటవస్తువులు… ఇలా అన్నింటా వెదురు వాడకం పెరుగుతోంది. సప్తస్వరాల్ని పలికించే వేణువూ ఫిడేలూ ఏక్‍తారా… వంటి సంగీత వాద్య పరికరాలు సైతం వెదురుగానాన్నే ఆలపిస్తున్నాయి.
ఆరోగ్యానికీ..!
‘కాసిని వెదురు పిలకల్ని తీసుకుని సన్నగా కోసి కొబ్బరి పాలల్లో ఉడికించుకుని తింటే ఆ రుచే వేరు…’ అని ఎవరైనా అంటే ఆశ్చర్యపోకండి. ఒకప్పుడు ఆగ్నేయాసియా దేశాల్లోనూ గిరిజన తెగల్లోనూ మాత్రమే వాడుకలో ఉన్న వెదురు పిలకలు ఆరోగ్యానికి మంచివని చాలామంది తింటున్నారిప్పుడు. ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండుతుంది. క్యాలరీలు తక్కువ. దాంతో బరువు తగ్గాలనుకున్న వాళ్లకు మేలన్నమాట. లేత వెదురు కాడల్లో ఖనిజాలూ ఇతరత్రా పోషకాలూ అధికంగా ఉండటంతో రోగనిరోధకశక్తినీ పెంచుతాయి. వెదురు చిగుళ్లతో ఊరగాయ కూడా పెట్టుకుంటారు. ఈ చిగుళ్ల కషాయం చలువ చేస్తుంది. దీన్ని సంప్రదాయ, ఆయుర్వేద వైద్యులు కఫం, మూల వ్యాధి, మధుమేహ నివారణకీ, ఆకలికీ, గర్భకోశ శుద్ధికీ వాడతారు. దీన్ని కాల్చినప్పుడు వచ్చిన బొగ్గుని ఆరోగ్యకరంగా భావించి ఆహారోత్పత్తుల్లోనూ వాడుతున్నారు. అంతెందుకు… ‘తింటే బొంగులో చికెనే తినాలి’ అనేవాళ్ల సంఖ్యా పెరిగింది!
వెదురుతో అనేక లాభాలు..
వెదురు పొదలు వివిధ వన్యజీవులకు ఆవాసాలుగా ఉపయోగపడతాయి. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడంలో వెదురు ఎనలేని పాత్రను పోషిస్తుంది. ఇటీవల బస్తర్ ప్రాంతంలో- మహిళలు వెదురుతో చేసిన రాఖీలకు ప్రజల నుంచి మంచి స్పందన రావడం సహా సామాజిక మాధ్యమాల్లో దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. వెదురుతో తయారు చేసే కళారూపాల్ని బహుమతులుగా తీర్చిదిద్దడం ద్వారా పలువురు ఆదాయ మార్గాల్ని సృష్టించుకొని, ఆర్థిక ఉన్నతి వైపు అడుగేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెదురు వస్తువుల ఎగుమతులు సుమారు 250 కోట్ల డాలర్లకు చేరుకోవడం దీని ఆర్థిక ప్రాధాన్యానికి అద్దం పడుతోంది. అంతేకాకుండా, వెదురును అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు అడవుల క్షీణతను అడ్డుకోవచ్చు. వెదురుతో కూడిన అటవీ వనాల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు అందరిపైనా ఉంది. ఇకనైనా ప్రభుత్వాలు ఈ దిశగా యోచించాల్సిన అవసరం ఉంది.
- ఎసికె. శ్రీహరి, ఎ : 9849930145